నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, జగ్గయ్యపేట, విజయవాడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తెదేపా, జనసేన, బీజేపీలో చేరుతుండటంతో మెజారిటీ కోల్పోయిన ఆయా స్ధానిక సంస్థల్లో వైసీపీ అధికారం కోల్పోతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఈ పరిస్థితి మొదలైంది. వైసీపీలో అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు, వ్యాపార అవసరాలకోసం కొందరు, తమ డివిజన్లలో అభివృద్ధి పనులు చేయించుకోడానికి కొందరు, వచ్చే కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పటి నుంచే సీటు రిజర్వేషన్‌కు కొందరు..ఇలా తమ అవసరాల కోసం పార్టీలు మారారు. దీంతో వైసీపీకి మెజార్టీ తగ్గిపోవడంతో కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఓడిస్తున్నారు. విజయవాడ తప్పించి మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి అధికారం సొంతం చేసుకుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా త్వరలో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని ఆ పార్టీ కార్పొరేటర్లంటున్నారు. ఆయా మున్పిపాలిటీల్లో ఛైర్మన్లు, కార్పొరేషన్లలో మేయర్లు వైసీపీ తొత్తులుగా పనిచేశారే తప్ప ప్రజాప్రతినిధులుగా పనిచేయలేదని విమర్శిస్తున్నారు. అప్పటి ప్రాంతీయ ఇన్‌చార్జులదే పెత్తనం. వారు చేసిన ప్రతిపాదనలనే కౌన్సిల్ అజెండాలో పొందుపరిచేవారని అంటున్నారు. అంతేకాదు పార్టీ అధిష్టానానికి అవసరమైన భూములు, ఇతర వ్యవస్థలు సొంతం చేసుకునేందుకు కాంట్రాక్టులు పొందేందుకు మాత్రమే అజెండాలు నింపేవారని వార్డుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని పలుమార్లు వినతులు ఇచ్చినా మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు పట్టించుకోలేదని దాంతో ప్రజల దృష్టిలో చులకనైపోయినట్లు వైసీపీ కార్పొరేటర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో ఏ జిల్లాలోనూ కనీస మెజార్టీ లేకపోవడంతో కూటమికి అన్ని విధాలుగా పైచేయి లభించింది. కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోటే రహదారులు, మంచినీటి సమస్య, డ్రైనేజి ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడంతో ప్రజల్లో సానుకూలత పెరిగింది. అప్పటి వరకు తమ స్వార్ధం చూసుకున్న మేయర్లు వైసీపీ అధికారం కోల్పోవడంతో ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. ఇక కార్పొరేటర్లు తమ అసంతృప్తిని బయటకు వెళ్లగక్కారు. అదే సమయంలో కూటమి నేతలు కూడా వారి అసంతృప్తిని ఆసరాగా తీసుకుని తమ పార్టీల్లోకి ఆహ్వానించారు. దీంతో ఎవరి అవసరం కొద్దీ వారు ఆయా పార్టీల్లో చేరిపోయారు. మెజార్టీ పెరిగిన కూటమి పార్టీలు ఆయా కార్పొరేషన్లలో మేయర్లపై అవిశ్వాసం పెట్టించారు. వైసీపీ ఓడిపోవడంతో ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లు కూటమి పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
తాజాగా కూటమి ఖాతాలోకి విశాఖ కార్పొరేషన్
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. వైసీపీకి చెందిన మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ఏప్రిల్ 19న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కొత్త మేయర్ ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 111 మందికి ఓటు హక్కు ఉంది. నాలుగేళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ 58 వార్డులను గెలుచుకోవడంతో పాటు ఇండిపెండెంట్లుగా గెలిచిన నలుగురు కార్పొరేటర్ల మద్దతుతో మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారిని ఎంపిక చేసింది. అప్పటినుంచి జీవీఎంసీలో వైసీపీ నేతల హవాయే నడుస్తూ వచ్చింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో జీవీఎంసీలో పరిణామాలు శరవేగంగా మారసాగాయి. ఇండిపెండెంట్లుగా గెలిచిన నలుగురిలో ఇద్దరు టీడీపీలో చేరగా, మరో ఇద్దరు జనసేనలో చేరిపోయారు. వైసీపీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన 27 మంది కూడా టీడీపీ, జనసేన గూటికి చేరారు. దీంతో కౌన్సిల్‌లో కూటమి బలం 63కి చేరగా, వైసీపీ బలం 32కి తగ్గిపోయింది. అదే సమయంలో జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లను కూటమి పార్టీలే గెలుచుకోవడంతో ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో 11 స్థానాలు కూటమికి పెరగడంతో దాని బలం 74కి పెరిగింది. అంటే మొత్తం 111 మంది సభ్యులు కలిగిన కౌన్సిల్‌లో కూటమికి 2/3 వంతు ఆధిక్యం దక్కినట్టయింది. ఈ మేరకు స్పష్టమైన సంఖ్యా బలం ఉండడంతో కూటమి నేతలు జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కోరుతూ గత నెల 22న జిల్లా కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ ఈ నెల 20న అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటు మరో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ పదవీచ్యుతు లయ్యారు. రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్ ఇప్పుడు కూటమి ఖాతాలోకి చేరింది.
2024లోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్
నెల్లూరు మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి చెందిన అనేక మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైసీపీ నాయకత్వంలోని లోపాలు, ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీరుపై అసంతృప్తి, పలువురు నేతలు పార్టీ మారడానికి ప్రేరేపించాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు కూడా ఈ కారణంగా టీడీపీలో చేరారు. వాస్తవంగా 2022లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ మొత్తం 54 సీట్లను గెలిచి అధికారం కైవసం చేసుకుంది. అయితే 2024లో టీడీపీ అధికారంలోకి రావడంతో, వైసీపీ కార్పొరేటర్లు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీలో చేరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం 30 మంది వైసీపీ కార్పొరేటర్లు . మేయర్ స్రవంతి కూడా తెదేపాలో చేరిపోయారు. గత నెలలో జరిగిన డిప్యూటి మేయర్ ఎన్నికల సమయంలో మరో 15 మంది తెదేపాలో చేరారు. దాంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య తొమ్మిదికి పడిపోయింది.
గుంటూరు కార్పొరేషన్ కూడా
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా కూటమి ఖాతాలో చేరింది. గుంటూరు నగరపాలక సంస్థలో వైసీపీ ఒకప్పుడు ఎంతో పటిష్టంగా ఉండేది. 2021 కార్పొరేషన్ ఎన్నికలలో నగరంలో 57 డివిజన్లకు గానూ, వైసీపీ తరపున 44 మంది కార్పొరేటర్లు మీద గెలిచారు. 9 మంది కార్పొరేటర్లు టీడీపీ, ఇద్దరు జనసేన, మరో ఇద్దరు గురవయ్య, చల్లా రాజ్యలక్ష్మి స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. ఆ తర్వాత వారిద్దరు వైసీపీలో చేరారు. దీంతో కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 46కు పెరిగింది.
8వ డివిజన్ కార్పొరేటర్ రమేష్ గాంధీ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానానికి ఏర్పడ్డ ఖాళీకి ఎన్నికలు నిర్వహించగా, తెలుగుదేశం పార్టీ తరపున పోతురాజు సమత గెలుపొందారు. దీంతో కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ తరపున పది మంది కార్పొరేటర్లు అయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు, తరువాత వైసీపీకి చెందిన అనేక మంది కార్పొరేటర్లు, కూటమి ప్రభుత్వంలో చేరారు. దీంతో కార్పొరేషన్లో కూటమి కార్పొరేటర్ల బలం 35కు చేరుకుంది. ఇటీవల జరిగిన స్టాండిరగ్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో కూడా ఆరుగురు కూటమి అభ్యర్థులు తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. దాంతో త్వరలో ఈ కార్పొరేషన్‌లోనూ మేయర్ ఎన్నిక జరగనుంది.
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కూడా
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కూడా కూటమి ఖాతాలోకి చేరింది. ఒంగోలు కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లకు గాను వైసీపీ నుంచి 41 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఆ తర్వాత ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరూ వైసీపీ చేరిపోయారు. దీంతో వైసీపీ బలం 43కు చేరింది.వైసీపీ తరుఫున మేయర్‌గా గంగాడ సుజాతను ఎన్నుకున్నారు. శాసనసభ ఎన్నికలలో వైసీపీ నుంచి టీడీపీ కూటమి చేతిలోకి రావటంతో ఒంగోలు మేయర్ సుజాత సహా 19 మంది వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెదేపా కండువా కప్పుకున్నారు. మిగిలిన వైసీపీ కార్పొరేటర్లలో డిప్యూటీ మేయర్ మాధవ్ సహా 20 మంది కార్పొరేటర్లు ఇటీవల జనసేన గూటికి చేరిపోయారు.
దీంతో ఒంగోలులో వైసీపీకి నలుగురు కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. ఎన్నికల సమయంలో టీడీపీకి ఆరుగురు, జనసేనకు ఒక కార్పొరేటర్ ఉండేవారు. పార్టీ మార్పుల తర్వాత టీడీపీకి ఉన్న కార్పొరేటర్ల బలం 25కు చేరింది. అలాగే జనసేన బలం 21కి పెరిగింది. ప్రస్తుతం వైసీపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్‌పై మీద కూటమి పట్టు సాధించింది.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా తెదేపా వశమైంది. 2021 జూలైలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో 50 స్థానాలకు వైసీపీ 47, టీడీపీ మూడు స్థానాలు గెలుచుకుంది. గతేడాది ఎన్నికల ముందు వైసీపీ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు టీడీపీలోకి వచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేయర్ నూర్జహాన్ సహా మరో 21 మంది, మరో ఐదుగురు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో కూటమి బలం 32కు చేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిప్యూటి మేయర్లుగా తెదేపా కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. నూజివీడు మున్సిపాలిటీ కూడా తెదేపా ఖాతాలో చేరనుంది. ఇక్కడ గతంలో 32 వార్డులకు గాను 25 వార్డులు వైసీపీ, 7 తెదేపా గెలుచుకుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత చాలా మంది తెదేపా వైపు మొగ్గారు. ఇటీవల జరిగిన వైఎస్ చైర్మన్ ఎన్నికలో జరిగిన బలప్రదర్శనలో తెదేపా తరపున నిలబడిన కౌన్సిలర్ గెలిచారు. తెదేపాకు 18, వైసీపీ 14 ఓట్లు వచ్చాయి.
జగ్గయ్యపేట, తుని కూడా
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ కూడా తెదేపా ఖాతాలో చేరింది. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తెదేపాలో చేరారు. ఆయనతో పాటు 7, 23, 31వ వార్డుల కౌన్సిలర్లు పూసపాటి సీతారావమ్మ, డి. రమాదేవి, గింజుపల్లి వెంకట్రావు, అతని కుమారుడు కృష్ణ తెదేపా తీర్థం పుచ్చుకొన్నారు. గతంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీలో తెదేపాకు 14 మంది కౌన్సిలర్లు ఉండగా, తాజా చేరికలతో ఆ పార్టీ బలం 18కి చేరింది. వైసీపీ బలం 13కు పడిపోయింది. కాకినాడ జిల్లా తునిలో కూడా కౌన్సిర్లు వైసీపీ షాక్ ఇచ్చారు. మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా, 15 మంది టీడీపీలో చేరారు. ఇప్పటికే మెజార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా, మరికొందరు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో తునిలో తెదేపాకు ఒక కౌన్సిలర్ మాత్రమే గెలవగా ఇప్పుడు ఆ సంఖ్య 16కు చేరింది. వైఎస్ చైర్మన్ కూడా తెదేపాలో చేరగా చైర్మన్ ఏలూరు సుధారాణి తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్