గ్రామ భారతి తెలంగాణ

‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’ (ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను) ఇది భూమాత గురించి భారతీయ దృష్టికోణం. ఇంకా, ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ (కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి) అన్నమాట రామాయణ కాలంలోనే చెప్పారు. మనది భూమాత పట్ల దైవీ భావన, పూజ్య భావన. అవసరం మేరకే అనుభవించే సంస్కృతి మనది. మట్టిని తల్లిగా ఆరాధిస్తూ అవినాభావ సంబంధం, సేవాభావం కలిగి ఉంటారు భారతీయులు. ఇది జగజ్జనని, అన్నపూర్ణ, ఆరోగ్య ప్రదాయని. ఈ భూమే మనందరికీ భారతమాత!

ఈ భావన మన సంస్కృతిలో ఎలా ఆవిర్భ వించింది. భూమాతను అన్నపూర్ణగా భావించడం వల్ల కూడా. మనవి బంగారు నేలలు. కాబట్టి బంగారు పంటలు కూడా. మనకు ఉన్నవి అమృత జలాలు. సముద్రాలు – నదులు – లోయలు – వనాలు – కొండలు – గుట్టలు ఇవన్నీ ఈ భూమికి అలం కారాలు. నదులు లోయలు, వనాలు, కొండలు – గుట్టలు, భూగర్భజలాలు ఈ భూమి మనకు ప్రసాదించిన సహజ వనరులు. ఇవే కోటాను కోట్ల జీవరాశులకు ప్రాణాధారం. అందుకే మానవ మనుగడకు సర్వం సమకూర్చే కన్నతల్లిగా భూమిని చూస్తాం. నేల అంటే జీవ వైవిధ్యాన్ని పోషించే తల్లి. చరాచర సృష్టికి బ్రతుకుదెరువునిచ్చే అన్నపూర్ణ.

కానీ ఇవాళ భూమి పరిస్థితి ఏమిటి? ఆధునికత పేరుతో అడవుల నరికివేత, అధిక నీటి వినియోగం, భారీ యంత్రాల వాడకం యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇన్ని వేల ఏళ్లుగా పచ్చగా ఉన్న భూమాత ఇప్పుడు ప్రాణాంతక రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలతో నిస్సారమైపోతున్నది. అంతా కాలుష్యం.

కొంచెం ఆలస్యంగా అయినా భూమి సుపోషణ – పర్యావరణ సంరక్షణ ఆవశ్యకతలను గురించి ఒక ఆలోచన, ఆవేదన మొదలయ్యాయి. ఫలితమే ఒక కార్యాచరణ కూడా వచ్చింది. భూమి సుపోషణతో భూసార సంరక్షణ పని చేపట్టాలి. పర్యావరణ పరిరక్షణతో జీవ వైవిధ్యం కాపాడుకోవాలి. చెట్లు, ఔషధ మొక్కలు, పూలమొక్కలు, కూరగాయ మొక్కలు, మిశ్రమ పంటలతో భూమిని బలోపేతం చేసుకోవాలి. యంత్రీకరణతో భూమిని గాయపరిచిన మనం కొన్ని ఇతర చర్యలు, సంప్రదాయం సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవే, గో పోషణ, పశుపోషణ, ఎద్దుల వ్యవసాయం. నిజానికి ఈ విధానంతో భూమికి కడుపునిండా ఆహారం దొరుకుతుందని అనాలి. విచక్షణా రహితంగా సాగిపోతున్న రసాయనిక ఎరువులు వాడకంతో పాతాళానికి వెళ్లిపోయిన వానపాములను మనం మళ్లీ స్వాగతించాలి. వాటి సంచారంతో నేల గుల్లగా తయారు కావడానికి , నీటిధారలు ప్రవహించేందుకు దోహదం చేయాలి.

భూమి సుపోషణ, భూసార సంరక్షణ ధార్మిక దృష్టితో చేయాలి. లాభనష్టాలు బేరీజు వేసుకోవడం సరికాదు. ఇందుకు గ్రామాలలో చేయాల్సిన పనులు ఏమిటి? ఉగాది పండుగ లేదా మరొకరోజు భూమిపూజ, భూసుపోషణ గూర్చి సంకల్పం తీసుకోవాలి. ఇంతకాలం మనం ఉదాశీనంగా వ్యవహరించినందుకు ప్రాయశ్చిత్తంగా మనం ఈ సంకల్పం తీసుకోవాలి. వేసవిలో లేదా ఒక్కొక్క పంటకు మధ్య భూమికి విశ్రాంతిని ఇవ్వాలి. భూమిని ఉష్ణతాపం నుంచి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. భూమికి అచ్ఛాదన (మల్చింగ్‌), వాపు (నీరు, నీటి ఆవిరి సంతులనం) ఏర్పాటు చేయాలి. ఈ భూమిలో ఎల్లెడలా వానపాములు , కోటాను కోట్ల జీవరాశుల సంచారం చేస్తూ ఉంటాయన్న ఒక నిరంతర స్పృహ మనకి అవసరం. గోపోషణ, పశుపోషణ, పొలంలో పశువుల మందలు తిరిగేటట్టు చేయాలి. ఎద్దులతో వ్యవసాయం చేయాలి. ఇలా చేస్తే రేపటి తరానికి కాస్తయినా ఆరోగ్యంగా ఉన్న భూమిని మనం అప్పగించగలుగుతాం. నవధాన్యాలు, పప్పుధాన్యాలు, స్వల్పకాలిక పంటలు, పచ్చి రొట్టలతో భూమికి పోషణ లభిస్తుంది. సేంద్రియ ఎరువులు, గోకృపామృతం, బీజామృతం, జీవామృతాలతో నేలకు సమృద్దిగా ఆహారం అందించడం మనందరి కర్తవ్యం. చెరువు మట్టి, మట్టి ద్రావణం, ప్రాకృతిక కీటక నియంత్రణ కషాయాల వినియోగం కూడా అవసరమే. మిశ్రమ పంటలు, పంట మార్పిడి, రైతులు తమ గ్రామానికి కావలసిన అన్ని పంటలు పండిస్తూ భూమిని ఇంకా నిస్సారం కాకుండా చూసుకోవాలి. భూసారం, నీటి వనరులు, వర్షాలు, వాతావరణం వంటివాటి వీటి ఆధారంగా రైతులు పంటల విధానం ఏర్పరుచు కోవాలి. వారు తమకు కావలసిన దేశవాళీ విత్తనాలు స్వయంగా తయారు చేసికోవడం కూడా అవసరమే. పొలంలో పడ్డ వర్షపు నీరు అక్కడే, గ్రామంలో పడిన వర్షం నీరు గ్రామంలోనే ఇంకిపోయే విధంగా చూసుకోవాలి.

పొలాలలో కాంటూర్‌ పద్ధతిలో నీటిని నిలిపే విధంగా గట్లువేసి, అధిక పంటలు పండిరచాలి. పొలం గట్లపైన ఉపయోగకరమైన చెట్లు, గడ్డి పెంచుకోవాలి. వ్యవసాయం పనులకు, కలుపు తీసేందుకు చేతితో, పశువులతో నడిచే చిన్న యంత్రాలు వినియోగించడానికి పరిమితం కావడం అవసరం. యజమానులు కుటుంబ సహితంగా కూలీలతో కలసి పొలం పనులు చేసే సంస్కృతిని పెంచాలి. తమ పొలాన్ని, ఇంటిని, వీధిని, గ్రామాన్ని, ధార్మిక – సామాజిక స్థలాలను పర్యావరణ పోషకంగా ఉంచుకోవాలి. అంటే నిరంతరం భూరక్షణ స్పృహతో ఉండాలి. ఇప్పుడు ప్లాస్టిక్‌ పర్యావరణానికి అతిపెద్ద బెడద. ఆహార వస్తువుల నిలువ, విత్తనాల భద్రత కోసం … ప్లాస్టిక్‌ – పాలిథిన్‌ రహిత పాత్రలు, గోనె సంచులు, గుడ్డ సంచులను ఉపయోగించే అలవాటును పెంచాలి. మానవ వికాసం అంటే పంచ భూతాల సమ్మేళనంతోనే జరుగుతుంది. అంటే సృష్టి, పర్యావరణం, ప్రాణుల సంరక్షణే మానవవికాసం. ఆ దృష్టితో చూస్తూ వీటిని కాపాడుకోవాలి.

పొలాల్లో, ఇండ్లల్లో, వీధులలో, సామాజిక స్థలాలలో అత్యధికంగా సౌరశక్తిని ఉపయోగించే పద్ధతి అలవడాలి. గ్రామ పెద్దలు, ప్రభుత్వాధికారులు రైతులను ప్రోత్సహించాలి. రైతే ‘రాజు’ అన్న భావనకు గౌరవం తేవాలి.

భూసుపోషణలో నగరాలకూ, పట్టణాలకూ కూడా బాధ్యత ఉంది.

 ‘ఉగాది’ నుండి ఏప్రిల్‌ చివరివరకు తమ బస్తీ -కాలనీ-అపార్ట్మెంట్‌లలో ఏదేని ఒక పూజా విధానంతో, భూసుపోషణ – పర్యావరణ సంరక్షణ పట్ల సదవగాహన కల్గించే ప్రయత్నం అందరం చేయాలి. ఈ కార్యక్రమం దేశమంతా జరుగుచున్నది. గ్రామాలే కాదు, పల్లెలే కాదుÑ నగరాలు – పట్టణాల నివాసం, ఈ భూమాత పైననే అని గ్రహించాలి. భూ సుపోషణ కేవలం రైతుల బాధ్యత కాదు, ప్రజలందరి కర్తవ్యం. ఇంటిలో, పరిసరాలలో ప్లాస్టిక్‌, పాలిథిన్‌, ధర్మోకోల్‌, ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌, సిమెంట్‌ వంటి వాటి వినియోగాన్ని నియంత్రించాలి. ధార్మిక స్థలాలు, సామాజిక స్థలాలు, పండుగలు, శుభకార్యాలు, విందులు, వినోదాలలో ప్లాస్టిక్‌ – పాలిథిన్‌ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. ఇండ్లలో తడి చెత్తను – పొడి చెత్తను విడిగా ఉంచడం చాలా అవసరం. తడిచెత్త, మిగిలిపోయిన ఆహార పదార్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసి, ఉపయోగించుకోవాలి.

మన ఇంటి పరిసరాలు, వీధులు, మురికి కాలువలు, చెరువులు, కుంటలు, సామాజిక స్థలాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తమ ఇంటి పరిసరాలు, మిద్దెలు, దేవాలయాలు, పాఠశాలలు, సామాజిక స్థలాలతో అత్యధికంగా చెట్లు, మొక్కలు, కూరగాయలు పెంచుకోవాలి (ువతీతీaషవ Gaతీసవఅఱఅస్త్ర). బస్తీ, కాలనీ, అపార్ట్మెంట్లో సేంద్రియ విక్రయశాలలు – మేళాలు నిర్వహించుకోవాలి. సేంద్రియ ఆహార పదార్థాలు, గో ఆధారిత వస్తువులు, పంచగవ్య ఔషధాల కిట్స్‌ (ఖఱ్‌ం) తయారు చేసుకొని, మహిళలు, నిరుద్యోగ యువతీ యువకులు, తమ చుట్టుప్రక్కల ఇండ్లలో అమ్మకాలు సాగించాలి. ఈ విషయంలో నగరాలూ, పట్టణాలకూÑ గ్రామాలకు మధ్య ఒక అవగాహన ఉండాలి. ఒక్కొక్క బస్తీ – కాలనీ – అపార్ట్మెంట్‌ దగ్గరలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. రైతులకు – గ్రామస్తులకు పెట్టుబడి సమకూర్చి అక్కడి నుండి తమకు కావలసిన ఆహార దినుసులు, పండ్లు, పాలు, గో ఆధారిత వస్తువులు తెప్పించుకునే ఏర్పాటు చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది.


సంకల్పం (ప్రతిజ్ఞ)

భారతదేశము నా మాతృభూమి. భారత దేశము లోని నా నివాసం గ్రామం లేదా పట్టణం, ఏదైన ప్పటికీ, భారతీయ సంస్కృతిలో భాగస్వామినై, ఈ భూమితల్లి పట్ల మాతృభావనను కలిగి ఉండేందుకు నేను సర్వసన్నద్ధంగా ఉంటాను.

ఈ భూమితల్లి పట్ల గల నా ఆదరాభిమానాలను నా దినచర్య కర్తవ్య పాలనతో నిరూపిస్తాను.

ఈ భూమి సుపోషణ కోసం నేను నా జీవి తాంతం, ఈ క్రింది విధంగా శ్రమిస్తాను.

  1. భూసారం దెబ్బతినకుండా ఆపుతాను. మట్టి సారవంతం కావడానికి కృషి చేస్తాను. 2. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుమందులు, రసాయనిక రోగ నిరోధక మందులు ఉపయోగించను. 3. వ్యవసాయంలో పంటకు కావలసినంత మేరకే నీటిని ఉపయోగిస్తాను, ఎక్కడనూ నీటిని వృథా కానివ్వను. 4. చేలగట్ల పైన చెట్లు పెంచుతాను, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తాను.

పై నియమాలను పాటించడంలో పాటుగా, భూమి సుపోషణ కోసం, ఈ క్రింది పద్ధతులను అనుసరిస్తాను.

భూసారానికి హాని కలిగించే పదార్థాలను, ఉదా॥ ప్లాస్టిక్‌, ధర్మకోల్‌ మొదలైన వాటి వాడకం వీలైనంత తగ్గిస్తాను. వస్తువులను భూమికి హాని కలగని రీతిలో జాగ్రత్తగా, అతి తక్కువగా, ఉపయోగిస్తాను. కాగితాలు, వృక్ష సంబంధ ఉత్పత్తులను అవసరమైనంతవరకే ఉపయోగిస్తాను. ఈ ఉత్పత్తులను మరలా మరలా ఉపయోగించే పద్ధతులను పాటిస్తాను.

చెట్లు నాటి, వాటిని సంరక్షించే కార్యములో నేను ఎల్లప్పుడూ పాల్గొంటూ ఉంటాను. ఈ పద్ధతు లన్నింటినీ, నేను సంపూర్ణ విశ్వాసంతో, నిష్ఠతో పాటిస్తాను. ఈ కార్యంలోనే నా దేశ సౌభాగ్యం, భూమాత ఔన్నత్యం ఆధారపడి ఉంటాయని నమ్ముతాను.


భూ సుపోషణ ప్రతిజ్ఞ

సర్వశక్తిమంతుడగు శ్రీ పరమేశ్వరునీ, మన పూర్వికులనూ తలంచి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తానని, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి మొక్కలు నాటి చెట్లు పెంచుతానని పర్యావరణాన్ని తద్వారా భూమాతను రక్షిస్తానని నా కోసం, నా భావితరాల కోసం ఈ వ్రతాన్ని నేను జీవితాంతం పాటిస్తానని మా గ్రామదేవత… సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.

భూమాతాకీ జై!


భూ సుపోషణ

(అందరూ చెప్పవలసిన పూజా మంత్రాలు)

1) మాతా భూమిః పుత్రోహమ్‌ ప్రృథివ్యాః (భావం: ఈ భూమి నా తల్లి నేనామె పుత్రుడను)

2) గంధద్వారామ్‌ దురాధర్షా నిత్యపుష్టామ్‌ కరీషిణీమ్‌ (భావం: సమస్త ప్రాణులను పోషించే అజేయమైన సుగంధాన్ని వెదజల్లే ఈ భూమిని గోమయాన్ని ఉపయోగించి నిత్యపుష్ఠిగా చేస్తాము.)

3) జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ (భావం: కన్నతల్లి, జన్మించిన నేల స్వర్గం కన్నా మిన్న)

4) సానో భూమి స్తివబలమ్‌ రాష్ట్రీ దదాతూత్తమే (భావం: ఉత్తమమైన మన భారతభూమాత మన అందరికీ తేజస్సు, బలాన్ని ప్రసాదించుగాక)

5) గ్రీష్మస్తే భూమే వర్షిణీ శరద్ధేమంతః శిశిరో వసంతః ఋతవస్తే విహితా హాయనీ రహెరాత్రే పృథివినో దుహతామ్‌ (భావం: ఓ భూమాతా! విధాత నీ కోసమే ఈ ఆరు ఋతువులు గ్రీష్మ వర్ష శరద్‌ హేమంత శిశిర వసంత వర్ష సమూహం పగలు రాత్రి మొదలైనవన్నీ సృష్టించాడు.)

  1. ఓం ధ్యౌః శాంతిః అంతరిక్షగమ్‌ శాంతిః ప్రృథివీ శాంతిః ఆపః శాంతిః ఓషధయశ్శాంతిః వనస్పతయశ్శాంతిః విశ్వేదేవా శాంతిః బ్రహ్మ శాంతిః సర్వగమ్‌ శాంతిః శాంతి రేవ శాంతిః సామా శాంతి రేధి ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః (భావం : ధ్యౌలోకమ్‌ అంతరిక్షమ్‌ భూమి జలము ఓషధులు వనస్పతులు సమస్త దేవతలు బ్రహ్మ అంతటా శాంతికి కూడా శాంతి ఈ శాంతి నిరంతరం ఉండాలి.)
  2. భూమిః స్వర్గతామ్‌ యాత్‌ మనుష్యో యాత్‌ దేవతామ్‌ ధర్మో సఫలతామ్‌ యాత్‌ నిత్యం యాత్‌ శుభోదయమ్‌. (భావం : ఈ భూమి స్వర్గం కావాలి. ఈ మనుషులు దేవతలు కావాలి. ఈ ధర్మం సఫలం కావాలి. నిత్యమూ అందరికీ శుభాలు కలగాలి.)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE