ఇస్లాంలోని మతపరమైన దాతృత్వ కార్యక్రమాలకు వక్ఫ్ ‌ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగిస్తారు. వక్ఫ్ ఇచ్చిన వారు వాకీఫ్‌ (‌దాత). ఈ సంపదను పర్యవేక్షించడానికి నియమించిన వ్యక్తి ముతవల్లి. వక్ఫ్ ‌బ్రిటిష్‌ ‌కాలం నుండి అనేక రూపాంతరాలు చెందింది. ముసాల్మాన్‌ ‌వక్ఫ్ ‌వాలిడేటింగ్‌ ‌యాక్ట్ 1913, ‌ముసాల్మాన్‌ ‌వక్ఫ్ ‌యాక్ట్ 1923, ‌వక్ఫ్ ఆక్ట్ 1954, ‌సవరణలు 1959, 64,69, 1984లో చేశారు. వక్ఫ్ 1954 ‌యాక్టును మార్చి 1995లో కొత్త చట్టం తెచ్చారు. 2013లో సవరణలు ద్వారా వక్ఫ్‌కు దేశంలో ఏ సంస్థకు లేని అధికారం ఇచ్చి, ఆ వ్యవస్థలో అవినీతికి రాజమార్గం వేసింది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం.

వక్ఫ్‌కు ప్రపంచంలో అత్యంత ఆస్తులు ఉన్నది భారతదేశంలోనే. 2024 నాటికి మొత్తం ఆస్తులు 9.4 లక్షల ఎకరాలు. వాటి విలువ దాదాపు రూ. 1.2 లక్లల కోట్లు (మార్కెట్‌ ‌విలువ ఇంకా ఎక్కువే). అందులో 5,32,819 ఎకరాలకు లెక్కలు లేవు. లేదా కబ్జాలలో ఉన్నవి. ఇక సచార్‌ ‌కమిటీ నివేదిక ప్రకారం వక్ఫ్ ఆస్తుల నుండి ఏడాదికి కనీసం రూ. 12,000 కోట్ల ఆదాయం రావాలి. కానీ 2019లో రూ. 163 కోట్లు వస్తే, 2024 మొత్తం దేశంలో కేవలం రూ.1.6 కోట్ల ఆదాయం రావడం హాస్యాస్పద సన్నివేశం. రక్షణ రంగం, రైల్వేస్‌ ‌తర్వాత అత్యధిక ఆస్తులు ఉన్నది ఇస్లాం మతపరమైన వక్ఫ్ ‌సంపద. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు, వక్ఫ్ ‌పేద ముస్లింలకు ఒక వరం కావలిసింది, ఒక శాపం అయింది.

వక్ఫ్ ‌బోర్డులో ప్రధాన సమస్యలు

అధికారం కొండంత, జవాబుదారీతనం మాత్రం శూన్యం : ముత్తవల్లివే సర్వాధికారాలు. ఇది అత్యంత అవినీతిమైన వ్యవస్థగా పేరు పొందింది.

భూములు ఎక్కువగా కబ్జాలలో ఉన్నాయి. లేదంటే కోర్టు కేసులలో ఉన్నాయి. కొన్నింటిని బంధువులకు అప్పగించారు.

కోట్ల ఆస్తులు, పైసల్లో లీజు లేదా అద్దెలు. పైగా ఏ లీజు అయినా కనీసం 30 ఏళ్లకు తగ్గదు.

వక్ఫ్ ‌బోర్డు సభ్యులంటే ఒక సిండికేట్‌ అం‌టే సత్యదూరం కాదు. మొత్తం ఆస్తులు ముస్లిం నాయకులు, నవాబులు, ఉన్నత వర్గాల హస్తగతంలోనే ఉన్నాయి. అత్యధిక ఆస్తులు ఈ పెద్దల ఆసుపత్రుల కోసం, వైద్య కళాశాలల కోసం, వాణిజ్య సముదాయాల కోసం వినియోగంలో ఉన్నాయి. 8,70,000 (8.7 లక్షల) ఆస్తుల వివరాలకు బదులు కేవలం 3,30,000 (3.3 లక్షల) అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటికి లెక్కలు లేవు.

2013లో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం గద్దె దిగేటప్పుడు వక్ఫ్ ‌చట్టంలో సెక్షన్‌ 40 ‌జొప్పించింది. ఇది ఒక రాజ్యాంగ ఉల్లంఘన. సెక్షన్‌ 40 ‌ప్రకారం ముత్తావలి, ఎలాంటి ఆధారాలు లేకుండా భారతదేశం మొత్తాన్ని కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే అవకాశం కల్పించారు. ఇంకా ఘోరమైన విషయం, భారత దేశంలోని ఏ కోర్ట్ ‌వక్ఫ్ ‌ట్రిబ్యునల్‌ ‌లేదా ముత్తవలి చర్యలను సమీక్షించే అవకాశం లేకుండా చేశారు.

వక్ఫ్ ‌బోర్డులో ముస్లింలలో వెనకపడ్డ వర్గాలకు, స్త్రీలకు రిజర్వేషన్‌ ‌లేదు. కేవలం ముస్లింలలోని ఉన్నత వర్గాలకే అవకాశం. దీనితో వీరిదే ఆడింది అట, పాడింది పాట అయింది.

వక్ఫ్‌పై దేశంలో 40,000 కేసులు ఉంటే, అందులో 10,000 ముస్లిములు వేసిన కేసులే.

సెక్షన్‌ 40 అరాచకం

దేశం మొత్తంలో కోర్టుల పర్యవేక్షణకు అవకాశం లేని ఏకైక చట్టం అది.

తమిళనాడులోని ఒక గ్రామం (తిరుచందురై) మొత్తం వక్ఫ్ ఆస్తి అని ప్రకటించారు.

సూరత్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌భవన, ఆవరణ మావేనని వక్ఫ్ ‌ప్రకటించింది.

దేవభూమి ద్వారకలో బెట్‌ ‌ద్వారకలో రెండు ద్వీపాలు తమవేనని వక్ఫ్ ‌ప్రకటించింది

సూరత్‌లోని శివశక్తి సొసైటీలో రెండు ప్లాట్లు వక్ఫ్‌వని ప్రకటించి అక్కడ ఒక మసీదు నిర్మించారు.

తిరుచందురై దేవాలయం 600 ఎకరాలు, బెంగళూరులో 600 ఎకరాలు, కర్ణాటక, విజయపురి జిల్లాలో 1500 ఎకరాలు, కర్ణాటక దత్తపీఠ్‌ ‌మందిర్‌, ‌కర్ణాటక పాళీపుర ఆలయ భూములు 600 ఎకరాలు, కేరళ క్రిస్టియన్‌ ‌మిషనరీస్‌ ఆస్తులు, తెలంగాణలోని 4000 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌భూమి, అసెం మొరి గోవాన్‌లో 400 ఎకరాలు, ప్రయాగరాజ్‌లోని చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‌పార్క్, ‌మహారాష్ట్రలోని మహాదేవ్‌ ‌మందిర్‌.. ఇలా 2013 లో 9.4 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ ఆస్తులను సెక్షన్‌ 40 అడ్డం పెట్టుకొని వివిధ రాష్ట్రాలలో 36 లక్షల ఎకరాలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌భూమి వక్ఫ్ ఆస్తులు అని ప్రకటించి ఒక మహా న్యాయ వివాదానికి కారణమైంది.

తెలంగాణలో

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆస్తులలో 77,538 ఎకరాలు భూముల రూపంలో ఉన్నాయి. మరొక 33,929 ఆస్తులు ఉన్నాయి. అందులో 57,423 (75%) ఎకరాలు కబ్జాలలోనే ఉన్నాయి. 3500 కేసులు నడుస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ ‌రేటు ప్రకారం దాదాపు రూ.4 లక్షల కోట్లు ఉన్న ఈ ఆస్తులపై వచ్చే ఆదాయం మాత్రం సున్న. ఉదారణకు చార్మినార్‌ ‌దగ్గర ఉన్న మదీనా కాంప్లెక్స్ అనే వాణిజ్య సముదాయం వక్ఫ్ ఆస్తి, కోట్ల ఆదాయం వస్తున్నా వక్ఫ్ ‌సంస్థకు ఇచ్చే అద్దె ఏడాదికి రూ.10,000 కూడా లేదు. తెలంగాణలో కబ్జా అయిన భూముల్లో అత్యధికంగా బడా నేతల, బడా వ్యాపారుల ప్రైవేట్‌ ‌మెడికల్‌ ‌కాలేజీలు, ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్, ‌ప్రైవేట్‌ ‌విద్య సంస్థలు, ఫంక్షన్‌ ‌హాల్స్, ‌కమర్షియల్‌ ‌కాంప్లెక్స్‌లు, కంపెనీలు ఉండటం విశేషం. కొన్ని నామమాత్రపు లీజు అందుతోంది. అత్యధికంగా కబ్జాల పాలయ్యాయి. అవన్నీ అప్పగించవలసి వస్తుందనే ముస్లిం నేతలు గొడవ చేస్తున్నారు. ఆ వ్యతిరేకత కూడా అందుకే.

సచార్‌ ‌కమిటీ సిఫారసులు

2006లో అప్పటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం జస్టిస్‌ ‌సచార్‌ ‌నాయకత్వంలో ముస్లిముల ఆర్థిక, సామాజిక, విద్య పరిస్థితుల గురించి, వారి పురోభివృద్ది గురించి, సూచనలు ఇవ్వడానికి కమిటీని ఏర్పాటు చేసింది. అందులోని వక్ఫ్‌కు సంబంధించిన అంశాలు పరిశీలించదగినవి.

  • వక్ఫ్ ఆస్తుల నుండి ఏడాదికి కనీసం రూ. 12,000 కోట్ల ఆదాయం రావాలి. కానీ కేవలం రూ. 163 కోట్లు మాత్రమే వస్తోంది. (2024లో కేవలం 1.6 కోట్ల ఆదాయం).
  • ముత్తవల్లి పనితీరు పారదర్శకంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి.
  • రికార్డులు మొత్తం పారదర్శకంగా ఉండాలి.
  • ఏ మతం వారయినా వక్ఫ్ ‌బోర్డులో సాంకేతిక నిపుణులను నియమించాలి.
  • బోర్డులో మహిళలు, వెనకపడ్డ వర్గాలు, ముస్లింలలో ఉన్న ఇతర తెగలకు (షియా, అఘకాని, ఇస్నాలియాస్‌, ‌బోరా) స్థానం కల్పించాలి
  • జాయింట్‌ ‌సెక్రటరీ స్థాయి అధికారులను కౌన్సిల్‌, ‌బోర్డులలో స్థానం కల్పించాలి.
  • వక్ఫ్ ‌బోర్డును ఫైనాన్సియల్‌ అడిట్‌ ‌పరిధిలోకి తేవాలి.
  • ఈ సూచనలు కేవలం ముస్లింల అభివృద్ధి కొరకు సూచించినవి.

ఇస్లామిక్‌ ‌దేశాలలో వక్ఫ్

‌సౌదీ అరేబియా, టర్కీ, ఇరాక్‌, ఇరాన్‌, ఒమాన్‌, ‌మలేసియా, ఇండోనేషియా లాంటి అనేక దేశాలలో భారత వక్ఫ్ ‌బోర్డుల ఆస్తుల కంటే చాల తక్కువ. అలానే అత్యధిక దేశాలలో ప్రభుత్వ అధికార యంత్రాంగ పరిధిలోనే వక్ఫ్ ‌నడుస్తున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి అంటూ ఎక్కడ లేదు.

యూనిఫైడ్‌ ‌వక్ఫ్ ‌నిర్వహణ, సాధికారత, సమర్థత,అభివృద్ధి చట్టం (2025) ద్వారా ముస్లిం సమాజానికి కలిగే లాభాలు ఏమిటో కూడా చెప్పాలి. పారదర్శకత పెంపునకు ప్రయత్నం జరుగుతుంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, డిజిటల్‌ ‌రికార్డింగ్‌కు అవకాశం వస్తుంది. ఆర్థిక సద్వినియోగం, వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని సామాజిక, విద్యా అభివృద్ధికి వినియోగించడం సాధ్యమవుతుంది. అక్రమ ఆక్రమణల నివారణ, అక్రమణలపై కఠినచర్యలు, చట్టపరమైన రక్షణ చర్యలు తీసుకునే అవకాశం కొత్త సవరణ వల్ల వస్తుంది. పరిపాలనా సామర్థ్యం: వక్టస్ ‌బోర్డుల పనితీరులో సమర్ధతను పెంచడం కూడా ఈ సవరణ ఉద్దేశం. మహిళలకు సమాన హక్కులు మరొక కీలక అంశం. వక్ఫ్ ‌నిర్వహణలో మహిళా ప్రాతినిధ్యం ఉంటుంది. ముస్లింలలోని వెనుకపడ్డ వర్గాలకు, అల్పసంఖ్యాక వర్గాలు షియా అఘకాని, బోరా, ఇస్మాయిలి వర్గాలకు ప్రాతినిధ్యం దక్కుతుంది. సాంస్కృతిక, సామాజిక అభివృద్ధి ఆలోచన కూడా ఇందులో ఉంది. పేద ముస్లింలకు విద్యా, ఆరోగ్య పరిరక్షణకు వక్స్ ఆదాయాన్ని అందించడం జరుగుతుంది. వక్ఫ్ ‌బోర్డుల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిర్యాదు అవకాశం కూడా ఈ సవరణ ఇస్తుంది. ఆడిట్‌ ‌నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచడం మరో అంశం.

ఇప్పటి వరకు వక్ఫ్ ‌చట్టం కేవలం నాయకులకు, ధనిక వర్గాలకు, ఆక్రమణ దారులకు ఒక అడ్డాగా మారింది. అల్లాహ్‌ ‌పేరుతో పేదవర్గాలకు చేరవలసిన ఫలాలు ధనిక ముస్లిం వర్గాలు కొల్లగొట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ అల్లాహ్‌ ఆస్తులు ముస్లిం వర్గాలలోని పేద వర్గాలు, మహిళలకు అందాలనే ప్రయత్నం చేశారు. ఇందువలన హిందూ సమాజానికి కానీ, ఇతర మతస్థులకు కానీ వచ్చే లాభం ఏమి లేదు. సబ్‌ ‌కా సాథ్‌, ‌సబ్‌ ‌కా వికాస్‌, ‌సబ్‌ ‌కా విశ్వాస్‌, ‌సబ్‌ ‌కా ప్రయాస్‌ అనే స్ఫూర్తే ఈ సవరణల ప్రధాన ఉద్దేశం.

డా. బూర నరసయ్య గౌడ్‌

‌ధార్మిక హిందూ పరిషద్‌

‌మాజీ ఎంపీ – భువనగిరి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE