వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదించాయి. ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం చేశారు. ఇప్పుడది చట్టం. పేరు ఉమీద్. వక్ఫ్ అంటే దానం. ఇస్లామిక్ మత దానాలు ఈ పరిధిలోకి వస్తాయి. వక్ఫ్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో ఎవరికీ తెలియదు. రైల్వేలు, రక్షణ రంగ ఆస్తుల తర్వాత వక్ఫ్ ఆస్తులే దేశంలో అధికం. నిజానికి ఆ ఆస్తుల ఫలాలు పేద ముస్లింలకు అందవు. వీటిపై కొంతమంది అమీర్లు, రాజకీయ భూస్వాములు పెత్తనం చేస్తున్నారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ముగ్గురు స్త్రీలు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లు పారదర్శకంగా ఉంది. ఐనా సరే కొందరు ఎందుకు కోర్టుకెక్కారు?
హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ భూములు, అభయారణ్యాలు అన్యాక్రాంతమవు తున్నాయి. వాటిని అమ్మి స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీకి కప్పం కడుతున్నది. ఈ విషయంలో ఆందోళన జరిగింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ టీచర్ల నియా మకంలో అక్రమాలు చేసిందని కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురయింది. ఇలా ఎన్నెన్నో సంఘటనలు ఇటీవలివే ఉదాహరింపవచ్చు. దీనిని బట్టి తెలిసేదేమిటంటే హైకోర్టు, సుప్రీంకోర్టులతో పాటు భారతదేశంలో మూడో కోర్టు ఉంది. అది రోడ్డు కోర్టు. లక్ష్యసాధన కోసం రోడ్డుకెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. ఇక్కడికి వచ్చే వివాదాలకి న్యాయాన్యా యాలతో పనిలేదు. ప్రభుత్వ వ్యతిరేకత. ప్రజా స్వామ్యాన్ని అవమానించడం. ఇంకా చెప్పాలంటే మెజారిటీ మతస్థుల మనోభావాలకు విలువ లేదని రుజువు చేయడం. విద్యార్థులు ఇందులో ఇంధనం లాగా ఉపయోగపడుతూ ఉంటారు. మూడవ కోర్టు అంటేనే రోడ్డెక్కి ఆందోళనలు, అరాజకాలు సృష్టించడం.
మన రాజకీయ పార్టీలలో కమ్యూనిస్టులకు కోర్టుల మీద ఎట్టి నమ్మకమూ లేదు. ఈ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, కోర్టులు అంతా బూటకమని వారు బహిరంగంగానే చెప్పారు. అందుకు వారు చూపించిన ఉదాహరణలు` 1984 నాటి సిక్కుల ఊచకోత కేసు 40 సంవత్సరాలు నడిచింది. 1990 నిర్భయ – కొత్తూరు థామస్ షఫీ (కేరళ) కేసు 30 సంవత్సరాలు సాగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వివేకానంద రెడ్డి హత్యకేసు పదేండ్లుగా సాగుతూనే ఉంది. నేషనల్ హెరాల్డ్ అక్రమ ఆస్తుల కేసులు దశాబ్దంగా సాగుతూనే ఉన్నాయి. కమ్యూనిస్టులనే కాదు, ద్రవిడ పార్టీలు, చాలా ప్రాంతీయ పార్టీలు, ప్రజా సంఘాల పేరుతో చెలామణి అవుతున్న అరాచక శక్తులు ఆశ్రయిస్తున్నది ఈ మూడో కోర్టునే. ఇప్పుడు వక్ఫ్ చట్ట సవరణ ఇలాంటి కిరాయి ఆందోళనకారులకి మూడో కోర్టునే చూపిస్తున్నది. ఏమైతేనేం! ఇవాళ వక్ఫ్ ఆస్తులతో పాటు, చర్చి ఆస్తుల గురించి ఆలోచించే ఒక అవకాశం వచ్చింది.
ప్రస్తుతం కేరళ వంటి రాష్ట్రాలల్లో చర్చి భూములు ఎన్ని ఉన్నాయో ఎవరైనా లెక్కలు తేల్చారా? రామంతపూర్ క్రైస్ట్ ది కింగ్ ప్రాంగణం ఎన్ని ఎకరాలల్లో ఉంది? ముస్లిం మసీదులు, శ్మశాన భూములు, మదర్సాల మీద, చర్చిల మీద ఎవరికీ ఎటువంటి నియంత్రణ లేదు. వారి జోలికి పోతే మైనారిటీ హక్కులకు భంగం అంటూ కాంగ్రెసు, కమ్యూనిస్టు వర్గాలు ఒంటికాలిపై లేస్తాయి. కాబట్టే ఒక సాహసోపేత నిర్ణయంగా అంతా భావిస్తున్న వక్ఫ్ సవరణ చట్టం అంశం జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. తమిళనాడు టెంపుల్ టూరిజం మీద బ్రతికే రాష్ట్రం. ఇక్కడి ముఖ్యమంత్రి వక్ఫ్ ఆందోళనలో పాల్గొని ‘మూడవ కోర్టు’ను ఆశ్రయిస్తు న్నాడు? ఇదేకాదు, పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీనిని హత్యగా చిత్రీక రించి రాజకీయ లబ్ధి పొందాలని ఇవ్వాళ క్రైస్తవ సంఘాలు ఆశ్రయించినది కూడా మూడవ కోర్టునే.
హైదరాబాదు నగరాన్ని అసఫ్ జాహీ వంశస్థులు పాలించారు. అందువలన నగరంలోని భూములన్నీ వారివే అంటున్నారు ఒక వర్గం. ప్రయాగరాజ్ (సైఫాబాద్) భూములు, తాజ్‌మహల్ (ఆగ్రా) వక్ఫ్ పరిధిలోకే వస్తాయని ఇంకొందరు వాదించారు. ప్రభుత్వ నియంత్రణకు వ్యతిరేకత ఇందులో సుస్పష్టం. కానీ హిందూ దేవాదాయ సంస్థపై ప్రభుత్వాల నియంత్రణ, ప్రత్యక్ష జోక్యం ఉన్నాయి. గుడ్డిలో మెల్ల అన్నట్టు స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి వక్ఫ్ భూముల సమగ్ర సర్వే చట్టబద్ధంగా జరిగే అవకాశం వచ్చింది.
వక్ఫ్ అనే మాటకు అర్థం దేవుడికి చేసిన దానం. భక్తులు, కొందరు ఆనాటి పాలకులు ఇచ్చిన జాగీర్లు ఇవి. ఇలాగే హిందూ దేవాలయాలకు, మఠాలకు భక్తులు దానాలు చేశారు. వీటిని దురాశపరులు ఆక్రమించుకున్నారు. ఇందులో సింహాచలం, తిరుపతి వంటి ప్రముఖ ఆలయాల భూములు కూడా ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయ భూములను అప్పడాలు నమిలినట్లు నమిలి తినేశారు. ఇక్కడ అన్ని మతాల వారికి ఒక సామ్యం ఉంది. ఇటీవలి కాలంలో శ్మశాన భూములు, చెరువులు, అడవులు అన్యాక్రాంత మైనాయి. ఈ పని చేసినవారు ఓ కులం, ఓ మతానికి చెందినవారని చెప్పలేం. శ్రీవారివి ఏడుకొండలు కాదు జోడుకొండలే అని లోగడ ఒక ముఖ్యమంత్రి అనటం అప్పుడు కోర్టులల్లో కేసులు నడపడం గుర్తుండే ఉంటుంది. ‘మదర్సా’ అంటే విద్యాలయం. విద్యాభివృద్ధికై ఎవరో దాత దానం చేస్తాడు. అక్కడ మదర్సా ఉండదు. మరి ఆ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నట్లు?
సెక్షన్ 3 (షరియ) ప్రకారం చరాచర ఆస్తులు వక్ఫ్‌బోర్డుకు చెందుతాయి. అందులో ముస్లిం మతాధికారులు ఉండేవారు. స్త్రీలకు స్థానం లేదు. ఈ చట్టాన్ని 1954-1995-2013 సంవత్సరాలలో కాంగ్రెసు ప్రభుత్వం సవరించింది. ఈ సవరణలన్నీ పేద ముస్లిం ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసినవి కావు. రాజకీయ లబ్ధి కోసం ఆయా సమయాలలో కాంగ్రెసు పార్టీ చేసినవి.
కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీలు సవరణ బిల్లును వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్‌లో నారా వారి పార్టీ, జగన్ రెడ్డి పార్టీ రెండూ బిల్లుకు అనుకూలం గానే ఓటు వేశాయి. తెలంగాణ నుండి మజ్లిస్, బీఆర్‌ఎస్ బిల్లును వ్యతిరేకించాయి. అసదుద్దీన్ ఒవైసీ, ఎం.కె. స్టాలిన్లు ‘మూడవ కోర్టు’ను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. ఒవైసీ అయితే నితీశ్‌నీ, చంద్రబాబునీ ముస్లింలు ఏనాటికీ క్షమించరని పిల్లి శాపం కూడా పెట్టారు. ఈ ఉదంతంలో శివసేనదే మరీ లజ్జాకరమైన వైఖరి. ఆ పార్టీ ఐక్యంగా ఉన్నప్పుడు ఒక సభ్యుడు లోగడ భారతదేశంలో ముస్లిముల పౌరసత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించాడు. తాజాగా అదే శివసేన (యూబీటీ) ముస్లిం లీగ్‌తో కలసి ఓటింగ్‌లో పాల్గొన్నది. ‘‘రాజ్యాంగంలోని 14-15-24-25-26-29 సూత్రాలకు ఈ సవరణ విరుద్ధం. అందుకని మేము మూడవ కోర్టు ‘వీధిపోరాటానికి సిద్ధం’ అన్నాడు అసదుద్దీన్ ఒవైసీ (4.4.2025). 4-4-2025 నాడు లూథియానా, అహమ్మదాబాదు, కలకత్తా, ముంబాయి, చెన్నైలలో శుక్రవారం ప్రార్థనల తర్వాత గుంపులు గుంపులుగా వీధులలోకి వచ్చి ఆ వర్గం వారు అరాచక నినాదాలు ఇచ్చారు. భారతదేశంలోని ముస్లిం మహిళలు ఈ బిల్లును సమర్థించారు. లోగడ త్రిపుల్ తలాక్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ముస్లిములలో అమీరులు ఒక్క శాతం మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించారు. వాయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వక్ఫ్ బిల్లు చర్చలలో పాల్గొనలేదు. దీనితో వాయనాడ్ ప్రజలు ఆమెను నిలదీశారు. ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది? అని బహిరంగంగానే తిరగబడ్డారు. రాహుల్ కూడా ముఖం చాటేశాడు.
హైదరాబాదులోని పక్ఫ్ భూములపై అసదుద్దీన్ కిరాయిలు వసూలు చేసుకోవడం నిజమా? కాదా? సారాంశమేమంటే మమతా బెనర్జీ వంటివారు, జయరాం రమేశ్ వంటి వారు హిందూ ముస్లిం భేదాలు సృష్టించి అంతర్యుద్ధాన్ని ప్రేరేపించాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సభ్యుడు సుధాంశు త్రివేది తన రాజ్యసభ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆయన అన్న మాటలు: ముస్లిం పేద ప్రజల నోట్లో మట్టి కొట్టి ఈ ఆస్తులను కొందరు అమీర్లు అనుభవిస్తున్నారు. ఈ స్వార్థపరులు మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి జోర్డాన్, యెమెన్, కువాయిట్ వంటి ఏ ముస్లిం పాలక దేశాల్లోను లేదు. ఇదేనా కాంగ్రెస్ మార్క్ సెక్యులరిజం అంటే? అని ప్రశ్నించారాయన.
ఇది వక్ఫ్ చట్ట సవరణ. మతానికి సంబంధిం చిన అంశం కాదు. భూవివాదం మాత్రమే. త్రిపుల్ తలాక్ ఒక సాంఘిక దురాచారం. స్త్రీలపై జరిగే హింస. దీనిని మతచట్టంగా ఎలా పరిగణిస్తారు? బాల్య వివాహాలు సాంఘిక దురాచారాలే కాని తాత్వికాంశాలు కావు. భారతీయ ముస్లిములలో అబ్దుల్ కలాం వంటి దేశభక్తులు ఎందరో ఉన్నారు. హిందూ పేర్లతో మనుగడ సాగిస్తున్న దేశద్రోహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి మతాన్ని బట్టి ఒక వ్యక్తి దేశభక్తుడా? కాదా? అని మూకుమ్మడిగా నిర్ణయించలేం. భారతదేశాన్ని అరబ్బులు, మొగలుల 600 ఏళ్లు పాలించారు. అప్పుడు భారీ స్థాయిలో మతాంతరీకరణలు జరిగాయన్న మాట నిజం. 1947 నాటి దేశవిభజన తర్వాత భారత్‌లోనే కొన్ని కోట్ల మంది ముస్లింలు ఉండిపోయారు. వీరిలో నిరుపేదలే అధికం. వీరిని ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూ కాంగ్రెసు పార్టీ కొన్ని దశాబ్దాలు భారతదేశాన్ని పాలించింది. ఈ పేద ముస్లిముల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ఆలోచన ఏనాడూ చేయలేదు. రంజాన్ మాసంలో ఒక పూట ఇఫ్తార్ ఇచ్చినంత మాత్రాన వీరి దరిద్రం తొలగిపోతుందా? అరటిపండ్లు, కూరలు, పూలు అమ్ముకుంటూ, చిన్న చిన్న మెకానిక్‌లుగా రోడ్డు పక్కన బతికే ముస్లింలు హైదరాబాదులోనే లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిని కమ్యూనిస్టు, కాంగ్రెసు వర్గాలు పట్టించుకున్నాయా? అనుభవం ఏం చెబుతున్నది? ఇండియాలో హిందువులు మెజారిటీలో ఉన్నంత వరకు ముస్లిములు, క్రైస్తవులు సుఖజీవనం చేయగలరు. చైనాలో కమ్యూ నిష్టుల రాజ్యం ఉంది. అక్కడ ముస్లిములు రంజాన్ చేసుకోవడానికి వీలులేదు. పాకిస్తాన్‌లో ముస్లిములదే మెజారిటీ. అక్కడ కూలి పనులు చేసుకొనే కొద్దిమంది హిందువులు ఒక్క శాతం మిగిలారు. నరేంద్ర మోదీ ‘సబ్‌కా వికాస్’ మంత్రాన్ని భారతదేశంలోని ముస్లిం మహిళలు నమ్మారు. కానీ అల్లరంతా హిందూ పేరు, పాకిస్తాన్ మనసు ఉన్నవారిదే. మూడో కోర్టులన్నీ వీళ్లవే.
– ప్రొ. ముదిగొండ శివప్రసాద్, విశ్రాంత ఆచార్యుడు