వక్ఫ్ చట్ట సవరణలకు నిరసన పేరుతో ముస్లిం మతోన్మాదులు మరొకసారి రెచ్చి పోవడానికి పథకాలు వేస్తారన్న అంచనాలు ఉన్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 రద్దు, అయోధ్యలో వివాదాస్పద స్థలం రాముడిదేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అన్ని సమయాలలోను ముస్లిం మతోన్మాదులు దేశంలో రక్తపాతం సృష్టించడానికి పథకాలు వేశారు. హిందువుల శోభాయాత్రలపై దాడులు మరొకటి. ఇదంతా హిందువులను రెచ్చగొట్టి దేశంలో కల్లోలం తెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడమే ధ్యేయంగా ముస్లిం మతోన్మాదులు కదులుతున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం తరువాత ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే జరిగింది. వక్ఫ్ సవరణ చట్టం తీసుకువస్తే దేశంలో అలజడి తప్పదని ముస్లిం మతోన్మాద పార్టీలే కాదు, కొన్ని పాక్ అనుకూల భారత రాజకీయ పార్టీలు కూడా హెచ్చరించిన సంగతి తెలిసినదే.
వక్ఫ్ చట్ట సవరణతో ముస్లింల ఆస్తులు మొత్తం దోచుకుంటారన్న దుష్ప్రచారం మరింత తీవ్రం చేశారు. ఎంఐఎం రేపుతున్న అపోహలు, పార్లమెంటులో కొందరు విపక్ష నాయకులు ఇచ్చిన ప్రసంగాలు, వామపక్షాలతో పాటు జమాత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ చేస్తున్న ప్రకటనలు ఇలాంటి ఒక అశాంతి వాతా వరణాన్ని సృష్టించేందుకేనని అర్థమవుతుంది.
ఇందుకు తృణమూల్ కాంగ్రెస్ పాలనలోని పశ్చిమ బెంగాల్‌లో మంచి వేదిక. ఇప్పుడు రాష్ట్రం వైపు అందరి దృష్టి పడడానికి కారణం ఇదే. షేక్ హసీనా భారత్‌కు వచ్చిన తరువాత బాంగ్లాదేశ్ ఎలాంటి పరిస్థితులలో చిక్కుకుపోయిందో, పశ్చిమ బెంగాల్‌లో కూడా అదే పరిస్థితులు ఏర్పడ్డాయన్న వాదన ఎప్పుడో వచ్చింది. బాంగ్లా చొరబాటు దారులకు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ను అప్పగించడానికే మొగ్గు చూపుతున్నట్టు ఉంది. అంతవరకు తన కుర్చీ పదిలంగా ఉంటే చాలు. ఈ పరిస్థితులన్నీ అక్కడ అల్లర్లకు అనుకూలమే.
వక్ఫ్ చట్ట సవరణలకు నిరసన పేరుతో పశ్చిమ బెంగాల్‌లో మొదలైన ముస్లిం మతోన్మాదుల అరాచకం కేంద్ర బలగాలు రంగ ప్రవేశం చేయడంతో మటుమణిగాయి. ఏప్రిల్ 11న శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తరువాత ఆరంభమైన ముస్లిం మతోన్మాదుల అరాచకం సరిహద్దు భద్రతా దళాలు, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాల రాక తరువాత 14వ తేదీకి ఆగింది. బాంగ్లాదేశ్‌కు సరిహద్దుగా ఉన్న ముర్షిదాబాద్ జిల్లా ఈ అల్లర్లతో కుదేలయింది. అల్లర్లలో 12వ తేదీ ముగ్గురు మరణించడంతో కేంద్ర బలగాల మోహ రింపు కోసం హైకోర్టు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. యథా ప్రకారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత బాధ్యతా రహితంగా ప్రకటనలు చేశారు. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసింది తాను కాదని, కేంద్ర ప్రభుత్వమని; మీరు ఏదైనా తేల్చుకోవాలని అనుకుంటే ఢిల్లీతో పోరాడాలని మరింత రెచ్చగొట్టే ప్రకటన చేశారు. అంతేకాదు, ముస్లింలను ఏదో ఒకరకంగా బుజ్జగించాలని, వక్ఫ్ సవరణ చట్టం రాష్ట్రంలో అసలు అమలు చేసే ప్రసక్తే లేదనీ, ముర్షిదాబాద్‌లో ఆ మాటే వినిపించదని కూడా ప్రకటించారామె. కేంద్ర బలగాలను పంపాలని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయినా కూడా వాటి రాక పట్ల తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ నిరసన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రాల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని పాత పాటే పాడారు. ఇక దాడుల లక్ష్యం హిందువు లేనని, నాలుగు వందల కుటుంబాలు గంగానది దాటి మాల్డా జిల్లాకు కట్టుబట్టలతో వెళ్లిపోయాయని బీజేపీ నాయకుడు, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. ఈ అల్లర్ల వెనుక కేరళ ఉత్పత్తి చేసిన ఎస్‌డీపీఐ (సోషల్ డెమాక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. దీని అనుబంధ పీఎఫ్‌ఐ గతంలోనే నిషేధానికి గురైంది) ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు అంచనాకు రావడం ఈ రక్తకాండకు కొస మెరుపు. ఇంతవరకు ఈ అల్లర్లకు ముగ్గురు బలయ్యారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. 150 మందిని అరెస్టు చేశారు.
కేంద్రంతో తేల్చుకోండని మమతా బెనర్జీ, ఈ అల్లర్ల వెనుక ఉన్న భారీ కుట్ర గురించి తమ నాయకురాలు వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని టీఎంసీ ఎంపీ కునాల్ ఘోష్ వ్యాఖ్యానించడం విశేషం. ఈ కుట్ర వెనుక పారా మిలటరీ బీఎస్‌ఎఫ్, మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ అల్లర్లన్నీ బయటి నుంచి వచ్చిన వారు చేసినవేనని కునాల్ ఆరోపణ. ఇందులో బీఎస్‌ఎఫ్ పాత్ర ఏమిటో ఈ ఎంపీ చెప్పినది వింటే విస్తుపోతాం. సరిహద్దు భద్రతాదళంలో ఒక భాగం లాలూచి పడి, కొంత భాగం చూడకుండా విడిచి పెట్టిందని, ఆ ప్రాంతం నుంచే బయటివారు రాష్ట్రంలో ప్రవేశించి రక్తపాతానికి వడి గట్టారని కునాల్ వివరించాడు. అలాగే అల్లర్లు జరిపిన తరువాత యథేచ్ఛగా బయటకు పోవడానికి కూడా అవకాశం ఇచ్చారని ఆయన చెప్పాడు. నిజానికి ఏప్రిల్ 13న కూడా కొన్ని ప్రాంతాలలో దుండగులు అల్లర్లకు ప్రయత్నించారు. కానీ సరిహద్దు భద్రతా దళాలు చెదరగొట్టాయి. ప్రస్తుతం అక్కడ తొమ్మిది కంపెనీల బీఎస్‌ఎఫ్, ఎనిమిది కంపెనీల సీఆర్‌పీఎఫ్ నిఘా బాధ్యతను నిర్వహిస్తున్నాయి.
బెంగాల్ పోలీస్ వర్గాల కథనం ప్రకారం సోషల్ డెమాక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) ఈ అల్లర్ల వెనుక ఉంది. దీని అనుబంధ సంస్థ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను 2022లో కేంద్రం నిషేధించింది. ఇది దక్షిణ భారతదేశంలో సృష్టించిన రక్తపాతం తక్కువేమీ కాదు. ఎస్‌డీపీఐ సంస్థ ముర్షిదాబాద్ ప్రాంతంలోని ముస్లిం యువకులను వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టిందని పోలీసు శాఖ దర్యాప్తులో వెల్లడైంది. వక్ఫ్ సవరణతో ముస్లింలను సర్వం దోచుకోవాలని కేంద్రం కుట్ర పన్నిందని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయించింది. ఈ విషయాన్ని సాక్షాత్తు ఇజాజ్ అహ్మద్ అనే వ్యక్తి కుటుంబీకులు చెప్పారు. ఇజాజ్ పోలీసులతో ఘర్షణ పడి ఆసుపత్రి పాలయ్యాడు. తరువాత ఏప్రిల్ 12న చనిపోయాడు. ముర్షిదాబాద్ ప్రాంతంలో ఎస్‌డీపీఐ దుష్ప్రచారం నిర్వహించిందని అతడి కుటుంబీకులు చెప్పారు. 11వ తేదీన శుక్రవారం ప్రార్థనల తరువాత చెలరేగిన అల్లర్లు దాని ఫలితమే. మొదటి రోజు మూడు గంటల పాటు గృహదహనాలు, విధ్వంసం, ఆస్తుల దోపిడీ యథేచ్ఛగా సాగిపోయాయి. పైగా ముర్షిదాబాద్ బాంగ్లాదేశ్‌కు సరిహద్దులలోనే ఉంది. 12వ తేదీ శనివారం కూడా అల్లర్లు కొనసాగాయి. ఆ రోజే తండ్రీకొడుకులు హరగోవింద్ దాస్, చందన్ సహా ముగ్గురు చనిపోయారు. మొత్తంగా ఈ పరిణామాలు ముర్షిదాబాద్ ప్రాంత హిందువులను తీవ్రంగా భయపెట్టాయి. ఇందుకు నిదర్శనంగా వందల సంఖ్యలో హిందువులు పడవల మీద గంగానది దాటి మాల్డా చేరుకుంటున్నట్టు చూపే వీడియో వెలుగులోకి వచ్చాయి.
నిజానికి విధ్వంసకారులు ముందస్తు ప్రణాళికతోనే ఉన్నారు. ఏప్రిల్ 8న 12వ జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు మీద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆ రోజే సంతకం చేశారు. ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. స్థానిక ఎంపీ ఖలీలుర్ రహమాన్ కార్యాలయం మీద దాడి చేశారు. నిమితియా రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. 11వ తేదీకి అల్లర్లు తీవ్రమయ్యాయి. అప్పటికి ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం ఆరంభించారు. మొదట నిరసన కార్యక్రమం శాంతియుతంగానే ప్రారంభమైనా, అది తమ సంప్రదాయం కాదని నిరసనకారులు గట్టిగా నమ్మి అల్లర్లకు పాల్పడ్డారు. వక్ఫ్ వ్యతిరేక నిరసనలు తరువాత అల్లర్లుగా పరిణమించి సూతి, ధౌలియన్, జంగీపూర్, షంషేర్‌గంజ్ ఇతర ప్రాంతాలకు విస్తరించాయి.ఈ ప్రాంతాలన్నీ పూర్తి నిర్మానుష్యంగా ఉండిపోయాయి. భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయి. గంగానది దాటి మాల్డా చేరుకున్న వారికి అధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. వీరిలో కొందరి ఇళ్లను విధ్వంసకారులు తగులబెట్టారు.
ముర్షిదాబాద్ జిల్లా మత కల్లోలాలతో అట్టుడుకుతున్నట్టు ఉడుకుతున్నా ముస్లిం మత పెద్దలు రెచ్చగొట్టే ప్రకటనలు మానలేదు. ఏప్రిల్ 12న జమాత్ అధిపతి మహమ్మద్ మాదానీ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం. వక్ఫ్ చట్ట సవరణ బోర్డులు సమర్థంగా పనిచేయడానికి కాదని, స్వార్థ ప్రయోజనాలకేనని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశాలతో రూపొందించిన ఈ సవరణ ముస్లింల ఆస్తులను ఆక్రమించుకోవడానికే ఉపయోగ పడుతుందని, కాబట్టి నిరసనలు చేయాలని, కానీ అవి శాంతియుతంగానే ఉండాలని చెబుతున్నాడు. ఇతడు శాంతియుతంగా నిరసనలు జరపాలని నొక్కి చెప్పాడంటే, అందులో హింసాకాండను మరచి పోవద్దు సుమా అన్న ధ్వనే ఉన్నదనిపిస్తుంది. ఈ ‘శాంతియుత’ నిరసనలు అన్నిచోట్లా చేయాలని కూడా పిలుపునిచ్చాడు.
ఈ అల్లర్లు రాజకీయ ప్రేరేపితమేనని పోలీసులు ఈ పర్యాయం గట్టిగానే నమ్ముతున్నారా? ఇలాంటి అభిప్రాయానికి కొంతవరకు రావచ్చు. పశ్చిమ బెంగాల్ పోలీసులు మొత్తం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే. అయినా కొన్ని చేదు వాస్తవాలు వాళ్లని ఒక అభిప్రాయానికి తీసుకువెళ్లాయి. ఈ అల్లర్లలో కుర్రకారు జోరు ఎక్కువగా ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా ముస్లిం మతోన్మాద వర్గాలు చేసిన వక్ఫ్ వ్యతిరేక ప్రచారం దారుణంగా ఉంది. కొందరు ఇంటింటికీ తిరిగి లేదా సామాజిక మాధ్యమాలతో చేసిన ప్రచారంలో ఎక్కువ భాగం ముస్లింలను సర్వం దోచుకుంటారన్నదే కనిపించింది. వక్ఫ్ సవరణ అంటే ‘ముస్లింల ఇళ్లు స్వాధీనం చేసుకుంటారు. మసీదులను కూలగొడతారు. ఆఖరికి ముస్లింలకు చెందిన శ్మశాన వాటికలను కూడా కేంద్ర ప్రభుత్వం దిగమింగుతుంది.’ ఈ మాటలు ముర్షిదాబాద్‌కు వలస వచ్చిన కూలీలను తీవ్రంగా భయపెట్టాయట. వీళ్లే కూలీలు. వీళ్ల ఆస్తులు కేంద్రం తీసేసుకుంటుందని వణికి పోయారట. అందుకే 14-19 సంవత్సరాల వయసు ఉన్న యువకులు వీధులలోకి వచ్చి ఏప్రిల్ 11 శుక్రవారం వీరంగం వేశారట.
మొదటి దశలో రోడ్లను దిగ్బంధనం చేశారు. ఈ దిగ్బంధనం ఒక రాత్రంతా సాగింది. తరువాత ఒక పథకం ప్రకారం హింసాకాండకు, రక్తపాతానికి దారి తీసింది. షంషేర్‌గంజ్, జంగీపూర్, ధౌలియాలలో ఈ పరిణామాలు స్పష్టంగా కనిపించాయి. ఒక జాతీయ ఆంగ్ల చానల్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసు వాహనాలే కాదు, అంబులెన్సులు, హిందువుల ఇళ్లు, రైళ్లు కూడా దగ్ధం చేశారు. ఏప్రిల్ 9 నుంచి ఈ కల్లోలిత ప్రాంతంలో సీనియర్ పోలీసు అధికారుల నాయకత్వంలో పోలీసు పహారా ఉన్నప్పటికీ అల్లర్లు అదుపులోకి రాలేదు. ఈ చానల్‌కు ఒక పోలీసు అధికారి ఇచ్చిన సమాచారం ఇలా ఉంది: ‘అనేక కోణాల నుంచి దాడులు ఆరంభించారు. అవి వ్యూహాత్మకంగా, ఆకస్మికంగా మొదలయ్యాయి. ఇవన్నీ ఒక పథకం ప్రకారం జరిగిన అల్లర్లు. కుట్రదారుల వెనుక పెద్ద బలగమే ఉంది’. ఆ శుక్రవారం ప్రార్థనలు పూర్తి కాగానే మొదలైన అల్లర్లను గమనించినా వీటి వెనుక ఎంత పకడ్బందీ పథకం ఉందో అర్థమయింది అంటారాయన. రోడ్ల మీద అల్లర్లకు దిగిన మూకలతో పోలీసులు పోరాడుతుంటే, ఒక మూక వెళ్లి హిందువుల ఆస్తులను, ఇళ్లను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది. కొన్ని హిందూ ఆలయాలు కూడా దాడికి గురయ్యాయి. ముర్షిదాబాద్ ప్రాంతంలో గట్టి పట్టున్న ఎస్‌డీపీఐ ఈ అల్లర్ల వెనుక ఉన్నదన్న అనుమానం ఇప్పుడు అందరిలోను వచ్చింది. దీని అనుబంధ సంస్థ పీఎఫ్‌ఐ సరిహద్దు ప్రాంతాలలో పట్టును సాధించింది. మరో మతోన్మాద సంస్థ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పాత్ర గురించి కూడా అనుమానాలు ఉన్నాయి.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలు 33 శాతం ఉన్నారు. ముస్లిం జనాభా పెరుగుదల వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని మమత ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చొరబాటుదారుల ఆస్తులు కాపాడడమే తన ప్రధాన ధ్యేయంగా ప్రకటించారామె. కాబట్టి బాంగ్లా చొరబాటుదారులకు తలుపులు తెరవడంలో వామపక్ష ప్రభుత్వానికీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికీ తేడా ఏమీ లేదు. కొన్ని వాస్తవాలు ఇప్పుడైనా జాతికి తెలియాలి. బెంగాల్ ఎన్నికలు జరిగితే హింస జరుగుతుంది. ప్రతి దసరాకు హింస జరుగుతుంది. కానీ ఎప్పుడు హింస జరిగినా నష్టపోయేది హిందువులే. వామపక్ష ప్రభుత్వం మూడున్నర దశాబ్దాలు, మమత ఏలుబడి పదిహేనేళ్లు కలిపి అర్థశతాబ్దంగా బెంగాల్ హిందువులు మాడిపోతున్నారు.పైగా బాధితులంతా హిందువులే అయినా ఈ దారుణం గురించి భద్రలోక్ ప్రజానీకానికి పట్టడం లేదు. అత్యంత అపాయకరమైన, హీనమైన ఉదారవాదాన్ని పశ్చిమ బెంగాల్ భద్రలోక్ సమాజం అనుసరిస్తున్నది. కాబట్టి హిందూ సమాజంలోని కింది తరగతులే బెంగాల్‌లో దారుణంగా నష్టపోతున్నాయి. వారి ధనప్రాణ మానాలకు కాస్త కూడా రక్షణ లేదు. గవర్నర్‌కు విలువ లేదు. పోలీసులంతా అక్షరాలా మమతకు బానిసలు. ఇక అక్కడ హిందువులకు ఎవరు రక్షణ?
– జాగృతి డెస్క్