పార్లమెంట్‌ ఉభయ సభలూ రాత్రీ పగలూ తేడా లేకుండా 26 గంటలకు పైగా సుదీర్ఘమైన చర్చోపచర్చలు జరిగిన తర్వాత వక్ఫ్‌ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపాయి. లోక్‌సభలో బిల్లుపై ఏప్రిల్‌ 2 బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏప్రిల్‌ 3 గురువారం తెల్లవారుజామున 2.15 గంటల వరకు చర్చ, ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు అదే రోజు మధ్యాహ్నం రాజ్యసభకు చేరుకుంది. రాజ్యసభలో 12 గంటలకు పైగా చర్చ అనంతరం ఓటింగ్‌ ప్రక్రియ జరిగిన తర్వాత ఏప్రిల్‌ 4 శుక్రవారం తెల్లవారుజామున బిల్లు సభ ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు. భారత్‌ వృద్ధి పథానికి చరిత్రాత్మక మలుపు చేకూర్చారు. దేశ సమ్మిళిత అభివృద్ధికి మేలుకొలుపు పాడారు. పార్లమెంట్‌ పనిలోపనిగా 1923నాటి ముసల్మాన్‌ వక్ఫ్‌ యాక్టుకు ఉద్వాసన పలికే 2024 నాటి ముసల్మాన్‌ యాక్టు (రద్దు) బిల్లుకు పచ్చ జెండా చూపింది.  ఇంతటి ఘనతను సాధించడంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు ముఖ్య భూమికను పోషించారు. పార్లమెంట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక బిల్లుపై ఇన్నేసి గంటలు చర్చ జరగడం ఇదే తొలిసారి. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలతో వేడెక్కిన పార్లమెంట్‌ కురుక్షేత్రాన్ని తలపించింది. బిల్లు ఆమోదం పొందకుండా ఆపడం కోసమని విపక్షాలు నేలవిడిచి సాము చేశాయి. బిల్లు పట్ల దేశ ప్రజల్లో ముఖ్యంగా ముస్లిం మైనారీటిల్లో లేనిపోని అపోహలను కల్పించడానికి, వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నించాయి. పసలేని మాటలతో కూడిన తుప్పు పట్టిపోయిన, నిర్వీర్యమైపోయిన అస్త్రాలను సంధించాయి. మొత్తమ్మీద తమదే పైచేయి అని చెప్పడానికి ప్రయత్నించాయి. సరిగ్గా ఇక్కడే అమిత్‌ షా, కిరెన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కృష్ణార్జునులను తలపించారు. వేలెత్తిచూపడానికి అవకాశమివ్వని సమగ్రమైన సమాచారంతో విపక్షాలకు ఊపిరాడకుండా చేశారు.  బిల్లును ప్రవేశపెట్టి, అందులోని విశిష్టతలను ఉభయ సభలతో పాటుగా యావత్‌ భారతావనికి పూసగుచ్చినట్టుగా విడమరిచి చెప్పే బాధ్యతను కిరెన్‌ తీసుకుంటే, అమిత్‌ షా పదునైన వాగ్బాణాలతో విపక్షాల వాచాలత్వాన్ని, మూర్ఖత్వాన్ని  తుత్తునియలు చేయడమే కాకుండా పార్లమెంట్‌ ఆమోదం పొందడంలో బిల్లుకు ఎర్ర తివాచీని పరిచారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోట్లాది ముస్లింలకు ప్రయోజనం చేకూర్చే బిల్లుకు చట్టబద్ధత తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేయడం ద్వారా అనేక దశాబ్దాలుగా భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉప్పుపాతర వేసింది. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న వక్ఫ్‌ ఆస్తులపై వ్యాజ్యాలు ఓ కొలిక్కి వచ్చేలా చేసింది.

చట్టబద్ధమైన వక్ఫ్‌బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకు ఉండకూడదని బిల్లు ముందుకు సాగకుండా అడ్డంగా నిలుచున్న విపక్షాలను మోదీ సర్కారు నిలదీసింది. హిందువులు, ముస్లింలకు మధ్య ఆస్తి వివాదం వచ్చినప్పుడు వక్ఫ్‌ బోర్డులో ముస్లింలు మాత్రమే ఉంటే వివాదం ఎలా పరిష్కారమవుతుందని వేలెత్తి చూపింది. చట్టబద్ధతను సంతరించుకున్న వక్ఫ్‌బోర్డు మతాలకు అతీతంగా వ్యవహరిస్తూ, అన్ని మతాలకు ప్రాతి నిధ్యం వహించాల్సిన అవసరాన్ని కుండబద్దలు కొట్టి నట్టుగా చెప్పింది. గతంలో వక్ఫ్‌ ట్రిబ్యూనళ్లు ఇచ్చే తీర్పు లపై ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కోర్టులు జోక్యం చేసు కునేవి. ట్రిబ్యూనల్‌ ఇచ్చిన తీర్పుతో న్యాయం దక్కనిపక్షంలో కక్షిదారుకు న్యాయస్థానంలో అప్పీల్‌ చేసుకునే హక్కును సవరణబిల్లు తెచ్చిపెట్టింది. సంబంధిత యంత్రాంగాలను బలోపేతం చేసింది. 2014 ఎన్నికలకు ముందు, నరేంద్ర మోదీ సర్కార్‌ రాకకు ముందు ప్రభుత్వ భూములను వక్ఫ్‌బోర్డుకు కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు పాల్పడిన దురాగతాన్ని నిండు సభలో దుయ్యబట్టింది. దానం పేరిట సాగించిన అపాత్రదానాన్ని తూర్పార పట్టింది. ఇకపై ఇలాంటి దాతృత్వపు ఆటలు సాగనే సాగవని తేల్చి చెప్పింది.


చరిత్రాత్మకమైన మలుపు

వక్ఫ్‌ (సవరణ) బిల్లు, ముసల్మాన్‌ వక్ఫ్‌ (రద్దు) బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని పొందడం సామాజిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం తాము సమష్టిగా సాగిస్తున్న శోధనకు ఒక చరిత్రాత్మకమైన మలుపునకు నిదర్శనంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది మరీ ముఖ్యంగా చాలాకాలంగా అట్టడుగున ఉండిపోయి తమ వాణి వినిపించలేక, అవకాశాలు అందుకోలేకపోయిన వారికి ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ‘‘వక్ఫ్‌ వ్యవస్థ దశాబ్దాల కాలంగా కొరవడిన పారదర్శకతకు, జవాబుదారీ తనానికి మారుపేరుగా నిలిచింది. ఇది ప్రత్యేకించి ముస్లిం మహిళలు, పేద ముస్లింలు, పస్మంద ముస్లిం ప్రయోజనాలకు చేటు చేసింది. పార్లమెంటు ఆమోదించిన బిల్లులు పారదర్శకతకు పెద్ద పీట వేస్తాయి. ప్రజల హక్కులకు ఒక రక్షాకవచంగా నిలుస్తాయి’’ అని ప్రధాని అన్నారు.


సామాన్య ముస్లింలకు సువర్ణ అవకాశం

2025 నాటి వక్ఫ్‌ సవరణకు ఆంగ్ల అక్షరాలతో ఉమీద్‌ అని నామకరణం చేశారు. పూర్తిగా చెప్పాలంటే ఏకీకృత వక్ఫ్‌ నిర్వహణ, సాధికారత, కార్యకుశలత, అభివృద్ధి యాక్ట్‌ అని అర్థం. అదే ఉమీద్‌కు హిందీలో ఆశ, ఆధారం, నమ్మకం, విశ్వాసం, కోరిక అనే అర్థాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు వక్ఫ్‌ ఆస్తులకు కాపుకాస్తూనే మరోవైపు సామాన్య ముస్లింలకు ప్రయోజనాలు చేకూర్చడమే లక్ష్యంగా ఉమీద్‌ను తీసుకొని వచ్చింది. వక్ఫ్‌ ఆస్తుల బాగోగులను స్వయంగా చూసుకోవాలి. వాటి ద్వారా వచ్చే ఆదాయం అవసరార్థులకు చేయూత నివ్వాలి. వారి పురోగతికి బాట వేయాలి. వక్ఫ్‌ ఆస్తులనేవి ఉన్నదే ముస్లిం సమాజం సంక్షేమం కోసమని, సామాన్య ముస్లింలకు విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయలను కల్పించి, ధార్మిక అవసరాలను తీర్చడానికి అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతే తప్ప పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తులకు, కొన్ని కుటుంబాలకు, వారి బంధువులకు ప్రయోజనాలు చేకూర్చడానికి కాదు వక్ఫ్‌ ఆస్తులు ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8, 2024న లోక్‌సభలో 2024 నాటి వక్ఫ్‌ (సవరణ) బిల్లు, 2024నాటి ముసల్మాన్‌ వక్ఫ్‌ (రద్దు) బిల్లును ప్రవేశపెట్టింది. అయితే బిల్లులపై లోక్‌సభలో విపక్ష సభ్యులు గగ్గోలు పెట్టడంతో వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి(జేపీసీ) పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలుగా ఎలాంటి పక్షపాతం లేకుండా సమాజంలో అందరికీ అండగా నిలబడటం, అట్టడుగు స్థాయిలో సమ్మిళిత అభివృద్ధిని సాధించడం ఉన్నాయి.

వక్ఫ్‌ చట్టానికి తాజాగా ప్రతిపాదించిన సవరణ కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పలుకుబడి ఉన్న వ్యక్తులకు కాకుండా సాధారణ ముస్లింలకు సేవ చేయడం అని చెప్పింది. ఉమీద్‌ ప్రకారం కొత్తగా ప్రతిపాదించిన సవరణ 1995 నాటి వక్ఫ్‌ చట్టంలో పక్షపాతంతో కూడుకున్న అనేక క్లాజులను రద్దు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న వక్ప్‌ ఆస్తులకు సంబంధించిన అనేక అంశాలను, సమస్యలను, సవాళ్లను సరిదిద్దుతుంది. వక్ప్‌ ఆస్తుల నిర్వహణలో లోటుపాట్లను చక్కబెడుతుంది. సామాన్యుడి పట్ల సానుకూల దృక్పథంతో సర్వతోముఖ సమ్మిళిత అభివృద్ధికి సైతం ఊతమిస్తుంది. ఇదే సవరణలో పొందుపరిచిన అంశాలు దేశమంతటా ఉన్న వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణను మరింత మెరుగుపరుస్తాయి. న్యాయ వివాదాల భారాన్ని తగ్గిస్తాయి. మొత్తమ్మీద ముస్లిం సమాజానికి అండగా నిలబడటం ద్వారా దానిని బలోపేతం చేస్తాయి.


బిల్లు పెట్టకపోతే పార్లమెంట్‌ కూడా వక్ఫ్‌ ఆస్తే

వక్ఫ్‌ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టని పక్షంలో ప్రజాప్రతినిధులు కూర్చొని ఉన్న పార్లమెంట్‌ సైతం వక్ఫ్‌ ఆస్తిగా మారిపోయేదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు అన్నారు. చరిత్రాత్మకమైన వక్ఫ్‌ (సవరణ) బిల్లును పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1970 నుంచి ఢల్లీిలో పార్లమెంటు భవనంతో పాటుగా పలు ఆస్తులను ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు తనదిగా చెప్పుకున్న వ్యవహారంపై ఓ కేసు నడుస్తోందని తెలిపారు. అయితే కేసు కోర్టులో ఉండగానే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 123 ఆస్తులను డీనోటిఫై చేసి వక్ఫ్‌ బోర్డుకు అప్పగించిందని చెప్పారు.


అయితే అనాదిగా వక్ఫ్‌ ఆస్తుల ఆక్రమణ, తప్పుడు యాజమాన్యపు హక్కుల ధ్రువీకరణ, రాజకీ యంగా పలుకుబడి ఉన్న ముస్లింలు వక్ఫ్‌ ఆస్తులను దుర్వినియోగం చేయడం లాంటి లెక్కకు అందని తార్కాణాలు సామాన్య, పేద ముస్లింలు మరీ ముఖ్యంగా ముస్లిం మహిళలను కలవరపెడు తున్నాయి.

రాజకీయంగా అండదండలు దండిగా ఉన్న ముస్లింలు ఈ ఆస్తులను పేద ముస్లింలకు సాయం చేయడానికి బదులుగా, సగటు ముస్లిం వ్యక్తికి నమ్మక ద్రోహం చేస్తూ తమ స్వప్రయోజనాలకు వాడుకున్న దృష్టాంతాలు కోకొల్లలు. ఇస్లాం చట్టం ప్రకారం వక్ఫ్‌ అనే పదం పక్కన చేరిన ఆస్తులను దాతృత్వ, ధార్మిక అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. కానీ రాజకీయ నేతల ప్రోద్బలంతో రెచ్చిపోతున్న ల్యాండ్‌ మాఫియా వాటిని దాతృత్వానికి బదులుగా తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంది. వక్ఫ్‌ బోర్డుల అధీనంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువతో మొత్తంగా తొమ్మిది లక్షలకు పైగా ఎకరాల్లో ఎనిమిది లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఫలితంగా వక్ఫ్‌ బోర్డుల సమూహం దేశంలో మూడవ అతిపెద్ద భూస్వామిగా అవతరించింది. అయితే అడపాదడపా వక్ఫ్‌ వ్యవహారాల్లో సంస్కరణలు చోటుచేసుకుంటున్న ప్పటికీ అవి ఏమంత సమర్థవంతంగా పనిచేయడం లేదు సరికదా సామాన్య ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం పరిష్కరించలేకపోయాయి. అయితే వక్ఫ్‌ చట్టానికి చేసిన తాజా సవరణ ప్రధాన లక్ష్యం వక్ప్‌ ఆస్తుల పరిరక్షణకు, సద్వినియోగానికి గ్యారంటీ ఇవ్వడం. తద్వారా సుదీర్ఘ కాలంగా ఉన్న వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణలో అవినీతి, వక్ఫ్‌ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఆస్తులు లాంటి దీర్ఘ కాలిక సమస్యలకు పరిష్కారం చూపే దిశగా భరోసా ఇవ్వడం. తాజా సవరణ సమ్మిళిత అభివృద్ధికి ముందడుగు అవుతుంది. పారదర్శకత మెరుగుదలకు పెద్ద పీట వేస్తుంది. అది వక్ఫ్‌ బోర్డులలో జవాబుదారీ తనం, సత్‌ పరిపాలనతో కూడిన ఒక పటిష్టమైన వ్యవస్థను సృష్టించి సాధారణ ముస్లింలు అందరికీ అవకాశం ఇస్తుంది. ఇప్పటిదాకా ఆస్తులను గుర్తించడంలో సరైన వ్యవస్థ, డిజిటైజేషన్‌ లేకపోవడం వాటి నిర్వహణ లోపాల్లో ప్రధానమైంది. అన్ని ముస్లిం దేశాల్లోనూ వక్ఫ్‌ ఆస్తులున్నప్పటికీ వాటి బాగోగులు చూసుకోవడానికి ఎలాంటి యంత్రాంగం లేకపోవ డాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి. యావత్‌ ప్రపంచంలో భారతదేశం మాత్రమే చట్టబద్ధమైన భద్రతతో కూడుకున్న వక్ఫ్‌ బోర్డులను కలిగి ఉంది. మోదీ సర్కారు తాజాగా తీసుకొచ్చిన ఉమీద్‌ సాధారణ ముస్లింలకు న్యాయం చేకూరుస్తుంది. వారు వివక్షకు గురికాకుండా చూస్తుంది.


ముప్లిమేతరుల పాత్ర వక్ఫ్‌ బోర్డు వరకే

వక్ఫ్‌ (సవరణ) బిల్లుకు లోబడి ముస్లిమేతరుల పాత్ర వక్ఫ్‌ బోర్డుకు, వక్ఫ్‌ మండలికి మాత్రమే పరిమిత మవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. వారు మతపరమైన ఎలాంటి కార్యకలాపాలను చేపట్టరని తెలిపారు. వారు వక్ఫ్‌ ఆస్తులను చట్టప్రకారం నిర్వహించేలా చూస్తారని మంత్రి చెప్పారు. 1913 నుంచి 2013 మధ్యకాలంలో వక్ఫ్‌ బోర్డు కింద 18 లక్షల ఎకరాలు ఉండేవని, అదే 2013 నుంచి 2025 మధ్య కాలంలో దానికి అదనంగా 21 లక్షల ఎకరాలు చేరాయని తెలిపారు. ఉత్తర రైల్వేలు, పురాతన దేవాలయాలకు చెందిన భూములను వక్ఫ్‌ ఆస్తులుగా పేర్కొన్న దృష్టాంతాలను అమిత్‌ షా వివరించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తన ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా 2014 ఎన్నికలకు ముందు న్యూఢిల్లీలోని ల్యూటెన్స్‌ ప్రాంతంలో 123 ప్రముఖమైన ఆస్తులను వక్ఫ్‌ బోర్డుకు కట్టబెట్టిందని ఆయన విమర్శించారు.


ఉమీద్‌ అసలు భూస్వామికి చట్టబద్ధమైన టైటిల్‌ లేని ఆస్తులను వక్ఫ్‌ ఆస్తులు అంటూ పుట్టుకొచ్చే తప్పుడు కేసులను నామరూపాల్లేకుండా చేస్తుంది. ఆ క్రమంలో ఇకపై కలెక్టర్‌ అంతకు మించి స్థాయిలో ప్రభుత్వ అధికారి వక్ఫ్‌ ఆస్తులపై యాజమాన్య హక్కులపై దర్యాప్తు చేస్తారు. ఐదేళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్న వారు తమ ఆస్తిని దానం చేయవచ్చు. వక్ఫ్‌ ఆస్తులపై ట్రిబ్యూనళ్లు ఇచ్చిన తీర్పులపై పిటిషన్లు సహేతుకమైన పక్షంలో తీర్పులు ఇచ్చిన ఆరు నెలల తర్వాత ఆ పిటిషన్లను కోర్టులు స్వీకరించవచ్చు. ఉమీద్‌ స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా చట్టబద్ధమైన వారసుల హక్కులను కాపుగాస్తుంది. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ పూర్తి బాధ్యతను తనదిగా చేసుకుంటుంది. సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అవుతూ వక్ఫ్‌ ఆస్తులను స్వప్రయోజనాలకు వాడుకునే వారి భరతం పడుతుంది. పాత చట్టంలో పాతుకుపోయిన అవకతవకలు కోకొల్లలు. వాటిలో రద్దు చేయడానికి వీలు లేని విధంగా వక్ఫ్‌ ఆస్తులకు అవాంఛనీయమైన రక్షణ, అనవసరమైన న్యాయ వివాదాలు, పేలవమైన నిర్వహణ, కోర్టుల పర్యవేక్షణ లేకపోవడం, ముత్తావలీల అధికార దుర్వినియోగం లాంటివి కీలక మైనవి. సాధారణ ముస్లింలు, సాధారణ జన బాహుళ్యం ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా వక్ఫ్‌ చట్టానికి సవరణ జరిగింది. ఈ సవరణ పాలనా పరమైన జవాబుదారీతనం, పారదర్శకత, ఆస్తులపై న్యాయబద్ధమైన యాజమాన్యం ధ్రువీకరణపై గట్టి పట్టు బిగించడం ద్వారా వక్ఫ్‌ బోర్డులకు చట్టసమ్మతిని పునరుద్ధరిస్తుంది. వక్ఫ్‌ బోర్డుల ద్వారా సాధారణ ముస్లింలకు మేలు చేకూర్చి దేశాన్ని సమ్మిళిత అభివృద్ధి దిశగా ముందడుగు వేయిస్తుంది.


వక్ఫ్‌ బోర్డు నిరంకుశత్వానికి అడ్డుకట్ట

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వక్ఫ్‌ (సవరణ) బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహాకుంభమేళా కోసం ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు కుంభమేళాకు చెందిన భూమి తమదిగా వక్ఫ్‌ బోర్డు ప్రకటించిందని తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా వక్ఫ్‌ (సవరణ) బిల్లుతో వక్ఫ్‌ బోర్డు నిరంకుశ చర్యలకు అడ్డుకట్ట వేశారని యోగి అన్నారు. బోర్డు ఇకపై సంక్షేమ కార్యకలాపాలపై మాత్రమే దృష్టి పెడుతుందని తెలిపారు. వక్ఫ్‌ పేరుతో అనేక నగరాల్లో భూములను ఆక్రమించుకున్నారని, చివరకు శ్రీరామచంద్రుడికి ఆప్తమిత్రుడైన నిషధ రాజుకు చెందిన పవిత్రమైన భూమిని కూడా విడిచిపెట్టలేదని యోగి అన్నారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE