– గన్నవరపు నరసింహమూర్తి
‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
నెల రోజుల తరువాత సమీరతో నా పెళ్లి జరిగింది. మూడు రోజుల పెళ్లికి మధు, శ్రీరామ్, ఊరి వారందరూ వచ్చారు. బావ శ్రీధర్ కూడా అమెరికా నుంచి వచ్చాడు. మా మావ చనిపోయిన తరువాత ఇప్పుడు మా కుటుంబాలు ఒకటయ్యాయి. మా పెళ్లి జరిగినందుకు మా అత్త చాలా సంతోషించింది. మా మామ కక్ష వల్ల దూరమయ్యాం కానీ మా అత్తకు మొదటి నుంచీ మా పెళ్లి ఇష్టమే అనీ ఆమె మాటల వల్ల తెలిసింది.
శ్రీరామ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. మధు ఆమెతో సహ జీవనానికి స్వస్తి చెప్పి విడిగా ఉంటున్నాడు. ఇద్దరికీ నప్పలేదుట. ఆమె వాడి మీద పెత్తనం చెలాయి స్తుండటంతో ఆ గొడవలు మరింత పెరిగి ఇద్దరూ విడిపోయారట. సహజీవనంలో ఉన్న లాభం అదే… కోర్టులు గొడవలూ లేకుండా సామరస్య పూర్వకంగా విడిపోవచ్చు. పిల్లలు కలిగితే ఇబ్బందవుతుంది. కానీ వాళ్లకు ఆ ఇబ్బంది లేదు.
పెళ్ళి మర్నాడు వెళ్లి పోతామన్న ఇద్దరూ సమీర కోరికపై మరో రెండు రోజులు ఉండటానికి ఒప్పుకున్నారు.
ఒకరోజు మేం ముగ్గురం మా పొలానికి వెళ్లినపుడు మా మధ్య నా కోచింగ్ కేంద్రం ప్రస్తావన వచ్చింది. ‘‘విశాఖపట్నంలోని కోచింగ్ ఇనిస్టిట్యూట్ లాంటిదే హైదరాబాద్‌లో పెడితే అక్కడ బాగా అభివృద్ధి చేయవచ్చు’’ అని శ్రీరామ్‌తో చెప్పాను.
‘‘శ్రీరామ్ … మీరిద్దరూ కొంత డబ్బు పెట్టండి. మేము కొంత పెడతాము. అక్కడ ఒక కేంద్రాన్ని ప్రారంభిస్తే మీరిద్దరూ దాన్ని మేనేజ్ చేయవచ్చు. అలా మనమే కొందరికి ఉపాధి కల్పించవచ్చు. సాఫ్ట్‌వేర్‌్ ఉద్యోగాల్లో మనం ఇమడలేము. పైగా ఒత్తిడెక్కువ. ఉద్యోగాలు ఎన్నాళ్లుంటాయో తెలియదు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివి ఈ ఉద్యోగాలు. 40 సంవత్సరాల వయస్సులో ఉద్యోగ భద్రత లేకపోతే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరిద్దరూ ఆలోచించి ఓ నిర్ణయానికి రండి. మీకిష్టమైతే రేపే విశాఖపట్నం వెళ్లి వారం రోజుల పాటు ఆ కేంపస్‌ని గమనించండి. మనకు ఆ కేంద్రాన్ని నడిపే అనుభవం ఉంది కాబట్టి హైదరాబాద్ కేంపస్ ప్రారంభించటం పెద్ద కష్టం కాదు. నెలరోజుల్లో దాన్ని ప్రారంభించవచ్చు. పైగా విశాఖపట్నం కేంద్రానికి పేరొచ్చింది. కాబట్టి అదే పేరుతో కేంపస్‌ని ప్రారంభిస్తే పెద్దగా పబ్లిసిటీ అవసరం కూడా ఉండదు. ఇలా మనం వీటిని ప్రారంభిస్తే మంచి అనుభవం వస్తుంది. దాంతోపాటు ఎంతోమంది విద్యార్థులకు మంచి శిక్షణనిచ్చి వాళ్లకు ఉద్యోగవకాశాలను కల్పించే అవకాశం కలుగుతుంది. దానివల్ల జాబ్ శాటిస్ ఫాక్షన్ కలుగుతుంది. స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఒకరి కింద పనిచేసే అవసరం ఉండదు’’ అని చెప్పాను.
వాళ్లిద్దరూ నేను చెప్పినవన్నీ వినీ చాలాసేపు తర్జభర్జన పడి చివరకు ఒప్పుకున్నారు. శ్రీరామ్ తన దగ్గర పదిలక్షలున్నాయనీ, అది ప్రస్తుతానికి ఖర్చు చేస్తాననీ చెప్పాడు. మధు కూడా మరో పది లక్షలు, మిగతా సొమ్ము నేను పెడతాననీ చెప్పాను…
ఇప్పుడు మా స్నేహితుల సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. మొన్నటి దాకా సమీరకు ఎన్నో సమస్యలు… నాతో పెళ్లితో అవి తీరిపోయాయి. ఇప్పుడు వాళ్లిద్దరివి కూడా ఈ కోచింగ్ కేంద్రం ద్వారా తీరిపోతాయి…
‘‘ఏరా! మీకు జీవితం ఎలా అనిపిస్తోంది’’ అనీ అడిగాను…
‘‘చిన్నప్పుడే బాగుండేదనిపిస్తోందిరా? అప్పుడు బాదరబందీలు ఉండేవి కాపు. ఇప్పుడు అన్ని సమస్యలే.అమెరికా అంటే దూరపు కొండల నునుపు.దూరం నుంచి బాగుంటుంది. దగ్గర కెళితే తెలుస్తుంది. అందరూ మన తూరుపు నుంచి పడమరకి అంటే అమెరికా, కెనడా, బ్రిటన్లు వెళుతునారు కానీ చాలా మంది అక్కడ ఇమడకలేక తిరిగి తూర్పుకి రావలసిందే. పడమరన అస్తమించే రవిబింబం ఉదయాన్నే తూర్పులో ఉదయించక తప్పదు.’’ అన్నాడు శ్రీరాం నిర్వేదంగా.
‘‘బాల్యం ఎప్పుడూ బాగుంటుందిరా… ఎన్ని అనుభూతులు, ఎన్ని సరదాలు… ఇప్పుడవన్నీ ఏవి? ‘‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?’’ అని ఓ కవి అన్నట్లు ఆ అనుభూతులు, ఆనందాలు ఎక్కడ? ఎంత తీయటిది మన బాల్యం…
‘‘ఎగరేసిన గాలిపటాలు,
దొంగాటలు, దాగుడు మూతలు
ఏటిగట్లపై కట్టిన పిచ్చుక గూళ్లు
వర్షం లో వదిలే కాగితం పడవలు
కర్రాబిళ్లా ఆటలు
కబాడీ ఆటలో తగిలిన దెబ్బలు
ఏట్లో ఈదినప్పుడు నాన్న చూపే కోపాలు
సైకిలు నేర్చుకున్నప్పుడు బెణికిన కాళ్లు
తోటల్లో రాళ్లతో కొట్టిన మామిడికాయలు
పొట్లాల్లో ఉప్పూకారాలు
అవి తింటుంటే కళ్ల నుంచి కారే నీళ్లు
సంతలో కొన్న దసరా బాణాలు
అవన్నీ చిన్ననాటి ఆనవాళ్లు
స్నేహంలో మైలు రాళ్లు’’…
అనీ నేను చెప్పగానే వాళ్ళిద్దరి కళ్లల్లో నీళ్లు చెమ్మగిల్లాయి.
‘‘ఎంత బాగా చెప్పావురా మన బాల్యాన్ని… ఆ గేయంలో మన బాల్యం కనిపిస్తోంది. చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది’’ అన్నాడు మధు.
ఆ తరువాత మేము ఇంటికి తిరిగి వచ్చేసాము.
* * *
కాలచక్రం తిరుగుతోంది. నేను ప్రారంభించిన రెండు కోచింగ్ కేంద్రాలు బాగా నడుస్తున్నాయి. విశాఖపట్నం కేంద్రం సమీర అధ్వర్యంలో బాగా పనిచే స్తోంది. సమీర ఇప్పుడు బాగా బిజీ అయిపోయింది. అక్కడ ఇల్లు కొన్నాను. నేను వారం మధ్యలో వెళుతుంటాను. మళ్లీ ఇద్దరం శనివారం మా ఇంటికి వస్తూ మూడు రోజులు గడుపుతాము. అప్పుడు వ్యవసాయం చూసుకుంటూ ఉంటాను. వ్యవసాయంలో కూడా సమీర నాకు సహాయ పడుతుంటుంది. ఇప్పుడు మాకు ఒక బాబు… పరాశర్…మా గోత్రం పేరే పెట్టుకున్నాము. మా అమ్మకి వాడితో బాగా కాలక్షేపం.ఇక హైదరాబాద్ కేంపస్‌ని మధు, శ్రీరాం బాగా నడుపుతునారు.
నా పెట్టుబడిని తిరిగి ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్లిద్దరే దానికి యజమానులు. ఇద్దరూ వివాహాలు చేసుకున్నారు. ఇద్దరికీ పిల్లలు…
ఎన్నో ఒడుదుడుకులతో సాగిన మా నలుగురి జీవితాలు ప్రశాంతతను సంతరించుకుంటున్నాయి. జీవితం అంటేనే కష్టసుఖాలు, చీకటి వెలుగుల సంగమం. కష్టం ఉంటేనే సుఖం విలువ, రాత్రి ఉంటేనే పగలు గొప్పదనం, ఎండ ఉంటేనే నీడ విలువ తెలుస్తాయి. సుఖాల్లో ప్రతివాళ్లు నవ్వుతారు. కష్టాల్లో నవ్వేవాడే గొప్పవాడు.
కష్టాలతరువాత వచ్చే సుఖం చాలా ఆనందాన్ని ఇస్తుంది .అందుకే ఏదొచ్చినా మనమంచికే అనీ ముందుకు సాగిపోవాలన్నది నా సిద్ధాంతం. గౌతముడి శాపం అహల్యకు రామదర్శనం కలిగించినట్లు ఒక కష్టం ఇంకో సుఖానికి దారి తీస్తుంది. కష్టాలు మనకు పాఠాలు నేర్పుతాయి. ఎలా జీవించాలో, ఎలా ముందుకెళ్ళాలో చెబుతాయి.
ఎలాగైతేనేం ఈ తూర్పు నుంచి ఆ పడమరకి వెళ్లిన ముగ్గురూ మళ్లీ తూర్పుకి వచ్చి ఉదయించి వెలుగులు విరజిమ్ముతూ ముందుకెళుతునారు.
చాలామంది ఉద్యోగం, పెళ్లి తరువాత కథ ముగిసిపోతుంది అనుకుంటారు కానీ అది నిజం కాదు. మళ్లీ కష్టాలు వస్తాయి. సుఖాల కోసం ప్రయత్నిస్తూ ముందుకెళ్ళాలి. జీవితంలో కష్టసుఖాలు కావడి కుండలు లాంటివి. కలిమి లేముల రంగుల రాట్నంలో లాగ వచ్చి పోతుంటాయి…
తూరుపు- పడమర ఎదురెదురు. అవి సమాంతర రేఖల్లా కలవని దిక్కులు… రైలు పట్టాలు కూడా అంతే… రైలు పట్టాలు కలవకుండా ఎడంగా ఉంటేనే మనం గమ్యం చేరుకుంటాము…
మన తాత ముత్తాతల తరంలో ఎవ్వరూ పడమర వైపు వెళ్లే సాహసం చెయ్యలేదు. ఆ తరువాత మా తరం చొరవతో అమెరికా బాట పట్టి మళ్లీ తూర్పు వచ్చారు. మా పిల్లల తరం మళ్లీ ముందుకు వెళ్లవచ్చు…
తాతల నుంచి తండ్రుల మీదుగా మన నుంచి పిల్లలకు సంప్రదాయాలు, కుటుంబ గౌరవాలు అన్నీ సంక్రమించాలి. అదే శాఖా చంక్రమణం… ఇదే జీవన సౌరభం… దాని పరిమళాన్ని జీవితమంతా ఆస్వాదిస్తూ ఆనందంగా ముందుకెళ్లాలి.
(సమాప్తం)