ఇటీవల రెండు అగ్రరాజ్యాధినేతల మధ్య 90 నిముషాలపాటు జరిగిన చర్చలపై ఎంత రాసినా తరగదనే చెప్పాలి. ఎందుకంటే గత మూడేళ్లుగా కొనసాగుతూ మొత్తం యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు డోనాల్డ్ ట్రంప్, పుతిన్‌ల మధ్య టెలిఫోన్‌లో జరిగిన చర్చలకు సహజంగానే అత్యంత ప్రాధాన్యత ఏర్పడిరది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, పెద్దన్నగా తాను చె ప్పిందే వినాలన్న ధోరణి డోనాల్డ్ ట్రంప్‌లో కనిపిస్తే, వ్యూహాత్మక చాణక్యం పుతిన్‌లో కనిపించింది. 30 రోజులపాటు ఇంధన మౌలిక వసతులపై దాడులు జరపకుండా పుతిన్ అంగీకరించడాన్ని ట్రంప్ తాను సాధించిన విజయంగా చెప్పుకుంటున్నప్పటికీ పుతిన్ మాత్రం యుద్ధక్షేత్రంలో తాను అనుకున్న విధంగా రష్యా సేనలు ఉక్రెయిన్ లోని భూభాగాలను స్వాధీనం చేసుకునేవరకు నిదానంగా సాగే ఈ చర్చల ప్రక్రియకు పూర్తి మద్దతు పలు కుతూ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేసే పరిస్థితి కనిపిస్తోంది.
మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ లోని 20% భూమిని మాత్రమే ఇప్పటివరకు రష్యా తన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగింది. కానీ దేశం ఇందుకు చెల్లించిన మూల్యం అపారం. ఇదే సమయంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ చర్చలకు సమ్మతిం చారంటే అందుకు ప్రధాన కారణం, ట్రంప్ అధికారంలోకి వచ్చాక యు.ఎస్. వైఖరిలో వచ్చిన సమూల మార్పు తప్ప, రష్యా మొదట్నుంచీ అనుసరిస్తున్న ఆలోచనా విధానాన్ని సవరించుకోవడం వల్ల కాదన్నది ఇక్కడ గుర్తించాలి.
పుతిన్ వ్యూహం స్పష్టం
విచిత్రమేమంటే ట్రంప్ ప్రభుత్వం రష్యా`ఉక్రెయిన్ యుద్ధ పరిసమాప్తికి ఇంతటి స్థాయిలో ప్రసవ వేదన పడుతున్నప్పటికీ, మాస్కో ఆలోచనలు భి న్నంగా వున్నాయి. ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతి లక్ష్యంగా ఈ యుద్ధానికి ఏదోవిధంగా ముగింపు పలికి, తానొక శాంతి కాముకుడిగా ప్రపంచానికి చాటుకోవాలని ట్రంప్ చూస్తున్నారని రష్యా అంచనా వేస్తోంది. ట్రంప్ అసలు ఉద్దేశాన్ని పసిగట్టిన పుతిన్ ఈ యుద్ధంలో మరిన్ని రాయితీలు పొందడానికి స్పష్టమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణ ముసుగులో ఉక్రెయిన్‌కు చెందిన మరిన్ని భూభాగాలను సాధ్యమైంత తొందరగా స్వాధీనం చేసుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఆవిధంగా విజయాన్ని మరింత వేగంగా సొంతం చేసుకొని, తుది ఒప్పందం సమయంలో తనకు ప్రయోజకర షరతులతో ముందుకు రావడం ఆయన వ్యూహం. ఇదే సమయంలో జోబైడెన్ హయాంలో అమెరికాతో తీవ్రస్థాయి వైరం నెలకొన్న దశ నుంచి ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ దేశంతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా, తన నిర్దేశిత లక్ష్యాల్లో గరిష్ట శాతాన్ని సాధించుకునే వ్యూహాన్ని ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు అనుసరిస్తున్నారు. ఇదేసమయంలో ట్రంప్‌తో సుహృద్భావంగా వ్యవహ రించడం, అమెరికాతో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబం ధాలను తిరిగి గాట్లో పెట్టేందుకు యత్నించడం, మధ్యప్రాచ్యంలో పరస్పర సహకారం వంటి అంశాలతో తన దౌత్య వ్యూహాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఇదేసమయంలో రష్యా చర్చలకు సిద్ధంగా వుందని ట్రంప్ నమ్మే విధంగా ఇంధన మౌలిక వసతుల పై దాడులు జరపకుండా కాల్పుల విరమణను పాటించడం వంటి చిన్నపాటి రాయితీలకు అంగీకరించడం కూడా పుతిన్ వ్యూహంలో భాగమే. ఈవిధంగా నిదానంగా వ్యవహరిస్తూ చర్చల సమయానికి ప్రస్తుతం ట్రంప్ నిర్దేశించుకున్న అంశాల్లో మార్పులు చేర్పులు చేసుకునేలా చేయడం పుతిన్ అనుసరిస్తున్న మరో కీలక వ్యూహం. ఈవిధంగా తుది చర్చల్లో, యుద్ధక్షేత్రంలో తనకు అనుకూలంగా ఒప్పందం రూపొందేలా చూసుకోవడంపై ప్రస్తుతం పుతిన్ దృష్టి కేంద్రీకరించారు.
పుతిన్ షరతు…ట్రంప్ సందిగ్ధం
అయితే చర్చలకు రావాలంటే అమెరికా ప్రస్తుతం ఉక్రెయిన్‌కు అందజేస్తున్న సైనిక, ఇంటెలిజెన్స్ సహాయాన్ని తక్షణం నిలిపేయాలన్నది రష్యా విధించిన షరతు. రాజకీయంగా, దౌత్యపరంగా ఈ సమస్యకు పరిష్కారం రావాలంటే ఈ సహాయం నిలిపిపేయడం అత్యవసరమని రష్యా కోరడంలో తప్పులేదు. అయితే ఈ విషయంలో ట్రంప్ ఇంకా స్పష్టమైన వైఖరితో ఉన్నట్టు లేదు. ఎందుకంటే జలన్‌స్కీ మెడలువంచి చర్చలకు రప్పించేందుకు ట్రంప్ ఈ రెండు రకాల సహాయాన్ని నిలిపేసినా, తర్వాత గత బైడెన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పునరుద్ధరించడం గమనార్హం. బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌తో కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందాన్ని ట్రంప్ ఇప్పటివరకు రద్దు చేయలేదు. మరి ట్రంప్ ఒకవేళ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే ఏర్పడే ఖాళీని పూరించే శక్తి యూరప్‌దేశాలకు లేదు. ఈ పరిస్థితుల్లో రష్యా చేస్తున్న ఈ డిమాండ్‌పై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఇక్కడ గుర్తించాల్సిన మరో ముఖ్య విషయమేంటంటే ట్రంప్ కోరుకున్నట్టు పుతిన్ ఇప్పటికిప్పుడు ఒప్పందానికి రావాలన్న తొందర పడటంలేదు. ఎందుకంటే ఇంతకాలంగా తమ సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నందువల్ల, మరికొద్ది జాప్యం జరిగితే వచ్చే నష్టమేంలేదు. వచ్చే ఎండాకాలం నాటికి ఉక్రెయిన్ వద్ద ఆయుధాల నిల్వలు హరించుకుపోతాయన్న సంగతి పుతిన్‌కు తెలుసు.
ట్రంప్ దూకుడు
ఉక్రెయిన్ ఎంత భూభాగం కోల్పోయిందనేది ప్రశ్న కాదు, శాంతి ఒప్పందం కుదిరిందా లేదా అన్నది ట్రంప్‌కు ముఖ్యం. నోబెల్ శాంతి బహుమతిని సాధించడం లక్ష్యం! అంటే ఈ ఒప్పందం వల్ల రష్యా అమితంగా లాభపడుతుందనేది స్పష్టమైంది. ఎన్నికల ప్రచార సమయం నుంచీ ట్రంప్, రష్యా`ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెబుతూ వస్తున్నారు. ఆయన వ్యవహారశైలి కూడా అందుకు తగ్గట్టే వుంది. శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన దగ్గరినుంచి ట్రంప్ యంత్రాంగం జెలన్‌స్కీని తప్పుపడుతూ వచ్చింది. యుద్ధానికి కారణం ఆయననేనని వేలెత్తి చూపింది. ఇదే సమయంలో ట్రంప్ నాటో దేశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం ఇచ్చేందుకు మద్దతు పలికేందుకు కూడా ట్రంప్ సుముఖత వ్యక్తం చేయలేదు. యూరోపియన్ యూనియన్ నాయకులతో కూడా ట్రంప్ చర్చలు జరపడానికి ఇష్టపడలేదు. జెలన్‌స్కీని దోషిగా చూపడమే కాదు, తమ డిమాండ్లను అంగీకరిస్తేనే అతనితో చర్చలు జరుపుతానని కుండబద్దలు కొట్టారు కూడా. చర్చలకు పిలిచినప్పుడు రష్యానుంచి మరిన్ని రాయితీల డిమాండ్ రాకుండా ట్రంప్ యంత్రాంగం, పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరించిందనుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో జెలన్‌స్కీ తన డిమాండ్ల విషయంలో అమెరికాపై బలమైన ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ సైన్యం పరిమాణంపై పరిమితి వుండాలని, ఉక్రెయిన్‌లోకి యూరోపియన్ దేశాల దళాలు ప్రవేశించకూడదని పుతిన్ పట్టుపట్టే అవకాశాలే ఎక్కువ. అంతేకాదు, ప్రస్తుతం ట్రంప్ దేశీయంగా కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అంశాన్ని కూడా పుతిన్ గుర్తించారు. ముఖ్యంగా ఫెడరల్ ప్రభుత్వంపై ట్రంప్ చేస్తున్న దాడిని డెమోక్రట్లు వ్యతిరేకించే స్థితిలో లేనప్పటికీ, చికాకు పడుతున్నారు. ఇదే సమయంలో కొన్ని దశాబ్దాలుగా యు.ఎస్. అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన హార్డ్ అండ్ సాఫ్ట్ పవర్ వ్యవహార శైలిని ట్రంప్ పూ ర్తిగా పక్కన పెట్టేయడం వారికి ఎంతమాత్రం రుచించడంలేదు. అయితే ట్రంప్ తన సొంత రిపబ్లికన్ పార్టీపై ఇప్పటికీ పూర్తి పట్టు కొనసాగిస్తున్నారు. రిపబ్లికన్లలో ఉదారవాదులకు ట్రంప్‌ను ప్రశ్నించే ధైర్యం లేదు. ఒక పార్టీలో ప్రముఖులు అనదగ్గ నాయకులంతా ట్రంప్ అజెండాకే మద్దతు పలుకుతుండటంతో ట్రంప్ ఎదురులేకుండా తాననుకున్నవి చేసేస్తున్నారు. ఇదేసమయంలో ట్రంప్ ప్రపంచ క్రమాన్ని శాసించడంలో ఎంతమాత్రం ఇబ్బంది పడటం లేదు. ముఖ్యంగా గొప్ప దేశాలు, చిన్న దేశాలను నియంత్రించడం, అవసరమైతే ఇతర దేశాల భూభాగాల్లోకి చొచ్చుకుపోవడం వంటి ఆధిపత్య ధోరణులు ట్రంప్‌లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. తన పొరుగు దేశమైన కెనడాను యు.ఎస్.లో ఒక రాష్ట్రంగా కలిసిపొమ్మని చెప్పడం, గ్రీన్‌లాండ్‌ను, పనామా కాల్వను స్వాధీనం చేసుకుంటామని చెప్పడం ఆయన ఆధిపత్య వైఖరికి నిదర్శనం.
సానుకూల స్థితిలో పుతిన్
మొత్తంమీద ఈ పరిణామాలను పరిశీస్తే ప్రస్తుతం పుతిన్ అత్యంత సానుకూల స్థితిలో వున్నారనే చెప్పాలి. రష్యా నిర్దేశించే యుద్ధ నిబంధనలను అమలు చేసే బాధ్యతను తన స్నేహితుడైన డోనాల్డ్ ట్రంప్ భుజస్కంధాలపై ఉంచి పుతిన్ ఇక నిశ్చింతగా వుండవచ్చు. అయితే ఇక్కడ ఆయనకు రెండు ప్రధాన అవరోధాలు ఎదురుకానున్నాయి. మొదటిది ఉక్రెయిన్ సమాజం ఈ ఒప్పందాన్ని అంగీకరించకుండా యుద్ధం చేయడానికే నిర్ణయించుకునే అవకాశాలు మెండుగా వుండటం. రెండవది యు.కె., ఫ్రాన్స్ వంటి దేశాలు జెలన్‌స్కీకి బాసటగా నిలవడం. ఈ రెండు దేశాలు సైనికంగా, ఆర్థికంగా ఉక్రెయిన్‌కు వెన్నుదన్నుగా ఉండటానికే నిశ్చయించుకోవడం కీలకం.
ఉక్రెయిన్‌తో యుద్ధం పరిసమాప్తమైన తర్వాత పుతిన్ ఆ దేశంలో తక్షణం ఎన్నికలు జరగాలని పట్టుపట్టే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఈసారి జరిగే ఎన్నికల్లో తనకు అనుకూల ప్రభుత్వం వచ్చేలా చేసి, ఉక్రెయిన్‌ను సంబంధాల పేరుతో తన గుప్పిట్లో వుంచుకునే వ్యూహాన్ని పుతిన్ తప్పక అమలు చేస్తారు. ఇదే సమయంలో యూరోపియన్ దేశాలు శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచి యుద్ధానికే కాలు దువ్వుతున్నాయంటూ, ట్రంప్‌కు ఉదాహరణలతో సహా చూపించి, వాటిని కట్టడి చేయడం మరో వ్యూహం. ఆర్థిక ఆంక్షలతో వాటిపై వెనకా ముందూ చూడకుండా విరుచుకుపడే ట్రంప్ బలహీనత పుతిన్‌కు బాగా తెలుసు కనుక ఈ అవకాశాన్ని ఆయన చక్కగా వినియోగించుకోగలడు. మొత్తంమీద చెప్పాలంటే పుతిన్ రాజకీయ చదరంగాన్ని పదునైన వ్యూహంతో ఆడుతున్నారు. ఈ ఆటలో ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ట్రంప్ రూపంలో పుతిన్ వ్యూహాలకు వచ్చే సానుకూలత జెలన్‌స్కీ పతనానికి దారితీయనుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
పుతిన్‌ను నమ్మని ఈయూ దేశాలు
నిజానికి పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని డోనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాటలను ఇటు జెలన్‌స్కీ అటు యూరోపియన్ యూనియన్ దేశాలు నమ్మడంలేదు. ఎందుకంటే ఉక్రెయిన్ ఒక స్వతంత్రదేశంగా ఉండటం పుతిన్‌కు ఇష్టంలేదు. ఇదే సమయంలో నాటోదళాలు ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని గట్టిగా కోరుతున్నాయి. ఇదే సమయంలో పుతిన్ సరికొత్త ప్రపంచ క్రమం అమల్లోకి రావాలని, ఇందులో రష్యా కీలక పాత్ర పోషించాలని కూడా కోరుకుంటు న్నారనేది విశ్లేషకుల వాదన. ఇందుకూ ఒక కారణ ముంది. సోవియట్ యుగంలో పుతిన్‌తో పాటు ఆయన నమ్మకస్తులు చాలా మంది కేజీబీలో పనిచేశారు. ప్రస్తుతం వారంతా బయటకు వచ్చినప్పటికీ, నాడు యుఎస్‌ఎస్‌ఆర్ పతనంలో ప్రపంచ దేశాలు వ్యవహరించిన తీరు, తర్వాతి కాలంలో రష్యా పట్ల వాటి దారుణ వైఖరిని వీరు ఇప్పటికీ జీర్ణించు కోలేకపోతున్నారు. యుఎస్‌ఎస్‌ఆర్ పతనమై తీవ్ర సంక్షోభంలో ఉన్న 1990ల్లో పుతిన్ అధికార ప్రస్థానం క్రమంగా ప్రారంభమైంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయి, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన రోజులవి. 2000 సంవత్సరంలో పుతిన్ దేశాధ్యక్షుడయ్యాక, పెరిగిన చమురు ధరల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకోవ డమే కాకుండా, ఎంతోమంది కోటీశ్వరులయ్యారు. ఆర్థికంగా వేగంగా పుంజుకుంటున్న రష్యాను జి`7 దేశాల కూటమిలో సభ్యురాలిగా ఆహ్వానించారు. రష్యా ప్రవేశంతో ఈ కూటమి జి`8గా మారింది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించడమే కాకుండా, జి`8 సభ్యత్వాన్ని పశ్చిమ దేశాలు రద్దుచేశాయి.
నిజానికి ప్రపంచంలో అతిపెద్ద దేశంగా, పుష్కలంగా ప్రకృతి వనరులున్న దేశంగా ఉన్న రష్యాకు కేవలం జి`8 దేశాల్లో ఒకటిగా గుంపులో గోవిందయ్యలాగా వుండటం పుతిన్‌కు ఇష్టంలేదు. అందువల్ల జి`8నుంచి వెలేసినా ఆయన పెద్ద పట్టించుకోరు. ఆయన ప్రధాన లక్ష్యమల్లా ఇంతటి పెద్ద, అద్భుతమైన వనరులున్న రష్యా ప్రపంచంలో కీలకపాత్ర పోషించేలా చేయడం.
అవకాశాలు సృష్టించుకునే మేధావి పుతిన్
ట్రంప్ తీసుకువచ్చిన శాంతి ప్రతిపాదన, ఉక్రెయిన్‌పై మరిన్ని సత్వర విజయాల సాధనకు, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి పుతిన్ ఆయన చుట్టూ ఉన్న నాయకులు, ఒక అవకాశంగా పరిగణిస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయో గించుకోవడంలో పుతిన్‌ను మించినవారు లేరు. గందరగోళంతో కూడిన గతిశీలక పరిస్థితులు ఏర్పరచి తనకు అనుకూలంగా అనేక అవకాశాలు సృష్టించుకోగల అద్భుత మేధావి. అప్పుడు తనకు అందుబాటులో ఉన్న అనేక అవకాశాల్లో ఏది ఉత్తమమైందో ఎంపిక చేసుకొని దాన్ని అమలు చేస్తారు. ట్రంప్ శాంతి యత్నాల నేపథ్యంలో, రష్యా తన దీర్ఘకాలిక ప్రణాళికలను ఇసుమంతైనా మార్చుకోలేదు.
ఉక్రెయిన్ యుద్ధం ముగించాలంటే, అసలు ఈ సంఘర్షణకు ‘మూలకారణాలను’ సమూలంగా పరిష్కరించాలని రష్యా అధికారులు డిమాండ్ చేస్తున్నది తమ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే. ఉక్రెయిన్‌లో తక్షణం ఎన్నికలు జరిపించడం, నాటోదళాలు ప్రచ్ఛన్న యుద్ధ కాలంనాటి తమ స్థానాలకు తిరిగివెళ్లడం అనేవి పుతిన్ దృష్టిలో ‘మూలకారణాలు’. ఆయన ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, బెలారస్ మాదిరిగానే ఉక్రెయిన్ తనకు అనుకూలంగా కొనసాగడం, ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్ లేదా నాటో దేశాల కూటమిలో ఉక్రెయిన్ చేరకుండా నిరోధించడం. కేవలం ఈ కారణాలవల్లనే 2022లో ఉక్రెయిన్‌పై ‘సైనిక ఆపరేషన్‌కు’ రష్యా అధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు. మరి ఇప్పటివరకు కొనసాగించిన సైనిక చర్యవల్ల దీన్ని సాధించలేదు కాబట్టి, యుద్ధానికి ముగింపు పలకరు. ఒకవేళ ట్రంప్ మధ్యవర్తిత్వంలో దౌత్యపరంగా దీన్ని సాధించినా పుతిన్‌కు అభ్యంతరముండదు. అయితే పుతిన్ దీన్ని దౌత్యం కంటే, ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించడం ద్వారానే సాధించడానికి ప్రాధాన్యం ఇస్తారు. అందుకనే పుతిన్ ఎప్పటికప్పుడు జెలన్‌స్కీని ఎన్నికలు జరపని ఒక నియంతగా ప్రపంచ యవనికపై చూపేందుకు యత్నిస్తున్నారు. ఉక్రెయిన్‌ను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న యూరప్ దేశాలకు పుతిన్ ఎప్పుడూ నమ్మదగిన నాయకుడు కాదు! రష్యా కూడా ప్రస్తుత ‘సైనిక చర్య’ను ఉక్రెయిన్‌పై చేస్తున్నది కాకుండా, పశ్చిమదేశాలతో జరుపుతున్న యుద్ధంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో యు.ఎస్. మధ్యవర్తి త్వంతో శాంతి ఒప్పందం కుదురుతుందని లేదా ఒకవేళ కుదిరినా అది సజావుగా అమలవు తుందన్న విశ్వాసం రష్యన్ ప్రజల్లోనే లేదు. ఎందుకంటే కొన్ని శతాబ్దాలుగా రష్యాలో కొనసాగిన విధ్వంసానికి, తమ అణచివేతకు పశ్చిమదేశాలే కారణమన్న భావన బలీయంగా దేశవాసుల్లో ఉంది. ఇక పుతిన్ దృష్టిలో ఉక్రెయిన్ ఒక ప్రత్యేక దేశం కాదు. యుఎస్‌ఎస్‌ఆర్‌లో భాగం మాత్రమే! పుతిన్ తన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడంలో దేశ మతపరమైన గుర్తింపును కూడా చక్కగా వాడుకుంటున్నారు. రష్యా ఆర్ధోడాక్స్ చర్చ్ నాయకుడు పాట్రియార్క్ కిరిల్ ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పూర్తిగా సమర్థిస్తుండం ఇందుకు ఉదాహరణ.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్