భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

శిరీష పాల గ్లాస్‌తో ఎదురొ చ్చింది. తలుపులు బంధించబడ్డాయి, కానీ కోరికలు రెక్కలు విప్పుకొని వినువీధుల్లో విహరిస్తున్నాయి! ఎన్నో కావ్యాలు చదివాడు వినయ్‌. ఎదురుగా నేడు కావ్య కన్యక. ‘‘నన్ను చదవ్వూ!’’ అంటున్నది. తెల్లటి చీరలో ఎల్లోరా శిల్పంలాంటి తన సిరి విసురుతున్న ఆ సూటి చూపులకు ఎక్కడో సిగ్గుపడుతున్నాడు. స్త్రీ బిడియం సడలించినప్పుడు ప్రేమ జల్లులో తడిసి వలపు వాగులో కొట్టుకు పోవడం సహజమైన ఇబ్బందే మగవాడికి! మల్లెలూ, పరుచుకున్న పరువం లాంటి కొత్తటి మెత్తటి పరుపూ పోటీ పడుతున్నాయి, ఆస్వాదనకి శ్రీకారం చుట్టవోయ్‌.. అం‌టూ. ‘నేను అడ్డయితే తీసేయండి’ అంటున్నది దీపం. చాలిక! నీ మదిలోని ఈ తొలిరేయి వర్ణన! ఆపి కార్యోన్ము ఖుడవు కమ్మంటోంది ఆత్మీయ అంతరంగం. అక్కడ నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ శిరీష వేసిన ప్రశ్న వినయ్‌ని వెంటాడుతోంది. ఆరేయి ఎలా గడిచిందో మరో మారు చెప్పుకుందాం.

                                                                                                 * * *

ఏంటి ఆ ప్రశ్న? వినయ్‌ని వెంటాడుతున్నదీ-శిరీష అడిగినదీ! తెలుసుకోవాలంటే – మనం శ్రీ పంచాగ్నుల వెంకటావధాని గారి ఇంటి తలుపు తట్టాల్సిందే. ‘‘ఇప్పటికి 9 నెలలు అయింది. వ్యాకరణం, పద్య రచన బాగానే నేర్చుకున్నావు, సంతోషం! ఏదీ! నేను అడిగిన ప్రశ్నకి నువ్వు ఆశువుగా ఒక అందమైన పద్యం చెప్పు! చూద్దాం’’ – సూటిగా ప్రశ్నించాడు అవధాని గారు. అదే! అదే!! అలాగే అచ్చంగా తొలిరేయి నాడు అడిగేసింది శిరీష. ‘ఓయ్‌! ‌వినయ్‌! ‌సారీ.. వినయ్‌ ‌గారూ! మీరు ఎంఏ తెలుగు చేశారుగా. నా అందం మీద ఓ అందమైన పద్యం చెప్పరూ!’ అని, కళ్లు వినయ్‌ ‌చుట్టూ తిప్పేస్తూ. ‘‘చెబితేనేనండోయ్‌ ‌మనం ముందుకెళ్లేది’’ అన్నది కూడా. చచ్చింది గొడ్డు. చదివింది ఎంఏ తెలుగే కానీ, చేస్తున్నది బ్యాంకులో ఉద్యోగం.

ఏవో మాయమాటలు చెప్పి ఏమార్చి ఆ రోజు శిరీషను సంతోషపెట్టాడే కానీ పద్యం చెప్పలేదు. ఫస్ట్ ‌నైట్‌ ‌చెలి కోరిన తొలి కోరిక తీర్చలేదు. వచ్చే యానివర్సరీకైనా శిరీష అందం మీద హృద్యంగా ఓ పద్యం చెప్పేయాలని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు వినయ్‌. అదీ సంగతి! అందుకోసం వెంకటావధాని గారి వద్ద శిష్యరికం. చేతులు నలుపుకుంటూ- గురువుగారి పాదపద్మాలకు దగ్గరగా పీట వేసుకొని కూర్చున్నాడు రోజుకు మల్లే. అక్కడే దివాణం మంచం మీద శయనించి ఉన్నారు గురువుగారి సతీమణి పద్మావతి. ఆమెకు సపర్యలు చేస్తూ ఉంటుంది మంజుల. పద్మావతి గారు కూడా పాండిత్యంలో దిట్టే! కాకపోతే ఆవిడ అనారోగ్య రీత్యా ఇంటి పనులు వంట పనులు ఏవీ చేయడంలేదు. అంచేత మంజుల వారింట పదేళ్లుగా పనిచేస్తున్నదట. పద్మావతి గారు కూడా సాహితీ పిపాస కలిగి ఉండడంతో – అనారోగ్యం ఆలోచనలు పక్కకు పెట్టి గోష్టి కార్యక్రమాలు వీక్షిస్తూ, ఆస్వాదిస్తూ ఉంటారు. అవధానిగారు ముక్కుపొడి లాగిస్తూ – వ్యసనం మీద ఆశువుగా ఓ పద్యం చెప్పవోయ్‌ అని అడిగి, మళ్లీ… ‘‘ఆగాగు! పద్యం-మహాభారతంలోని ఏదైనా ఘట్టాన్ని స్పృశిస్తూ ఉండాలి’’ అన్నారు. వినయ్‌కి తొలి రేయినాటి చెమటలు గుర్తుకు వచ్చాయి. ఎందుకో తెలుసా? ఇది వినయ్‌ ‌చెప్పబోయే తొలి ఆశువు గనుక. శారదామాతకు మనసులోనే ప్రణమిల్లి గొంతు సవరించుకొని చెప్పసాగాడు.

కం.పరిపాలన తన విధి ఏ

మరిపాటులు కూడ దెపుడు మహిపతులకు ఆ

విరటుడు జూదము నాడుచు

మరచెను పరిపాలనమ్ము మతిహీనుండై!

తను చెప్పిన పద్యం ఎలా ఉంటుందని అంటారో! అనే ఆరాటం అతడి ముఖంలో కనపడిపోతోంది. అవధాని గారు భుజం మీద కండువా సరి చేసుకుని, ఓమారు గొంతు సవరించుకొని వారి అభిప్రాయం చెప్పబోయే తరుణంలో మంజుల పుసుక్కున ఓ నవ్వు నవ్వి-కొంగు అడ్డుపెట్టుకున్నది. ‘ఎందుకు నవ్వుతున్నావ్‌’ ‌పద్మావతి గద్దించింది మంజులను. ఆ ఇంట్లో వంట చేస్తున్న ఆ అమ్మాయిని వాళ్లు ‘అన్నపూర్ణా’ అని పిలుస్తారు-పదేళ్లుగా అన్నం వండి పెడుతోంది గనుక.

 ఆమె వారికి ఇంటి మనిషి కిందే లెక్క. అవధాని గారు కూడా ‘ఎందుకు నవ్వావు ? అలా నవ్వవచ్చా! సభ్యత కాదు కదా ! చేతనయితే ఓ పద్యం నువ్వూ చెప్పు!’ అన్నారు ఆయన. మంజులకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్షమాపణలైన చెప్పాలి లేదా పద్యమైనా చెప్పాలి. తను రెండవదే ఎంచుకున్నది.

కం.తన గోవుల పరరాజులు

కొనిపోవగ వాని దెచ్చుకొనగల ధీరున్‌

‌గనజాలని దుస్థితిలో

ఘనుడగు పార్థుడు దెచ్చి కాపాడేగదా!

అన్నది చేతులు జోడించి నమస్కరిస్తూ!

ఽఓ భేష్‌! ‌బాగా చెప్పావు’ అన్నది పద్మావతి. మంజుల ఆమెకు నమస్కరిస్తూ, ‘‘మీ సేవా భాగ్యం వలన నాకు కాస్త విద్య అబ్బింది’ అని ఆమె పాదాలను కళ్లకద్దుకున్నది…‘మీ యెదుట ఇది నా తొలి ప్రయత్నం’ అంటూ. వినోద్‌ ‌కూడా భేషజం లేకుండా సంతోషాన్ని ప్రక టించాడు. అవధాని గారు మాత్రం సంతోషించినట్లు లేరు. ‘నేను వారిని అడిగితే-నీవు చెబుతావేం? నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పాలి. అది సభ్యత. మన ఇంట్లో జరిగే చర్చల ద్వారా అబ్బిన పరిజ్ఞానం, వాసనా బలంతో చెప్పినట్లుగా ఉన్నది. ఇది నీ తొలి ప్రయత్నం అయితే ఇప్పుడు నీకో సవాల్‌! ఏదైనా ప్రస్తుత కాలపు వ్యసనాన్ని నిరసిస్తూ ఓ పద్యం చెప్పు! చూద్దాం..’’ అన్నారు అవధాని గారు.

 ‘‘సవాలు స్వీకరిస్తావా?’’ కాస్త పరుషంగానే అడిగారనిపించింది. వినయ్‌ ‌కి కూడా ఒక సవాలే! మనసులో ఆశువు ఒకటి మెరిసింది వెంటనే. పెదవుల మీదికి వచ్చేసింది. చక్కటి పద్యం చెప్పాలని తహతహ! అయితే అవధాని గారి మాట అడ్డు పడ్డది. అడిగినది మంజులను. ఆమె చెప్పడమే సబబు! వెనక్కు తగ్గాడు వినయ్‌ ‌వినయంగా. ఈసారి గురువుగారి పాదాలకి నమస్కరించి చెప్పింది మంజుల – మంజులమైన పద్యం.

కం.ఇప్పటి యూట్యూబ్‌ ‌ముందర

అప్పటి చతురంగ మొక్క వ్యసనమ్మగునా

ఎప్పుడు బాలురు వృద్ధులు

తప్పనిసరిగా యువత – దానికి దాసుల్‌!’’

‘‘‌చరవాణికి దాసులు అందరూ! అని నీవు వినిపించిన బాణి బాగుందోయ్‌! ఏదీ.. ఈ సందర్భంగా మాకు ఓ మంచి కాఫీ పట్రా’’ అంటూ మంజులకు పని పెట్టారు అవధానిగారు. అంతటి మంచి సాహితీ స్పర్శ గల వాతావరణంలో ఉండడం వల్లే ఆశువును మంజుల సునాయాసంగా చెప్పగలుగుతున్నది అని అభినందించాడు వినయ్‌. ‌మళ్లీ మాటల్లో పడ్డారు గురుశిష్యులు ఇద్దరూ. వరుసగా రోజూ అవధాని గారి ఇంటికి వస్తూనే ఉన్నాడు, అశువులు చెబుతూనే ఉన్నాడు. శభాష్‌ అనిపించుకుంటూ చదివిన తెలుగు ఎంఏ పట్టాకి గౌరవం తీసుకొచ్చాడు.

                                                                                                 * * *

సరే ! ఇంతకీ వినయ్‌ ‌తొలిరేయి యానివర్సరీ నాడు శిరీషకు ఏం పద్యం చెప్పాడో తెలుసుకోవాలని మీకూ మహా తొందరగానూ కుతూహలం గానూ ఉందని నాకు తెలుసు! దీపమార్పే ముందు ఫస్ట్ ‌నైట్‌ ‌స్మృతుల గురించి ముచ్చటించు కుంటూ- ‘శిరీషా! ఆరోజు ఆశువుగా పద్యం చెప్పమన్నావు కదూ! ఇదిగో చెబుతున్నా కంద పద్యం. ‘‘బిగి కౌగిలి ..అంటూ అందుకున్నాడు వినయ్‌. ‘‘‌నోరు ముయ్యండి! పద్యం లేదు, గిద్యం లేదు…’’ అంటూ తన పెదవులతో అడ్డుకున్నది మహా సుకుమారి సవినయంగా!

వచ్చేవారం కథ..

ఎడబాటు

– వెంకట శివకుమార్‌ ‌కాకు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE