విపక్ష నేతలు దేశ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందంటూ గగ్గోలు పెడుతూ, జాతీయ సమైక్యతకు తూట్లు పొడుస్తూ, ప్రమాదకర రాజకీయాలకు తెరలేపుతున్నారు. భిన్న సంస్కృతి, చరిత్ర, బహు భాషలతో భిన్నత్వంలో ఏకత్వంగా సమైక్యంగా ఉండే భారతీయులను ప్రాంతాల పేరుతో విభజించడానికి కుట్రలు ప్రారంభమయ్యాయి. దశాబ్ద కాలంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆశయాలను ఒక్కొక్కటి పూర్తి చేస్తూ రోజురోజుకు ప్రజాదరణ పొందుతుండడడంతో భవిష్యత్తులో తమ మనుగడకే ముప్పు ఏర్పడుతుందనే అభద్రతా భావంతో, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే అభూత కల్పనతో, అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి పక్రియ ప్రారంభించకపోయినా, ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా బీజేపీని లక్ష్యంగా చేసుకొని చెన్నయ్ వేదికగా జాయింట్ యాక్షన్ కమిటీ – జేఏసీ పేరుతో దేశ విభజన కుట్రలకు కొన్ని రాజకీయ పార్టీలు నాంది పలికాయి.
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే నెపంతో డీఎంకే చెన్నయ్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని బీజేపీ వ్యతిరేక శక్తులు ఒక వేదికగా మార్చుకున్నాయి. ఈ సమావేశంతో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, బీఆర్‌ఎస్, బీజేడీ, ఆప్, అకాలీదళ్, ఎంఐఎం, ఐయూఎంఎల్, సోషలిస్టు పార్టీలతో పాటు దేశ వ్యతిరేక ఎన్జీఓలకు, కుహనా మేధావులకు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పసలేని ఒక అంశం దొరికినట్టయ్యింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉందని ఢంకా భజాయించుకునే కాంగ్రెస్, చెన్నయ్‌లో అసత్యాలతో హడావిడి చేసి జాతీయ పార్టీ స్థాయి నుండి ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. ఇక బీజేపీ పేరు చెబితేనే ఉలిక్కిపడే వామపక్షాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక్కడ వారు కూడా అలానే వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్య మంత్రి డీ.కే.శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌సింగ్‌తో పాటు ఇతర పార్టీల ప్రతినిధులు కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టు ‘ఫెయిర్ డీలిమిటేషన్’ పేరుతో నిర్వహించిన ఈ సమావేశాన్ని బీజేపీ వ్యతిరేక కూటమి వేదికగా మార్చారు. తమిళనాడు రాష్ట్ర శాసనసభకు 2026లో జరిగే ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార డీఎంకే కుట్రలో ఈ పార్టీలన్నీ పావులుగా మారాయి.
తమిళనాడులో ఆచరణ సాధ్యంకాని అనేక హామీలతో 2021 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి 2026 అసెంబ్లీ ఎన్నికలు ప్రతికూలంగా మారనున్నాయి. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో పాటు డీఎంకే సర్కార్ అవినీతిపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి రాష్ట్రంలో మొత్తం 39 ఎంపీ స్థానాల్లో గెలిచినా, విడివిడిగా పోటీ చేసిన అన్నాడీఎంకే కూటమి 23 శాతానికి పైగా, బీజేపీ కూటమి 18 శాతం పైగా ఓట్లు సాధించి స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చాయి. మరోవైపు సినీ నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీకి కూడా యువతలో మంచి ఆదరణ ఉంది.
రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదని తెలుసుకున్న డీఎంకే తమిళ ప్రజల్లో మనోభావాలను రెచ్చగొడుతూ వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తోంది. గతంలో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ డీఎంకే నేతలు వ్యాఖ్యానించారు. అనంతరం హిందీ, సంస్కృత భాషలను వివాదాస్పదం చేశారు. ఈ అంశాలపై ఆశించిన స్పందన లేకపోవడంతో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనను లేవనెత్తారు. సనాతన ధర్మం, హిందీ, సంస్కృత భాషల వివాదాలపై ఇతర పార్టీలు కలిసిరాకపోవడంతో నియోజకవర్గాల పునర్విభజనను ముందుకుతెచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీయేతర పార్టీలను జేఏసీ పేరుతో బరిలోకి దింపి కుట్రలను ప్రారంభించింది. తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గుతాయని డీఎంకే ఎన్ని విధాలా ప్రచారం చేస్తున్నా తమిళ ప్రజల నుంచి, స్థానిక రాజకీయ నేతలు నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో చెన్నయ్ వేదికగా ఇతర రాష్ట్రాల పార్టీలను పిలిచి సమావేశం పేరుతో హడావిడి చేసింది.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు, ప్రకటనలు వెలువడకపోయినా ఈ పార్టీలు అపోహలతో ప్రజలను రెచ్చగొడుతున్నాయి. 2011 తర్వాత కరోనా మహమ్మారి కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనగణన చేపట్టలేదు. 2026లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ తర్వాతనే నియోజకవర్గాల పునర్విభజన చేపడతారు. ఇంత పక్రియ జరగాల్సి ఉన్నా జనగణన చేపట్టకముందే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికంగా సీట్లు పెరుగుతాయని, తమిళనాడు, ఆంధప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సీట్లలో కోత పడుతుందని ఎవరికి తోచిన లెక్కలు వారు చెబుతూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. జనగణన చేపట్టకముందే ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు చెబుతున్నారు? ఒక రాష్ట్రంలో ఇంత జనాభా పెరుగుతుందని, ఇంత జనాభా తగ్గుతుందనే లెక్కలకు ఆధారాలేమిటి? అనే ప్రశ్నలపై స్పష్టత లేదు. అంతా అసత్యాలతో కూడిన ఊహాజనితాలే.
ఒకవేళ వారు చెప్పినట్టే ఉత్తరాదిలో అధిక స్థానాలు, దక్షిణాదిన తక్కువ స్థానాలుంటే అది నరేంద్ర మోదీ సృష్టించింది కాదు కదా! స్వాతంత్య్రం రాకపూర్వం నుంచి దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన భూమి సాంద్రతతో పాటు జనాభా కూడా ఎక్కువే. 1971 జనాభా లెక్కల ఆధారంగానే 1976లో, 2009లో నియోజకవర్గాల పునర్విభజనను కేవలం సరిహద్దులను మారుస్తూ చేపట్టారు. మరి అప్పుడు కూడా ఉత్తరాదినే అధిక సీట్లు ఉన్నాయి కదా? దానికి 2014కు పూర్వం వరకు ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమా? 1971లో జనాభా నియంత్రణ కోసం చేపట్టిన పద్దతులను ఉత్తరాది రాష్ట్రాలు పాటించకపోతే 2014 వరకు కాంగ్రెస్‌తో సహా ఈ పార్టీలన్నీ ఎందుకు మిన్నకుండిపోయాయి? ఆ కాలంలో కేంద్రంతో పాటు అధిక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అప్పుడు వారు ఎందుకు మాట్లాడలేదు? 1976 ప్రామాణికంగా మరో పాతికేళ్ల వరకు పునర్విభజన చేయవద్దని చెన్నయ్ సమావేశంలో తీర్మానించారు. ఎలాంటి మార్పులు చేయవద్దంటే సదరు నియోజక వర్గాల్లో గుత్తాధిపత్యం సాగిస్తున్న కుటుంబాలే అధికారం చెలాయించాలా? కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వకూడదా? అశాస్త్రీయమైన మూస పద్దతి విధానాలనే కొనసాగించాలని వారు డిమాండ్ చేయడం శోచనీయం.
కేంద్ర ప్రభుత్వం అధీనంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, పథకాల అమలు, రక్షణ రంగాల అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా బాధ్యాతారాహిత్యమైన ప్రకటనలకు వేదికగా జేఏసీ సమావేశం జరిగింది.
చెన్నయ్ సమావేశంలో ప్రాంతీయ పార్టీలు అవకాశవాద రాజకీయాలతో పాల్గొని తీర్మానాలు, వ్యాఖ్యలు చేసినా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా తన బాధ్యతను, తన హోదాను విస్మరించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పార్టీ కీలక నేతలు పాల్గొన్న సమావేశంలో చేసిన తీర్మానాలను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ వేదికగా డిమాండ్ చేస్తుందా? దేశంలో అధిక కాలం పాలించిన ఆ పార్టీ 1976 నుంచి నియోజకవర్గాల పునర్విభజనను దాటవేస్తూ, ఇప్పుడే ఏదో అన్యాయం జరిగిపోతుంది అంటూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, విభజన రాజకీయాలు చేయడం ప్రమాదకరం.
దేశంలో జనగణన అనంతరం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం ఇది మొదటి సారి కాదు. జనగణన ప్రాతిపదికన నియోజకవర్గాల హద్దులు, చట్టసభల్లో స్థానాల సంఖ్య మార్పు ఉంటుందని భారత రాజ్యాంగం చెబుతుంది. దీన్ని అనుసరించే 1951, 1961, 1971 సంవత్సరాల్లో జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ, రాజ్యసభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, నియోజకవర్గాల పరిధులు మారాయి. అయితే 1976లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో, 42వ రాజ్యాంగ సవరణతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, నియోజకవర్గాల పునర్విభజన ఆపేశారు. 2009లో పునర్విభజన పక్రియ మళ్లీ చేపట్టినా కేవలం నియోజకవర్గాల పరిధులలో మార్పులు చేర్పులు చేశారు. స్థానాల సంఖ్యల్లో ఎలాంటి మార్పులు జరగలేదు.
పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంపీ సగటున 30 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంటే, తమిళనాడులో సుమారు 18 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో రాష్ట్రాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది. అంతేకాక పెద్దపెద్ద నియోజకవర్గాలతో సదరు ఎంపీ ఆ ప్రాంతానికి పూర్తి న్యాయం చేయలేరు. మరోవైపు ప్రజలకు ఆ ప్రజాప్రతినిధి అవసరాలకు అందుబాటులో ఉండడం కూడా కష్టమే. గతంలో 1977 నాటి లోక్‌సభలో ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహించేవారు. ఈ ప్రాతిపదికనే తీసుకుంటే, ప్రస్తుతమున్న 543 స్థానాలు సుమారుగా 1400 అవుతాయి. అలాకాకుండా 20 లక్షలకు ఒక నియోజకవర్గం అంటే సుమారుగా 700 స్థానాలవుతాయి. ఇటీవల నూతనంగా ప్రారంభించిన పార్లమెంట్ భవనంలో 888 మంది ఎంపీలకు సీటింగ్ వ్యవస్థ ఉంది. ఈ లెక్కన తీసుకుంటే, 20 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం ప్రతిపాదనే ఉండే అవకాశాలున్నాయి.
ప్రతిపక్షాలు ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాలు, ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ గతంలో పార్లమెంట్ వేదికగా, అనంతరం హోం మంత్రి అమిత్‌షా స్పందిస్తూ దక్షిణాదిలో స్థానాలు తగ్గవని ప్రకటించినా, జనాభా ప్రాతిపదికన అన్యాయం జరగుతుందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల కంటే, దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెట్టి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకొచ్చే బదులు, కీలకాంశాల్లో రాజకీయాలకే ప్రాధాన్యతిస్తే, అన్ని వైపుల నష్టం జరిగే అవకాశా లుంటాయి. జనాభా లెక్కలు, కుటుంబ నియంత్రణ అంశాలకే ప్రాధాన్యత ఇస్తే సమన్యాయం జరగదు. ఉదాహరణకు 1991-2001 జనాభా లెక్కల్లో ఉత్తరప్రదేశ్‌లో జనాభా పెరుగుదల 25.85 శాతం ఉండగా, 2001-2011లో అది 5 శాతంపైగా తగ్గింది. ఇదే సమయంలో తమిళనాడు రాష్ట్రంలో 1991-2001 జనాభా లెక్కల్లో జనాభా పెరుగుదల 11.72 శాతం ఉండగా 2001-2011లో అది సుమారు 4 శాతం పెరిగింది. కాబట్టి అన్నింటికీ ఒకే ప్రాతిపదక ఉండదు. ఒకవేళ నిజంగా నష్టం జరిగితే రాజకీయాలకు అతీతంగా ఒక ఫార్ములాను తీసుకొచ్చేందుకు అందరూ కృషి చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పక్రియ చేపట్టలేదు. త్వరలో నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలో విపక్షాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ లక్ష్యంగా ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తే నష్టపోయే అవకాశాలున్నాయి. అన్నింటినీ రాజకీయాలు చేయకుండా సదరు ప్రాంతానికి న్యాయం జరిగేలా మార్గాలను అన్వేషిస్తే దీర్ఘకాలికంగా నష్టం జరగకుండా ఉంటుంది. అంతేకాని నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రమాదకర విభజన రాజకీయాలకు వాడుకుంటే మాత్రం భవిష్యత్ తరాలు ఈ పార్టీలను క్షమించవు.
– శ్రీపాద