ఒకవైపు కృత్రిమమేథ-ఏఐ డిజిటల్ కమ్యూనికేషన్‌కు కొత్త రూపాన్ని ఇవ్వడంలో తలమునకలై ఉండగా మరోవైపు గ్రోక్ లాంటి ఏఐ నమూనాలు తప్పుడు సమాచారపు పుట్టలుగా డిజిటల్ ప్రపంచాన్ని కబ్జా చేస్తున్నాయి. గ్రోక్ అధునాతమైన భాషా సామర్థ్యాలతో అభివృద్ధి చెందినప్పటికీ అది ప్రజలను తప్పుదారి పట్టించే కథనాలను తెరమీదకు తీసుకువస్తూ వాటిని భూతద్దంలో పెట్టి చూపించడం ద్వారా నెటిజన్లలో నైతికపరమైన, భద్రతాపరమైన ఆందోళనలకు దారి తీస్తోంది. అమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బోట్ గ్రోక్ భారత ప్రధాని నరేంద్రమోదీపై ‘అత్యంత మతతత్వ రాజకీయనాయకుడు’ అనే ముద్ర వేసింది. తద్వారా పెను వివాదానికి కారణమైంది. గ్రోక్ అత్యంత ప్రభావశీలురైన భారత ప్రధానమంత్రిని ఇలా తప్పుడు భావనతో ప్రజలకు పరిచయం చేయడమనేది ఇక్కడితో ఆగిపోదు. ఇలాంటి అవాకులూ చెవాకులూ మున్ముందు కూడా సాగడానికి అన్నట్టుగా దీని వెనుక పెద్ద ఎత్తుగడ ఉన్నట్టే కనిపిస్తోంది. ఎలాంటి నియంత్రణ లేకుండా అడ్డూఅదుపూ లేకుండా రెచ్చిపోతున్న గ్రోక్ లాంటి ఏఐ నమూనాలతో వాస్తవం కనుమరుగైపోతుందని, చారిత్రక, రాజకీయ వాస్తవికతలు వక్రీకరణకు గురౌతాయనే ఆందోళన అంతటా వ్యక్తమౌతోంది. ఏఐతో అనంతమైన సమాచారాన్ని, అంతులేని జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏఐ నిజానిజాలు తేల్చుకోకుండా వడ్డిస్తున్న సమాచారంతో ప్రజాస్వామ్య నిష్కాపట్యానికి, సమాజంలో ఐకమత్యానికి పెనుసవాల్ విసురుతోంది. మొగ్గలోనే తుంచివేసే తరహాలో కఠినంగా వ్యవహరిస్తూ కట్టడి చేసే వ్యవస్థలూ, విధి విధానాలను వెంటనే డిజిటల్ బరిలోకి తీసుకురాని పక్షంలో ఏఐ చోదక తప్పుడు సమాచారం రాజకీయ పక్రియలకూ, ప్రజల విశ్వాసానికీ, సుస్థిరమైన జ్ఞానానికీ పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుంది.
ప్రజాస్వామ్యానికి పెను ముప్పు
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐ గ్రోక్‌ను అభివృద్ధి చేసి, దానిని ఎక్స్‌తో (గతంలో ట్విటర్) కలిపేసింది. గ్రోక్‌ను ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీ పీటీ, గూగుల్‌కు చెందిన జెమిని, మెటాకు చెందిన ల్లామాకు పోటీదారుగా తీర్చిదిద్దారు. అయినప్పటికీ గ్రోక్ నైతికమైన ఏఐ నమూనాల్లో మొదటి వరుసలో ఉండాల్సింది పోయి అది తననుతాను తప్పుడు సమా చారానికి పురిటిగడ్డగా మార్చుకుంది. అది ఎన్నికలు, ప్రజారోగ్యం, దేశాల మధ్య విభేదాలు లాంటి కీలక మైన అంశాలపై తనకు తోచినట్టుగా సమాచారాన్ని ఇస్తోంది. దీనికి సామాజిక మాధ్యమం ఎక్స్ జత కలవడంతో తప్పుడు సమాచారం అనే అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. పాత్రికేయ రంగంలో ఉన్నట్టుగా గ్రోక్ ఇచ్చే సమాచారానికి ఒక నిజ నిర్ధారణ వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. దాంతో అది ప్రధాని మోదీ లాంటి ప్రముఖులపై విషం కక్కు తోంది. అదే సమయంలో ఎన్నికలు, ఓటర్లకు సంబం ధించిన సమాచారం వక్రీకరణలకు గురౌతోంది. ఏఐ చోదక తప్పుడు సమాచారం ఓటర్లను పెడదారి పట్టించే ప్రమాదం ఉంది. అభ్యర్థులు, పార్టీలు, పార్టీ విధానాల గురించి ఏఐ అల్లే కట్టుకథలు ఎన్నికల ఫలితాలను అవాంఛ నీయమైన రీతిలో ప్రభావితం చేస్తాయి. ప్రజాస్వామ్యాన్ని మట్టికరిపిస్తాయి. ప్రస్తుతం లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ప్రజలను భ్రమింపజేస్తున్న సోషల్ మీడియా శకం నడుస్తోంది. దీనికి ఏఐ పెంచి పోషించిన తప్పుడు సమాచారం తోడైతే అది మహావిపత్తుగా మారుతుంది.
ప్రజారోగ్యపై దుష్ప్రభావం
రాజకీయ రంగం తర్వాత తప్పుడు సమా చారంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న రంగాల్లో ఒకటిగా ప్రజారోగ్యం నిలిచింది. టీకాలు, మహమ్మారులు, వైద్య చికిత్సలు ఇలా ఒకటేమిటి ప్రజారోగ్యానికి సంబంధించి ఏఐ పుట్ట నుంచి పుట్టుకొచ్చే అసత్యాలు టీకాల పట్ల ప్రజల్లో అపోహలు సృష్టించి వారిని అశాస్త్రీయమైన నాటు వైద్యం వైపు మొగ్గేలా చేస్తున్నాయి. ఒకసారి తప్పుడు సమాచారం డిజిటిల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత అది ఎక్కడి దాకా వెళుతుందీ, ఎంత మందికి చేరుతుందీ, అది సృష్టించే విధ్వంసం ఎంత మొత్తంలో ఉంటుందీ కచ్చితంగా చెప్పడమనేది నరమానవుడిక్కూడా సాధ్యం కాదు. ఇలా చెప్పలేకపోవడం వెనుక ఉన్న కారణాల్లో ఏఐపైన, అది వ్యాపింపజేసే సమాచారం పైన ఎలాంటి నియంత్రణ లేకపోవడం ఒకటి.
కళ్లెం వేయకుంటే కష్టమే
ప్రపంచంలో ఆయా దేశాల ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోని పక్షంలో ఏఐ చోదక తప్పుడు సమాచారం డిజిటల్ శకంలో ఎదుర్కునే పెను సంక్షోభాల్లో ఒకటిగా ఆవిర్భవిస్తుంది. ఏఐకి మానవ మేధస్సును వృద్ధి చేసేందుకు అవసరమైన అసాధారణమైన సామర్థ్యం ఉంది. అయితే దానికి సత్యనిష్ఠ, జవాబుదారీతనం అనే ముక్కుతాడు పడాలి.
విధాన రూపకర్తలు, టెక్నాలజీ దిగ్గజాలు, పౌర సమాజం ఒక్కతాటి మీదకు వచ్చి ఏఐ మానవ మేధస్సును కలుషితపరిచేదిగా కాకుండా మేధస్సును వికసింపజేసే ఒక చోదక శక్తిగా కలకలం ఉండి పోయేలా చూడాలి. దీనికి సంబంధించి మనం తీసుకునే నిర్ణయాల పైన ఏఐ సత్యానికి ఒక ఉత్ప్రేరకంగా ఉంటుందా లేక సామూహిక నయవంచనలో అగ్రగామిగా నిలుస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. ఏఐ విషంగక్కే విద్వేషపు సమాచారం, అసత్యాలకు పట్టంకట్టకుండా సత్యనిష్ఠను పాటించే రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.