సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఛైత్ర బహుళ అష్టమి – 21 ఏప్రిల్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
పశ్చిమ బెంగాల్ ఓ శాపగ్రస్థ రాష్ట్రం. ఏవో కొన్నేళ్లు తప్ప, బ్రిటిష్ ఇండియాలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆ రాష్ట్రం నిరంతరం రక్తపాతంతో, అల్లర్లతో కునారిల్లిపోతూనే ఉంది. 1946 నాటి కలకత్తా హత్యాకాండ, 1947 నాటి నవకాలి హత్యలు పునరావృతమవుతూనే ఉన్నాయి. వక్ఫ్ చట్ట సవరణకు నిరసన పేరుతో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అరాచకం దేశ విభజన నాటి ఘోరాలకు కొనసాగింపు మాత్రమే. అందులో జిన్నా మతోన్మాదం సుస్పష్టం. దీనిని సీపీఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్ పెంచి పోషించాయి. దాదాపు యాభయ్ ఏళ్లు రాష్ట్రాన్ని రావణకాష్టంలా మండిరచడంలో ఆ రెండు పార్టీలు సమాన పాత్ర వహించాయి. కమ్యూనిస్టుల హింసా అరాచకాల నుంచి విముక్తం కావడానికి బెంగాలీలు టీఎంసీని ఆశ్రయించారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని త్వరలోనే అర్ధమయింది. జాతీయ భావాలకు నిలయమైన బెంగాల్‌ను దేశ వ్యతిరేక శక్తులతో, అసాంఘిక శక్తులతో, ముస్లిం మతోన్మాదులతో నింపివేసే పనికి ఆ రెండు పార్టీలూ, ముఖ్యమంత్రులూ పోటీ పడ్డారు. మమత వంటి ముఖ్యమంత్రినీ, ఆమె పాలననీ చూడవలసి రావడం ఈ తరం భారతీయుల దౌర్భాగ్యం. ప్రజాస్వామ్యం పేరుతో ఇలాంటి వాళ్లకి కూడా జనం పట్టం కట్టడం పెను విషాదం.
ఏప్రిల్ 11 నుంచి 14 వరకు వక్ఫ్ సవరణలకు నిరసన పేరుతో అట్టుడికినట్టు ఉడికిన ముర్షిదాబాద్ జిల్లా కాస్త సద్దు మణిగింది. కానీ కొన్ని గంటలు కూడా ఆలస్యం చేయకుండా ఏప్రిల్ 14న అదే నిరసన పేరుతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అల్లర్లు విస్తరించాయి. కోల్‌కటా శివార్లలోని భాన్‌గర్‌కు, 24 పరగణాల జిల్లాకు వ్యాపించాయి. అంటే దక్షిణ కోల్‌కటా కూడా భగ్గుమంది. ఐఎస్‌ఎఫ్ (ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్) అధ్యక్షుడు, భాన్‌గర్ నియోజక వర్గ శాసనసభ్యుడు నవాజ్ సిద్దికి రెండో దశ అల్లర్ల పనిని స్వీకరించారు. వక్ఫ్ సవరణకు నిరసన పేరుతో ఐఎస్‌ఎఫ్ పార్టీ కార్యకర్తలు భాన్‌గర్ నుంచి సీల్దా బయలుదేరారు. రాళ్ల దాడులు చేస్తూ వీళ్లు ఊరేగింపు నిర్వహించారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. బసంతి జాతీయ రహదారి మీద తిష్ట వేసి, రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న ఈ మూకలను వెళ్లమని చెప్పగానే హింసాకాండకు దిగారు. సీఆర్‌పీఎఫ్, యాంటీ రాయిట్స్ స్పెషలిస్టులను, రాపిడ్ యాక్షన్ ఫోర్సును వెంటనే రంగంలోకి దించవలసి వచ్చింది. వక్ఫ్‌కు నిరసనే కాకుండా మమత మీద ఆరోపణలు చేయడానికి సిద్దికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాడు. పాతికవేల మంది ఉపాధ్యాయులను కోర్టు ఉద్యోగాలను తొలగించిన విషయాన్ని మరుగు పరచడానికి మమతా బెనర్జీ వక్ఫ్ నిరసనలను ఉపయోగించుకుంటున్నదని సిద్దికి కొత్త ఆరోపణ చేశాడు. నిజమే కావచ్చు. మనుగడ కోసం మమత ఎంత నీచానికైనా సిద్ధపడతది.
వక్ఫ్ సవరణలకు నిరసన పేరుతో బెంగాల్ వేదికగా ముస్లిం మతోన్మాదశక్తులు ఐక్యమయ్యే ప్రయత్నం ఆరంభించాయి. ముర్షిదాబాద్‌ను నిన్నటి వరకు అల్లకల్లోలం చేసినది ఎస్‌డీపీఐ. తాజాగా అల్లర్లు ప్రారంభించినది ఐఎస్‌ఎఫ్. దీని అధ్యక్షుడే సిద్దికి. ఇతడు హుగ్లీ జిల్లా ఫర్‌ఫురా షరీఫ్ ప్రధాన మత గురువు. 2021లో ఈ పార్టీని స్థాపించి, భాన్‌గర్ నుంచి అసెంబ్లీకి వెళ్లాడు. కాంగ్రెస్, సీపీఎం కూటమి ఇతడిని అంటకాగినవే. కానీ మమతను, బీజేపీని ఇతడు ద్వేషిస్తాడు. ఈ పార్టీ ఉద్దేశం ప్రాంతీయవాదంతో కూడిన ముస్లింల ఉద్ధరణే. 2021 ఎన్నికల వేళ బాంబులతో పట్టుబడిన జైరుల్ ముల్లా ఈ పార్టీ కార్యకర్తే.
నకిలీ రైతు ఉద్యమాలతో ఆనాడు, వక్ఫ్ సవరణ వ్యతిరేకత ముసుగుతో ఇప్పుడు భారత వ్యతిరేక మూకలు, ముస్లిం మతోన్మాద శక్తులు ఏకమయ్యే ప్రయత్నాలు తీవ్రం చేశాయి. ఈ రెండిరటికీ నడుమ అక్రమ సంబంధం బలంగానే ఉంది. కేరళలో నానా విధ్వంసం సృష్టించి, కేంద్రం దెబ్బకు కుదేలైన ఎస్‌డీపీఐ ఇప్పుడు బెంగాల్, బాంగ్లాదేశ్ సరిహద్దులలో వీరంగం వేస్తున్నది. దీనికి ఐఎస్‌ఎఫ్ జతకూడిరది. ముర్షిదాబాద్ తరహా అల్లర్లు దేశమంతటా వ్యాపించే ప్రమాదం ఉందని కేంద్రం కూడా జాగ్రత్తలు తీసుకున్నది. హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీ సహా చాలా చోట్ల నిరసనలకు పథకాలు వేశారు. బెంగాల్ తాజా రక్తపాతాన్ని ఖండిస్తే బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని కాబోలు, బెంగాల్ అరాచకాలకు వ్యతిరేకంగా దేశంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా నోరు విప్పడం లేదు. భారత వ్యతిరేకతతో, హిందూ వ్యతిరేకతతో వ్యవహరిస్తున్న ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రుల విషయంలో విపక్షాలు అనుసరిస్తున్న వైఖరి దేశానికే మహాద్రోహం.
30 శాతం ఓట్ల కోసం మమత చేస్తున్న విధ్వంసం మాటలకు అందేది కాదు. కోర్టులు గవర్నర్లను అదుపులో పెడతాయి. కొన్ని రాష్ట్రాల అరాచకాలను ఉమ్మడి జాబితా కాపు కాస్తుంది. ఏ రక్షణా లేనిది సాధారణ ప్రజలకే. పోలీసులే గాయపడుతున్న ఉదంతాలు పశ్చిమ బెంగాల్‌లో కోకొల్లలు. ఇక సాధారణ ప్రజల మాటేమిటి? వీరిని ఎవరు రక్షించాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రే ముస్లిం మతోన్మాదులకు కొమ్ము కాస్తూ, కేంద్రంతో తేల్చుకోండని ప్రేరేపిస్తున్నది. మతోన్మాదులు వాహనాలపై ఊరేగుతూ వక్ఫ్ సవరణలు అమలు చేస్తే అంతు చూస్తామని బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. షాహీన్‌బాగ్‌లాగే ఈ అల్లర్లలో పిల్లలను ఉపయోగించుకుంటున్నారు. హిందువులు వలస పోతున్నారు. అల్లర్లలో చనిపోతున్నదీ, తీవ్రంగా నష్టపోతున్నదీ కూడా హిందువులే. ఇప్పటికైనా అక్కడ ప్రజలు కూడా క్రియాశీలం కావాలి. కొంచెం కటువుగానే ఉన్నా, కళ్లు తెరవాలి. మమతను గద్దె మీద నుంచి విసిరి కొట్టడం అంటే అది బీజేపీకి అనుకూల చర్యగా చూడడం తగదు. అది బెంగాల్‌లో ప్రజాస్వామ్యానికి పునాదిరాయి వేయడమే. వందేమాతరం, జనగణమన వంటి జాతీయ గీతాలకు జన్మనిచ్చిన గడ్డ గౌరవాన్ని నిలబెట్టడమే.