ఏప్రిల్ 6 శ్రీరామనవమి
అఖండ భారతావనికి నిత్య ఆరాధనీయుడు, ధర్మత్యాగాలను ఆచరించి చూపిన ఆదర్శమూర్తి రామచంద్రుడు. విళంబి నామ సంవత్సర ఉత్తరాయణం వసంత రుతువు, చైత్రమాస, శుక్లపక్ష నవమి, పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నం అభిజిత్ లగ్నం (మధ్యాహ్నం 12 గంటలు) సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా ఉదయించిన శుభసమయం. ఆనాడు శ్రీరామజయంతితో పాటు సీతారాముల కల్యాణం జరుపుకోవడం అనుశ్రుతంగా వస్తోంది. దానిని జగత్కల్యాణంగా హైందవ సమాజం సంభావిస్తోంది.
జానకీరాములు పరిణయం లోకకల్యాణం. రామచంద్రుని జన్మదినం చైత్ర శుక్ల నవమి నాడే కల్యాణం జరిపించడం రుషిప్రోక్తం. వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం 18వ సర్గలో శ్రీరామజననం, కల్యాణాలను ప్రస్తావన చేశారు. ఇతర దేవీదేవతల అవిర్భావ/అవతార దినాలలో జయంత్యుత్సవాలు పాటించడం సహజం. కానీ రామజన్మదినం నాటి కల్యాణాన్ని వశిష్ట, వాల్మీకాది మహర్షులు దివ్య దృష్టితో ఏర్పరచిన సంప్రదాయంగా చెబుతారు. ఆ ఆదర్శ దంపతుల కల్యాణంతో పాటు కౌసల్య దశరథులను అర్చించడం మరో విశేషం. రఘు కులాన్వయానికి మూలపురుషుడు సూర్య భగవానుడి ఆరాధనతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. ‘నేను రాముడనే. దశరథరాజు పుత్రుడైన రాఘవుడినే..’ అని చాటాడు. అంతటి మాతృపితృభక్తి పరాయణుడు కనుకనే ఆయన కల్యాణం నాడు కౌసల్యా దశరథులనూ అర్చిస్తారు.
మర్యాదా పురుషోత్తముడు రాముడు ధర్మరక్షణకు, మానవులు పాటించవలసిన నీతినియమాల దర్శనకు, రాజ్యపాలనాది క్రమశిక్షణకు అవతరించి, మానవుడిగా, మానవోత్తముడిగా నిలిచాడు.
త్రేతాయుగం నుంచి ఈ యుగం వరకు ఎందరు చక్రవర్తులు,రాజులు, పాలకులు వచ్చినా ఆయననే మహానాయకుడిగా లోకం కీర్తిస్తోంది. ఎందరు పట్టాభిషిక్తులైనా ఆయన పట్టాభిషేకమే లోక ప్రసిద్ధం. ఎన్ని కావ్యాలు వచ్చినా రామాయణాన్నే మహా కావ్యంగా సంభావిస్తారు. శ్రీరాముడు అవతరించింది ఉత్తర భారతదేశం అయోధ్యలో అయినా, తెలుగు వారు ఆయనను సొంతం చేసుకున్నారు. ‘పది కొంపలును లేని పల్లెనైనను రామభజన మందిర ముండు ఒరలు గాత’ అని పెద్దలు పలికారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలిగా రామాలయాలు పూజలు అందుకుంటుండగా భద్రాచలం (తెలంగాణ), ఒంటిమిట్ట (ఆంధప్రదేశ్)లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కల్యాణోత్సవాలు నిర్వహిస్తూ, స్వామి వారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నాయి. భద్రాచలంలో నవమినాడు కల్యాణం, మరునాడు పట్టాభిషేకం కాగా, ఒంటిమి ట్టలో నవమి నాడు ఉత్సవాలు మొదలై చతుర్దశి నాడు కల్యాణోత్సం, ఆ మరునాడు రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే మహాకవి పోతనా మాత్యుని జయంతి జరుపుకోవడం విశేషం.
పాలకుని బట్టే పాలితులు-అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం రామచంద్రుడు. ప్రజలు ఆయన ధర్మపథాన్నే అనుసరించారు. రఘువంశ పాలకులు, పాలితులు అన్యోన్యతతో దేశం సుభిక్షంగా, సమస్త సిరిసంపదలతో తులతూగిందని చరిత్ర చెబుతోంది. జన వాక్యంతు కర్తవ్యం’… అన్నట్లు ప్రజాభిప్రాయాన్ని మన్నించాలనే సత్ సంప్రదాయం రామరాజ్యంలో కనిపించే కీలక అంశం. రాముడు సింహాసనం అధిష్టించే ముందు ప్రజామోదం కోరాడు. సింహాసనాన్ని వీడేటప్పుడూ ప్రజాజ్ఞను అభ్యర్థించాడు. రాజ్యం ప్రజలదని, తాను కేవలం వారి ప్రతినిధిననే భావించాడు. దానిని పరిపాలనలో ప్రతి క్షణం రుజువు చేస్తూ వచ్చాడు. ధర్మవిరుద్ధమైన అంశాలు పాలనలోకి జొరబడకుండా చూసుకుంటూ, పారదర్శ కతకు పెద్ద పీట వేశాడు. పాలనా ప్రయోజనాలన్నీ పాలితులకే చెందాలని భావించాడు. అందుకు పటిష్టమైన పాలనా వ్యవస్థను నిర్మించాడు. తాను స్వయంగా శక్తిమంతుడే అయినా, పాలనా భారాన్ని ఇతర మంత్రులు, అధికారులకు అప్పగించాడు. ధర్మనిర్దేశకుడుగా వశిష్టుడిని గురుస్థానంలో నిలుపుకున్నాడు. అమాత్యులను, అధికారులను గౌరవించాడు. విరామ సమయాలలో శీలవృద్ధులతో సదాచారాల గురించి, వయోవృద్దులతో సత్ సంప్ర దాయాలను, జ్ఞానవృద్ధులతో వేదాం రహస్యాలను చర్చించి తెలుసుకొనేవాడట. ఒక్క మాటలో- రామరాజ్యం ధర్మరాజ్యంగా (రూల్ ఆఫ్ లా)గా విలసిల్లింది. ఆయన పాలన రీతి, నీతి ఆధునిక పాలనకు తారకమంత్రం.
రావణ వధానంతరం, స్వర్ణమయమైన లంక తన స్వాధీనమైన వేళ ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటూ ప్రవచించిన దేశభక్తుడు. ప్రకృతి శక్తులు సయితం రాక్షస శక్తుల ముందు మోకరిల్లిన వేళ, అల్పప్రాణులు వానరులను సమీకరించి సమతను స్థాపించిన కార్యదక్షుడు.
ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం. ఎన్నిమార్లు విన్నా నవ్యాతి నవ్యం శ్రీమద్రామాయణ గాథ. రామభక్తి, రామభజన, రామస్మరణ ముక్తి దాయకాలు అన్న భక్త తులసీదాస్ ‘భుమినంతటిని కాగితంగా, భువిపై వృక్షాలను కలాలుగా, సముద్రజలాలను సిరాగా చేసి రాసినా రామాయణం ఉన్నతి వర్ణన ఇంకా మిగిలే ఉంటుంది’ అనడం ఆ మహాకావ్య పరమోన్నతికి చిరు ఉపమానం.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్