శ్రీ కృష్ణామాచార్యులు వచనాల రకాలు – కొన్ని ఉదాహరణలు.
‘‘దేవా శ్రీ రామానుజ సిద్ధాంతమును బోలు మరి సిద్ధాంతము లేదు
పరమాచార్యులం బోలు మరి యాచార్యులు లేరు.
పరమ భాగవతుల బోలు మరి భాగవతులు లేరు
వారి కైంకర్య పరులంబోలు మరి కైంకర్యపరులు లేరు
అస్మద్గురుభ్యో నమ: అను మంత్రమునకు సరి మంత్రము లేదు
పరమ రహస్యంబును బోలు మరి రహస్యంబులేదు
పరమనాంచారి బోలు మరి జనని లేదు
అనాధపతి స్వామి నరహరి బోలు మరి దైవంబులేదు
స్వామి సింహగిరి నరహరీ / నమో నమో దయానిధీ
వైరాగ్య విషయాలను ప్రతిపాదిస్తూ కృష్ణమాచారి వ్రాసిన వచనం చూడండి.
దేవా! తనువు మాయ తలపోసి తలపోసి చెప్పెదనంటినే / కఱకఱల మోహమిది /
ఆశల పాషాణంబిది అతుకుల జల్లెడ యిది/తన బ్రతుకు కొరకు పోరాడి పోరాడి/
యొరులం జెఱ చెడు దుర్గంధపు డొంకాయిది
నీరు బుగ్గ, ఊట చెలమ, తూంట్ల బాన / తొడరి దుర్గంధమున బొలచును
మాటలే కాని మణి యెందును బసలేదు / నోటను మురికి, దంతంబుల పాచి,
చెవులోని గుల్మి, చెట్టల కొంప, / మూటగట్టు కొన్న మలమూత్రముల బొమ్మ
అమ్మమ్మ యీ బొమ్మ / ఉత్తమ గుణములెంచి చూచెదనం ఇలా సాగుతుందీ ఈ వచనములు కవిత.
సింహాద్రి అప్పన్న తెలుగువారి దేవుడు. తూర్పు కనుమలలో భాగంగా విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న పర్వతమే సింహాచలం. ఆ కొండ మీద వెలసిన దైవమే వరహాలక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయంలోని మూల విరాట్టును సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుడే ప్రతిష్టించాడని చెబుతారు. రాక్షస సోదరులైన హిరణ్యాక్షుడు హిరణ్య కశిపులని చంపిన వరహా, నరసింహ అవతారాల కలయికగా ఇక్కడి విగ్రహం కనిపిస్తుంది. వరాహ మొఖంతో, మనిషి శరీరంతో సింహం తోకతో వరాహ నరసింహస్వామి ఉంటారు. ఉగ్రమూర్తి అయిన స్వామివారి రూపాన్ని భక్తులు తట్టుకోలేరు. కాబట్టి నిత్యం వారు చందనంతో కప్పివేయబడతారు. సంపెంగ పూలతోనూ, పనస చెట్లతోనూ నిండిన సింహాచలం కొండ మీద అడుగు పెట్టగానే దివ్యమైన అనుభూతి, కలుగుతుందని భక్తుల భావన. స్వామివారి అనుగ్రహ మహిమో, వారి మీద ఉండే చందనం మహిమోకానీ గర్భగుడిలోకి ప్రవేశించగానే మండు వేసవిలో సైతం ఒళ్లు చల్లబడి పోతుందని చెబుతారు.
సింహాచలం స్వామి అంటే తెలుగువారికి, అందున ఉత్తరాంధ్ర వారికి చాలా నమ్మకం. ఆయనను తలచుకుంటే చాలు తమ ఆపదలు తీరిపోతాయని విశ్వాసం. అలా ఆపదలను తీర్చే స్వామి కాబట్టే ఆయనను అప్ప (తండ్రి) అన్న అని పిలుస్తారు. ఆ చల్లని స్వామి మనలను తండ్రిలా కాచుకుంటాడు. ఎందరో వాగ్గేయకారులు ఆ స్వామిని కీర్తించారు. వారితో కృష్ణమాచార్యులు ప్రథములు. ప్రపంచ భాషలన్నింటిలోను పదకవిత, పద్య కవిత అని రెండు విధాలు పాడుకోవడానికి ఉపయోగించేది పదం, పద్యం పండితులకు మాత్రమే పరిమితమైంది. మనదేశంలో సాహిత్యం ‘‘మార్గ’’ ‘‘దేశి’’ అని ద్వివిధం. ప్రజలచేత వాడబడి, పాడబడి, పాడబడుతూ పరివ్యాప్తమైంది దేశి. లక్షణబద్దమై పండితైక పరమైంది మార్గ. తెలుగులో పదమే పప్రథమంగా పుట్టింది.
తెలుగులో ఎందరో వాగ్గేయకారులున్నారు. వారిలో అన్నమయ్య, పెద తిరుమాలాచార్యులుచిన తిరుమలాచార్యులు, క్షేత్రయ్య, రామదాసు, సారంగపాణి, మునిపల్లె సుబ్రమణ్యకవి, త్యాగరాజు సింహాచలంలో శ్రీకాంత కృష్ణమాచార్యులు.
శ్రీకాంత కృష్ణమాచార్యులు దేశి అయిన అచ్చ తెలుగులో వచనాలు రచించి కృష్ణ భక్తి మార్గోపదేశ కుడు ఆయన రచనలు పేరుకు వచనాలే అయినా పాడుకోవడానికి భక్తి ప్రపత్తిని తెలుసుకోవడానికి ఉపకరించేవే.
కృష్ణమాచార్యులు అన్నమాచార్యుల కంటే పూర్వుడు. రామానుజ మతమైన విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి, ప్రచారం చేసిన మహనీయుడు. పాడుకోవడానికి వీలైన వచనాలు భగవద్భక్తి పరంగా రచించి ఈ పద్ధతికి మార్గదర్శకుడైనవాడు. ‘‘తెలుగు మాటల నంగవలదు, వేదముల కొలదిగా చూడు’’ డని ద్విపదల్లో జాను దెనుగులో రచన చేసినవాడు పాల్కురి సోమనాధుడు, అలాంటి మాటలేమీ చెప్పకుండానే అచ్చ తెలుగులో భగవన్నామ సంకీర్తన పరంగా వచనాలు రచించినవాడు కృష్ణమాచార్యుడు, ఇలాంటి వచనాలు బసవేశ్వరాదులు కన్నడంలో శైవమత పరంగా రచించారు. కృష్ణమాచార్యుల తరువాత సంకీర్తనంతోపాటు వచనాలు రచించిన భక్తుడు పెద్ద తిరుమలాచార్యుడు.
సింహగిరి నరహరిపై మాలికాగేయాలు రచించిన కృష్ణమాచార్యుడు లీలాశుకునికి (బిల్వా మంగళుడు) సమకాలికుడు. (ఇతడు శ్రీ కృష్ణకర్ణా మృతం అనే గ్రంథాన్ని వ్రాశాడు). ఆ కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాకతీయ రాజులు శైవమతాభి మానులు, దేశం అంతటా శైవమతం ప్రచారంలో ఉండే కాలంలో లీలాశుకుడు ఆరంభంలో పంచాక్షరీ మంత్రోపాసకుడు కావడం సమంజసమే. కృష్ణమాచార్యులకు నెలవైన సింహగిరి లాగానే కాకతీయ రాజధాని పరిధి వైష్ణవ క్షేత్రమైన వేదాద్రికి చుట్టుప్రక్కల ఇతడు సగం జీవితం గడిపి ఉండవచ్చునని రజనీకాంతారావు గారి అభిప్రాయం.
కాకతీయ రాజులలో రెండవ ప్రతాపరుద్రుని (క్రీ।।శ।। 1254-1323) సమకాలికుడు కృష్ణమా చార్యులు. శ్రీ నిడదవోలు వెంకట్రావు, శ్రీ కృష్ణమాచార్యులు జనన కాలము 1290గా నిర్దారించారు. కాని డా।। వేటూరి ఆనందమూర్తి వచనముల ఆధారంగా ఆయన 1268లో జన్మించి వుండవచ్చునని అభిప్రాయం వెలిబుచ్చాడు. డా।। ఎమ్.కులశేఖరరావు శ్రీ కృష్ణమాచార్యులు 1265-70 ప్రాంతంలో తన స్వగ్రామమైన సంతూరు లేక సంతపురంలో జన్మించినట్లు అది తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉందని అభిప్రాయపడ్డారు.
కృష్ణమాచార్యులు పుట్టు గుడ్డి అని తల్లిదండ్రులు ఆ బాలుని ఓ నీళ్లు లేనిబావిలో పడవేశారని, బాలుని ఏడుపు విని కువార స్వామి (కుమారస్వామి) అనే సన్యాసి రక్షించి అతడ్ని సింహాచలం చేర్చాడనీ, (కువార స్వామి స్వయాన సింహాద్రి అప్పన్నేయని) అక్కడ ‘‘స్వామి క్షీరము తెచ్చి ఉపయోగించమనిన… అంధత్వము మాసె’’ (పేజీ.48) చూపు వచ్చిందనీ, తరువాత ఆ బాలుని మేనమామ శ్రీ రంగాచార్యులు పెంచి పెద్ద చేసి యుక్త వయస్సు రాగా తన కూతుర్ని ఇచ్చి పెండ్లి చేశాడనీ, సంసారిక జీవితం గడుపుచూ, పుత్ర సంతానం పొంది, పుత్ర వియోగంతో బాధపడి, సంకీర్తన వాక్పూజలు చేస్తూనే ఆ వెనుక వేశ్యాలోలుడై వుండగా అతని దర్శనార్ధం పోతకమూరు ఆరుగురు సోదర భాగవతులు వచ్చారు. వారి దర్శనంతో కృష్ణమాచార్యునికి కనువిప్పు కలిగింది. ఇలా ఎన్నో కథలు ఉన్నాయి.
‘‘ఏది యేమైనా భక్తి సంకీర్తనలను పాడుకొంటూ మహిమలెన్నో ప్రదర్శిస్తూండేవాడు. ఈ మహా నీయుడు పుట్టింది సంతపురంలోనే అయినా బహుకాలం సింహాచలంలోనూ, నడుమకాలంలో వోరుగల్లు లోనూ, చివరకు శ్రీరంగంలోను జీవిత యాత్ర సాగించినట్లు తెలుస్తుంది. ఆంధ్రదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాలన్నిటిని దర్శించినట్లు కూడా తన పదాలలో ఆయనే పేర్కొన్నాడు’’.
‘‘ఆంధ్రదేశమున వచన రచనకు, భజన సంకీర్తనా పద్ధతులకు ప్రపితామహుడు అయినవాడు మనమెరిగినంతలో నీ కృష్ణమాచార్యుడే. ‘‘ఓం నమో నారాయణాయ’’ అనియు ‘‘నమోనమో లక్ష్మీ వల్లభా’’ అనియు, అనాధపతి సింహగిరి నరహరి నమో నమో దయానిధీ, అనియు, మా యతిరామానుజ ముని పరంధాతారు కృష్ణ కువ్వారు స్వామి నరహరి నమో నమో దయానిధీ, అనియు ‘‘పరబ్రహ్మ సింహగిరి నరహరి నమో నమో దయానిధీ’’ మకుటుములుగా స్వామి వారి అనంతనామ గుణ కదలకు వచన బాపంబున నీతడు విన్నపము చేయుచుండెడువాడు. ఈ విధముగా కృష్ణమాచార్యుడు పాడుకొన్న వచన సంకీర్తనములలో విన్నపములుగాను, చూర్ణికలుగాను గుర్తింప బడినవి కొన్ని మాత్రమే మనకు లభించినవి.
పదునైదు పదునారు శతాబ్దాలలో వెలసిన తాళ్లపాక కవీశ్వరులు ‘‘కృష్ణమాచార్యునే తమకు మార్గదర్శకుడుగాను, తాళ బంధచ్ఛందో విరహితమై చూర్ణాఖ్యం జరగునట్టి పదరచనలకు పరికల్పకుడుగను’’ పేర్కొన్నారు. కృష్ణమాచార్యుల వాఙ్మయ పరిమితిని గురించి ప్రస్తుతం చెప్పదగ్గ సాక్ష్యం ఏమీ లేదు. అయినా చతుర్లక్ష గ్రంథ సంకీర్తనల కృష్ణమాచార్యులు రచించిన కృతులలో లభ్యమైన వచన సంకీర్తనలు ముఖ్యంగా తులసీ మహత్మ్యము, నరసింహా నామములు, రామనామ కీర్తనము, రామనామాలు, వాటిని వైష్ణవ మత సిద్ధాంత ప్రతిపాదకాలు, పురాణ సంబంధమైనవి, వేదాంత పరమైనవి, నీతి బోధకమైనవి అని నాలుగు విధాలుగా విభజించారు. మచ్చుకు భక్తి ప్రబోధాత్మ కంగా, వర్ణవ్యవస్థా రహితంగా చెప్పిన వచనం.
‘‘దేవా విష్ణు భక్తిలేని విద్వాంసునికంటే హరికీర్తన చేయునతడే కులజుండు, శ్వపచుండైన నేమి? ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటె అతడే కులజుండు, సంధ్యా (వందనాది) నిత్యకర్మానుష్టానంబులు తప్పక నడిపిననేమి? సకల ధర్మంబులు సేసిననేమి? మా సింహగిరి నరహరిదాసులకు దాసులైనంగాని లేదు గతి? స్వామీ! సింహగిరి నరహరీ నమో నమో దయానిధీ.
‘‘తెలుగు భాషలో వచనైక రచన చేయుటలో ప్రథముడైన కృష్ణమాచార్యుల ప్రభావము అతని తరువాత ఆంధ్ర రచయితలపై స్పష్టముగా కన్పిస్తున్నది. రచనా పదతియందును, భావము నందును, సాంప్రదాయమునందును ఈ ప్రభావము ఇతర రచయితలపై నున్నది. స్తుతి వచనములు వ్రాయుట యిందితడే యగ్రగామి యగుట వలన ఈ సాంప్రదాయమును పాటించి రచనలు చేసిన శ్రీ వేంకటేశ్వర వచనములు, శఠకోప విన్నపములు, కాళికాదీశ్వర వచనములు మొదలగు రచయిత లందరూనూ నీతని యనుయాయులే. ఇలా వచనాలు రచించి సంకీర్తనా పద్దతికి, వైష్ణవభక్తి ప్రపత్తికి ప్రచారం తెచ్చిన ఘనత కృష్ణమాచార్యులకే దక్కుతుంది. డా।।కులశేఖరరావు పేర్కొన్నారు.
ప్రతాప చరిత్ర ప్రకారం ‘‘కృష్ణమాచార్యులు చాతుర్లక్ష గ్రంధం రాగిరేకుల మీద చెక్కించి వాటిని బళ్ల కెత్తించి శ్రీరంగం తీసుకుపోయారు’’. కృష్ణమా చార్యులు పదకర్తగా, సంకీర్తనాచార్యులుగా మహిమాన్వితులైన భక్త శిఖామణిగా పేరు పడి సింహాచలంలో స్వామి సేవా తత్పరులుగా వున్నారు.
సింహగిరి వచనాలు గేయాలుగా ప్రసిద్ధి కెక్కాయి, అంటే అవి తొలి తెలుగు వచనగేయాలన్న మాట (పేజీ.20)
‘‘ఒకానొక సందర్భంలో కృష్ణమాచార్యులవారు స్వామి సన్నిధిలో గానం చేస్తుండగా స్వామి బాలరూపంలో వచ్చి ఆయన తొడమీద కూర్చొని గంటంతో తాటాకుల మీద వ్రాయసాగారట. (పేజీ.30) వీరు మొదట తాటాకులపైన రాసినా తరువాత వాటిని తామ్ర పత్రికలపై వ్రాసి శ్రీరంగం తరలించినట్లు తెలుస్తున్నది.
తిరుపతి వెంకన్నకు అన్నమాచార్యులు భదాద్రి రామన్నకు కంచర్ల గోపన్న, సింహాద్రి అప్పన్నకు కృష్ణమాచార్యులు ప్రధాన వాగ్గేయకారులు దురదృష్ణవశాత్తూ కృష్ణమాచార్యులు ప్రజా బాహుళ్యానికి అంతగా తెలియదు. తన్మయత్వంలో కృష్ణమా చార్యులు పాడుతూ వుంటే సింహాద్రి అప్పన్న నాట్యం చేసేవాడట. ఈ మాట స్వయాన కృష్ణమాచార్యులే చెప్పారు.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు