అమెరికా విధించిన ప్రతీకారసుంకాల తీవ్రత రాష్ట్రంలో ఆక్వారంగాన్ని నేరుగా తాకింది. ఇప్పటికే రొయ్యలకు వ్యాధులు ప్రబలి, సాగు ఖర్చులు భారమై సతమత మవుతున్న రొయ్యల సాగుదార్లపై ట్రంప్ తాజా ఆంక్షలు సమ్మెటపోటుగా పరిణమిం చాయి. భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం విధించిన 27% ప్రతీకార సుంకం ప్రకటన వెలువడిన కొన్నిగంటల్లోనే రొయ్యల ధరల్లో పతనం మొదలైంది. దీంతో సముద్ర ఆహార ఎగుమతి పరిశ్రమ సంక్షోభంలో పడిపోతుందని ఆక్వా రంగ భాగస్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధప్రదేశ్ రొయ్యల సాగు, ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలోనే అగ్రగామిగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం ఊతమిస్తోంది. జీఎస్‌డీపీలో రొయ్యల పరిశ్రమ వాటా 11 శాతంగా ఉంది. ప్రధానంగా ఈ రంగం ఎగుమతులపై ఆధారపడి ఉంది. 2023-24లో మన దేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92% వాటా కలిగి ఉన్నాయి. భారత రొయ్యలకు అతి పెద్ద మార్కెట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు. 40%పైగా రొయ్యలు భారత్ నుంచి అక్కడికి ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత సముద్ర ఉత్పత్తులపై 27% సుంకం విధించ•డంతో మన రొయ్య యూఎస్ మార్కెట్‌ను తట్టుకొని పోటీలో నిలవలేదు. సుంకాల పెంపుతో కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని ఎగుమతులు నిర్ణయించుకున్నారు. దాంతో రొయ్యల రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ అయి కోల్డ్ స్టోరేజీలు, పోర్టుల్లో ఉన్నాయి. వీటిపై సుంకం భారం పడుతుంది. రాష్ట్రంలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంటను ఎక్కడ ఉంచాలో తెలియని గందరగోళ పరిస్థితిలో రైతాంగం ఉంది. 27% సుంకాల కారణంగా రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతిదారులు నిలిపివేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నాయి. ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతి దారులు.. ఇలా అందరికీ సమస్యలు వచ్చాయి.
మార్కెట్‌ను మరిచిపోవాల్సిందే..
అమెరికా సుంకాల ప్రభావం కేవలం యూఎస్‌కు జరుగుతున్న రొయ్యల ఎగుమతులకే పరిమితంకాదు. ద్వితీయ ఎగుమతి మార్గాలను కూడా తీవ్రంగా దెబ్బతీయనున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న చైనా, థాయ్‌లాండ్, వియత్నాంలకు 35 శాతం రొయ్యల ఉత్పత్తులు మన దేశం నుంచి వెళుతున్నాయి. తిరిగి ఈ రెండు దేశాలూ తాము దిగుమతి చేసుకున్న రొయ్యల్లో చాలా భాగం అమెరికాకే ఎగుమతి చేస్తున్నాయి. ఇప్పుడు చైనా, వియత్నాం నుంచి యూఎస్‌కు ఎగుమతులపై 30% కంటే ఎక్కువ సుంకాలు ట్రంప్ తాజాగా విధించారు. దీంతో ఆ దేశాల నుంచి మనకు ఆర్డర్లు తగ్గిపోతాయి. ఇప్పటికే ఉన్న 5.76 శాతం కౌంటర్ వేలింగ్ డ్యూటీ (సీవీడీ), 1.35% నుంచి 3% మధ్య ఉన్న యాంటీ -డంపింగ్ డ్యూటీలను కూడా కలుపుకొంటే ఈ సుంకాల భారం 33%-35% వరకు ఉండవచ్చు. దేశంలోని వివిధ పోర్టుల నుంచి ఆక్వా ఉత్పత్తులతో సముద్ర మార్గంలో అమెరికాకు బయల్దేరిన కంటెయినర్లు 2 వేలు. రవాణాకు సిద్ధంగా ఉన్నవి మరో 2 వేలు. మొత్తం 4 వేల కంటెయినర్లలో ఉన్న సరకు విలువ సుమారు రూ.4 వేల కోట్లకు పైనే. ఈ కంటెయినర్లు ఏప్రిల్ 9లోపు అమెరికాకు చేరకపోతే 26% సుంకం, 3.88% యాంటీ డంపింగ్ సుంకం, 5.77% కౌంటర్ వెయిలింగ్ సుంకం కలిపి 34% చెల్లించాల్సిందే. అంటే ఇప్పటికిప్పుడు పడే సుంకాల భారం రూ. 1,300 కోట్లకు పైనే ఉండచ్చని వాణిజ్యవర్గాలు ఆంచనా వేస్తున్నాయి.
ఈక్వెడార్ నుంచి పోటీ
అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేస్తున్న ఈక్వడార్ వంటి దేశాలపై కేవలం 10% సుంకాన్ని మాత్రమే ట్రంప్ ప్రభుత్వం విధించింది. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ, వారికి అనుకూలంగా మారుతోంది. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77% కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ(సీవీడీ) భారాన్ని మోస్తున్నారు. అన్ని సుంకాలు కలుపుకొంటే ఈక్వడార్‌కు, భారత్‌కు మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20% ఉంటుంది. ఈ కారణంగా అమెరికాకు వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోంది. దీంతో భవిష్యత్తులో మనకు ఈక్వడార్ ప్రధాన పోటీదారుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆక్వాపై అగ్రరాజ్యం సెగ!
ఆంధప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 5.73,535 ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులున్నాయి. వాటిలో సుమారు 19 లక్షల టన్ను రొయ్యలు సాగు చేస్తున్నారు. దీంతో పాటు సముద్రపు వేట ద్వారా లభించే రొయ్యలను కూడా విదేశాలకు ఎగుమతి చేస్తారు. చెరువుల్లో సాగు చేసే రొయ్యలు 30 కౌంట్ వచ్చేవరకు రైతులు ఆగుతారు. ఈ తరుణంలో 30 నుంచి 50 కౌంట్ ఉన్న రొయ్యలు చెరువుల్లో అధికంగా ఉంది. వేసవిలో కొనుగోలు చేసిన రొయ్యలను ప్రాసెసింగ్ చేసి ఓడల ద్వారా డిసెంబరు నాటికి అమెరికాకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం అమెరికా విధించిన సుంకం కారణంగా 30 కౌంట్ ఉన్న రొయ్యలను ఎగుమతి చేయాలంటే కిలోకు రూ.130 అదనపు భారం పడుతుందని, దీంతో స్థానికంగా రొయ్యల ధర తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. ఈ వ్యత్యాసాన్ని ఎగుమతిదారులు భరిస్తారా లేక రైతులకు ఇచ్చే ధరలోనే కోతపెడతారా అనే అంశంపై రైతుల్లో చర్చ జరుగుతోంది.
ఆక్వా ఎగుమతులకు బ్రేక్ పడకుండా ఎగుమతిదారులు కొంతమేర భారం తమపై వేసుకునేందుకు ముందుకు వస్తారా?లేదా? అనే అంశంపై వారం రోజుల వ్యవధిలో స్పష్టత వస్తుందని స్థానికంగా రొయ్యలు కొనుగోలు చేసే వ్యాపారులు చెబుతున్నారు. మన దేశం నుంచి అమెరికా, చైనా తదితర దేశాలకు రొయ్యలన ఎగుమతి జరుగుతుందని, పెద్ద కౌంట్ ఉన్న రొయ్యలు అధికంగా అమెరికాకు ఎగుమతి అవుతాయని పెద్ద వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విధించిన 27 శాతం మేర సుంకం ప్రభావం తప్పనిసరిగా ఆక్వా రైతులపై పడుతుందని చెబుతున్నారు.
కొనుగోళ్లు నిలిపివేత
ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా సుంకం పెంచడంతో 50 కౌంట్ కంటే పెద్ద రొయ్యల కొనుగోలును ప్రాసెసింగ్ యూనిట్‌ల యజమానులు, ఎగుమతిదారులు నిలిపివేశారు. కిలోకు 50, 60, 70, 80, 90, 100 కౌంట్ ఉన్న రొయ్యలనే ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ధరలు తగ్గించి మరీ చేస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు కిలోకు 100 కౌంట్ ఉన్న రొయ్యలు రూ.250 మేర ధర ఉండగా, గత రెండు రోజులుగా ఈ ధరను రూ.200లకు తగ్గించివేశారు. 60 కౌంట్ రొయ్యలధర గతంలో రూ.330 వరకు ఉండగా నేడు రూ.250కు పడిపోయింది. 50 నుంచి 100 కౌంట్ ఉన్న రొయ్యలను చైనా దేశానికి ఎగుమతి చేసేందుకే కొనుగోలు చేస్తున్నామని, పరిస్థితులు చక్కబడేవరకు అమెరికాకు రొయ్యల ఎగుమతులు ఉండవని ఎగుమతిదారులు చెప్పడం గమనార్హం. ఇప్పటికే తమ వద్ద ఉన్న సరుకును ఏ పద్ధతిలో ఎగుమతి చేయాలో తెలియడం లేదని, 30, 40, 50 కౌంట్ ఉన్న రొయ్యలను ఇప్పట్లో కొనుగోలు చేయబోమని ప్రాసెసింగ్ యూనిట్‌ల యజమానులు, ఎగుమతిదారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రాసెసింగ్ యూనిట్ల సమస్య
కొవిడ్ సమయంలో ప్రభుత్వం రొయ్యల ఎగుమతులను ప్రోత్సహిస్తూ ప్రాసెసింగ్ యూనిట్లను నడిపింది. కానీ ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రత్యామ్నాయ మార్కెట్లు కనిపించడం లేదు. ఏపీలో రొయ్యల పరిశ్రమ ఉపాధి కల్పనకు ఊతం ఇస్తోంది. రాష్ట్రంలో 450పైగా రొయ్యల హచరీలు, 50పైగా ఫీడ్ మిల్లులు, 2లక్షలపైగా రొయ్యల చెరువులు, 250 పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు, 6వేలకుపైగా పడవలు, నౌకల ద్వారా వేలాదిమందికి జీవనోపాధి లభిస్తోంది. ఏటా ఏప్రిల్- సెప్టెంబరు మధ్యనే వార్షిక ఉత్పత్తిలో 70% చేతికి వస్తుంది. అయితే రొయ్యలు త్వరగా పాడయ్యే ఉత్పత్తి. సుంకాల కారణంగా కొంతకాలం సాగునీటి వనరుల్లో నిల్వ చేద్దామంటే తగిన శీతలీకరణ వసతులు లేవు. దీంతో ప్రాసెసింగ్ కష్టమై లక్షల మంది ఉపాధి కోల్పోతారు. ఈ నేపథ్యంలో కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఆక్వా సాగుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్