రామాయణం, రామకథల ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీలతో అయోధ్యలో అపురూప చలన చిత్రోత్సవం నిర్వహించారు. శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2025 పేరుతో నిర్వహించిన ఈ చలనచిత్రోత్సవంలో మన తెలుగువారు నిర్మించిన రెండు చిత్రాలకు నాలుగు పురస్కారాలు లభించాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ చలనచిత్రోత్సవం జరిగింది.
ఇందులో తెలుగు రచయిత, దర్శకుడు సత్యకాశీ భార్గవ శ్రీరాముడిపై రచించి, నిర్మించిన రెండు రామ చిత్రాలు నాలుగు పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. ఈ సందర్భంగా సత్యకాశీ భార్గవ మాట్లాడుతూ తమ డాక్యుమెంటరీ చిత్రాలకు నాలుగు పురస్కారాలు రావడం చాలా ఆనందదాయకమని అన్నారు. తనకే కాదు, ఈ వార్త ప్రతీ రామ భక్తుడిని పులకరింప చేస్తుందని అన్నారు. ఇందులో ఒకటి-‘శ్రీమాన్ రామ’ ఏనిమేషన్. మరొకటి ‘రామ అయోధ్య’. భారతీయ సినిమా చరిత్రలో పూర్తిగా అయోధ్యలో, రాముడిపై తీసిన మొట్టమొదటి డాక్యుమెంటరీ చిత్రంగా ఇది ఘనత పొందింది.
రామ అయోధ్య ఫిల్మ్ 2024 ఏప్రిల్ 17న ఆహా తెలుగు ఓటిటిలో విడుదలై ప్రేక్షకాదరణ సంపాదించింది. శ్రీమాన్ రామ దూరదర్శన్ జాతీయ టీవీలో 2024లో విడుదలై ఇప్పటికీ కొనసాగుతూ నెంబర్-1 టీవీ షోగా రికార్డు సృష్టించింది.
పురస్కారాలు
1) ఉత్తమ దర్శకుడు (ఏనిమేషన్)-సత్యకాశీ భార్గవ (శ్రీమాన్ రామ)
2) ఉత్తమ కార్టూన్ ఏనిమేషన్ ఫిల్మ్ -శ్రీమాన్ రామ
3) బెస్ట్ మైధలోజికల్ డాక్యుమెంటరీ చిత్ర దర్శకుడు-కృష్ణ ఎస్ రామ (రామ అయోధ్య)
4) ఉత్తమ సాంస్కృతిక కథనం -సత్యకాశీ భార్గవ (రామ అయోధ్య)