అటూ కేంద్ర ప్రభుత్వంతోనూ, ఇటు రాష్ట్ర గవర్నర్‌తోనూ నిత్యం ఏదో ఒక విషయంలో గిల్లికజ్జాలు పెట్టుకునే తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయనకు ఉన్నట్టుండి రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి తెచ్చిపెట్టుకోవాలని బుద్ధి పుట్టింది. అనుకున్నదే తడవుగా తన నిర్ణయానికి వేదికగా రాష్ట్ర అసెంబ్లీని మలచుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తికి, భాషా విధివిధానాలకు సంబంధించి తగు సూచనలు చేయడం కోసమని ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్టు ఏప్రిల్ 15న అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ఉన్నత స్థాయి కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వం వహిస్తారు. కమిటీ సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.అశోక్‌వర్థన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళికా సంఘం పూర్వ వీసీ ఎం నాగనాథన్‌లను నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చిన అంశాలను పునురుద్ధరించడం కోసం సిఫారసులు, రాష్ట్ర స్వయంప్రతిపత్తి కోసమని చేపట్టాల్సిన సంస్కరణలకు తోడు సర్కారియా, రాజమన్నార్ వంటి కమిషన్లు చేసిన సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. కమిటీ జనవరి, 2026నాటికి తాత్కాలిక నివేదికను, 2028నాటికి తుది నివేదికను సమర్పించనుంది. అయితే స్టాలిన్ వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఓట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రకటన చేశారని ప్రతిపక్షం అన్నాడీఎంకే కి చెందిన ఉపనాయకుడు ఆర్‌బీ ఉదయకుమార్ ఆరోపించారు. 50 సంవత్సరాల క్రితం స్టాలిన్ తండ్రి కరుణానిధి కూడా ఇదే తరహా చౌకబారు ఎత్తుగడలకు పాల్పడ్డారని అన్నారు.