భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ‌ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలు, నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవలంబించిన ఒంటెత్తు పోకడలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి. మచ్చుకు కాళేశ్వరం ప్రాజెక్టునే తీసుకుంటే.. కేవలం కేసీఆర్‌ ఒక్కరు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన ఆలోచనలు ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత అధికారులను వెంటాడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం మారినప్పటి నుంచీ విచారణలు కొనసాగుతున్నాయి. ఏకంగా జ్యుడీషియల్‌ ‌కమిషనే విచారణ సాగించింది. అనేక మందిని ప్రశ్నించింది. ఇదే అంశంలో ఇప్పుడు విజిలెన్స్ ‌రిపోర్ట్ ‌ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను వణికిస్తోంది. ఆ విజిలెన్స్ ‌రిపోర్ట్ ‌మేరకు చర్యలు తీసుకుంటే ప్రభుత్వ విభాగంలోనే ప్రకంపనలు పుట్టే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో అధికారులపై చర్యలకు విజిలెన్స్ ‌విభాగం సిఫారసు చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ ‌కుంగిన సంఘటనలో 39 మంది అధికారులపై చర్యలకు విజిలెన్స్ ‌సిఫారసు చేసింది. వీరిలో ఎక్కువ మంది ఇరిగేషన్‌ ‌డిపార్ట్‌మెంట్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. అందుకే ఒకేసారి చర్యలు తీసుకుంటే.. ఆ శాఖపైనే తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఈ విజిలెన్స్ ‌రిపోర్ట్‌పై ఏం చేయాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. మొత్తం ఈ 39 మందిలో 17 మందిపై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకోవాలని, 22 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ‌రిపోర్ట్‌లో సూచించారు. వీళ్లంతా కూడా గత ప్రభుత్వం నిర్ణయాల్లో తప్పుల వల్ల ఇరుక్కున్నవాళ్లే ఎక్కువ ఉన్నారట. అయితే, ఈ వ్యవహారంతో నేరుగా ప్రమేయం లేని వారికి ఉపశమనం కల్పించే యోచనలో రాష్ట ప్రభుత్వం ఉందంటున్నారు. కమీషన్లకు ఆశపడి కావాలనే తప్పు చేసినవాళ్లపై మాత్రం కఠిన చర్యలకు వెనకాడరాదని సర్కారు ఆలోచిస్తోందట. అయితే, ఈ విజిలెన్స్ ‌రిపోర్ట్‌పై మరోసారి సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఆ నివేదిక ప్రకారం నీటి పారుదల శాఖలో కీలక పదవుల్లో ఉన్న 22 మంది పై ఒకేసారి చర్యలకు దిగితే ఆ శాఖ కుప్పకూలే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది. ఇప్పటికే సీనియర్‌ ‌స్థాయిలో అధికారుల కొరతతో పెండింగ్‌ ‌ప్రాజెక్టులు ముందుకు సాగడంలేదు. ఇలాంటి సమయంలో అంతమంది అధికారులపై చర్యలు తీసుకుంటే ఆ శాఖ మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా, చర్యలకు విజిలెన్స్ ‌సిఫార్సు చేసిన అధికారుల్లో ఎక్కువ మంది గత సర్కారు చేసిన తప్పుల వల్ల ఇరుకున్నవాళ్లే ఉన్నారు. తప్పని తెలిసినా పైనుంచి వచ్చిన ఆదేశాలను పాటించామని, ఇందుకు తమను శిక్షించవద్దంటూ కొందరు ఆఫీసర్లు ఇప్పటికే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో మేడిగడ్డ ఘటనలో నేరుగా ప్రమేయం లేని అధికారులకు ఉపశమనం కల్పించే ఆలోచనలో రాష్ట్ర సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నేరుగా సంబంధం ఉన్న అధికారులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే నివేదికపై విజిలెన్స్ అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం, నాటి పెద్దల మెప్పు కోసం కావాలని తప్పులు చేసిందెవరు? తమ తప్పు లేకున్నా ఇరుక్కున్నవాళ్లు ఎవరు అనేది తేల్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత నేషనల్‌ ‌డ్యామ్‌ ‌సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌.ఏ), ‌విజిలెన్స్ ‌విభాగం విచారణకు ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. డిపార్ట్‌మెంట్‌లోని రిటైర్డ్ ఈఎన్‌సీలు, ఈఎన్‌సీలు, సీనియర్‌ ఇం‌జనీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లను విజిలెన్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌పలు దఫాలుగా విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో పాటు క్వాలిటీ కంట్రోల్‌, ఆపరేషన్‌ అం‌డ్‌ ‌మెయింటెనెన్స్ ‌వ్యవహారాలు చూసిన అధికారులను పిలిచి, వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.

బ్యారేజీలో తొలినాళ్లలోనే సీపేజీలు ఏర్పడినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పనులు కాకముందే నిర్మాణ సంస్థకు కంప్లీషన్‌ ‌సర్టిఫికెట్లు ఇవ్వడం, బ్యాంక్‌ ‌గ్యారంటీలను రిలీజ్‌ ‌చేయడం వంటి ఘటనలపై 39 మంది అధికారులపై విజిలెన్స్ ‌డిపార్ట్‌మెంట్‌ అభియోగాలు మోపింది. వీరిలో నలుగురు రిటైర్డ్ ఈఎన్‌సీలు, ఇద్దరు రిటైర్డ్ ‌క్వాలిటీ కంట్రోల్‌ ‌సీఈలు, ముగ్గురు సీఈలు, ఒక డిప్యూటీ సీఈ, ఇద్దరు ఎస్‌ఈలు, ఒక రిటైర్డ్ ఈఈ, ఇద్దరు ఈఈలు, ఒక వర్కస్ అకౌంట్స్ ‌డైరెక్టర్‌ ఉన్నారు. వీరితోపాటు ఒక రిటైర్డ్ ‌డిప్యూటీ సీఈ, ఒక రిటైర్డ్ ఎస్‌ఈ, ఒక ఎస్‌ఈ, ఒక డిప్యూటీ ఎస్‌ఈ, ఆరుగురు డీఈఈలు, 11 మంది ఏఈఈలు, ఒక డివిజనల్‌ అకౌంట్స్ఆఫీసర్‌ ఉన్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న 39 మందిలో ప్రస్తుతం 29 మంది సర్వీసులో ఉన్నారు. వీరిలో కొందరు మరికొన్ని నెలల్లో పదవీ విరమణ చేయుబోతున్నారు. పదవీ విరమణ చేసిన వారిపై పెన్షన్‌ ‌రూల్స్ ‌ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా విజిలెన్స్ ‌సూచించింది. విజిలెన్స్ ‌నివేదికలో కొందరు సీనియర్‌ అధికారుల పేర్లు బయటకు రావడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఇన్నాళ్లూ ఎలాంటి రిమార్క్ ‌లేకుండా పనిచేశామని, తాము ఎలాంటి తప్పు చేయకున్నా నాటి ప్రభుత్వ పెద్దల పుణ్యమా అని తమ కెరీర్‌ ‌పై మచ్చపడిందని వాపోతున్నారు. అప్పటి ప్రభుత్వం చెప్పినట్టు.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడం తప్ప తాము ఏ తప్పూ చేయలేదని అంటున్నారు.

విజిలెన్స్ ‌నివేదికపై ప్రభుత్వం పునః సమీక్ష చేయాలని యోచిస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం జ్యుడీషియల్‌ ‌కమిషన్‌ ‌రిపోర్టు ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 110 మంది దాకా అధికారులను విచారించిన అకౌంట్స్ ‌నేతృత్వంలోని జ్యుడీషియల్‌ ‌కమిషన్‌..,‌నివేదికకు తుదిమెరుగులు దిద్దుతోంది. అధికారుల స్టేట్‌మెంటు వారు సమర్పించిన అఫిడవిట్లు, డాక్యుమెంట్ల ఆధారంగా పలువురు అధికారులపై చర్యలకు ఉపక్రమించేలా నివేదికను దాదాపు •రారు చేసింది. షెడ్యూల్‌ ‌ప్రకారం ఈ నెలాఖరుకే కమిషన ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వం మాత్రం విజిలెన్స్? ‌రిపోర్టుపై ఏదో ఒకటి తేల్చాకే కమిషన్‌? ‌రిపోర్టుపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఈ క్రమంలోనే కాళేశ్వరం కమిషన్‌ ‌నివేదికను కొన్ని రోజులపాటు నిలిపివేయాలన్న (హోల్డ్) ‌యోచనలో ఉన్నట్టు సమాచారం. దీంతో కమిషన్‌ ‌గడువును మరో నెల పాటు పొడిగించనున్నట్టు తెలుస్తోంది. కమిషన్‌ ‌చైర్మన్‌ ‌జస్టిస్‌ ‌పినాకి చంద్రఘోష్‌ ‌మరోమారు హైదరాబాద్‌కు వచ్చి విచారణకు సంబంధించిన అంశాలను చక్కపెట్టాలని యోచిస్తున్నారు. ప్రజాప్రతి నిధులను పిలవాలా? వద్దా? అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని చర్చ జరుగుతున్నది. వీటన్నింటి నేపథ్యంలోనే ప్రభుత్వానికి కమిషన్‌? ‌నివేదిక మేలో అందుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సుజాత గోపగోని

 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE