పోర్చుగీస్‌ ‌వలస పాలనను నాలుగున్నర దశాబ్దాల పాటు నిలువరించి, ఐదారు యుద్ధాలలో వాళ్లని ఓడించిన వీర వనిత రాణీ అబ్బక్క. 1525 ఆమె ఉల్లాల్‌ ‌రాణి అయినది మొదలు, తుదిశ్వాస విడిచిన 1570 వరకు పోర్చుగీస్‌ ‌వలసదారులతో పోరాడారు. అలా ‘అభయరాణి’ అన్న బిరుదును సార్థకం చేసుకున్నారని అనిపిస్తుంది. భారతీయులు స్త్రీలను గడప వెనుకే ఉంచుతారన్న పాశ్చాత్యుల దుష్ప్రచారానికి ఆమె తిరుగులేని సమాధానం. భారతీయుల విజయాలు, అందులోను ఒక మహిళ కేంద్రబిందువుగా సాగిన వీరోచిత పోరాటాలు బయటి ప్రపంచానికి తెలిస్తే పాశ్చాత్య దేశాలకు ఎంత అవమానం? భారత్‌ను ఒక వలసగా చేసి దోచుకుంటున్న దేశాలకు ఎంత తలవంపు? పోర్చుగీసు కుట్రలని తిప్పికొట్టిన నాలుగున్నర దశాబ్దాల వీరగాథ అబ్బక్కది. అయినా అబ్బక్క వీరచరితాన్ని కర్ణాటక సాగరతీరంలో ఇసుక తిన్నెలకు పరిమితం చేశారు. కచ్చితంగా చెప్పాలంటే అబ్బక్క ప్రపంచ చరిత్రలోనే ఒక అబ్బురం. తొలి భారత స్వాతంత్య్ర పోరాట యోధురాలు ఝాన్సీలక్ష్మీబాయి అని ఎవరైనా ప్రకటిస్తే, ఆ మాటను కొట్టివేయకుండానే, అంతకు 300 సంవత్సరాల ముందే యూరోపియన్లను వణికించిన మరో వీరనారీమణి అబ్బక్క ఉన్నారని మనం ఎలుగెత్తి చాటాలి. ఇంకా ఒనకే ఓబమ్మ, కిత్తూరు చెన్నమ్మ, బెలవాడి మల్లమ్మ, కేళడి చెన్నమ్మ మొదలైన వారు. వారిలో ఒక్కొక్కరిది ఒక విశేష జీవనం.

1498లో వాస్కోడా గామా దక్షిణ భారతదేశంలోని కాలికట్‌ ‌చేరుకున్న తరువాత యురోపియన్‌ ‌వలసవాదం పరాకాష్టకు చేరుకుంది. వాస్కోడాగామా సముద్రమార్గం కనుగొన్న తరువాత సుమారు ఇరవై సంవత్సరాల వరకూ పోర్చుగీసు వారి గుత్తాధిపత్యం కొనసాగింది. అప్పటి నుండే వారు ఇండోనేషియా, శ్రీలంక, చైనా (మకావు) వంటి దేశాలలో అనేక కోటలు కట్టారు. వారికి కావలసినవి సుగంధద్రవ్యాలు, మసాలా దినుసులు, బట్టలు. వాటిని సంపాదించడానికి ఎగుమతి చేసుకోవడానికి వీలు కల్పించే అన్ని మార్గాలపైన ఆధిపత్యం సంపాదించారు. దానితో వాణిజ్య మార్గాలను నియంత్రించడానికి పోర్చుగీసు, డచ్‌, ఇం‌గ్లండు, ఫ్రాన్సులు పోటీపడ్డాయి. వారిలో ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ పైచేయి సాధించింది. కాబట్టి ఇంగ్లీషు వారితో జరిగిన పోరాట సంఘటనలే స్వాతంత్య్ర ఉద్యమంలో చోటు చేసుకున్నాయి. కానీ ఇతర వలసలతో జరిగిన ఉద్యమాల• పెద్దగా ప్రాధాన్యం సంతరించుకోలేదు. ఫలితంగా ఆ గాథలు కనుమరుగైనాయి. అందులోనిదే అబ్బక్క చరితం.

విజయనగర పాలకుడు, తుళువ వంశీకుడు శ్రీకృష్ణదేవరాయలు 1529లో మరణించాడు. తరువాత ఆ మహా సామ్రాజ్య పతనం మొదలైంది. తుళువనాడు అని పిలిచే ఉడిపి-దక్షిణ కన్నడ కాసరగోడ్‌ ‌ప్రాతం కీలక వాణిజ్య కేంద్రం. మేలు జాతి గుర్రాలు, బట్టలు, మిరియాలు, ఇతర సుగంధద్రవ్యాల వ్యాపారం దీని గుండా సాగింది. ఇది విజయనగర సామంతరాజులు పరిపాలనలో ఉంది. తుళువ రాజు పరిపాలించిన సంస్థానాల సమాహారమది. విజయనగర రాజ్య పతనం తరువాత వీరు స్వయం ప్రతిపత్తి పొందారు. కానీ ఈ రాజ్యాలకు పోర్చుగీసు పెద్ద బెడదగా తయారైంది. రాణి అబ్బక్క చౌతా కథ ఇక్కడే ప్రారంభమవుతుంది. అబ్బక్క పూర్వీకులు జైనులు వీరు గుజరాత్‌ ‌నుండి కర్ణాటకలోని తుళువనాడుకు సుమారు 12వ శతాబ్దంలో వలస వచ్చినారని ప్రతీతి. వీరు జైనులు అయినప్పటికి సమీపంలోని సోమేశ్వరాలయంలోని సోమేశ్వరనాథునే తమ వంశదైవంగా స్వీకరించారు.

కోస్తా కర్ణాటక (తుళువనాడు) లోని కొన్ని ప్రాంతాలను పాలించిన స్థానిక తుళువ రాజవంశం చౌతా కుటుంబానికి చెందినది. వారి రాజధాని పుట్టిగే. ఉల్లాల్‌ ఓడరేవు పట్టణం (మంగుళూరు దగ్గర) వారి అనుబంధ రాజధానిగా కొనసాగు తున్నది. ఉల్లాల్‌ ‌చాలా వ్యూహాత్మకం కనుక దానిపై పోర్చుగీసు వారు కన్ను వేశారు. చౌతాలు మాతృవంశ విధానాన్ని అనుసరించేవారు. తద్వారా అబ్బక్క ఉల్లాల్‌ ‌రాజ్యానికి రాణి పదవిని అలంకరించారు. ఆమె సునిశిత మేధ గొప్పది. యూరోపియన్ల ఆధునిక మందుగుండు ముందు భారతీయ రాజ్యాలు తల దించడం ఆమె గమనించింది. కాబట్టి సాంప్రదాయే తర గెరిల్లా యుద్దవిద్యకు ప్రాధాన్యమిచ్చింది. పొరుగు రాజ్యాలతో వ్యూహాత్మక సంబంధాలను ఏర్పరచుకుంది. కాలికట్‌ ‌రాజు జామరిన్‌ ‌మద్దతు కోరింది. తన సరిహద్దు రాజ్యాలకు స్నేహ హస్తం అందించింది. తద్వారా ఒక బలమైన కూటమిని తయారుచేసింది.

12వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు తుళువనాడులోని కొన్ని ప్రాంతాలను పాలించిన చౌతా రాజవంశీకులలో అబ్బక్క జీవితం, దృష్టికోణం, పాలనా సామర్థ్యం చరిత్రలో ప్రత్యేకమైనవిగా స్థానం పొందాయి. చిన్నతనం నుండి విలు విద్య, కత్తి యుద్దం, వివిధ యుద్ద విద్యలలోనే ప్రావీణ్యం గడించింది. 3వ తిరుమలరాయలు చౌతా రాజు, ఈమెను ఉల్లాల్‌ ‌రాణిగా ప్రకటించాడు. పోర్చుగీస్‌ ‌వలస ఆధిపత్యం మీద తిరుగుబాటు చేసినందుకు తొలి మహిళా స్వాతంత్య్ర యోధురాలిగా ఆమెను గౌరవించడం పరిపాటి. ఈ సాహసం ఆమె 16వ శతాబ్దంలోనే చేశారు. ఆమె పాలనలోని ఉల్లాల్‌ ‌పోర్చుగీస్‌ ‌పరం కాకుండా ఆమె చేసిన యుద్ధాలు స్మరణీయమైనవి. ఈ క్రమంలో భర్త లక్ష్మప్ప అరస బంగరాజా-2 (మంగళూరులోని బంగా సంస్థానాధిపతి)ను సైతం ఆమె విడిచిపెట్టింది. పెళ్లిలో ఇచ్చిన నగలన్నీ తిప్పి పంపడం అతడికి అవమానంగా తోచింది. మహిళ అని గాని, మాజీ భార్య అని గాని చూడకుండా అతడు పోర్చుగీసు శక్తులతో చేతులు కలిపి ఆమె పతనానికి సహకరించాడు.

 పోర్చుగీసులు గోవాను కబళించిన తరువాత దక్షిణంలోని తీర ప్రాంతం మీద కన్నేశారు. ఆ క్రమంలోనే 1525లో మంగళూరు పోర్టును ధ్వంసం చేశారు. ఆపై అబ్బక్క చౌతా ఆధిపత్యంలోని ఉల్లాల్‌ను స్వాధీనం చేసుకోవాలని కదిలారు. ఆరేబియాతో పాటు, పాశ్చాత్య దేశాలకు సుగంద ద్రవ్యాల రవాణాకు ఉల్లాల్‌ ‌కేంద్ర బిందువు. నిజంగానే ఉల్లాల్‌ ‌పోర్చుగీస్‌ ‌చేతిలో పడకుండా రక్షించుకోవడానికి ఆనాడే కులం, మతం, వర్గం, ప్రాంతీయ భేదాలను వీడి ప్రజలంతా ఐక్యమయ్యారు. వారికి అబ్బక్క నాయకురాలు. పోర్చుగీస్‌ ‌బలగాలను ఎదిరించి అగ్నివాన కురిపిస్తూ నిలువరించే ప్రయత్నం చేసిన వారిలో అబ్బక్క ప్రథమురాలు అని జానపద సంపద అనే అంశం మీద అధ్యయనం చేసిన డా. కైలాశ్‌ ‌కె. మిశ్రా వ్యాఖ్యానించారు. జైన మతస్థురాలే అయినా ఆమె కొలువులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా పనిచేశారు. ఆమె సైన్యంలో మొగ్గవీర (జాలరులు) వర్గీయులు విశేష సంఖ్యలో ఉండేవారు. జైన ఆధ్యాత్మిక కేంద్రం మూదబిద్రి కేంద్రంగా ఆమె పరిపాలన సాగించారు. ఆమె నౌకాదళాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఉల్లాల్‌ ‌పెద్ద నౌకాశ్రయం అనొచ్చు. మలాలై ఆనకట్టను స్వీయ పర్యవేక్షణలో నిర్మించారు. నిర్మాణాల కోసం ఆమె బెరీ వర్గం వారిని (ముస్లింలలో చిన్న తెగ) నియమించేవారు.

 వలస రాజ్యాల ప్రభ చెలరేగిపోతున్నప్పుడు అబ్బక్క పోర్చుగీస్‌ను ఎదిరించింది. వాస్కోడా గామా సముద్రమార్గం కనుగొన్న తరువాత రెండు దశాబ్దాల కాలంలోనే పోర్చుగీస్‌ ‌హిందూ సముద్రం మీద గుత్తాధిపత్యం సంపాదించారు. 16వ శతాబ్దంలో దేశానికీ, ధర్మానికీ చేటు జరుగుతున్న వ్యక్తి ఎవరైనా దూరంగా ఉంచాలన్న గొప్ప స్పృహను ప్రదర్శించిన వ్యక్తిగా రాణి అబ్బక్క కనపడతారు. కప్పం కట్టడానికి నిరాకరించినందుకు 1567లో ఉల్లాల్‌ ‌నగరాన్ని పోర్చుగీస్‌ ‌ముట్టడించింది. చాలామంది వలస పాలకుల మాదిరిగానే పోర్చుగీస్‌కు కూడా యుద్ధనీతిలో నమ్మకం లేదు. సాధారణ ప్రజలను హింసించేవారు. మొదటిసారి జరిపిన దాడిని అబ్బక్క తిప్పి కొట్టింది.

అబ్బక్క పట్టాభిషిక్తురాలైన 1525లోనే దక్షిణ కెనరా కేంద్రంగా పోర్చుగీస్‌ ‌బలగాలు దక్షిణ మంగళూరు నౌకాశ్రయాన్ని ధ్వంసం చేశాయి. ఇది పోర్చుగీసు వైపు నుంచి జరిగిన మొదటిదాడిగా ప్రసిద్ధమైంది. దీనితోనే అబ్బక్క అప్రమత్తమైంది. తరువాత పరిణామమే 1555 నాటిది.1525 నుంచి యుద్ధవాతావరణం ఉన్నప్పటికీ 1555లో అబ్బక్కకు, పోర్చుగీసు వలస పాలకులకు నడుమ ముఖాముఖీ ఘర్షణ ఆరంభమైందని అనుకోవచ్చు. 1555లోనే అడ్మిరల్‌ ‌డాన్‌ అల్వారో డా సిల్వేరియాను ఉల్లాల్‌ ‌రాణి అబ్బక్క వద్దకు రాయబారం పంపారు. చెల్లించవలసిన కప్పం చెల్లించాలన్న ఆదేశాన్ని పట్టుకుని సిల్వేరియా అబ్బక్క వద్దకు వచ్చాడు. ఆమె నిరాకరించింది. ఇలాంటి సమయంలో అబ్బక్క భర్త పోర్చుగీస్‌ ‌వలసదారులకు దగ్గరయ్యాడు. నిజానికి అతడు పాలిస్తున్న సంస్థానాన్ని అలా ఉంచి, అదనంగా భూమి ఇస్తామని పోర్చుగీస్‌ ఆశ పెట్టింది. రాయబారం విఫలమైన తరువాత 1555లో పోర్చుగీసువారు అడ్మిరల్‌ ‌డాన్‌ అల్వారోడా సిల్విరాను యుద్దానికి కూడా పంపారు. ఈ యుద్ధంలో అబ్బక్కదే పైచేయి అయ్యింది. 1557లో పోర్చుగీసు సేనలు మంగళూరు నౌకాశ్రయాన్ని దోచుకున్నాయి. మరుసటి సంవత్సరం మంగళూరు మీద ఆ సేనలు దాడికి దిగాయి. మూడోదిగా చెప్పే ఈ యుద్ధంలో పోర్చుగీసు క్రూరత్వం బయటపడింది. పురుషులతో పాటు మహిళలు, చిన్నారులను కూడా హింసించారు. ఆలయాలను కూడా దోచుకుని అంతిమంగా పట్టణానికి నిప్పు పెట్టారు. 1567లో మరొకసారి పోర్చుగీసు దాడి చేసింది. ఇది నాలుగోదాడి. ఈసారి ఉల్లాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే అబ్బక్క నిరోధించగలిగింది. ఐదోదాడి 1568లో జరిగింది. పోర్చుగీస్‌ ‌వైస్రాయ్‌ ఆం‌టోనియో నోరోన్‌హా సేనలను పంపాడు. ఈ దాడిలో పోర్చుగీస్‌ ‌సేనలు ఉల్లాల్‌ ‌పట్టణాన్ని, రాజ ప్రాసాదాన్ని కూడా స్వాధీనం చేసుకోగలిగాయి. అప్పుడే ఆమె ఒక మసీదులో తలదాచుకుంది. ఆ రాత్రే అబ్బక్క సైనికులు 200 మంది పోర్చుగీసు సేనలను ఎదుర్కొన్నాయి. జనరల్‌ ‌పీక్సోటో అనేవాడిని అబ్బక్క సేనలు చంపాయి. 70 మంది పోర్చుగీసు సైనికులను బందీలుగా పట్టుకున్నారు. దీనితో ఈ సేనలు పారిపోయాయి. అడ్మిరల్‌ ‌మాషెర్నస్‌ అనే అధికారిని చంపి అబ్బక్క సేనలు మంగళూరు నౌకాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. 1569లో ఆరో దాడి జరిగింది. పోర్చుగీసు సేనలు మంగళూరును మళ్లీ కబళించాయి. ఉల్లాల్‌ ‌మీద మళ్లీ దాడికి దిగాయి. ఇందుకు సాయపడినవాడు అబ్బక్క మాజీ భర్త బంగారాజా. 1570లోనే అబ్బక్క బిజాపూర్‌ ‌సుల్తాన్‌తో కాలికట్‌ ‌రాజు జామెరిన్‌తో కలసి కూటమి ఏర్పాటు చేసింది.

 జమరిన్‌ ‌సైన్యాధ్యక్షుడు కుట్టి పోకర్‌ ‌మార్కర్‌ అబ్బక్క తరుపున పోరాడి పోర్చుగీస్‌ అధీనంలో ఉన్న మంగళూరు నౌకాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. కాని, మాటు వేసి పోర్చుగీసు సైన్యం మోసంతో మార్కర్‌ను చంపేశారు. ఈలోగా అబ్బక్క మాజీ భర్త రహస్యంగా సైన్యంతో వెళ్ళి అబ్బక్కను బంధించారు. ఈమె బందీగా జైలులో 1570లో మరణించారు.

నేటికి యక్షగాన, భూత కోల వంటి ప్రదర్శక కళలు అబ్బక్క వీర చరిత్రను కీర్తిస్తున్నాయి. ‘‘వీర రాణి అబ్బక్క ఉత్సవం’’ ఆమె జ్ఞాపకార్ధం జరిగే వార్షిక వేడుక. ఈ సందర్భంగా విశిష్ట మహిళలకు వీరరాణి అబ్బక్క పశస్తి (అవార్డు) ప్రధానం చేస్తారు. జనవరి 15, 2003 భారత తపాలా శాఖ వారు అబ్బక్కపై ప్రత్యేక కవర్‌ను జారీ చేసింది. ఉల్లాల్‌లో, బెంగళూర్‌లో ఆమె కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. మాతృ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన ధీరవనిత రాణి అబ్బక్క. పోర్చుగీసు చరిత్రలోనే ఓ మరచిపోని ఘట్టం. భారతదేశం ఉన్నన్ని రోజులు ఈ భారతీయులందరికి ఆమె ధీరత్వం గుర్తుండాలని 2015లో నౌకాదళంలోని ఒక నౌకకి రాణి అబ్బక్క పేరు పెట్టి రుణం తీర్చుకుంది.

  • Sources:
    1) “Queen Abbakka: The warrior, Queen who defeated the Portugese.
    2) Dr. Kailash Kumar Misra
    3) Times of the warrior Queen Rani Abbakka Sirish Shetty.

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE