భారత్‌లో అత్యంత ప్రముఖ స్మారక నిర్మాణాల్లో ఒకటైన తాజ్‌మహల్ చాలా కాలంగా ప్రేమకు, భవన నిర్మాణ శాస్త్రంలో ఒక అద్భుతానికి తార్కాణంగా నిలుస్తూ వస్తోంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో తాజ్‌మహల్ యాజమాన్యంపై తీవ్రమైన చర్చ జరిగింది. అది న్యాయవివాదాలు, రాజకీయ వివాదాలు, మతపరమైన దావాకు దారి తీసింది. ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు తాజ్‌మహల్‌పై యజమాన్యం తమదే అంటూ నమ్మబలకడంతో వ్యవహారం ముదిరి పాకాన పడిరది. ఆ స్మారక కట్టడం భారత ప్రభుత్వం అధీనంలో ఉండిపోవాలా లేకుంటే దానిని వక్ఫ్ ఆస్తిగా గుర్తించాలా అనే న్యాయపోరాటానికి నాంది పలికింది.
1998లో ఫిరోజాబాద్‌కు చెందిన ఇర్ఫాన్ బెదర్ అనే వ్యాపారవేత్త తాజ్‌మహల్‌ను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డును ఆశ్రయించడంతో స్మారక కట్టడంపై వివాదం పురుడు పోసుకుంది. ఇర్ఫాన్ తాజ్‌మహల్‌కు చారిత్రకమైన, మతపరమైన ప్రాముఖ్యత ఉంది కాబట్టి దాని నిర్వ హణ బాధ్యతలను వక్ఫ్ బోర్డు తీసుకోవాలని వాదిం చాడు. దీంతో వక్ఫ్ బోర్డు తాజ్‌మహల్‌ను నిర్వహి స్తున్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ భారత పురావస్తు సంబం ధిత సర్వే సంస్థ – ఏఎస్‌ఐకు నోటీసు జారీ చేసింది.
వివాదం ముదిరి సుప్రీంకోర్టుకు..
ఇర్ఫాన్ 2004లో ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. తన వాదనకు న్యాయ పరమైన మద్దతు కావాలని కోరాడు. తాజ్‌మహల్‌కు సంరక్షకుడిగా తనను గుర్తించాలని హైకోర్టును వేడుకున్నాడు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ హైకోర్టు వక్ఫ్ బోర్డుకు సూచించింది. దీంతో 2005లో వక్ఫ్ బోర్డు తాజ్‌మహల్‌ను వక్ఫ్ ఆస్తిగా రిజిస్టర్ చేసింది. అయితే ఏఎస్‌ఐ ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సర్వోన్నత న్యాయస్థానం కేసుపై విచారణ చేపట్టింది. తాజ్‌మహల్ వక్ఫ్ ఆస్తి అని అనడానికి తగిన ఆధారం చూపించాలని, మొగలాయి చక్రవర్తి షాజహాన్ తాజ్‌మహల్‌ను వక్ఫ్ ఆస్తి అని ధ్రువీకరిస్తూ స్వయంగా ఇచ్చిన దస్తావేజును కోర్టు ముందు ఉంచాలని వక్ఫ్ బోర్డును ఆదేశించింది. సుప్రీంకోర్టు 2010లో తాజ్‌మహల్‌ను వక్ఫ్ ఆస్తిగా రిజిస్టర్ చేస్తూ వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై స్టే విధించడంతో పాటుగా యాజమాన్య హక్కుపై దర్యాప్తునకు ఆదేశించడంతో కేసు ఒక తిరుగులేని మలుపు తీసుకుంది.
రాజకీయ రణగొణ ధ్వని
తాజ్‌మహల్ ఎవరిదనే అంశంపై ఓ వైపు న్యాయ పోరాటం జరుగుతూ ఉండగానే మరోవైపు వ్యవహారానికి మరింత పీటముడి వేస్తున్నట్టుగా రాజకీయ ప్రముఖులు బరిలోకి దిగారు. 2014లో సమాజ్‌వాది పార్టీ నేత, అప్పటి ఉత్తరప్రదేశ్ పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి అజామ్‌ఖాన్ తాజ్‌మహల్‌ను అధికారికంగా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన అదే స్మారక కట్టడంలో షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులు ఉన్న కారణంగా అది కచ్చితంగా వక్ఫ్ బోర్డు పరిధిలోకే వస్తుందని వాదించారు. అజామ్‌ఖాన్ వాదన ఒక పెను వివా దానికి ఆజ్యం పోసింది. విమర్శకులు ఆయన వాదనను ప్రశ్నించారు. జాతీయ వారసత్వ కట్టడమైన తాజ్‌మహల్ మతపరమైన సంస్థ అధీనంలో ఉండ రాదని వాదించారు. షియా నేతలు సైతం చర్చకు రావడంతో వివాదం మరో మలుపు తీసుకుంది. షియా నేతలు ముంతాజ్‌మహల్ షియా ముస్లిం అని, తాజ్‌మహల్‌కు షియా సంప్రదాయాలతో విలక్షణమైన సంబంధం ఉందని అన్నారు. వారు మరింత విడమరచి చెబుతున్నట్టుగా ‘‘ముంతాజ్ ఓ షియా. ఆమె అసలుపేరు అర్జుమన్ బానో. తాజ్ మహల్ నిర్మాణమే ఆ స్మారక కట్టడానికి షియాతో సంబంధం ఉంది అనేందుకు నిలువెత్తు నిదర్శనం’’ అని అన్నారు.
తాజ్‌మహల్ వక్ఫ్ ఆస్తి అంటే ఒప్పుకునేదెవరు?
ఏప్రిల్, 2018న సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు వాదిస్తున్న దానికి దస్తావేజు ఆధారం ఏదంటూ ప్రశ్నించడంతో కేసు ఒక కీలకమైన దశకు చేరుకుంది. కోర్టు షాజహాన్ తాజ్‌మహల్‌పై యాజమాన్య హక్కును వక్ఫ్ వ్యవస్థకు బదలాయిస్తూ సంతకం చేసిన అసలు దస్తావేజులను సమర్పించా లని వక్ఫ్ బోర్డును ఆదేశించింది. వాదోపవాదాల సందర్భంగా అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఒక కీలకమైన వ్యాఖ్యానం చేస్తున్నట్టుగా ‘‘భారత్‌లో ఎవరైనా తాజ్‌మహల్ వక్ఫ్ బోర్డుకు చెందినది అంటే ఒప్పుకుంటారా? (వక్ఫ్ బోర్డును ఉద్దేశించి) దానిని మీకు ఎప్పుడు ఇచ్చారు? అది 250 సంవత్సరాలకు పైగా ఈస్టిండియా కంపెనీ అధీనంలో ఉంది. ఆ తర్వాత అది కేంద్ర ప్రభుత్వ పరమైంది. దానిని నిర్వహిస్తున్న ఏఎస్‌ఐకే దాని బాగోగులు చూసుకునే హక్కు ఉంది’’ అని అన్నారు.
వక్ఫ్ బోర్డు న్యాయవాదుల బృందం తమ వాదనలను గట్టిగానే వినిపించినప్పటికీ సుప్రీంకోర్టు నిస్సంశయమైన రుజువు లేకుండా తాజ్‌మహల్‌ను వక్ఫ్ ఆస్తిగా వర్గీకరించలేమని స్పష్టం చేసింది. అయితే వక్ఫ్ బోర్డు తరఫు సీనియర్ అడ్వకేటు వీవీ గిరి తాజ్ మహల్‌లో ఇద్దరు ముస్లిం ప్రముఖుల సమాధులు ఉన్నాయి కాబట్టి ఆ కట్టడాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించవచ్చని వాదించారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు తాను చేసిన స్పష్టీకరణకే కట్టుబడిరది. మతపరమైన ప్రాముఖ్యత న్యాయబద్ధమైన యాజమానత్వాన్ని కట్టబెట్టలేదని తేల్చి చెప్పింది.
తోక ముడిచిన వక్ఫ్ బోర్డు
2018 సంవత్సరంలో అర్ధభాగం గడిచిపోయే సరికి వక్ఫ్ బోర్డు దస్తావేజులు లేకుండా కోర్టులో చేస్తున్న వాదనకు నిలువ నీడ ఉండదని తేలిపోయింది. బోర్డు తాజ్‌మహల్‌ను వక్ఫ్ ఆస్తి అని పేర్కొంటూ అధికారి కంగా రిజిస్టర్ చేయడానికి వీలుకాదనే సత్యాన్ని అంగీకరించింది. అదే సమయంలో బోర్డు తరఫు న్యాయవాదులు వాదిస్తూ తాజ్‌మహల్‌కు యజమాని ఎవరనేది తేలలేదు కాబట్టి ఆ స్మారక కట్టడం ‘అల్లాకు చెందుతుంది’ కనుక వ్యావహారిక కార్యాల కోసమని దానిని వక్ఫ్ బోర్డు నిర్వహించడం సబబుగా ఉంటుం దని అన్నారు. వారు తమ వాదనను కొనసాగిస్తున్న ట్టుగా ‘‘తాజ్‌మహల్‌ను వక్ఫ్ ఆస్తిగా చూపడానికి మా దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. కానీ మతాచారం ప్రకారం చూసుకుంటే అది వక్ఫ్ ఆస్తి అవుతుంది. సన్నీ వక్ఫ్‌బోర్డు తాజ్‌మహల్‌ను నిర్వహించడానికి అర్హమైంది’’ అని తెలిపారు. దీన్నిబట్టి వక్ఫ్‌బోర్డుకు తాజ్ మహల్‌పై యావత్ యాజమాన్యపు హక్కును పొంద డానికన్నా కూడా దానిపై నిర్వహణపరమైన నియంత్రణ పొందడం పట్ల మరింత ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోంది.
ఏఎస్‌ఐ ఈ రకమైన వాదనలు జరుగుతున్నప్పటికీ తాజ్‌మహల్‌పై వక్ఫ్ బోర్డు పెత్తనాన్ని గట్టిగా వ్యతిరేకిం చింది. అలా చేసిన పక్షంలో అది ఒక దృష్టాంతంగా నిలిచి ఎర్రకోట, ఫతేపూర్ సిక్రి లాంటి జాతీయ స్మారక కట్టడాలు మావంటే మావి అంటూ వాటిపై పెత్తనం కోసం అనేక మంది ముందుకు రావడానికి దారి తీస్తుందని హెచ్చరించింది.
సుప్రీంకోర్టు ఎట్టకేలకు సరైన ఆధారాలు లేని కారణంగా తాజ్‌మహల్‌ను తమకు అప్పగించా లంటూ వక్ఫ్ బోర్డు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తాజ్‌మహల్ లాంటి వారసత్వ నిర్మాణాలు యావత్ జాతికి చెందుతాయని, ఏ ఒక్క మతానికి ఆస్తులు కావని స్పష్టం చేసింది. ఇటీవల కేంద్రంలో మోదీ సర్కారు వక్ఫ్ యాక్ట్‌కు చేసిన సవరణ, దానికి పార్లమెంట్ ఆమోదం లభించడంతో ఇకపై వక్ఫ్‌బోర్డులు తాజ్‌మహల్ కేసులో లాగా వ్యవహ రించవని ఆశిద్దాం.
ఆక్రమణల చెరలో వక్ఫ్ ఆస్తులు
ముస్లింల ఏలుబడిలోని వక్ఫ్ బోర్డుల చేతకానితనం కారణంగా దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తులు ఆక్రమణదారుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. భారత వక్ఫ్ ఆస్తుల నిర్వహణ వ్యవస్థ (డబ్ల్యూఏఎంఎస్‌ఐ-వంశీ) పోర్టల్‌లో ఆక్రమణలకు సంబంధించిన 58,890 దృష్టాంతాలు నమోదు అయ్యాయి.
అందులో కొన్ని దృష్టాంతాలను దిగువన చూడవచ్చు.
– భోపాల్‌లో ఒక వక్ఫ్ కాంప్లెక్స్‌ను ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారు. ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకోవడంతో మొత్తం రిజిస్టరైన 125 శ్మశానవాటికల్లో 101 శ్మశానవాటికలు అదృశ్యమైపోయాయి. దీనికి తోడు సరాయి సికిందరిలో 24,450 చదరపు అడుగుల మేర ఉన్న వక్ఫ్ ఆస్తిలో 1,800 చదరపు అడుగుల భూమిని స్థానిక రాజకీయ నాయకుడు ఆక్రమించుకున్నాడు.
– హైదరాబాద్‌లో ఒక్క 2021లోనే ఆక్రమణదారులకు 765 నోటీసులు జారీ అయ్యాయి. రూ.5 లక్షల కోట్ల విలువైన ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక వక్ఫ్ బోర్డుల్లో ఒకటిగా వాసికెక్కిన తెలంగాణ వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తుల్లో 75 శాతం ఆక్రమదారుల చెరలో ఉన్నాయి. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఒకానొక సందర్భంలో ఇదే విషయమై మాట్లాడుతూ హైదరాబాద్‌లోని వక్ఫ్ భూముల్లో 82 శాతాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించు కున్నారని తెలిపారు.
– ముంబైలో 60 శాతానికిపైగా వక్ఫ్ భూములు ఆక్రమణకు గుర య్యాయి. పరేల్‌లో లాల్ షా బాబా దర్గా అయితే వాస్తవానికి 72 ఎకరాలకు విస్తరించి ఉండాలి. కానీ ప్రస్తుతం దర్గా చుట్టూ ఆకాశాన్ని తాకుతున్న రెసిడెన్షియల్ టవర్లు కమ్ముకున్నాయి.
– ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న దాన్ని బట్టి లక్నోలో వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో 78 శాతం ప్రభుత్వ ఆస్తులు. వాటికి చట్టబద్ధమైన వక్ఫ్ హక్కులు లేవు. అదే రాష్ట్రంలో 1989 నాటి ప్రభుత్వ ఉత్తర్వు సాగులో లేని భూమి అక్రమంగా వక్ఫ్ ఆస్తిగా రిజిస్టర్ కావడాన్ని రద్దు చేసింది.
– బిహార్ సున్నీ వక్ఫ్ బోర్డు హిందువులు అత్యధికంగా నివసించే ఫతూహా బ్లాకులోని గోవింద్‌పూర్ గ్రామంలో భూమిపై యాజమాన్యహక్కు తనదిగా పేర్కొంటూ నోటీసు జారీ చేసింది. దీంతో ఏడు హిందూ కుటుంబాలు వీధినపడ్డాయి.
– సెప్టెంబరు, 2024న కేరళలోని ఎర్నాకుళంలో మరీ ముఖ్యంగా చెరాయి, మునాంబమ్ ప్రాంతాలకు చెందిన 600 క్రైస్తవ కుటుంబాలు తమ భూమిని వక్ఫ్ బోర్డు తన భూమిగా ప్రకటించడాన్ని వ్యతిరేకించాయి. క్రైస్తవ కుటుంబాలు ఆ భూమి తరతరాలుగా తమ అధీనంలో ఉందని వాదించాయి.
ప్రభుత్వ డేటా ప్రకారం దేశంలో 23 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వాటిలోనే బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు షియా, సున్నీ తెగలకు వేర్వేరు వక్ఫ్ బోర్డులను కలిగి ఉన్నాయి.
వంశీ పోర్టల్ ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37.39 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 8.72 లక్షల వక్ఫ్ ఆస్తులు రిజిస్టరై ఉన్నాయి. వక్ఫ్ ట్రిబ్యూనళ్లు, వక్ఫ్ బోర్డుల ఎదుట ఆక్రమణలు, అవ్యవస్థకు సంబంధించి 31,999 లిటిగేషన్ కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిలో దాదాపు 9,000 కేసుల్లో ముస్లిం కక్షిదారులు ఉన్నారు. ఇది వక్ఫ్ ఆస్తుల అపసవ్య నిర్వహణ బాధితుల్లో ముస్లింలు కూడా ఉన్నారనే విషయాన్ని ఎత్తి చూపుతోంది. ఆక్రమణలకు సంబంధించిన 16,140 కేసుల్లో దాదాపు 3,165 కేసులు ముస్లింలు ఆక్రమించినవాటికి సంబంధించినవే కావడం గమనార్హం.