సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఛైత్ర బహుళ పాడ్యమి-14 ఏప్రిల్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
భారత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ఇంతగా విషం చిమ్ముతున్న రాజకీయ నాయకుడిని భారతదేశం చూడడం ఇదే మొదటిసారి. ‘నీవు అగ్రకులంలో పుట్టకపోతే, ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరుడివే!’ ఇదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పట్నాలో ఏప్రిల్ 7న పాల్గొన్న ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్య. పైగా ఈ మాటలు అనడానికి ముందు ఈ అంశం గురించి ఆయన పడ చదివేశారట. ఆయన మాట్లాడినది ‘రాజ్యాంగ పరిరక్షణ సమావేశం’. శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది కాబట్టి ఇప్పుడు విషం చిమ్మే పనికి బిహార్‌ను ఎంచుకున్నారు విపక్షనేత. అగ్రకులానికీ, కింది కులాలకీ వైరాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న ఈ ఘనడు గాంధీ`నెహ్రూ వారసుడు.
మొదట ఆ ఉపన్యాసం సారాంశం ఏమిటో చూడాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలుతూ ఆ ఉపన్యాసం ఆరంభమైంది. ఎన్‌డీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగానే దేశంలో ఓబీసీలు, ఈబీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ద్వితీయ శ్రేణి పౌరులై పోయారని సర్వోత్తమ సామాజిక శాస్త్రవేత్త అనదగిన రాహుల్ గాంధీ తేల్చి పారేశాడు. తన మాటను మన్నించి తెలంగాణ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్‌ల కోసం తీసుకున్న నిర్ణయం దేశానికి మార్గదర్శకంగా ఉందని కూడా ఆయన కితాబిచ్చారు. సామాజిక న్యాయం దిశగా దేశంలోనే ఇదొక ముందడుగుగా భావించి తీరక తప్పదని కూడా చెప్పారాయన. అలాగే బిహార్‌లో కూడా చేస్తే ఆలస్యం లేకుండా అందరికీ న్యాయం జరిగిపోతుందని వాక్రుచ్చారు.
ఈ విషయం గురించి ఇంతకు మించి మాట్లాడే స్తోమత కాంగ్రెస్ నేతకి కరవైంది కాబోలు. వెంటనే ఆర్‌ఎస్‌ఎస్ మీద, భారత స్వాతంత్య్రోద్యమ సమరంలో అనితర సాధ్యుడు వినాయక్ దామోదర్ సావర్కర్ మీద విమర్శలు లంఘించుకున్నారు. సత్యాన్నే ప్రవచించిన శతాబ్దాల నాటి సిద్ధాంతాల ప్రాతిపదికగానే భారత రాజ్యాంగం నిర్మితమైందని రాహుల్ చెప్పారు. రాజ్యాంగం జవాహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వంటి మహనీయుల ఆలోచనల మేరకే రూపుదిద్దుకుందని, అన్నట్టు వీరు కూడా సత్యాన్నే నమ్మారని రాహుల్ బిహార్ ప్రజలకి గుర్తు చేశారు. చెప్పాలంటే సత్యాన్ని నమ్మిన వారి జాబితా చాలా పెద్దదని, అందులో అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, సావిత్రీ భాయి ఫూలే, బుద్ధభగవానుడు, గురు నానక్‌దేవ్, బసవన్న, నారాయణ గురు, కబీర్ వంటివారి పేర్లు కూడా ఇందులో చేర్చవలసిందేనని సెలవిచ్చారు. నీవు రాజ్యాంగాన్ని ఎప్పుడైతే చేతులలోకి తీసుకున్నావో అప్పుడు వేలాది సంవత్సరాల సిద్ధాంతాన్ని రక్షించవలసి ఉంటుందని చెప్పారాయన. హిందుస్తాన్‌లో జనించిన వేల ఏళ్ల నాటి సత్యాన్ని రక్షించేది రాజ్యాంగమని, రాజ్యాంగం మన నేతలకు నేర్పినది కూడా అదేనని చెప్పుకొచ్చారు. రాజ్యాంగం గౌరవించడంతో పాటు, రాజ్యాంగాన్ని రక్షించేందుకు బిహార్ ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిహార్ గొప్పతనం మీకు తెలియడం లేదు అంటూ అన్యాయానికి వ్యతిరేకంగా సుస్థిర చర్యలు తీసుకున్న రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఇదేనని అన్నారు. గాంధీజీ చంపారన్ సత్యాగ్రహం చేసిన గడ్డ ఇదేనని చరిత్ర మాస్టారి అవతారం కూడా ఎత్తారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవం వచ్చింది కూడా ఇక్కడేనని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాల మీద, వివక్ష మీద, ఆర్థిక సామాజిక న్యాయాలకు ప్రతికూలంగా జరుగుతున్న పోరాటలాల కోసం ముందుకు వచ్చి రాజ్యాంగాన్ని రక్షించాలని అన్నారు.
ఆయన పార్టీని రక్షించలేరు. రక్షించాలన్న తపన ఉన్నవాళ్లని ఆమడ దూరం తరిమేస్తారు. పార్టీ ఎన్నికలలో పోరాడుతూ ఉంటే ఆయన విదేశాలకు వెళ్లి కూర్చుంటారు. అవి పార్లమెంట్ సమావేశాలయినా ఎవరినో చూసి కన్ను కొడతారు. పార్లమెంట్ సమావేశాలు ఆరంభమైన ప్రతిసారి ఒక సమస్యను లేవనెత్తి వాటిని స్తంభింప చేస్తూ ఉంటారు. అక్కడే సొంతింట్లో చిన్నారి చెల్లెలని బుగ్గ గిల్లినట్టు ప్రియాంక వాద్రాని గిల్లుతారు.ఆ నిండు సభలో కూడా రాజ్యాంగం ప్రతి అంటూ ఒక పుస్తకాన్ని ఎత్తి పట్టుకుని ఎవరో రాసిచ్చిన ముక్కలు కష్టపడి అప్పగిస్తారు. ఆఖరికి ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టడానికి, ఒకవేళ ఇక్కడ ఉంటే అథ:పాతాళానికి తొక్కేస్తుందని వక్ఫ్ సవరణ చట్టం గురించి ఏళ్ల తరబడి ఉపన్యాసాలు దంచి, ఆ వర్గాన్ని రెచ్చగొట్టి తీరా పార్లమెంటులో దాని పతాక సన్నివేశం వేళ పలాయనం చిత్తగిస్తారు. ఇలాంటి నేతను చూసి ముస్లింలు కూడా ఛీత్కరిస్తుంటే, ఇప్పుడు ద్వితీయశ్రేణి పౌరుల బాణీని అందుకున్నారు రాహుల్. ఎక్స్‌రే విధానం ద్వారా జన గణన చేస్తే అది శాస్త్రీయం అవుతుందని తాను ముందు నుంచీ మొత్తుకుంటూనే ఉన్నానని రోదించారు పాపం. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదట. తన పార్టీలోనే తనకు విలువ లేదు. ఉందో లేదో తెలియని ఇండీ కూటమి సభ్యులకు ఈయనంటే కొంచెం అటు ఇటుగా గడ్డిపోచతో సమానం. కాబట్టి దేశంలో మిగిలిన పార్టీలు ఈయన మాటనీ, అభిప్రాయాలనీ గౌరవించాలని అనుకోవడం ఒట్టి మూర్ఖత్వం. ప్రజలు తన మాటను నమ్మేసి వెంటనే ఎన్‌డీఏ కూటమిని తరిమి కొట్టేస్తారని ఆయన అనుకుంటే అనుకోవచ్చు. అదీ ఒక భ్రమే.
కాంగ్రెస్ వారసత్వాన్నీ, కమ్యూనిస్టు భాషనీ మేళవిస్తూ ఈ మధ్య రాహుల్ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మైనారిటీ, మధ్య తరగతి, మహిళ, బడుగు, బలహీనవర్గ, శ్రామికవర్గ, సెక్యులర్, ఉదారవాద, కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన వేదికను ఒక దానిని తయారు చేయాలని ఉబలాట పడుతున్నారు. అందులో భాగమే ఈ ద్వితీయ శ్రేణి నినాదం.