నెమ్మదిగా నవ్వింది మైనం గోరువంకలా!జయప్రద ముఖం తడిసిన కాగితం పువ్వుల్లే అయింది. సంధ్యాకాంతి- నిశాదేవికి చంద్రుని సరళతను బోధిస్తోంది.
– ఈ తరహా వర్ణనల రచయిత్రి ఇరంగంటి వెంకట శేష అచ్యుతవల్లి.
ఎవరీమె అనుకొంటున్నారా? ఐవీఎస్ అచ్యుతవల్లి. భావుకతకు మారుపేరు. నాడు అందరికీ సుపరిచిత సాహితీవేత్త. అంతే స్థాయిలో లలిత గీతాల గాయని. ఇప్పుడు ఆమె ఉండి ఉంటే, ఇంకా ఎన్నెన్నో కథా రచనలు వెలువడి ఉండేవి. స్త్రీల మనస్తత్వ ఆవిష్కరణ మరింత విస్తృతంగా జరిగి ఉండేది. తొలి కథ ‘వంచిత’. ప్రచురిత పత్రిక ‘జగతి’. ఇప్పటి మాట కాదిది. అరవై ఆరేళ్ల నాటిది. కాలక్రమంలో… తెలుగు విశ్వవిద్యాలయం నుంచి రెండుసార్లు విశిష్ట పురస్కృతిని అందుకున్న ఘనత తనదే! తన పుట్టిన రోజు మే ఒకటిన.
అచ్యుతవల్లి ఎంత సంప్రదాయవాదో అంత ఆధునికురాలు. ఆమె రచనల సంభాషణలే ఇందుకు ఉదాహరణలు. ‘తెల్లగా పొడుగ్గా ఉన్న మెడలో ఒంటి వరస ముత్యాల హారం! ఒక చేతికి మూడేసి వరసల తెల్లరాళ్లు పొదిగిన బ్రేసలెట్, రెండో చేతికి ఆరు బంగారు డైమండ్ కటింగ్ గాజులు, లేత ఆకుపచ్చ సాటిన్ సాల్వార్.’
‘ఆమె గ్రేస్‌ఫుల్ వాకింగ్‌కి అబ్బురపడ్డాడు యువకుడు!’ ‘థాంక్సండీ… మీరు నా కస్టోడియన్ అయినందుకూ!’ ఇలా.
వందల సంఖ్యలో కథలు రాసిన ఆమె స్వస్థలం గోదావరి ప్రాంతంలోని దొంతవరం. సంస్కృతం, హిందీల్లోను ఉన్నత చదువులు చదివారు. భర్త ఉద్యోగ కారణంగా కొంతకాలం కర్ణాటక ప్రాంతాల్లో ఉన్నారు. ఈ తరం అమ్మాయి, ఉద్యోగస్తుడి భార్య, అమ్మంటే అమ్మ, తల్లి మనసు, సులక్షణ – ఇవన్నీ ఆమె కథల్లో కొన్ని. వెయిట్ ఫర్ ది టైం, బెటర్ హాఫ్, బాత్ ఏక్ రాత్‌కీ – ఇవీ అచ్యుతవల్లి కథలే! ‘జుఆ’ అనేది మరో విలక్షణ శీర్షిక గల కథ.
అబ్ తేరీ, ఆజ్ ఔర్ కల్, ఇజ్జత్; అలాగే షోడశ, సిద్ధి, దీపకరాగం, స్వయంబద్ధ కూడా తన రచనలే! ఈ శీర్షికల్లోని వైవిధ్యమే ఆమె భావవ్యక్తీకరణ వైభవాన్ని చాటి చెప్తోంది.
‘ఇంతటి విభిన్నత మీకెలా సాధ్యమైందీ’ అని ఒక సభలో అడిగితే- ‘రాస్తున్నకొద్దీ సాధ్యపడింది’ అంటూ వెంటనే బదులిచ్చారామె.
రసావిష్కరణ విధానంలోనూ అదే ప్రత్యేకత. ఉదాహరణకు ఓ కథానికలో: ‘ధ్యాస అంతా ఉల్లి ముక్కల మీదే ఉంది. అవి తన నోట్లో ఉన్నట్లూ, తను చప్పరిస్తూ, లొట్టలు వేస్తూ వాటి రసాన్ని పీలుస్తున్నట్లూ, కొంచెం కారం కూడా తన నాలిక్కి తగిలినట్లూ ఊహిస్తోంది.’ అని అభివర్ణన. ‘ఉల్లిముక్కల గురించి ఇదేం వర్ణనా’ అనుకోవచ్చు చదువరి ఎవరైనా? అసలు విషయం తెలియాలంటే నేపథ్యంలోకి వెళ్లి తీరాల్సిందే! అది ఇదీ:
‘ఆ సమయానికి సుభద్ర బంగాళా దుంపలు, నీరుల్లిపాయలు వేయిస్తోంది. ఆండాళుకి నోరూరిపోతూంది. ఎర్రగా వేగిన బంగాళా దుంప ముక్కల కోసం కాదు! స్టీలు మూకుడులో తళతళా మెరుస్తున్న ఆ ఉల్లి ముక్కల కోసం…!’
ఎందుకూ అంత నోరూరిందీ… అంటే ఆ కథను ఆసాంతం చదవాల్సిందే. ఇదే కదా – చదివించేలా రాయడమంటే!
గంభీరత గురించి చెప్పాలంటే – ‘ఆ వ్యధిత హృదయం అల్లకల్లోలమైంది. చెట్ల ఆకులు మంత్రం వేసిన వాట్లకు మల్లే ఎక్కడా కదలటం లేదు.’ ఇలా వాక్యాల్లో తనదైన రచనా నిపుణత.
మొట్టమొదటగా రాసింది వ్యాసాన్ని. ఆ తర్వాతే కథలూ నవలలూ. ‘పుట్టిల్లు’ నవల ప్రచురితం అయినపుడు అచ్యుతవల్లికి ఇరవై ఏళ్లు కూడా లేవు! మరో నలుగురైదుగురితో కలిసి ‘షణ్ముఖ ప్రియ’ అనే గొలుసు నవలనూ అప్పట్లోనే రాశారు.
శీర్షికలు నిర్వహించడంలోనూ దిట్ట. రాతలో, నిర్వహణలో పేరొందిన కారణంగానే ఆమె రచనలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తూ రాసిన నవల ‘ఇదెక్కడి న్యాయం’ తెలుగు సహా అనేక భాషల్లో చలనచిత్ర రూపం సంతరించుకుంది.
ఏ సాహితీవేత్తకైనా ముందుగా కావాల్సింది భావుకత. ఇది ఐవీఎస్‌లో పుష్కలం. ‘తమ తలదాల్చినది సువాసనలు వెదజల్లే సుకుమార సుందర పుష్పం అనుకుని మురిసిపోయింది. ఆ అందాల అరవిచ్చిన పూరేకుల నడుమ కణకణమండే నిప్పు రవ్వలున్నాయనీ, అవి ఎప్పుడో తన తలపైన పడి శరీరాన్నే భస్మం చేస్తాయనీ ఇప్పుడు తెలిసొచ్చింది’ అని రాయడం అంటే ఎంత భావోద్విగ్నత? ఉద్వేగ తీవ్రత కనిపిస్తుంది అంతటా.
సంస్కృత భాషలో అభినివేశం కొన్ని రచనల్లో స్ఫుటంగా కనబరిచారామె. కథ పేరు ‘మూగపోయిన ప్రకృతి’. ప్రారంభం శ్లోకంతో అవుతుంది. మధ్యలో ప్రాంతీయ యాస చోటు చేసుకుంటుంది. ముగింపులో ఎనలేని ఉత్కంఠగా అనిపిస్తుంది రచన అంతా.
విస్తృతి నిండిన రచన ఇది. జయదేవ అష్టపది ప్రస్తావన కథ మొదట్లో ఉంటుంది. స్ఫురదతి ముక్తలతా పరిరంభణ ముకుళిత పులకిత చూతే! బృందావన విపినే పరిసర పరిగత యమునా జలపూలే! దీని భావాన్ని, అర్థాన్ని సూక్ష్మరీతిన చెప్పిన తీరు పాఠకుల్ని అబ్బురపరుస్తుంది. భాషా సంపద నిండినట్లుంటుంది.
పాతికేళ్ల వయసు నిండుకుండానే ‘గృహలక్ష్మి’ స్వర్ణకంకణం ఆమెను వరించి వచ్చింది. దాదాపు అదే కాలక్రమంలో యద్దనపూడి సులోచనారాణికి అదే పురస్కృతి అందడం ఇక్కడ ప్రస్తావనార్హం.
అదే గృహలక్ష్మి పేరుతో మునుపు విఖ్యాత పత్రికా సంస్థ నిర్వహణ, దశాబ్దాల పర్యంతం సాగించిన సేవ ఆదర్శప్రాయం. ఉత్తమ కథారచయిత్రి పురస్కృతి 1977 ప్రాంతాల్లో అచ్యుతవల్లికి లభించింది. ఆ సందర్భంలో ఒక వ్యాసం వెలువరించిన ఆమె తన ప్రధాన కేంద్రీకరణ మనిషి మనస్తత్వం మీదనే అని వెల్లడించారు. నిజమే అనేకానేక రచనల్లో ఆ చిత్రీకరణ మన కళ్లముందు నిలుస్తుంటుంది.
‘నాగావళి నవ్వింది’ కథ వెలువడి ఇప్పటికి ఐదున్నర దశాబ్దాలు. నాటి వారపత్రికలో ముద్రితమైంది కూడా మే నెలలోనే!
‘నాగావళి కొత్తగా వస్తుంది. అక్కడక్కడ ఉన్న ఇసుక మేటల్ని చెరగుకుంటూ చిక్కగా కాఫీరంగులో ఉన్న నీళ్లతో అది నవ్వుకుంటూ నడుస్తూంది. కడుపు నిండిన కొండ చిలువలాగుంది.
నాగావళి నల్లబడింది. కుశాలపురం నుంచి ఆ వంతెన మీదుగా జ్యేష్ట మాసపు చివర మేఘాలు ప్రయాణించుతూ, నాగావళి బురద నీళ్లను తమ చివర్లకి పులుముకుంటున్నాయి.
నాగావళి ఒడ్డును ఒరుసుకుంటూ ప్రవహిస్తోంది. ఆ వేగాన్ని ఎవరు అరికట్టగలరు?
నాగావళి మటుకు తనలో తానే నవ్వుకుంటూనే ఉంటుంది. చీకట్లలో నల్లబడుతూనే ఉంది.’
– ఇలా కథ అంతటా సందర్భ అనుసారంగా.. నాగావళి గమనాన్ని విపులీకరించారు రచయిత్రి. ఆ రచనకు వేసిన చిత్రం సైతం నది రూపంలో ఉండటం, స్త్రీ రూపాన్ని ప్రతిఫలించడం మరింత విశేషం!
ఆమె నవలా సాహిత్యం మీద ఏకంగా సిద్ధాంత గ్రంథమే రూపుదిద్దుకుంది. అప్పట్లోనే బహుళ ప్రాచుర్యాన్ని సొంతం చేసుకుంది.
అచ్యుతవల్లిలోని పరిశీలనాసక్తి మరెన్నో సాహితీ పక్రియలకు మూల కారణంగా నిలిచింది. పరిణీత శీర్షికతో నాటక రచననీ చేశారామె. సాహిత్యం, సమాజ అనుబంధ బాంధవ్యం గురించి వ్యాసా లెన్నింటినో వెలయించారు. పగిలిన పలక, పగిలిన పలకలు – ఈ రెండు రచనలూ ఆమెవే! ముద్రితమైంది కొన్ని సంవత్సరాల వ్యవధిలో.
మోతీ అంటూ రెండే రెండు అక్షరాలు శీర్షికతో అచ్యుతవల్లి రాసిన కథ ఆనాడు ‘భారతి’లో వెలువడింది. మోతీ అంటే మంచి ముత్యం. సున్నితంగా అలా పిలుస్తూంటే, ఎక్కువ శ్రావ్యంగా వినవస్తుంది. ఆ మోతీ ముఖం ముద్దులు మూటగట్టినట్లు ఉండేది. పసితనపు పాలనురుగు వంటి మృదుత్వం.
‘తెల్ల కుందేలు పిల్లా, తెల్లపిల్లి పిల్లా- వీటన్నింటికంటే నేను జీవితాంతం మరవలేని రూపం నా చిన్నారి మోతీది!’ అంటారు ఒకచోట. ఇంతకీ ఆ మోతీ ఏమిటి, అది ఎవరి కథ అనేది రచన చివరివరకు తెలియదు మనకు! అంతటి రచనా చాతుర్యం ఆ కలంలో ప్రవహిస్తూ ఉండేది ఎప్పుడూ!
రచనలతోపాటు ఆమె లలిత గీతికలూ ఆనాడు తెలుగునాట సమాదరణ అందుకున్నాయి. ప్రశంసలకు పాత్రమయ్యాయి.
ఇప్పటికి ఒకటిన్నర దశాబ్దం కిందట ఆ కలం ఆగింది. గళమూ మూగవోయింది. అయినప్పటికీ ఇప్పటికీ పాఠకుల, శ్రోతల మనోమందిరాల్లో ఆమె జ్ఞాపకాలెన్నో పదిలంగా ఉన్నాయి.
అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన పోటీల్లో విజేత ఆమె. వివిధ స్థాయుల్లోని తన ప్రతిభా పాండిత్యాలను రచనల ద్వారా గుదిగుచ్చి, సాహితీ మాత మెడలో పూలహారంగా సమర్పించారు.
నీడబారిన మొక్క, పారిపోని చిలుక, కదలని చాట వంటి పదబంధ రచనలతో చదువరులందరి మదిలో ఆలోచనలు రేకెత్తించిన ప్రయోగశీలి. అచ్యుతవల్లి రచనల్లోని ‘నిర్మల’ పద అర్థం ఆమెకి సంపూర్తిగా వర్తిస్తుంది మరి. ప్రతిభాశాలికి సముదాత్త ఉదాహరణ ఆమే!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్