భారతదేశానికి హిందూదేశమని మరొక పేరు. సింధు నది నుంచి ఉద్భవించినదే ‘హిందు’ పదమని చెబుతారు. నది పేరే ఈ దేశం పేరుగా స్థిరపడింది. నదులకీ, భారతదేశానికీ ఉన్న బంధం ఎంత సమున్నతమైనదో, పురాతనమో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. భారత్‌ అం‌టేనే నదుల ఆవాసం. మనది నదీ తీరస్థ సంస్కృతి కూడా. నాలుగు వేదాలలో పురాతనమైన రుగ్వేదం ‘నదీస్తుతి సూక్తం’ (10.75.5-6) ప్రవచించింది.  ఆ స్తుతితో ఆర్యావర్త భౌగోళిక స్వరూపాన్ని నదులతో దర్శింపచేశారు రుషులు. ఓ గంగ! ఓ యమున! అర్జకియ, సుషోమి, పరుష్ణి; ఇంకా అసిక్ని, వితస్థ, మరుద్వతీ.. నా ప్రార్థన వినండి అంటూ సాగుతుంది ఈ సూక్తం. ఇంకా సింధు, యమున తదితర నదుల పేర్లు కూడా వేదాలలో, అష్టాదశ పురాణాలలో వినిపిస్తాయి. ఓ నదీమ తల్లుల్లారా! ప్రవాహంతో ఈ భూమిని తడపండి అని విన్నవిస్తాడు రుషి, ఆ సూక్తంలో. ఇంకా అనేక నదులను వాటి పురాతన నామాలతో స్మరిస్తాడు. గంగ, బ్రహ్మపుత్ర, సింధు హిమాలయాలలో పుడతాయి. గోదావరి, కృష్ణ  ద్వీపకల్ప నదులు. ఇవి బంగాళాఖాతంలో కలుస్తాయి. మన పురాణాలు ప్రస్తావించిన నదుల పేర్లే 102. ఇందులో సరస్వతి నది పేరు అత్యధికంగా, దాదాపు 42 సార్లు ప్రతిధ్వనిస్తుంది. గంగ పేరు ఎనిమిది పురాణాలలో వినిపిస్తుంది. గోదావరి, వంశధార, సరయు, అలకనంద, బాహుద, చంద్రభాగలను పురాణాలు ప్రస్తావించాయి.

‘గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్‌ ‌సన్నిధిం కురు’

గంగ లేదా భాగీరథి, జాహ్నవి అంటే మనందరికీ కేవలం ఓ జల ప్రవాహం కాదు, జీవనాధారం (ఆధునిక లెక్కల ప్రకారం గంగా పరీవాహక ప్రాంతం భారతదేశంలో నలభయ్‌ ‌శాతం). మరొక నది సరస్వతి. జ్ఞానదేవత పేరు. జీవనానికీ, జ్ఞానానికీ ఆధరువుల పేర్లతో మనం నదులను గౌరవించుకుంటున్నాం. గోదావరి, కావేరి, నర్మద, యమున అన్నీ మనకి పూజనీయ జలరాశులే. లక్షలాది సంవత్సరాల నుంచి కోట్లాది ప్రజలకు నదులే జీవనాధారం. కానీ ఈరోజు నది అంటే కాలుష్యానికి ఆలవాలంగా మారిపోయింది. నదులను నాశనం చేసుకునే వినాశకర తరాలు పుట్టుకొచ్చాయి. నదుల పట్ల మన పూర్వికులు నిర్మించిన దృక్పథం తిరిగి రావాలి. ఇది భ్రమ కాదు. అలాంటి దృక్పథమే వాటిని పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచిందన్నది కాలం రుజువు చేసిన సత్యం. ఒక నిత్య సత్యాన్ని ఔదలదాల్చ డానికి భేషజాలు అక్కర్లేదు.

దేశంలో ఆరు ముఖ్య నదుల పరీవాహక ప్రాంతాల క్షాళన కోసం అధ్యయనాలు నిర్వహిస్తామని ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎంత ప్రత్యేకమైన సమాచారమో, ఎంత నిర్మాణాత్మకమో వేరే చెప్పక్కరలేదు. ఎందుకు? కొన్ని దశాబ్దాలుగా దేశంలో నదులపై ఉన్న పవిత్రభావం నేల కోతకు గురైన చందంగా భావ కాలుష్యంలో కొట్టుకు పోయింది. క్షంతవ్యం కాని స్థాయిలో నదీమ తల్లులను మనం కలుషితం చేస్తున్నామన్న కఠోర వాస్తవాన్ని ఇకనైనా గుర్తించాలి. ఇటీవలి కాలంలో నదులను నాశనం చేసుకున్నాం. ఇది నిజం! కాకపోతే ఇన్ని లక్షల కోట్ల• వాటి రక్షణకు ఎందుకు వ్యయం చేస్తున్నాం? ఆధునిక భారతదేశంలో నదులకు పడుతున్న దుర్గతికి ఖామ్‌ ‌పెద్ద ఉదాహరణ. ఇది ఛత్రపతి శంభాజీనగర్‌ (ఇటీవలి వరకు ఔరంగాబాద్‌) ‌గుండా ప్రవహిస్తుంది. మెట్ల బావులు, నెహర్‌ ‌పేరుతో పిలిచే ఆక్వాడక్టస్‌తో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఆ నగర దాహార్తిని ఈ నదే తీర్చింది. దీనిని రక్షించుకోలేకపోయారు. అంతేకాదు, ఒకనాటి దీని వైభవాన్ని మరచి, మురికికాలువ గానే పరిగణిస్తున్నారు. లక్షల తరాలను ఆశీర్వదించిన నదులు ఇటీవలి తరాలను మాత్రం శపించకుండా ఉండగలవా?

దేశంలో నదీనదాలను మనం దేవతలుగా ఆరాధిస్తాం. అవి మనకి కనిపించే దైవాలు, ప్రాణదాతలు. నదికీ, మానవ మనుగడకీ ఉన్న బంధం ఈ దేశవాసులకి మరింత లోతుగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మనది వ్యావసాయక దేశం. మనమంతా కర్షకుల కుటుంబాల నుంచి వచ్చినవారమే. తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో వేసవి తరువాత తిరిగి కాలువలు తెరిచినప్పుడు, నీటిని పసుపు కుంకుమతో, పూలతో స్వాగతించడం చాలామందికి అనుభవమే. అలాగే నదులను వివిధ సందర్భాలలో పూజించడం సర్వసాధారణం.ఈ భావనను నిరాకరించే, ఆక్షేపించే విధ్వంసకారులు పెరుగుతున్నారు. కొన్ని నదులను అక్షరాలా కుళ్లు కాలువలను చేసేశారు. ఉదాహరణకు మూసీ. మూసీ మాత్రమే కాదు, కొన్ని పెద్ద నదులు, చాలా వరకు ఉపనదుల ఆరోగ్యం అథఃపాతాళంలో ఉంది. ఇన్ని లక్షల ఎకరాలకు పచ్చదనం పూసే నదులను రక్షించుకోవాలన్న కనీస స్పృహే జనించడం లేదు. ఈ తరాల బుర్రలు ఇంకెంత కుళ్లిపోయాయో కదా!

నాగరికత పెరగడం అంటే, నగరాలు పెరగడమన్న భ్రమ ఇటీవలి కాలపు వికారం. ఇలా ఎందుకు అనుకోవలసి వస్తున్నదంటే నగరాలు పెరిగిన కొద్దీ నాశనమవుతున్నవి నదులే. శరవేగంగా విస్తరిస్తున్న నగరాలతో మొదట బలౌతున్నది నదీనదాలే. సర్వేలు ఘోషిస్తున్న వాస్తవమిది. కొన్ని జనావాసాలు, కొద్దిమందికి జీవనోపాధి కల్పించే కర్మాగారాల మూలంగా లక్షలాది ఎకరాలకు నీరునిచ్చే, కోట్లాదిమందికి ఆహారం అందించే నదులు కలుషితమైనా పట్టించుకోనక్కరలేదన్న అసంబద్ధ, విధ్వంసకర దృష్టి చాలాకాలం రాజ్యమేలింది. మురుగు నీరు, వ్యర్థాలు, మలినాలు-ఏ పేరుతో పిలిచినా వీ•న్నిటి గమ్యం నదులే. ఇలాంటి ధోరణి సరికాదని ప్రజలు గుర్తించడం లేదు సరే, నదులు నాశనమైతే మానవాళి మనుగడ ఏమిటో గుర్తించవలసిన బాధ్యత కలిగిన పాలనాయంత్రాంగాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నదులను కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తించిన మొదటి ప్రధాని 2014లో వచ్చారు. ఆయన నరేంద్ర మోదీ. అప్పటి నుంచి నదుల ప్రక్షాళన అన్న ఆలోచన కార్యరూపం దాల్చింది. ఫలితంగానే, నదుల స్థితిగతుల మీద అధ్యయనం కోసం ప్రణాళికలు, ఒక కార్యాచరణ ముందుకు వచ్చాయి.

కేంద్రం ప్రకటించిన ఆ ఆరు నదుల ప్రక్షాళన కోసం జరిపే అధ్యయనంలో 12 ప్రముఖ సంస్థలు భాగస్వాము లుగా ఉన్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను అవి రూపొందిస్తాయి. తరువాత ఆ విధివిధానాల అమలుకు నేషనల్‌ ‌రివర్‌ ‌కన్సర్వేషన్‌ ‌డైరెక్టరేట్‌; ‌జల్‌శక్తి-ఐఐటీలు, నిట్‌లు, ఐఐఎస్‌సీలు, నీరీ (నాగపూర్‌) ‌మధ్య ఒప్పందం జరుగుతుంది. పరీవాహక ప్రాంతాల రక్షణకు ఎన్నుకున్న ఆ ఆరు నదులు-నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి, పెరియార్‌, ‌మహానది. నమామి గంగే ఒక అసాధారణ పథకం. దీనితోపాటు గోమతి రివర్‌‌ఫ్రంట్‌ ‌పథకం, భారత్‌ ‌క్లీన్‌ ‌ఫౌండేషన్‌, ‌మైథీ నది క్షాళన పథకం కూడా అమలవుతున్నాయి. ఈ నదుల క్షాళన కార్యక్రమంలో నిపుణులు ఇచ్చిన ప్రణాళికలతో పాటు, నమామి గంగే పథకం అనుభవాలను కూడా స్వీకరిస్తారు. వీటన్నిటి సారాన్ని భవిష్యత్తులో చేపట్టే నదుల క్షాళన కార్యక్రమాలకు వినియోగిస్తారు. భారత్‌ ‌నదుల క్షాళనకు కేంద్రం పట్టుదలతో ఉన్నదన్న విషయాన్ని ఈ పరిణామాలన్నీ వెల్లడిస్తున్నాయి. దీనితో పాటు సరస్సులు, సాగరతీరాల క్షాళనకు కూడా కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఢిల్లీ, ఆగ్రా, మధురల గుండా ప్రవహించే యమున; అహమ్మదాబాద్‌, ‌గాంధీనగర్‌ల గుండా ప్రవహించే సబర్మతి; ఆంధప్రదేశ్‌, ‌కర్ణాటక, మహారాష్ట్రలలో ప్రవహించే కృష్ణ; నాసిక్‌లో పుట్టి తెలంగాణ, మీదుగా ఆంధప్రదేశ్‌కు చేరే గోదావరి; కర్ణాటక, తమిళనాడుల గుండా వెళ్లే కావేరి ఏ ఒక్కటి సురక్షితంగా లేవు. మలినాలు, ప్లాస్టిక్‌ ‌వీటిలోని నీళ్ల ప్రమాణాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తున్నాయి.

ఒకసారి నర్మద పరిస్థితి ఎలా ఉందో పరికిద్దాం. 2016లోనే నాలుగు ప్రాంతాల నుంచి తెచ్చిన ఈ నది నీటిని పరీక్షించారు. ఈ నీరు ఎంతమాత్రం ఉపయోగకరం కాదని మధ్యప్రదేశ్‌ ‌కాలుష్య నియంత్రణ సంస్థ తేల్చి చెప్పింది. పెరిగిన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నర్మదను అథమ స్థాయికి తీసుకుపోయాయి. ఇప్పుడు ఆ గొప్ప నది నీటి పరిశుభ్రత స్థాయి, ప్రమాణం కేవలం ‘సీ’ కేటగిరీకి (భారత ప్రమాణాల బ్యూరో లెక్క మేరకు) చేరింది. 2017 వరకు అందిన సమాచారాన్ని బట్టి, మధ్యప్రదేశ్‌లోని 52 నగరాల నుంచి వ్యర్థాలు, మలినాలు, మురుగు నీరు నేరుగా ఈ నదిలోకి వచ్చి పడుతున్నాయి. అవే నదిని దారుణంగా కలుషితం చేసేశాయి. నర్మద రక్షణకు 2016లో బీజేపీ ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రారంభించింది. రూ. 1500 కోట్లతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మించనున్నట్టు ప్రకటించింది. మురుగును నదిలోకి తీసుకుపోయే కాలువలను పునర్‌ ‌వ్యవస్థీకరించడం, జనావాసాల నుంచి వెల్లువెత్తే చెత్తాచెదారాన్ని నిరోధించడం ఆ ప్లాంట్‌ ఉద్దేశం. 2016 డిసెంబర్‌లోనే ప్రధాని నరేంద్ర మోదీ నర్మదా సేవా మిషన్‌ ‌కార్యక్రమం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాటి మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌చురుకుగా పాల్గొని, నర్మదా పరీవాహక ప్రాంతంలో చైతన్యయాత్రను నిర్వహించారు. ఆ యాత్రలోనే ఆయన అనేక సభలలో ఉపన్యసించారు. నదులను కలుషితం చేయవద్దని ప్రజలను వేడుకున్నారు. ఆ యాత్ర సందర్భంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఎంతో విజయం సాధించింది. ఆ యాత్ర సాగిన ప్రాంతమంతా కార్యకర్తలు 7.14 కోట్ల మొక్కలు నాటారు. అంటే నదీ పరీవాహక ప్రాంతమంతా ఆ కార్యక్రమం నిర్వహించారు. నదుల క్షాళన కార్యక్రమంలో అడవుల పెంపకం అంతర్భాగంగా తీసుకురావడం ఉత్తమమైన ఆలోచన.

మనం ఎంతో గొప్పగా చెప్పుకునే గోదావరి పరిస్థితి కూడా నర్మదకు పెద్ద భిన్నంగా ఏమీలేదు. ఇది అత్యంత విషాదకరం. గోదావరి జలాల ప్రమాణం కూడా 2019 నాటికే ‘సి’ కేటగిరిలో చేరిపోయింది. దీనితో నేషనల్‌ ‌రివర్‌ ‌కన్సర్వేషన్‌ ‌పథకం కింద మోదీ ప్రభుత్వం 2022లో గోదావరి క్షాళనకు రూ 88 కోట్లు కేటాయించింది. మురుగు నీటి కాలువల పునర్‌ ‌వ్యవస్థీకరణే ఈ కేటాయింపుల ఉద్దేశం. భూమిలోపల మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు ఈ నిధులు ఉపయోగించాలి. అంటే శుద్ధి చేయకుండా ఏ రకమైన నీరు నదిలోకి ప్రవేశించకూడదు.

నదుల క్షాళన చర్యలన్నీ కాగితాల మీదనో, ప్రకటనలలోనో ఉండిపోతున్నాయని అనుకోవడం పొరపాటు. ఇందుకు ప్రబల నిదర్శనం ఎగువ ఉత్తర భారతదేశంలో చేపట్టిన దేవిక పథకం. అసలు ఉత్తర భారతదేశంలో దిగ్విజయంగా పూర్తయిన తొలి నది క్షాళన ఇదేనన్న కీర్తి కూడా దీనికి దక్కింది. దేవిక (ఈ నది గురించి వరాహ, కూర్మ పురాణాలు ప్రస్తావిస్తాయి) పథకాన్ని 2019లో నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేవిక నది స్వచ్ఛత, ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. దేవిక అంటే గంగానది సంతానంగా పరిగణిస్తారు. అక్కడి ప్రజలకు విశ్వాసాల పరంగా ఈ నది ఎంతో కీలకమైనది కూడా. దేవిక జమ్ముకశ్మీర్‌ (ఉదంపూర్‌ ‌జిల్లా)లోని కొండలలో సుద్ధా మహదేవ్‌ ఆలయం వద్ద పుట్టింది. అక్కడ నుంచి పడమర దిశగా సాగి, పంజాబ్‌కు చేరుకుని రావి నదిలో కలుస్తుంది. ఈ సంగమ స్థలం పాకిస్తాన్‌లో ఉంది. దేవిక నది క్షాళన పథకం ప్రకారం మురుగునీటి శుద్ధి కోసం మూడు ప్రాజెక్టులు నిర్మించారు. వాటి సామర్ధ్యం 8, 4, 1.6 ఎంఎల్‌డీలు. ఆ మురుగు నీటి శుద్ధి వ్యవస్థను 129.27 కిలోమీటర్లకు విస్తరించారు. దీనితో జనావాసాల నుంచి వచ్చిన వ్యర్థాల నిర్వహణ ఎంతో సమర్ధంగా జరుగుతున్నది. దేవిక నది క్షాళన పథకంలో రెండు చోట్ల అంత్యక్రియల కోసం ఉద్దేశించిన రేవులు నిర్మించారు. నది రక్షణతో పాటు, పరీవాహక ప్రాంతంలోని పచ్చదనాన్ని రక్షించేందుకు కంచె కూడా నిర్మించారు. మధ్యలో చిన్న చిన్న జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టులు కూడా నిర్మించారు. మూడుచోట్ల సౌర విద్యుత్‌ ‌ప్లాంట్‌లు కూడా కట్టారు.

భారతదేశ నదుల రక్షణ, వాటికి పునరుజ్జీవం కల్పించడానికి జరుగుతున్న ఆ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచానికే ఒక మహాద్భుతంగా కనిపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఈ అద్భుతాలు సాధించే అవకాశం ప్రపంచ దేశాలకు కూడా భారత్‌ ‌ప్రేరణగా నిలుస్తున్న మాట కూడా నిజం. గత ఏడాది దుబాయ్‌లో సీఓపీ 28 శి•రాగ్ర సదస్సు జరిగింది. అక్కడే భారత్‌ ‌ప్రపంచ నదీ తీరాల నగరాల అలయెన్స్‌ను (గ్లోబల్‌ ‌రివర్‌ ‌సిటీస్‌ అలయెన్స్) ఆరంభించింది. ఈజిప్ట్, ‌నెదర్లాండ్స్, ‌డెన్మార్క్, ‌ఘనా, ఆస్ట్రేలియా, భూటాన్‌, ‌కంబోడియా, జపాన్‌ ‌భారత్‌ ఆలోచనతో గళం కలిపాయి. దీనికి మూలం నేషనల్‌ ‌మిషన్‌ ‌ఫర్‌ ‌క్లీన్‌ ‌గంగ పథకమే. ఈ పథకాన్ని మనకంటే ప్రపంచ దేశాల వారే ఎక్కువ అర్ధం చేసుకున్నారని అనిపిస్తుంది. ప్రపంచాన్ని పునరుజ్జీవింప చేయడానికి చేపట్టిన 10 పథకాలలో నమామి గంగే పథకానికి కూడా చోటు దక్కింది.

నదుల క్షాళన కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలలోని కొన్ని నదీతీరస్థ నగరాలు కూడా అందిపుచ్చుకున్నాయి. ది హేగ్‌ (‌నెదర్లాండ్స్), అడిలాయిడ్‌ (ఆ‌స్ట్రేలియా), జోల్నాక్‌ (‌హంగేరి) ఇందులో ఉన్నాయి. ఈ నగరాలు ప్రపంచంలో నదుల పరిరక్షణ ఉద్యమానికి కొత్త వెలుగును ఇచ్చాయి. ఇవి ఆ పని ప్రారంభించడంతో 11 దేశాలలోని 275కు పైగా నదీ తీరస్థ నగరాలు నదుల క్షాళనకు నడుం కట్టాయి. భారత్‌ ‌నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ బ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, ఆసియన్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌బ్యాంక్‌ ‌వంటివి భాగస్వాములయి, తమ వంతు అందిస్తున్నాయి. మన గంగ క్షాళన అలా ప్రపంచాన్ని తాకింది. అంతకు ముందే దేశంలోని నదుల క్షాళనకు గంగ క్షాళన పథకం ప్రేరణగా నిలిచింది. నమామి గంగే పథకం కోసం 2021-26 ఆర్థిక సంవత్సరాలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ 2652.00 కోట్లు కేటాయించింది. అలాగే నేషనల్‌ ‌రివర్‌ ‌కన్సర్వేషన్‌ ‌డైరెక్టరేట్‌కు, నేషనల్‌ ‌మిషన్‌ ‌ఫర్‌ ‌క్లీన్‌ ‌గంగ పథకాలకు రూ. 22,500 కోట్లు కేటాయించింది.

నమామి గంగే పథకం ఒక సమగ్ర యోజన. నీటి వృథాను అరికట్టడం, ఘన వ్యర్థాల నిరోధం, రివర్‌ ‌ఫ్రంట్‌ ‌మేనేజ్‌ ‌మెంట్‌ (‌రేవుల, శ్మశానవాటికల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటివి గంగ, దాని ఉపనదుల క్షాళన వరకు అమలు చేస్తున్నారు) వంటి చర్యలు అందులో ఉన్నాయి. అందులో అంతర్భాగంగానే 450 పథకాలు ఆరంభించారు. ఇందుకు అయ్యే ఖర్చు రూ. 38,438 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో 280 పథకాలను విజయవంతంగా పూర్తి చేశారు. నదుల కాలుష్యానికి ప్రధాన కారణమైన మురుగునీటి చేరిక, పారిశ్రామిక మలినాలు, జనావాసాల నుంచి వచ్చే వ్యర్థాల నివారణకు మౌలిక వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ పథకాలన్నింటిలో ప్రధానంగా కనిపిస్తుంది.

వీటికి తోడు 2023లోనే ప్రారంభించిన ‘ప్రయాగ్‌’ ‌పథకం కూడా ఉంది. దీని ఉద్దేశం నదులలో నీటి ప్రమాణాన్ని నిరంతరం పరీక్షించడమే. మురుగు నీటి వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి ఏర్పాటు చేసిన ప్లాంట్‌ల పనితీరును పరిశీలించడం కూడా. గంగ, యమునలలో కామన్‌ ఎఫ్లుయింట్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్స్, ‌మురుగు నీటి వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్‌ల పని తీరును పరిశీలించడం ఇందులో ఉన్నాయి. దేశంలో నదుల పరిరక్షణకు భారత్‌ ‌చేపట్టిన చర్యలు పర్యావరణ రక్షణ పరిధిలో ఎంతో కీలకంగా ఉన్నాయి. దీనికి అంతర్జాతీయ సహకారం కూడా ఉంది. నర్మద సేవా మిషన్‌, ‌దేవిక పథకం, నమామి గంగే పథకాలను చూస్తే భారత్‌ ‌తన పవిత్ర నదీజలాలను పరిరక్షించు కోవడంతో పాటు, ఈ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే స్థాయికి చేరుకుంది. గ్లోబర్‌ ‌రివర్‌ ‌సిటీస్‌ అలయెన్స్ ‌నదుల సంరక్షణ ఉద్యమంలో భారత్‌ ‌కీలకం కావడం అందుకే.

దివ్యమైన ఆర్థికవ్యవస్థ, ధరాతలాన్ని తడిపే జల సంపద, రవాణా ద్వారా ప్రపంచంతో ఏర్పడే సంబంధ బాంధవ్యాలు నాగరికతను నిర్దేశిస్తాయి. ఇందుకు మూలం నదులు. ఇప్పటికీ జీవకోటికి ఆధారం నదులే. కాబట్టి నదులను నాశనం చేసుకోకూడదన్న స్పృహ మనిషిగా పుట్టినవారందరికీ ఉండాలి.

ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతో దబ్ధాసో అపరీతాస ఉద్భిదః।

దేవా నో యథా సదమిద్వృధే అసన్నప్రాయువో రక్షితారో దివేదివే।।

 (అన్ని దిక్కుల నుంచి ఉన్నత భావాలు నాలో ప్రవేశించుగాక: రుగ్వేదం)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE