వర్ధమాన దేశాల యువశక్తి అత్యంత ప్రభావవంతమైనది. అపురూప శక్తి సామర్థ్యాలతో కూడిన యువత తమ దేశానికి ఉజ్వల భవిష్యత్తు మాత్రమే కాదు, శక్తిమంతమైన వర్తమానం కూడా. అయితే, యువతలో నిక్షిప్తమై ఉన్న ప్రబలమైన ఈ శక్తిని ఏ దేశంలోనూ సరిగా వినియోగించుకోవడం లేదు. అపారమైన ఈ సామర్థ్యాన్ని ‘‘చదువుకోండి-మార్కులు తెచ్చుకోండి-ఉద్యోగం సంపాదించండి’’ అనే ఇరుకు సందులోకి మళ్లిస్తున్నారు. ఈ మార్గం కుటుంబ స్థిరత్వానికి తోడ్పడుతున్నప్పటికీ, యువతలోని అపారమైన సామర్థ్యాలను ఉద్యోగాలకే పరిమితం చేస్తున్నది.
మన లక్ష్యాల విషయమై పునరాలోచించవలసిన సమయం ఆసన్నమయింది. యువత తమ అంతిమ లక్ష్యాన్ని ఉద్యోగానికే పరిమితం చేయకుండా, ఉపాధి అవకాశాలను సృష్టించడంపై సారించాలి. నాయకత్వ లక్షణాలతో కూడిన ఒక ఆవిష్కర్తగా, యజమానిగా మారే దిశగా అడుగులు వేయాలి. డిజిటల్, పారిశ్రామిక రంగాలలో ఔత్సాహికులకు అపరిమిత అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొనే విధంగా యువతకు దిశాదర్శనం చేయాలి.
ఉపాధి: ఆరంభమే, అంతిమ లక్ష్యం కాదు
ఉద్యోగం చేయడమనేది వైఫల్యం ఎంతమాత్రమూ కాదు. దీనివల్ల అనుభవం, క్రమశిక్షణ, నైపుణ్యాల వంటి అమూల్యమైన అర్హతలు సొంతమవుతాయి. గట్టి పునాది కూడా ఏర్పడుతుంది. అయితే, వ్యక్తిగత లక్ష్యాలను ఇక్కడికే పరిమితం చేసుకోకూడదు. ఉద్యోగం స్థిరత్వాన్నిస్తుంది, కానీ వ్యవస్థాపకత అంతకన్నా ఉన్నతమైన అవకాశాలను సృష్టిస్తుంది. ఒక సంస్థను స్థాపించి కొద్ది మందికి ఉద్యోగాలు ఇవ్వడం వ్యక్తిగత విజయాన్ని సూచించడంతో పాటు ఆర్థిక స్వాతంత్య్రానికి, సమాజ ప్రగతికి, దేశాభివృద్ధికి బాటలు వేస్తుంది.
పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో యువత కేవలం కంపెనీలలో పనిచేయడం తోనే ఆగిపోకుండా తమనుతాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలి. అలాంటి ప్రతి ప్రయత్నం వల్ల వందలా0ది ఉద్యోగాలు, స్థానిక సమస్యలకు అనుగుణమైన ఆవిష్కరణలు వెల్లువెత్తి అన్ని ప్రాంతాలలో సాధికారత సాక్షాత్కరిస్తుంది.
మూస మనస్తత్వం వీడాలి
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు సాధారణంగా నెలజీతంతో కూడిన ఉద్యోగం వైపు యువతను నడిపిస్తారు. దీని వెనక సదుద్దేశమే ఉన్నప్పటికీ, సొంత వ్యాపారాలపై భయం కారణంగానే వాళ్లు అలాంటి సలహాలు ఇస్తారు. అది ఉత్తమ భవిష్యత్తు వైపు నడిపించే ప్రయత్నం ఎంతమాత్రమూ కాదు. ఆర్థిక అభద్రత తాండవమాడే వర్ధమాన దేశాలలో పారిశ్రామికత ఓ జూదంలాగే కనిపించవచ్చు. కానీ కాలం మారుతోంది. ఇంటర్నెట్, డిజిటల్ నైపుణ్యాలు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థలు అందుబాటులోకి రావడం వల్ల ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఇదివరకటి కంటే తక్కువ పెట్టుబడితోనే సాధ్యం చేయవచ్చు. మనకు కావలసిందల్లా ఆలోచనా విధానంలో మార్పు. సమాజం అగశ్రేణి ఉద్యోగులను ఎలాగైతే గౌరవిస్తుందో వ్యాపార యజమానులు, సామాజిక వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, ఉద్యోగాల సృష్టికర్తలను కూడా గౌరవించాలి. ధైర్యం చేసి రంగంలోకి దిగడం, ఓటమిని వృద్ధిలో భాగంగా పరిగణించడం, భవిష్యత్తు గురించి సృజనాత్మకంగా ఆలోచించడం వంటి లక్షణాలను యువతకు ఒంటబట్టించాలి.
బడి నుంచే బాటలు వేయాలి
మన విద్యావ్యవస్థ మారాలి. పాఠశాలలు, కళాశాలలు ప్రస్తుత పాఠ్యపుస్తకాలు, పరీక్షల మూస నుంచి బయటపడాలి. జీవన నైపుణ్యాలు, విమర్శ నాత్మక ఆలోచన, ఆర్థిక అక్షరాస్యత, పారిశ్రామికత వంటి అంశాలను బోధించాలి. వ్యాపార ప్రతి పాదనలు తయారుచేసుకోవడం, వాస్తవ సమస్యలకు పరిష్కారం కనుగొనడం, వివిధ ప్రాజెక్టుల ద్వారా సంబంధిత సమూహాలతో కలిసి పనిచేయడం వంటి వాటిలో విద్యార్థులను ప్రోత్సహించాలి.
ఆలోచనలు వాస్తవరూపం దాల్చాలంటే సరైన మార్గదర్శనం, కొత్త ఆలోచనలకు సహకారం అందించే సంస్థలు, ఆర్థిక వనరుల లభ్యత వంటివి ప్రధానపాత్ర పోషిస్తాయి. యువత తమ కలలను సాకారం చేసుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉమ్మడి సహకారం అందించాలి.
విజయగాథల ప్రేరణ
యువతకు విజయగాథలు స్ఫూర్తినిస్తాయి. తమలాంటి సామాజిక స్థితి నుంచి వచ్చి అవాంతరా లను అధిగమించి విజయం సాధించిన వారి అనుభవాలు కచ్చితంగా ప్రభావం చూపుతాయి. వారిని చూసినప్పుడు తమ సొంత సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్తగా వైవిధ్యమైన రంగాలలో ప్రవేశించి సత్తా చాటుకున్న పారిశ్రామి కులు, చిన్న వ్యాపారాల యజమానులు, వైవిధ్యంతో కూడిన ఆలోచనలతో విజయం సాధించినవారి వివరాలను పొందుపరచి యువతకు అందుబాటులో ఉంచాలి. ఈ విజయగాథలను పాఠ్యాంశాలలో, వార్తాప్రసార సాధనాలలో, సామూహిక చర్చలలో భాగం చేయాలి.
ఎంతసేపూ డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వాధి కారులను కీర్తించడం కాకుండా ఒక ఊళ్లో ఫ్యాషన్ దుస్తుల వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న మహిళను, రైతులు తమ ఉత్పాదనలను అమ్ముకోవ డానికి ఉపయోగపడే మొబైల్ యాప్ తయారుచేసిన వ్యక్తిని కూడా కీర్తించాలి. ఎందుకంటే వీళ్లు ప్రగతికి కొత్త సారథులు.
ఉపాధి అన్వేషణ నుంచి ఉద్యోగాల కల్పన వైపు
ఉపాధి వెతుకులాటకు స్వస్తి చెప్పి ఉద్యోగాలు కల్పించే వైపు మళ్లడం అంత సులభమేమీ కాదు, ఇది ముందుచూపుతో సాధ్యమవు తుంది. ప్రస్తుత పరిస్థితులను దాటి ఆలోచించడం, ఉన్నతమైన స్వప్నాన్ని చూసే సాహసం చేయడంతోనే సగం విజయం సొంతమవుతుంది. ఈ విజయ స్వప్నాన్ని సాకారం చేసుకోవా లంటే ధైర్యం, పట్టుదల, తగిన సహకారం అవసరమవుతాయి. ఒక్కసారి ముందడుగు వేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సాంకేతిక రంగం వంటి వాటిలో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను యువత సారథ్యంలోని సంస్థలు సులభంగా పరిష్క రించగలుగుతాయి. ఈ సంస్థలు కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాకుండా వినూత్నమైన ఆవిష్కరణల ద్వారా సొంతకాళ్లపై నిలబడే బృందాలను తయారుచేయగలుగుతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలపడి విదేశీ సహాయంపైన, పరిమిత ఉద్యోగాలపైన ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తాయి.
కార్యాచరణకు సిద్ధం కండి
వర్ధమాన దేశాల యువత కార్యాచరణకు సిద్ధం కావాలి. తాము ఆశించింది అందగానే ఆగిపో కూడదు. అంతకన్నా ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా ముందుకు సాగాలి. చదువులను మెట్లుగా ఉపయోగించాలి, గమ్యం చేరుకున్నాం కదా అని ఆగిపోకూడదు. మార్గదర్శకులను కలుస్తుండాలి, నిరంతర అధ్యయనం సాగించాలి. వైఫల్యాలకు భయపడకూడదు, తట్టుకొని నిలబడాలి. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న పెద్దపెద్ద పరిశ్రమలన్నీ చిన్నచిన్న ఆలోచనలతోనే రూపుదిద్దుకున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
తల్లిదండ్రులు, మార్గదర్శకులు ఎప్పుడూ సృజనాత్మకతను, ఔత్సాహికతను, ధైర్యాన్ని ప్రోత్సహించాలి. చిన్నప్పటి నుంచీ పిల్లలను మంచి మార్కుల కోసం ప్రోత్సహించడమే కాకుండా ఉన్నత మైన కలలు కనే విధంగా తీర్చిదిద్దాలి. యాజమాన్యం, ఆవిష్కరణ, నాయకత్వ లక్షణాల విలువను బాల్యం నుంచే నేర్పించాలి.
యువత సొంతంగా పరిశ్రమలను స్థాపించేం దుకు ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించి, అందుకు తగిన వ్యవస్థలను ఏర్పరిచే బాధ్యత విధాన రూపకర్తలు, నాయకులపై ఉంటుంది. విద్యావ్యవస్థలో సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిధులు సమకూర్చే వ్యవస్థలను సులువుగా సంప్రదించే వాతావరణం నెలకొల్పాలి. వ్యాపారం ప్రారంభించి, నిలదొక్కుకునే దశలో అవాంతరాలు కలగకుండా చూడాలి.
ముగింపు
వర్ధమాన దేశాల భవిష్యత్తు అక్కడి యువత చేతుల్లోనే ఉంటుంది. ఉపాధి పొందడానికి కాకుండా ఉద్యోగాల కల్పనకు వారిని ప్రోత్సహించాలి. ఉద్యోగం సంపాదించడమనేది పరమావధి కాదని, అంతకన్నా చాలా ఎక్కువ సాధించవచ్చని ఆలోచించే స్వభావాన్ని పెంపొందించాలి. ఉన్నత లక్ష్యాలతో కలలు కనే తరానికి, కార్యసాధకులకు, మార్పును సాధించేవారికి ప్రోత్సాహం అందించాలి. ఎందు కంటే, యువత నడుం బిగిస్తేనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది.
పి. వేణుగోపాల్‌రెడ్డి
పూర్వ సంపాదకులు