అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలతో విడివిడిగా చేస్తున్న సుంకాల సమరాలు భారత్‌కు ఒక భౌగోళికశక్తిగా అంతర్జాతీయ యవనికపై తన శక్తి, సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి. తద్వారా భారత్‌ను తన సొంత ఆర్థికాభివృద్ధి నమూనాతో నిలిచిన అద్వితీయ శక్తిగా అంతర్జాతీయ సమాజం పరిగణనలోకి తీసుకుంటుంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గడచిన కొద్ది వారాలుగా జారీ చేసిన సుంకాల ప్రభావంపై పెద్ద ఎత్తున అధ్యయనాలు జరుగుతున్నాయి. సుంకాల విధింపునకు అనుకూలంగా, వ్యతిరేకంగా బల్లగుద్ది మరీ వాదిస్తున్నవారు మరింత చర్చకు ఆస్కార మిస్తున్నారు. ఆ క్రమంలో సుంకాలు, వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు అంతటా మారుమోగిపోతున్నాయి. అభివృద్ధికి సంబంధించిన ఒక ఇతివృత్తానికి ఊతమిస్తున్నాయి.
పలువురు విశ్లేషకులు సుంకాల సవరింపును వాణిజ్య సమరం అని అన్నారు. అయినప్పటికీ ఇతరులు అంతర్జాతీయ రాజకీయ వాతావరణంపైకి పోటెత్తుతున్న వాణిజ్యం కేంద్రంగా చోటు చేసుకున్న సంఘర్షణ తాలూకు పరిణామాలను పరిశీలించడానికి ప్రయత్నించారు. అది మార్కెట్లు, ఈక్విటీలు, కరెన్సీలు, ఉత్పత్తులు, బులియన్, తదితర ఆర్థిక అంశాలపై వెంటనే ప్రభావాన్ని చూపించింది. మార్కెట్‌లో గందరగోళం తలెత్తింది.
ట్రంప్ చెప్పినట్టుగా ‘విముక్తిదినం’ అంటూ వైట్‌హౌస్ సుంకాలపై ఉత్తర్వులను జారీ చేసిన తర్వాత ఇన్వెస్టర్ల తాలూకు బిలియన్ల డాలర్ల కొద్దీ సంపద రాత్రికి రాత్రే తుడిచిపెట్టుకోవడమో లేకుంటే పాక్షికంగా పూర్వస్థితికి రావడమో జరిగింది.
అమెరికా దేశానికి ఐరోపా యూనియన్‌తో- ఈయూ 200 బిలియన్ డాలర్లు, చైనాతో 300 బిలియన్ డాలర్లకు పైగా వాణిజ్య లోటు ఉంది. అధ్యక్షుడు ట్రంప్ ఈయూ, చైనాలను లక్ష్యంగా చేసుకొని సుంకాలను పెంచినప్పటికీ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు, లాజిస్టిక్స్ కంపెనీలు నిలువ నీడ కోసం అలమటించినట్టుగా బెంబేలెత్తిపోయాయి.
ట్రంప్ 1.2 ట్రిలియన్ డాలర్లకు పేరుకుపోయిన అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం కోసమని స్నేహితులు, శత్రువులు అనే తేడా లేకుండా 60 దేశాలపై వెక్కిరింతను జోడించి మరీ పెద్ద ఎత్తున సుంకాలను విధించారు.
‘లావాదేవీల ట్రంప్’ పాలనా యంత్రాంగం దాదాపు 100 దేశాలను ఉపేక్షించింది. దీంతో కొందరు ఆర్థికవేత్తలు అమెరికా వాణిజ్య మిగుళ్లను వేలెత్తి చూపారు.
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ రాజకీయ అజెండా అమెరికన్లను, వారి వ్యాపారాలను అన్యాయంగా చూసిన తీరును, ఉత్పాదకరంగాన్ని అమెరికా నుంచి ఇతర దేశాలకు తరలించడం ద్వారా తన ‘ఓటర్ల’కు ఉద్యోగ అవకాశాలను నిరాకరించిన వైనాన్ని సరిచేయడం చుట్టూ తిరిగింది. ఇది కూడా ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠంపైన కూర్చోవడంలో ఆయనకు అతి పెద్ద రాజకీయ అజెండాగా మారింది.
ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (అమెరికాకు పూర్వ వైభవాన్ని తెద్దాం) అజెండాతో దేశంలో శ్వేతజాతీయ ఓటర్లను చేరుకోవడానికి తోడు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్న యావత్ ప్రపంచాన్ని తమ భుజస్కంధాలపై మోస్తున్న అమెరికన్లపై భారాన్ని తొలగించడం చుట్టూనే ఆయన ఆలోచన కేంద్రీకృతమైంది.
ఇకపై అమెరికాలో వాణిజ్యం, సుంకాలు, ఉత్పాదకత, ఉద్యోగాల అజెండా అమలు కానుంది. దానికి సంబంధించిన సంకేతాలు అందుకునే వారెవరికైనా శుభాశుభాలను సూచిస్తాయి. వాటికి తరుణోపాయాన్నీ అందిస్తాయి.
వాషింగ్టన్, తదితర ప్రాంతాల్లో మొదలైన వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య సంప్రదింపులను వేగవంతం చేయడం కోసమని సుంకాల విధింపును 90 రోజులకు నిలుపుదల చేయడంతో అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలు అమెరికాపై ప్రతీకార సుంకాలను విధించాలనే ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టాయి.
అయితే చైనాపై అమెరికా సవతి తల్లి ప్రేమను చూపించింది. చైనా నుంచి అమెరికా దేశానికి ఎగుమతి అయ్యే ఉత్పత్తులు, సేవల్లో ఎక్కువ వాటిపై 145% సుంకాన్ని విధించింది. దీనికి బదులు చెబుతున్నట్టుగా చైనా అమెరికా ఉత్పత్తులు, సేవలపై 84% సుంకాన్ని విధించింది. అయితే ఇదంతా కూడా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపును 90 రోజులకు నిలుపుదల చేస్తూ చేసిన ప్రకటన వెనుక ప్రణాళికలో భాగం కాదు.
ప్రస్తుతానికి ఈ సుంకాల సమరం కాస్తా అమెరికా, చైనా మధ్య ప్రత్యక్ష పోరాటంగా మారింది. పోరాటం అంతు చూసే దాకా ఆగేది లేదని చైనా ప్రతినబూనింది.
అమెరికా, దాని వాణిజ్య భాగస్వాముల మధ్య సంప్రదింపులు సుదీర్ఘకాలం పాటు జరుగుతాయి కాబట్టి వాణిజ్యం కేంద్రంగా జరుగుతూ ముదిరిపాకాన పడుతున్న ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు.
వాణిజ్యానికి సంబంధించిన అంశాలు పరిష్కారమైనప్పటికీ పశ్చిమ దేశాల ప్రపంచీకరణ నమూనాపై పెను ప్రభావం చూపుతుంది. బ్రెట్టన్ ఉడ్స్ ఇన్‌స్టిట్యూషన్స్ అని పిలుచుకునే అంతర్జాతీయ ద్రవ్యనిధి – ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు రీసెట్ బటన్ నొక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థికపరమైన వ్యవహారాలు కొత్త దృక్కోణం సంతరించుకోవడం అనివార్య మవుతుంది. ఈ మార్పు ప్రపంచ దేశాలపై మరీ ముఖ్యంగా పేదరికంలో మగ్గుతున్న దేశాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి పెద్ద దిక్కుగా మారుతుంది.
సొంత దేశపు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అమెరికా కేంద్రంగా ట్రంప్ ప్రవేశపెట్టే ఆర్థిక విధానాలు భౌగోళిక-రాజకీయ, ఆర్థిక రంగస్థలాన్ని కమ్యూనిస్టు చైనాలాంటి అగ్రదేశాలకు అప్పగించడానికి దారి తీస్తుంది.
ప్రతీ దేశమూ అది చిన్నది లేదా పెద్దది కావొచ్చు అగ్రదేశాలైన అమెరికా, చైనా లేదా ఐరోపా యూనియన్ లాంటి వాటిపై ఆధారపడకుండా వాటి నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఉపకరించే వైఖరిని త్వరగా వంటపట్టించుకోవాలి.
వచ్చే నాలుగేళ్లలో మరిన్ని దేశాల నుంచి సామాజిక-ఆర్థిక స్వయంసమృద్ధి ఉద్యమాలు వెల్లువెత్తవచ్చు. ఈ నేపథ్యంలో గత 11 సంవత్సరాలుగా భారత్ నడుపుతున్న స్వయంసమృద్ధి ఉద్యమాలకు సార్థకత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న వ్యాల్యూ చైన్లు పునరుద్ధరణకు నోచుకుంటాయి, తెగిపోతాయి. అయినప్పటికీ మళ్లీ కలవడమనేది తప్పకుండా ఉంటుంది.
విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి భారత్ ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ ఉడుంపట్టు పడుతుంది. ఆదరబాదరగా స్పందించడానికి భారత్ సుముఖంగా లేదు. ఐరోపా యూనియన్‌లో పలు సభ్య దేశాలు లేదా చైనా లాగా చిర్రుబుర్రులాడుతూ దీటైన చర్యలను ప్రకటించడం లేదు. భారత్ కాలపరీక్షకు నిలిచే స్వయంప్రతిపత్తితో కూడుకున్న విధానపరమైన ప్రతిపాదన దన్నుగా జారగిలబడి ఉంది.
భారత్‌కు దశ దిశ సూత్రాలు:
భారత్ మొదటగా అమెరికా, ఐరోపా యూనియన్, యూకేతో కుదుర్చుకునే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు- ఎఫ్‌టీఏలపై పెట్టుబడులు లాంటి ఆర్థిక పరామితులతో మరోసారి కసరత్తు చేయాల్సి రావొచ్చు.
రెండవదిగా తనపైన కూడా 26% అదనపు సుంకం పడింది కదా అని భారత్ అమెరికా వ్యతిరేక కూటముల వలలో పడకుండా తనను తాను నిగ్రహించుకోవాలి. దానర్థం అమెరికాపై కక్ష తీర్చుకోవడానికని భారత్‌కు స్నేహ హస్తం అందించడానికని చైనా ముందుకు వచ్చినప్పుడు డ్రాగన్ ముఖానే తలుపులు గట్టిగా వేయమనికాదు.
మూడవదిగా భారత్ తనకు సరిసమాన స్థాయిలో, గౌరవప్రదమైన విధి, విధానాలతో పరస్పరం ప్రయోజనం కలిగిస్తూ కలకాలం నిలిచి ఉండేలా కొత్త భాగస్వాములతో సంబంధాలు ఏర్పరుచుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.
నాల్గవదిగా భారత్ ‘వసుదైవకుటుంబకం’ – ప్రపంచం ఒక పెద్ద కుటుంబం స్ఫూర్తిగా వాణిజ్యం, ఆర్థికం, అభివృద్ధి, భౌగోళిక-రాజకీయ ఒడంబడిక విషయంలో ఆచితూచి వ్యవహరించవచ్చు.
ఐదవదిగా భారత్ అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులను తోసుకుంటూ ఆరోహణ క్రమంలో పురోగమిస్తోంది. అయితే భారత్ ఒక ‘బాధ్యతాయుతమైన ఆర్థికశక్తి కేంద్రం’గా అవతరించాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే బాటను ఎత్తుపల్లాలు లేకుండా చక్కగా వేసుకోవాలి.
ఆరవదిగా, భారత్ వరుసలో ఆఖర్న నిలుచున్న వ్యక్తికి సైతం ఫలాలు అందించాలనే వైఖరితో బహిరంగమైన, సులభతరమైన నియమాలు, నియంత్రణలు చోదకమైన ఓ ‘మానవ ముఖం’తో కూడుకున్న ఆర్థిక ఒడంబడికను కుదుర్చుకోవాలి.
ఏడవదిగా, భారత్‌కు సామాజిక-ఆర్థికాభివృద్ధిపై తాను స్వంతంగా తయారుచేసిన నమూనాను ప్రపంచం ఎదుట ప్రదర్శించడానికి సరైన సమయం ఆసన్నమైంది. అది వినియోగదారులే లక్ష్యంగా వారిని దోచుకోదు. బదులుగా భారత్ నమూనా ప్రకృతికి, మానవ జీవనానికి మధ్య సమన్వయాన్ని ముందుకు తీసుకొని వెళుతుంది. అది వనరులను వివేకవంతంగా వినియోగించడంపైన మనుగడ సాగిస్తుంది.
ఎనిమిదవదిగా, అటు భౌగోళిక రాజకీయా ల్లోనూ, ఇటు మార్కెట్ కేంద్రిత వ్యవహారాల్లోనూ అంతర్జాతీయ శక్తుల పునర్‌వ్యవస్థీకరణ అనివార్య మవుతుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే అటువంటి చోట్ల భారత్ తనకుంటూ బాధ్యతా యుతమైన ఒక విలక్షణమైన పాత్రను స్వయంగా తీర్చిదిద్దుకోవాలి.
తొమ్మిదవదిగా, స్వదేశీ విజ్ఞానంపై పూర్తి భరోసా, అన్యోన్యమైన సౌభాగ్యం, శ్రేయస్సు కోసమని సనాతన ధర్మ విలువల ఆధారిత అభివృద్ధి భారత్ శక్తి, సామర్థ్యాలకు ఒక గీటురాయిగా మారుతాయి.
పదవదిగా, ఎవరైనా ఒక బలహీనమైన స్థితిలో ఉంటూ నాయకత్వ పాత్రను పోషించలేరు. భారత్ సముపార్జిస్తున్న ఆర్థిక పరిపుష్టి భారత్‌ను ఒక అతిపెద్దపాత్రను పోషించేలా చేస్తుంది.
కె.ఎ.బదరీనాథ్
డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్,
సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్
హోలిస్టిక్ స్టడీస్, న్యూఢిల్లీ.