భారత్ ఎప్పుడూ ఎలాంటి దండయాత్రల వల్ల ఓడిపోలేదని, ఎప్పుడూ తన ధార్మిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూనే ఉందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇతిహాస సంకలన సమితి తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా Dakshinapatha through the ages-glory of BHARATH పై మూడు రోజుల పాటు రాజేంద్ర నగర్‌లోని TSCABలో మార్చి 15న జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముసునూరి నాయకులపై రచించిన పుస్తకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాపథ సమావేశం జరగడం సముచితంగా ఉందన్నారు. ఎందుకంటే ఇక్కడ సాంస్కృతిక సంగమంతో పాటు గొప్ప నిర్మాణ శైలి కూడా సమృద్ధిగా ఉందన్నారు. భారత్ ముఖ్యంగా దక్షిణాపథం ఎల్లప్పుడూ ధర్మం, జ్ఞానం, ఆధ్యాత్మిక తకు నిలయంగా ఉందన్నారు. దక్షిణాపథ నాగరికత గురించి ఎక్కువగా హంపి, విజయనగరం, వరంగల్ ప్రదేశాలలో శాసనాలలో లిఖించి ఉందని అన్నారు.
భారతదేశ చరిత్రను, వారసత్వాన్ని సమకాలీ నంగా అర్థం చేసుకోవడానికి దేశీయ జ్ఞాన వ్యవస్థలు, మౌఖిక చరిత్రలు, నాణేల శాస్త్రం, రాతప్రతులను అధ్యయనం చేయాలని గవర్నర్ సూచించారు. కాంచీపురం, రామప్పకి చెందిన కళాత్మకత, ఆధ్యాత్మిక వైభవం గొప్ప వారసత్వానికి సజీవ ఉదాహరణలుగా నిలుస్తాయన్నారు. దక్షిణాపథంలోని ప్రాంతాలు చాలా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సంప్ర దాయాలకు నిలయాలుగా నిలుస్తాయన్నారు.
దక్షిణాపథంలో గొప్ప మహిళలు, రాణులు, కవయిత్రులు, కళాకారులు, అక్క మహాదేవి వంటి ఆధ్యాత్మిక మహిళలు కూడా ఉన్నారని గవర్నర్ అన్నారు. దక్షణాపథం ప్రపంచ వాణిజ్య మార్గంతో, రోమ్, ఆఫ్రికా, యూరప్‌లతో అనుసంధానించి ఉందన్నారు. అంతర్జాతీయ సంబంధాల కారణంగా దక్షిణాపథం గొప్పతనం విశ్వవ్యాప్తమైందని వివరించారు. తాను త్రిపుర ప్రాంతం నుంచి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు తనకు రామప్ప గురించి తెలియదన్నారు. అదే విధంగా అసోం వెలుపలి ప్రజలకు లచిత్ బడ్‌పుకాన్ గురించి తెలియదన్నారు. ఎప్పుడూ పానిపట్టు యుద్ధాలలో ఎలా ఓడిపోయామో మాత్రమే అధ్యయనం చేశామని, అంతేకానీ.. భారత్ తన ఆధ్యాత్మిక వారసత్వం, పరాక్రమ వీరుల ప్రతిఘటన ద్వారా ఎలా గెలిచిందో ఎప్పుడూ అధ్యయనం చేయలేదని, ఆ కోణంలో చరిత్రను అర్థం చేసుకోలేక పోయామన్నారు. ఆత్మగౌరవం లేకుండా ఏ జాతి కూడా ఆత్మనిర్భర్ కాలేదని గవర్నర్ పేర్కొన్నారు.
అంతకు ముందు ఇతిహాస సంకలన సమితి తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు ఆచార్య కిషన్‌రావు అతిథులకు స్వాగతం పలికారు. దక్షిణాపథ సెమినార్ అంశాలను పరిచయం చేశారు. తాము దక్షిణాపథం లోని రాజ్యాలు, రాజవంశాలను, దేశ వైభవం, రాజకీయాలు, సంస్కృతి, కళలు, సనాతన ఆధ్యాత్మిక వైభవానికి ఎలా సహకారం అందిస్తుందో పరిశోధనలు చేస్తున్నామని వివరించారు.
ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. మునుపటి సంవత్సరాలలో చరిత్ర బోధనతో పోలిస్తే.. నేటి కాలంలో సాధారణ పౌరులు, వ్యక్తులు, ఐటీ నిపుణులు, అనేక ఇతర ఔత్సాహికులు చరిత్రపై ఉత్సాహంగా రాస్తున్నారని, దీని ఫలితంగా దేశ వ్యాప్తంగా చరిత్రపై సమృద్ధిగా రచనలు వస్తున్నాయని అన్నారు. మరిచిపోయిన చరిత్రను ప్రజలకు గుర్తు చేయడానికి అనేక చారిత్రక సినిమాలు వస్తున్నాయని, సినిమాలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. దురదృష్టవ శాత్తు కొత్తగా పరిశోధనను చేయకుండా, తమ సొంత మూసలోనే కొందరు ఇరుక్కుపోవడం బాధాకర మన్నారు. మనకు సంబంధించిన అత్యంత పురాతన చరిత్ర నేడు సరికొత్తగా ఆవిష్కృతం అవుతోందని, అయితే నేటి చరిత్ర వివాదాస్పదంగా ఉందన్నారు. మరోవైపు విద్యావేత్తలు ముఖ్యంగా జాతీయ విద్యా విధానం ((NEP))లో భాగంగా అనేక ఆసక్తికర రంగాలను అన్వేషించే మార్గాలను చూపిస్తున్నా రన్నారు.
జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి మాట్లాడుతూ… నిజమైన హీరోలకి సంబంధించిన చరిత్రను మనం నేర్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లచిత్ బోర్పుకాన్, రాణి దుర్గావతి వంటి నిజమైన హీరోల చరిత్రను అధ్యయనం చేయడం లేదన్నారు. భారత స్వాతంత్రోద్యమం విషయంలోనూ ఇటీవల అనేక వెర్షన్లు వస్తున్నాయన్నారు. వక్రీకరించిన చరిత్రలు మనల్ని ఎంతో కలవరపరుస్తున్నాయని, అనేక సందేహాలకు కూడా గురి చేస్తున్నాయని అన్నారు. ఇక.. దక్షిణాపథంలో విజయనగరం వంటి అద్భుత రాజ్యాలు వర్ధిల్లాయన్నారు. రామప్ప ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన సాంకేతికత, దానిని ఎలా నిర్మించారో ఇప్పటికీ తెలియదని. అదే విధంగా దక్షిణాపథంలోని మన సాహిత్యం, కళలు, వాస్తుశిల్ప వైభవం ఇంకా తెలియదని, వీటిని తెలుసుకోవాలని సూచించారు.
ఏబీఐఎస్‌వై (అఖిల భారతీయ ఇతిహాస సంకలన సమితి యోజన) జాతీయ నిర్వాహక కార్యదర్శి బాల ముకుంద్ పాండే ఇతిహాస సంకలన సమితి ప్రణాళికను పరిచయం చేశారు. చరిత్ర అవిచ్ఛిన్నమైన దని, అది ఢిల్లీ కేంద్రీకృతంగా ఉండకూడదన్నారు. అంతేగాక ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక వంటి కృత్రిమ విభజనలు కూడా ఉండకూడదన్నారు. నిజమైన చరిత్రలో గ్రామాలు, అడవులు, గ్రామీణ ప్రాంతాల క్లుప్త చరిత్ర, స్థానిక సంప్రదాయాలను పొందుపరచడం సహా సాహిత్యం, పూర్వకాలపు సామగ్రిని అధ్యయనం చేయడం, పరిశోధించడం చాలా ముఖ్యమని తెలిపారు. కేవలం రాజకీయమే కాకుండా, దేశ సామాజిక, సాంస్కృతిక చరిత్రలను కూడా వివరంగా అధ్యయనం చేయాలని, తద్వారా యువతరం మన నిజమైన చరిత్ర తెలుసుకుని గర్వపడుతుందని అన్నారు.
– వి. నరసింహం