భారతదేశం మారింది. ఒకప్పటిలా న్యాయం చేయాలని ఇతర దేశాలను కోరడం లేదు. పాలకుడు నిబద్ధత ఉన్నవాడైతే పాలన ఎలా ఉంటుందో ప్రధాని నరేంద్ర మోదీ చూపించారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాట తీస్తానని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. భారత్‌లో ఉగ్రవాద, ఆర్థిక అక్రమాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని జుట్టుపట్టుకుని ఈడ్చుకు వచ్చేందుకు మోదీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అమెరికాలో సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, ముంబై ఉగ్ర దాడి కేసులో కుట్రదారుడు తహవ్వుర్ రాణాను భారత్‌కు తీసుకురావడంలో సఫలమైంది.
లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ ,తదితర ప్రాంతాల్లో దాడులు జరిపారు. ఈ దాడుల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది మృతి చెందారు. ఈ దాడి హిందువులు చేశారని ఆరోపించేందుకు వీలుగా కొన్ని ఆధారాలు సృష్టించి పెట్టినా వాస్తవం ప్రపంచానికి వెల్లడైంది. దీనికి కీలక కుట్రదారుడిగా పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తహవ్వూర్ రాణాను గుర్తించారు. అక్టోబర్ 2009లో షికాగోలో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అరెస్టు చేశారు.
కోర్టులను అడ్డుపెట్టుకుని
రాణాను అప్పగించాలన్న భారత ప్రభుత్వ విజ్ఞప్తికి అమెరికా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అమెరికా కోర్టులను అడ్డుపెట్టుకుని రాణా భారత్‌కు రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తాను పాకిస్తాన్ మూలాలున్న ముస్లింనని, పాక్ సైన్యంలో పని చేశానని, తనను భారత్‌లో తీవ్రంగా హింసించే అవకాశం ఉందని, చంపివేస్తారని రాణా ప్రతి కోర్టులోనూ మొసలి కన్నీళ్లు కార్చినా ఫలితం లేకపోయింది. భారత్, డెన్మార్క్‌లలో ఉగ్రవాదానికి, పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు మద్దతు అందించడానికి కుట్ర పన్నారనే అభియోగంపై ఇల్లినాయిస్ ఉత్తర జిల్లాకు చెందిన యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు రాణాపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిర్దోషిగా విడుదలైనా, మరో రెండు కేసుల్లో దోషిగా కోర్టు ప్రకటించింది. రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జనవరి 17, 2013న కోర్టు తీర్పునిచ్చింది. జూన్ 9, 2020న రాణాను కారుణ్య కారణాలతో విడుదల చేశారు. రాణాను అరెస్టు చేసిన తర్వాత, భారత్, అమెరికా దేశాల్లో అతడు పాల్పడిన నేరాలను అమెరికా అధికారులు కోర్టుకు వివరించారు. రాణాను భారత్‌కు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై సాను కూలంగా స్పందించిన కాలిఫోర్నియాలో ఒక జడ్జి, రాణాపై తాత్కాలిక అరెస్టు వారంట్‌ను జారీ చేశారు. అయితే రాణా ఒక కేసులో నిర్దోషిగా విడుదల లేదా శిక్ష విధిస్తే, అదే ఆరోపణపై మళ్లీ విచారణ జరపకుండా ఉండే డబుల్ జియో పార్టీని అడ్డుపెట్టు కుని అరెస్టు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిం చాడు. అతని వాదనను మే 16, 2023న న్యాయ మూర్తి తోసిపుచ్చారు. దీంతో రాణా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ కోసం పిటిషన్ వేశారు. అయితే కోర్టు దానిని ఆగస్టు 10, 2023న తిరస్కరించింది. కానీ పట్టువీడని రాణా అప్పీల్స్ కోర్టులో అప్పీల్ చేయగా అక్కడ కూడా అతడికి చుక్కెదురైంది. అయినా కానీ అతడు యూఎస్ సుప్రీంకోర్టులో సర్టియోరారీ రిట్‌ను దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు రాణా దాఖలు చేసిన రిట్‌ను ఈ ఏడాది జనవరి 21న తోసిపుచ్చింది.
ఒప్పందం మేరకు..
అమెరికా, భారత్ మధ్య 1997లో కుదిరిన ఒప్పందం మేరకు, రెండు దేశాలలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన, దోషులుగా నిర్ధారితమైన వ్యక్తులను అప్పగించడానికి చట్టబద్ధంగా ఒక విధానం రూపొందించారు. ఆ విధానం ప్రకారం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి పాల్పడితే అలాంటి నేరస్తుడిని అప్పగించవచ్చు. దేశాధినేత హత్య, వారి కుటుంబ సభ్యుల హత్య, ప్రభుత్వంపై యుద్ధానికి తెగపడటం, విమానాల హైజాక్, విమాన విధ్వంసం, అంతర్జా తీయంగా రక్షణ ఉన్న వ్యక్తులపై నేరాలు, వారిని బందీలుగా తీసుకోవడం వంటి నేరాలకు పాల్పడిన నిందితుడిని అప్పగిస్తారు. అయితే రాజకీయ నేరాలకు పాల్పడినవారిని అప్పగించరు. అప్పగింత విధానం ప్రకారం పైన పేర్కొన్న నేరాల్లో ఏ ఒక్కదాన్ని కూడా రాజకీయ నేరంగా పరిగణించరు.
భారత్‌కు అప్పగింత..
ముంబై టెర్రరిస్ట్ దాడుల కేసులో కీలక కుట్రదారుడు తహవ్వుర్ రాణాను అమెరికా భారత్‌కు అప్పగించింది. అప్పగింతకు అనుమతించవద్దంటూ రాణా దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు తిరస్కరించడంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఆ క్రమంలో భారత అధికారుల బృందం అమెరికా వెళ్లింది. అప్పగింతకు అవసరమైన పత్రాలను సమర్పించింది. అక్కడి చట్టపరమైన పనులన్నీ పూర్తి చేసింది. అనంతరం రాణాను అమెరికా అధికారులు భారత్‌కు అప్పగించారు. అమెరికా అధికారులు తోడు రాగా భారత్ అధికారుల బృందం, తహవ్వుర్ రాణాలతో కూడిన ప్రత్యేక విమానం ఏప్రిల్ 10 సాయంత్రానికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యానికి చేరుకుంది. విమానం దిగిన వెంటనే జాతీయ దర్యాప్తు ఏజెన్సీ – అధికారులు రాణాను అరెస్టు చేశారు. రాణాను పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఢిల్లీలోని పటియాల హౌజ్ కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాల అనంతరం అర్థరాత్రి వేళ న్యాయమూర్తి అతడిని 18 రోజులకు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించారు.
ట్రంప్‌కు ధన్యవాదాలు
ముంబై ఉగ్రవాదుల దాడిలో కీలకమైన కుట్రదారుడు తహవ్వుర్ రాణాను భారత్‌కు తీసుకురావడంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహకారం మరువలేనిది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ, ట్రంప్‌తో భేటీ అయ్యారు. తర్వాత మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ రాణాను భారత్‌కు అప్పగిస్తున్నా మన్నారు. మరికొందరు నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికాలో ఉండటానికి చివరి ప్రయత్నంగా రాణా అత్యవసర దరఖాస్తును దాఖలు చేశాడు. అది కూడా చెత్తబుట్టపాలైంది. రాణాను భారతదేశానికి తీసుకురావడం ఉగ్రవాదంపై అతి పెద్ద విజయంగా ముంబై దాడుల బాధితురాలు దేవిక నట్వర్‌లాల్ రోటవాన్ పేర్కొన్నారు.
ట్రంప్, మోదీలకు అభినందనలు
1984 భోపాల్ గ్యాస్ లీక్ సమయంలో యూనియన్ కార్బైడ్ సీఈఓగా ఉన్న వారెన్ ఆండర్సన్‌కు నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బెయిల్ మంజూరు చేసి పంపించారు. 20 ఏళ్ల తర్వాత ఆండర్సన్‌ను అప్పగించాలంటూ భారతదేశం చేసిన అభ్యర్థనను అమెరికా తిరస్కరించడానికి నాటి పాలకులే కారణం. ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అవలంబించాలన్నదే భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావన. అది వారు ఆచరణలో చూపారు. ట్రంప్ చొరవ చూపకపోతే రాణా ఇంకా అమెరికాలో కూర్చుని భారత్ వ్యతిరేక కార్యకలాపాలు సాగించేవాడు. దేశం, విశ్వశ్రేయస్సును కోరే ఇలాంటి పాలకులు అవసరం.
హేమచందర్ కొలిపాక
సీనియర్ జర్నలిస్ట్, 94400 21108