‘నేను’ నుంచి ‘మనం’ అనే దృక్పథం దిశగా ప్రతి హిందువు పురోగమించాలన్నదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఆశయం. ఈ ఐక్యతా సందేశాన్ని నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్పష్టంగా ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అంతస్సూత్రాన్ని జాతి దృష్టికి తీసుకువెళ్లే గొప్ప ప్రయత్నం చేశారు. మార్చి 30న ఆయన రేషింబాగ్‌ను సందర్శించినప్పుడు ఈ అద్భుత సన్నివేశం సాక్షాత్కరించింది. ‘స్వయంసేవకులు’ అని చెప్పవలసి వచ్చిన ప్రతిసారి ఆయన ‘మనం’ అన్న పదాన్నే ప్రయోగించారు. ఆయన మాట్లాడిన ప్రతిపదం వెనుక డాక్టర్‌జీ, గురూజీల ఆశయం, తాత్త్వికత తొణికిసలాడాయి. తాను దేశ ప్రధానినే అయినా అంతకంటే ముందు స్వయంసేవక్‌నేనని నిశ్చయంగా ప్రకటించుకున్నారాయన. నరేంద్ర మోదీకి ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం కొత్తకాదు. ఆయన మొదట ప్రచారక్‌. అణువణువు స్వయంసేవక్‌. ప్రధాని పదవి చేపట్టిన తరువాత 11 సంవత్సరాలకు ఆయన డాక్టర్‌జీ స్మృతి మందిరాన్ని తొలిసారి దర్శించుకున్నారు. సంఘ శతాబ్ది నేపథ్యంలో ఈ పరిణామం జరగడం మరింత ప్రాధాన్యానికి కారణమైంది. కంటి ఆసుపత్రి భవంతికి శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌ భారతజాతికి ప్రసాదించిన ముందుచూపు గురించి అద్భుతంగా ఆవిష్కరించారు. వందేళ్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ఏం చేసిందో చెప్పారు. స్వయంసేవకుల సేవాభావం ఎంత సమున్నతమైనదో, నిస్వార్థంగా ఉంటుందో చాటారు. ఆయన ప్రధాని అయిన దశాబ్దం తరువాత నాగపూర్‌ వచ్చి ఉండవచ్చు. అయినా ఆయన ఎంచుకున్న సమయం, సందర్భం విలక్షణంగా కనిపిస్తాయి. సంఘ శతాబ్ది ఉత్సవాలకు ఆయన శ్రీకారం చుట్టినట్టయింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఘనతను ఈ సమయంలో మోదీ వంటి వ్యక్తి దేశానికీ ప్రపంచానికీ గుర్తు చేయడం నిస్సందేహంగా చారిత్రక సందర్భమే.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావం, ప్రస్థానం, సాధించిన ఫలితాలు ప్రత్యేకమైనవి. ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగు పడిన ప్రతిచోటా భారతీయ సంస్కృతికి రక్షణ కవచం వలె ఉంటుందన్న ఖ్యాతి ఉంది. ఆత్మ విస్మృతి అనే మానసిక దాస్యం నుంచి స్వతంత్ర భారత పౌరులను విముక్తం చేయడంలో అది నిర్వహించిన పాత్రతో భారత్‌ ప్రపంచ పటం మీద నేడు దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. మూలాలను విస్మరించకుండానే, ఆధునికతను ఆలింగనం చేసుకుంటూనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయాణి స్తున్నది. అందుకే భారతీయ ప్రాచీన సంస్కృతికీ, ఆధునీకరణకీ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ మరణం లేని వటవృక్షం వంటిదని అన్నారు ప్రధాని మోదీ. ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలు, ఆదర్శాలు జాతీయ చైతన్యాన్ని పరిరక్షిస్తున్నాయని చెప్పడమూ అందుకే. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రథమ సర్‌సంఘచాలక్‌ పరమపూజనీయ డాక్టర్‌ కేశవ బలిరాం హెడ్గేవార్‌, రెండో సర్‌సంఘచాలక్‌ పరమ పూజనీయ మాధవరావ్‌ సదాశివ గోల్వాల్కర్‌ స్మృతికేంద్రాలను ప్రధాని మార్చి 30న నాగపూర్‌లో దర్శించారు. తన గుండె చప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ అని చాటారు. సంఘ్ ప్రాంగణంలో మాధవ్‌ నేత్రాలయ కంటి పరిశోధన వైద్య కేంద్రానికి అనుబంధంగా నిర్మిస్తున్న మాధవ్‌ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. మోదీ నాగపూర్‌ సందర్శన రోజే డాక్టర్‌జీ జయంతి కూడా. ఆ రోజు మరాఠాలకీ, తెలుగువారికీ కూడా యుగాది. నాగపూర్‌లోనే ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దీక్షాభూమి (ఆయన బౌద్ధం స్వీకరించిన స్థలం)లో కూడా మోదీ నివాళి ఘటించారు. ప్రధాని వెంట కేంద్రమంత్రి, నాగపూర్‌ లోక్‌సభ ఎంపీ నితిన్‌ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఉన్నారు. సర్‌సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌జీ భాగవత్‌, ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకు ముందు కలుసుకున్న సందర్భం కూడా ప్రత్యేకమైనది. అయోధ్య భూమి పూజ వేళ, బాలరాముడి ప్రతిష్ఠ ముహూర్తంలోను ఆ ఇద్దరు ఒకే వేదికపైకి వచ్చారు.

సైద్ధాంతిక శత్రువును నరేంద్ర మోదీ అసలు సహించరు. అందునా నిర్హేతుకమైన, శుష్కవాదాలతో దేశ ప్రగతిని ఎద్దేవా చేసేవారంటే ఆయన అసలే ఉపేక్షించరు. నిజం చెప్పాలంటే అలాంటి జాతి వ్యతిరేక భావధారను కాలరాస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మీద వందలాది ఆరోపణలు వచ్చాయి. కానీ సంఘం నిజాయితీని, దేశభక్తిని, సేవానిరతని ఎవరూ శంకించడం లేదు. అయినా విదేశీయుల సాయంతో రాళ్లు విసిరే ప్రయత్నం నిరంతరాయంగా కొందరు కొనసాగిస్తున్నారు. ఇందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ను అడ్డం పెట్టుకుంటారు. ఇలాంటివారికి మొహం వాచే తీరులో మోదీ సమాధానం చెప్పదలుచుకున్నారు కాబోలు. నేత్రాలయ భవంతికి శంకుస్థాపన తరువాత ఆయన చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం. ‘ఇది భవిష్యత్తులో వేయేళ్లు భారత్‌ పటిష్టంగా ఉండడానికి వేస్తున్న పునాది అని నేను అయోధ్య ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడే అన్నాను. డాక్టర్‌జీ, గురూజీలు ప్రవచనాల మార్గదర్శకత్వంలో మనం వికసిత భారత్‌ లక్ష్యాన్ని సాధిస్తాం. మన ముందుతరం వారు చేసిన త్యాగాలను మనం వృథాగా పోనివ్వం’ అని ప్రకటించారాయన. కాబట్టి ఎన్‌డీఏ ప్రభుత్వం జాతీయత పునాదిగా, దేశప్రయోజ నాల కోసమే పని చేస్తుందని, అవి సంఘ స్ఫూరితో వచ్చినవని ఆయన ఎలాంటి శషభిషలు లేకుండా ప్రకటించారు. ఇది ఉదారవాద ముసుగులో ఉన్న జాతి వ్యతిరేకులకు ఆయన ఇస్తున్న సమాధానమే.

సంఘ శతాబ్ది సంగతి ఆ మాజీ ప్రచారక్‌ దృష్టి నుంచి ఎట్టి పరిస్థితులలోను తప్పించుకుపోదు. ఆ స్పృహే మోదీ ఉపన్యాసమంతటా ప్రతిధ్వనించింది. వందేళ్లుగా సంఘటన, సమర్పణ భావాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న తపస్సు వికసిత భారత్‌ 2047 లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇప్పుడు ఫలాలను అందిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య చాలు, దేశ పురోగమనంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మౌనంగా చేసిన సేవ ఎంతటిదో చెప్పడానికి! ఒక నిశితమైన అంశం కూడా మోదీ మన ముందు ఉంచారు. ఆర్‌ఎస్‌ఎస్‌ 1925`1947 మధ్యకాలంలో ఒక విధమైన కీలక బాధ్యతను నిర్వహిస్తే, 2025`2047 మధ్య కాలంలో మరొక విధమైన గురుతర బాధ్యతను భుజాలకు ఎత్తుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1925`1947 ప్రాంతం భారత స్వాతంత్య్ర సమరం పతాక సన్నివేశానికి చేరుకుంటున్న దశ. కానీ స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎలాంటి భారత్‌ను నిర్మించాలో దాదాపు ఏ ఒక్కరికీ స్పష్టమైన భావన లేని దశ కూడా అదే. 2025`2047 మరింత కీలకం. స్వతంత్ర భారతదేశం ఆత్మ విస్మృతి నుంచి విముక్తం కావడానికి సిద్ధపడిన కాలం.  ప్రపంచ శక్తిగా ఎదగడానికి పునాది పడిన కాలం. ఈ అవకాశాలను ఉద్యమ స్ఫూర్తితో, జాతీయ ప్రయోజనాలతో అందిపుచ్చుకోవలసిన కాలం. ఈ క్రమంలోనే వచ్చే వేయేళ్లలో భారత్‌ వికాసానికి మనం పునాది వేయాలని పిలుపునిచ్చారు. ఇంకా చెప్పాలంటే, భవిష్యత్‌ భారతం మీద ఉండబోతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ వాద ముద్ర గురించి ముందే హెచ్చరించారు. జాతీయ భావాలను ఇప్పటికీ బలహీనం చేసే ప్రయత్నంలో ఉన్నవారికి ఇదొక హెచ్చరిక. ఎంతకాలం జీవించామని కాదు, సమాజానికి ఎంత చేశామన్నదే జీవితానికి నిజమైన కొలబద్ద అన్న గురూజీ మాటను కూడా మోదీ గుర్తు చేశారు.

భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ నాగపూర్‌లోని డాక్టర్‌జీ స్మృతి మందిరాన్ని, సర్‌సంఘ చాలక్‌తో కలసి సందర్శించడం ఇదే మొదటిసారి. ఆ మందిరంతో పాటు, దానిని నిర్మించిన రేషింబాగ్‌ అనే స్థలం ప్రతి స్వయంసేవక్‌కు పరమ పవిత్రమే. అది ప్రథమ సర్‌సంఘచాలక్‌ పరమ పూజనీయ డాక్టర్‌ కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ జ్ఞాపకం. సంఫ్‌ు చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఒక ప్రేరణ. అందుకే మోదీ నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాల యాన్ని సందర్శించడం ఒక చారిత్రక ఘటనగా అంతా చూశారు. రెండో సర్‌సంఘచాలక్‌ పరమ పూజనీయ గురూజీ స్మారక మందిరం కూడా ఇక్కడే ఉంది. అక్కడకి కూడా ప్రధాని వెళ్లారు. నిజానికి 2000 సంవత్సరంలో అటల్‌ బిహారీ వాజపేయి ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. 2013లో లాల్‌ కిషన్‌ అడ్వాణీతో కలసి ఢల్లీిలోని ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. అప్పుడు సర్‌కార్యవాప్‌ా మోహన్‌జీ భాగవత్‌. అంతకు ఒక నెల ముందు అడ్వాణీ నాయకత్వంలో పార్టీ బృందం నాగపూర్‌ వెళ్లి నాటి సర్‌సంఘచాలక్‌ మాననీయ కె. సుదర్శన్‌జీని కలుసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలకూ, బీజేపీ నాయకులకూ మధ్య ఉండేది గౌరవ పూర్వకమైన దృఢబంధమే. అందులో అజమాయిషీ లేదు. ఆత్మీయత మాత్రమే ఉంది. దేశ ప్రయోజనాల గీటురాయి మీద నిగ్గు తేలిన బంధమే వారి మధ్య ఉండేది. నాడు నేడు కూడా అలాంటి బంధమే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేటి సర్‌సంఫ్‌ుచాలక్‌ మధ్య ఉన్నది సైద్ధాంతిక ఏకాత్మత ఒక్కటే కాదు. వారు పరస్పరం విశేషంగా గౌరవించుకుంటారు. వారిద్దరు ప్రాణస్నేహితులని కూడా సంఘ పెద్దలు చెబుతూ ఉంటారు. వారిద్దరినీ చూస్తే ఒక సదాశయం కోసం జీవితాలను అంకితం చేసిన సోదరుల వలె అగుపిస్తారన్న మాట కూడా ఉంది. ఈ విషయం రుజువు చేయడానికి కాదు గాని, నాగపూర్‌లో ప్రధాని, సర్‌సంఘచాలక్‌ కలసి నడవడం, హాయిగా నవ్వుకోవడం, వారి మధ్య బంధం ఫోటోల రూపంలో స్పష్టంగా ప్రపంచానికి తెలిసింది. వారేమి మాట్లాడు కున్నారో తెలియకపోయినా, హిందూత్వ సంస్థకు చెందిన ఆ ఇద్దరు ప్రముఖుల మధ్య ఉన్న గాఢ స్నేహాన్ని అవన్నీ వ్యక్తం చేశాయి.

మోహన్‌జీ భాగవత్‌ 2000 సంవత్సరంలో సర్‌సంఘచాలక్‌ బాధ్యతలు స్వీకరించారు. నరేంద్ర మోదీ ఆ మరుసటి సంవత్సరమే గుజరాత్‌ ముఖ్య మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. బాధ్యతలను బట్టి ఆ ఇద్దరు వేర్వేరు రాష్ట్రాలలో ఉన్నప్పటికీ, రెండు వేర్వేరు సంస్థలలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారి మధ్య బంధం మాత్రం ఒకే రీతిలో కొనసాగిందని కూడా పరిచయస్థులు చెబుతారు. నాగపూర్‌ తాజా పర్యటనలో కనిపించినట్టు మోదీ, మోహన్‌జీ నవ్వుతూ మాట్లాకునే దృశ్యాలు అరుదుగానే కనిపిస్తాయి. అంతమాత్రాన ఆ ఇద్దరు మాట్లాడుకోరనుకోవడం తప్పేనని కూడా కొందరు సంఘ పెద్దలు చెబుతున్నారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎప్పుడైనా సంప్రతించుకోవలసి వస్తే ఇద్దరూ ఆయా స్థాయులలో మాట్లాడుకుంటూనే ఉన్నారని వారు అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రమశిక్షణకు, మాటతీరుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అయినా మోదీ, మోహన్‌జీ విషయంలో మాత్రం చలోక్తిగా జై`వీరు అని పిలుచుకుంటూ ఉంటారని కూడా తెలుస్తున్నది. అలాగే మోదీ, మోహన్‌జీల నిర్వహణ సామర్ధ్యం మధ్య కూడా పోలికలు తెచ్చే వారు ఉంటారు. ఆ విషయంలో ఇద్దరూ ఇద్దరే. కొందరికి ఆర్‌ఎస్‌ఎస్‌ నేత, ప్రస్తుత ప్రభుత్వ అధినేత కలవడం భారత పునర్‌ వైభవానికి ప్రతీకగా కనిపించింది. మాధవ్‌ నేత్రాలయం శంకుస్థాపనోత్సవంలో మోదీ పదే పదే మనం స్వయం సేవకులం అంటూ ఉదహరించారు. అంటే మోదీ అంటే బయటివాడు కాదు, స్వయంసేవకులలో ఒకడు అన్న అర్ధం వచ్చేటట్టే ప్రధాని మాట్టాడారు.

ప్రధాని సంఫ్‌ును మరణం లేని మహా వట వృక్షంగా ఎందుకు పేర్కొన్నారో అర్ధం చేసుకోవడం అవసరం. ప్రచారం కోసం ఏనాడూ అర్రులు చాచని ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి బయటి ప్రపంచానికి తెలిసినది తక్కువే. ఇవాళ దేశంలో లక్షకు పైగా శాఖలలో ఐక్యతా మంత్రంతో దీక్ష వహించి సమాజ సేవలో లక్షలాది స్వయంసేవకులు పని చేస్తున్నారు. వారంతా భారతీయత ఆధారంగా, దేశ ప్రయోజనాల మేరకే పనిచేస్తారు. వ్యక్తిగత స్వార్ధం ఉండదు. కొంతవరకు ప్రధాని సంఘ విస్తరణ గురించి వివరించారు కూడా. శాఖకు రాకున్నా, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరణతో పనిచేస్తున్న వారు కూడా కోకొల్లలు. వనవాసుల మధ్య, పేదల మధ్య, ఎస్‌సీల మధ్య నిరంతరం పనిచేసే స్వయంసేవకులు ఉన్నారు. వారందరినీ దేశ ప్రధాన స్రవంతిలోకి సగౌరవంగా తీసుకురావడమే ఈ సేవ పరమార్ధం. విద్యారంగంలో, వైద్యరంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల సేవలు చిరస్మరణీయమైనవి. ఇందుకు తాజా ఉదాహరణ కరోనా నాటి సంక్షోభంలో వారు చేసిన సేవలు. ఇవే కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలలో స్వయంసేవకులు నిరుపమానమైన సేవలను నిస్వార్థంతో అందిస్తారని, మహా కుంభ్‌ వంటి సందర్భాలలో కూడా వారి సేవలు అత్యంత శ్లాఘనీయమైనవని ప్రధాని మోదీ నాగపూర్‌లో వ్యాఖ్యానించారు. మానవతా దృక్పథంతో, ఏమీ ఆశించకుండా సేవలు చేసే లక్షణం వారిలో ఉందని మోదీ అభినందించారు. పెద్ద విపత్తు, లేదంటే చిన్న పని అని కాకుండా స్వయంసేవకులు అమూల్యమైన సేవలు అందించడానికి ముందుం టారన్న వాస్తవాన్ని దేశప్రజలు గమనిస్తున్నారని ప్రధాని అన్నారు. వనవాసి కల్యాణాశ్రమం, ఏకల్‌ విద్యాలయాలు (గిరిజన బాలబాలికల కోసం విద్యాలయాలు), సాంస్కృతిక చైతన్యం కోసం పనిచేస్తున్న సంస్థలు, సేవాభారతి సేవల గురించి ప్రధాని గుర్తు చేసుకున్నారు. సేవ అనేది ఒక యజ్ఞకుండం వంటిది. అది జ్వలించడానికి ప్రతి స్వయంసేవక్‌ తనను తాను సమర్పించుకుంటున్నాడు అని చెప్పారు.

ఇటీవల జరిగిన ప్రయాగ మహా కుంభ్‌లో ప్రజలకు స్వయంసేవకులు ఎంతో గొప్ప సేవ చేశారని కొనియాడారు. నిజానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశిస్తున్న హిందూ ఐక్యత ఈ కుంభమేళాలో దర్శించిందనే చెప్పాలి. అలాగే హిందువులు ఏకం కావడంతోనే దేశంలో రాజకీయ స్థిరత్వం, ఏకత్వం వస్తుందన్న బీజేపీ దృష్టికోణం కూడా ప్రయాగలో కనిపించింది. అందుకే మోదీ నాగపూర్‌లో ఆ మహాఘట్టం గురించి పదే పదే ప్రస్తావించారు. ఎక్కడ సేవ అవసరమైతే, ఎక్కడ విపత్తు తలెత్తితే అక్కడ ఆపన్నులకు సేవలు అందించడానికి స్వయం సేవకులు ఉంటారని మోదీ గుర్తు చేశారు. ఇంటి బాధలను కూడా పక్కన పెట్టి వారు గొప్ప సేవాదృక్పథంలో వస్తారని ప్రధాని చెప్పారు. వందేళ్ల క్రితం వేసిన బీజాలు ఇవాళ ఫలితాలు ఇస్తున్నాయని సంఘ శతాబ్ది నేపథ్యంలో ప్రధాని గుర్తు చేసుకు న్నారు. వందేళ్ల క్రితం వచ్చిన ఆలోచన ఇప్పుడు వట వృక్షమై ప్రపంచం ఎదుట నిలిచి ఉందని అన్నారు. విలువలు, సిద్ధాంతాలు ఆ వృక్షానికి అంతటి ఆకృతిని ఇచ్చాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. లక్షలూ, కోట్లలో ఉన్న స్వయంసేవ కులంతా ఈ మహావృక్ష శాఖలేనని అన్నారు. ఇది మామూలు చెట్టు కాదని, చిరంతనమైన భారత దేశ సంస్కృతికి ఆధునికీకరణకు అక్షయ వటవృక్షమని మోదీ వ్యాఖ్యానించడంలోని పరమార్ధం అదే. ఈ వటవృక్షం నిరంతరాయంగా భారతీయ సంస్కృతికి జవజీవాలు అందిస్తున్నదని జాతిలో జాగరూకతను నింపుతున్నదని అన్నారు. యోగ, ఆయుర్వేదం వంటి భారతీయ వ్యవస్థల ద్వారా ప్రపంచంలో భారతీయ సంస్కృతికి దక్కిన ప్రాధాన్యం గురించి కూడా గుర్తు చేశారు.

ఆత్మ విస్మృతి దుష్ఫలితాలను మొదటిగా గుర్తించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. కానీ ఆ విషయాన్ని జాతి చేత గుర్తింపచేయడమూ మహాయజ్ఞమే. బ్రిటిష్‌ జాతి దేశాన్ని వీడి ఏడున్నర దశాబ్దాలు గడచి పోతున్నా, మానసిక దాస్యం చాలామందిలో ఇప్పటికీ మిగిలి ఉంది. భారతీయులు కూడా విజయాలు సాధించగలరు అంటే అనుమానంగా చూసే వారి సంఖ్య తక్కువ కాదు. ఈ పరిణామానికి, ధోరణికి కొన్ని దశాబ్దాల నేపథ్యం ఉంది. భారతీయులలో ఉన్న జాతీయ స్పృహను అణచివేసే ప్రయత్నం చరిత్ర అంతా కనిపిస్తుందని, కానీ దేశ సాంస్కృతిక వారసత్వం దానిని కాపాడిరదని మోదీ గుర్తు చేయడం ఇందుకే. సంఫ్‌ు అక్కడ విజయం సాధిం చింది కాబట్టే చాలా రంగాలలో భారత్‌ను మొదటి స్థానంలో నిలపగలిగింది. మన యోగ, ఆయుర్వేదం ప్రపంచంలో కొత్త స్థానం ఆక్రమించాయి. ఒక దేశ అస్తిత్వం దాని సాంస్కృతిక వ్యాప్తి మీద, జాతీయ స్పృహ మీద ఆధారపడి ఉంటుందని సంఫ్‌ు నుంచి వచ్చారు కాబట్టి, మోదీ అనగలిగారు. భారతీయు లలో జాతీయతా స్పృహను తుడిచివేసే ప్రయత్నం కనిపిస్తుందని, కానీ అది విజయవంతం కాలేదని గుర్తు చేశారు. ఆ ప్రయత్నం విఫలం కావడానికి ఆయా సమయాలలో వెల్లువెత్తిన సామాజికోద్యమాలు కారణమని అన్నారు. భక్తి ఉద్యమం అందుకు మంచి ఉదాహరణ అన్నారాయన. ఒక సంక్షుభిత సమయంలో సాధుసంతులు మనలో జాతీయ కాంక్షను తిరిగి పాదుకొల్పారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఒక సంస్థ మాత్రమే అనుకోవద్దు, ఇది జాతీయతా ప్రేరణ కలిగిన ఒక శక్తి అని ప్రధాని వ్యాఖ్యానించారు.

‘వర్ష ప్రతిపద’ సందర్భంగా స్మృతి మందిరాన్ని దర్శించుకోవడం చాలా ప్రత్యేకమైన సందర్భం. ఎందుకంటే అదే డాక్టర్‌జీ జయంతి. అసంఖ్యాకమైన జనం ఆ మందిరాన్ని దర్శించి శక్తిని పొందారు. అందులో నేను ఒకడిని’ అని పుస్తకంలో తన సందేశం రాశారు నరేంద్ర మోదీ, భారత ప్రధాని.

ఆర్‌ఎస్‌ఎస్‌నూ, బీజేపీనీ నేరుగా ఎదుర్కొనలేక భారత వ్యతిరేకులు చాలా కుట్రలు చేస్తున్న సమయమిది. ఈ కుట్రకు అవసరమైన ఆధారాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ద్వారా అందిస్తు న్నారు. డిజ్‌మ్యాంటిలింగ్‌ హిందుత్వ అని ఒకడు అంటాడు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రిగా పనిచేస్తున్న ఇంకొక మూఢుడు సనాతన ధర్మాన్ని పెకలించవలసిందేనంటాడు. సనాతన ధర్మం అంటే కరోనా, డెంగీ లాంటిదని అవమానిస్తాడు. స్టాండప్‌ కమేడియన్లకి కేవలం హిందూ ఆచార వ్యవహారాలు, పండుగల నుంచే హాస్యం దొరుకుతూ ఉంటుంది. అసభ్యకరంగా మాట్లాడడానికి, చతురోక్తులు విసరడానికి బీజేపీ నేతలు మాత్రమే దొరుకుతారు. సెక్యులరిజం కాపాడవలసిన బాధ్యత ఏకపక్షంగా హిందువులే తీసుకోవలసి వస్తున్నది. తీసుకున్నా మతోన్మాదులుగా, మెజారిటేరియన్‌ నిజంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ఏ హిందూదేవాలయం అపవిత్రమైనా అది పిచ్చివాళ్ల పనే అయిపోతోంది. ఈ పిచ్చివాళ్లకి మరొక మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరమేదీ దొరకదు. ఇలాంటి సమయంలో నాగపూర్‌ నుంచి మోదీ ఇచ్చిన సంకేతాలు చాలా కీలకమైనవి. హిందువుల మధ్య ఐక్యతను కోరుకునే సంస్థలు తమలో తాము కలహించుకోవనీ, అలాంటి వాటి కోసం దింపుడు కళ్లం ఆశతో చూడవద్దని హెచ్చరించినట్టయింది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE