తీన్‌మూర్తి భవన్ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉంటుంది. సువిశాలమైన ప్రాంగణంలో, పచ్చని చెట్లు, గుబురుల మధ్య ఉండే ఈ భవనంలోనే 1964లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్)ని ప్రారంభించారు. ప్రథమ ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు, రాజకీయ జీవితం అధ్యయనం చేయడానికి అక్కడ అవకాశం ఉండేది. అందుకే ఇది నిరంతరం దేశదేశాల చరిత్రకారులతో, రాయబారులతో, దేశాధినేతలతో, మేధావులతో నిండి ఉండేది. పాత కట్టడాలను, ఆ మొత్తం ప్రాకారం స్వరూపాన్ని కాస్త కూడా మార్చకుండా, ఆ చరిత్రాత్మక భవంతి స్వరూపం చెక్కుచెదరనివ్వకుండా భారత ప్రధానులందరి గురించి అదే స్థలంలో అధ్యయనం చేసే అవకాశం ఇప్పుడు కల్పించారు. అదే ప్రధానమంత్రి సంగ్రహాలయ. ఆజాదీ కా అమృతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14, 2022న భారత ప్రధాని ఈ అద్భుత చరిత్ర ఖజానాను జాతికి అంకితం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఇదొక దర్శనీయ స్థలం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రులందరి చరిత్రను, దేశానికి చేసిన సేవను కళ్లకు కట్టేదే ప్రధానమంత్రి సంగ్రహాలయ. ఏ పార్టీ ప్రధాని అయినా దేశానికి చేసిన సేవ కొంత ఉండి తీరుతుంది. ఇది చెప్పడానికి ఉద్దేశించినదే పీఎం సంగ్రహాలయ. ఒక సమష్టి బాధ్యత ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిపుష్టం చేసుకున్నామో వెల్లడిరచే విజయగాథకు కూడా అద్దం పడుతుంది. మన ప్రధానులంతా వివిధ సామాజిక స్థాయి కుటుంబాల నుంచి వచ్చిన వారే. అయినా వారందరినీ మన ప్రజాస్వామ్య సౌధ ద్వారబంధాలు ఒకే రీతిలో తెరుచుకుని స్వాగతించాయి. దేశ పురోగతి, సామాజిక సమరసత, ఆర్థిక సాధికారత, శాస్త్రసాంకేతిక రంగాలకు ఊతం వంటి అంశాల మీద ప్రధానులంతా తమవైన పాదముద్రలను వదిలి వెళ్లారు. ఆ ముద్రలే మన స్వాతంత్య్రానికి నిజమైన అర్థం తీసుకువచ్చాయి.
75 ఏళ్ల స్వతంత్ర భారత జైత్రయాత్రను ప్రధానమంత్రుల కోణం నుంచి ఆవిష్కరించేదే ప్రధానమంత్రి సంగ్రహాలయ. స్వరాజ్య సమరం తరువాత మనకు దక్కిన భూమి ఎలాంటిది! అదో బక్కచిక్కిన దేశం. బ్రిటిష్ వలస పాలకులు వదిలి పెట్టిన దుర్గంధంతో నిండి ఉన్నది. దానికే మనం దరం కలసి జీవం పోశాం. కరవు కాటకాల నుంచి మిగులు ఆహార ధాన్యాల వరకు ప్రయాణం సాగింది. ఇదంతా ఒక్కొక్క ప్రధాని, ఒక్కొక్క దశలో అకుంఠిత దీక్షతో సాధించినదే. ఆ ప్రస్థానాన్ని మనం నిరంతరం గమనించుకోవాలి. గతాన్ని అధ్యయనం చెయ్యి. అదే భవిష్యత్తును నిర్వచిస్తుంది అంటాడు చైనా తత్త్వవేత్త కన్ఫూషియస్. పూర్వ ప్రభుత్వాల చరిత్రను చదివితే ఎలాంటి సవాళ్లు వస్తాయో ఊహించి, ఎదుర్కొనే సంసిద్ధత వస్తుందంటాడు థామస్ జఫర్సన్.
నాడు తీన్‌మూర్తి భవన్, నేడు సంగ్రహాలయ
ఇందుకు సరైన వేదిక తీన్‌మూర్తి ఎస్టేట్. తీన్‌మూర్తి మార్గ్‌లో ఉంది. ఢిల్లీలో ఉన్న ఈ చరిత్రాత్మక భవనమే స్వతంత్ర భారతదేశంలో ప్రథమ ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ నివాసం. దేశానికి ప్రధానమంత్రుల సేవల సంస్మరణ అన్న ఆలోచనకు అంకురం అక్కడే కనిపిస్తుంది. గతంలో నెహ్రూ లైబ్రరీ అండ్ మ్యూజియం అని పిలిచేవారు కూడా. నెహ్రూ మ్యూజియంను యథాతథంగా ఉంచారు. కానీ అవే వస్తువులను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ప్రతిభావంతంగా కనిపించే ఏర్పాట్లు చేశారు. తీన్‌మూర్తి చౌక్‌కు ఎదురుగా ఉండే తీన్‌మూర్తి భవన్ లేదా ఎస్టేట్‌లో ఇలాంటి ఒక అద్భుతమైన మ్యూజియంను ఏర్పాటు చేయాలని 2016 నాటి కేంద్ర ప్రభుత్వం యోచించింది. ఈ ప్రణాళిక మొత్తం వ్యయం రూ. 306 కోట్లు. రెండు భాగాలుగా ఉండే ఈ మ్యూజియంలో కొత్త భవనానికి ప్రేరణ నవభారతం సాధించిన అద్భుత పురోగతే. తీన్‌మూర్తి భవన్‌కు సమాంతరంగా వెనకే నిర్మించిన కొత్త భవనం కోసం, అసలు కొత్తగా చేపట్టిన ఏ నిర్మాణం కోసం ఒక్క చెట్టును కూడా బలి చేయలేదు. 2018 అక్టోబర్‌లో కొత్త మ్యూజియం నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఈ మొత్తం వైశాల్యం 15,619 చదరపు మీటర్లు.
మ్యూజియంకు టాగ్‌బిన్ రూపకల్పన చేసింది. ఇది గుర్గావ్ (ఢిల్లీ)కు చెందినదే. ఇంకొన్ని సంస్థల సహాయం కూడా ఈ పనిలో ఆ సంస్థ తీసుకుంది. ‘‘ఈ మ్యూజియం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయింది. తన్మయ పరిచే ప్రదర్శనలు, ప్రొజెక్షన్ మ్యాపింగ్, వర్చ్యువల్ రియాలిటీ, హెలికాప్టర్ రైడ్ వరకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి’’ అన్నారు టాగ్‌బిన్ సీఈఓ, శాస్త్ర సాంకేతిక ప్రధాన సలహాదారు సౌరవ్ భెయిక్. మ్యూజియమ్స్ అండ్ ఎక్స్‌పో (ఎంయూఎస్‌ఈ) నిర్వహిస్తున్నది.
భారతీయులందరి ఆకాంక్ష ప్రధానమంత్రి సంగ్రహాలయ. అందుకే దీనికి ప్రజాస్వామ్య నిలయంగా పేరు వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో ప్రధాని పదవి చేపట్టిన ప్రతివారు దేశాభివృద్ధికి ఎంతో సేవ చేశారు. కీలక పాత్ర పోషించారు. అందుకే ప్రతి ప్రధానమంత్రి సేవను గుర్తు చేస్తూ ఒక మ్యూజియం నిర్మించాలన్న యోచన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చింది. కొత్త మ్యూజియం భవనం నెహ్రూ మ్యూజియం ప్రాంగణంలోనే నిర్మించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎంతో చర్చ జరిగింది. నెహ్రూ లైబ్రరీ అండ్ మ్యూజియం భవంతి ఏ మాత్రం ప్రాధాన్యం కోల్పోకుండా కొత్త భవనం (బ్లాక్ 2) నిర్మించారు. ఇప్పుడు బ్లాక్ 1 (నెహ్రూ పాత నివాసం, తీన్‌మూర్తి భవన్) కొత్త బ్లాక్ (2) కలిపి ప్రధానమంత్రి సంగ్రహాలయ.
‘మోదీ భజనకోసం అనుకున్న వాళ్లే భంగపడ్డారు’
ప్రధానమంత్రి సంగ్రహాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడుగా పనిచేశారు, ప్రఖ్యాత పత్రికా రచయిత డాక్టర్ ఎ. సూర్యప్రకాశ్. ప్రస్తుతం కౌన్సిల్ సభ్యుని హోదాలో ఉన్న సూర్యప్రకాశ్‌తో ఢిల్లీలో జరిపిన ముఖాముఖీలోని కొన్ని అంశాలు:
నమస్తే. బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా చరిత్ర కాషాయీకరణ వంటి మాటలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతూ ఉంటాయి. సంగ్రహాలయ నిర్మాణం సమయంలో అలాంటి విమర్శలు ఎదుర్కొన్నారా?
ప్రధానమంత్రి సంగ్రహాలయను తీన్‌మూర్తి ప్రాంగణంలో అంటే, నెహ్రూ మ్యూజియం అండ్ లైబ్రరీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు యథాప్రకారం మోదీ నిర్ణయం మీద విమర్శలు వెల్లువెత్తాయి. అది ప్రథమ ప్రధాని స్మారకార్ధం ఏర్పాటు చేసినది కాబట్టి ఎవరూ తాకరాదన్నదే విమర్శకుల నిశ్చితాభిప్రాయం. ఇంకా విచిత్రంగా ఆ ప్రాంగణంలోనే అందరు ప్రధానుల చరిత్రలు వివరిస్తే, అది నెహ్రూ చరిత్రను, సేవలను చిన్న బుచ్చుతుందన్నంత వరకు వెళ్లారు విమర్శకులు. చాలామంది కాంగ్రెస్ ఎంపీలు ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలు చేశారు. పాత భవనాలను, నెహ్రూ స్మారక చిహ్నాలను ఏమీ కదల్చబోమని, అన్నీ యథాతథంగానే ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
తరువాత అయినా మోదీ సత్యనిష్ఠను గౌర వించారా?
సంగ్రహాలయను జాతికి అంకితం చేసిన తరువాత విమర్శకుల నోళ్లు మూతపడినాయి. అంతకు ముందు అనేక అనుమానాలు వ్యక్తం చేసిన మాజీ ప్రధాని కుటుంబీకులు కూడా విమర్శించే సాహసం చేయలేదు. మోదీకి భజన చేయడానికే ఇదంతా అన్నవారూ లేకపోలేదు. కానీ చివరికి నెహ్రూ సేవను తక్కువ చేసి చూపించే ప్రయత్నం, చరిత్రలో నెహ్రూ స్థానాన్ని చిన్న బుచ్చే కుట్ర అన్న విమర్శ మరీ అర్థం లేనిదని వారే గుర్తించవలసి వచ్చింది. అప్పటి దాకా సాగిన నామమాత్రపు నిర్వహణ పోయి, సమర్ధమైన నిర్వహణ వచ్చింది. కొద్దికాలం క్రితం అటకెక్కించిన కొన్ని వస్తువులు` ఫోటోలు, వార్తాపత్రికలు, స్మారక చిహ్నాలు – తిరిగి ప్రజల సందర్శనార్థం ఉంచారు.
సంగ్రహాలయ బాధ్యత తరువాత మీకు కలిగిన అనుభూతి!
ఇప్పుడు అది ఢిల్లీలోనే దర్శనీయ స్థలం. కానీ విపక్షాల విమర్శలు కొంచెం బాధించాయి. ఎందుకంటే నిజానికి అది కాంగ్రెస్ ప్రధానుల సంగ్రహాలయమే అవుతుంది. ఎందుకంటారా? ఒక్క వాజపేయి, మోదీ తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్ వారే. వారి జీవితంలో ఇంతవరకు జాతికి తెలియని కొన్ని అంశాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఇది ప్రధాని మోదీకి చరిత్ర పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం.
ఈ మ్యూజియంకు హృదయం అని చెప్పదగిన ఒక నిర్మాణం కొత్త భవనంలో ఉంది. కొన్ని చేతులు అశోక చక్రాన్ని మోస్తున్నట్టు ఉన్న నిర్మాణమది. అశోకచక్రం జాతీయ జెండా మధ్యన ఉంటుంది. ఇక ఆ చేతులన్నీ ఈ ప్రజాస్వామిక దేశం ఔన్నత్యాన్ని కాపాడుతున్న ప్రజానీకానివే. ఇదే మ్యూజియం చిహ్నం కూడా. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని వేల ఫోటోలు, వందలాది న్యూస్‌రీళ్లు, ఇతర వస్తువులు రకరకాల మార్గాల ద్వారా సేకరించారు. ప్రసార భారతి, దూరదర్శన్, ఫిలిమ్స్ డివిజన్, సన్సద్ టీవీ, రక్షణ మంత్రిత్వ శాఖ, దేశ విదేశాలలోని మీడియా సంస్థలు, విదేశీ వ్యవహారాల శాఖ అధీనంలో ఉండే తోషాఖానా (బహుమతులు, జ్ఞాపికల విభాగం) వంటివి ఇందుకు సహకరించాయి. ప్రధానులకు విదేశాలలో ఇచ్చిన అనేక బహుమతులు, జ్ఞాపికలు ఇందులో ఉన్నాయి. మన గత ప్రధానులు ఉపయో గించుకున్న వ్యక్తిగత వస్తువులు, పుస్తకాలు కూడా ఇందులో కోకొల్లలు. నెహ్రూ పుస్తకప్రియుడు. పాత భవనంలో ఆయన పుస్తకాలు వేలల్లోనే కనిపిస్తాయి. హోలోగ్రామ్స్, వర్చ్యువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, మల్టీ టచ్, మల్టీ మీడియా, ఇంటరాక్టివ్ కియోస్క్‌లు, కంప్యూటర్ కియోస్క్ శిల్పాలు, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్స్, ఇంటరాక్టివ్ స్క్రీన్స్, ఎక్స్‌పెరిమెంటల్ ఇన్‌స్టాలేషన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో మన గతాన్ని రమణీయంగా, ప్రేరణ దాయకంగా కళ్లకు కట్టారు.
ప్రధానమంత్రి సంగ్రహాలయ నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సలహాలు, చెప్పిన మాటలు ప్రేరణాత్మకంగా నిలిచాయి. ఇంతటి సమున్నత ప్రణాళికలు అమలు చేస్తున్నప్పుడు సృజనకు, ఆకాంక్షకు ఎలాంటి లోటు ఉండరాదని ఆయన చెప్పారు. ‘ఇది దేశ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ప్రతి భారతీయుడు తాను కూడా అందులో భాగస్వామిని అన్న అనుభూతి పొందాలి’ అని అన్నారని ప్రధానమంత్రి సంగ్రహాలయ కౌన్సిల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఒక సందేశంలో చెప్పారు.
చరిత్ర పట్ల భారతీయులకు కనీస స్పృహ లేదన్న అవమానకరమైన విమర్శకు సమాధానమే అన్నట్టు ఈ మ్యూజియంను రూపొందించారు. పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో చరిత్రకు కొత్త వైభవం తీసుకురావచ్చునని కూడా ఈ మ్యూజియం చూస్తే అనిపిస్తుంది. దేశ విభజనకు కాస్త ముందు లేదా భారత స్వాతంత్య్రోద్యమ చివరి ఘట్టాల నుంచి ఈ 75 ఏళ్ల ప్రతి చారిత్రక సందర్భాన్ని ఈ మ్యూజియం అక్షరాలా కళ్లకు కట్టింది. ఈ మ్యూజియం గతాన్ని మాత్రమే మన ముందు సాక్షాత్కరింప చేస్తుందను కుంటే పొరపాటు. వర్తమాన భారత విరాడ్రూపం, భవిష్యత్తులో భారత్ ఎలా ఉండబోతున్నదో రేఖా మాత్రంగాను ఒక చిత్రణ కూడా ఇది కల్పిస్తుంది. అదే ఈ మ్యూజియం ఘనత. రెండు భవనాలలో కలిపి 14 గ్యాలరీలు ఉన్నాయి.
సారథులు
నెహ్రూ మ్యూజియం అండ్ మెమోరియల్ లైబ్రరీ సొసైటీకి ప్రధాని మోదీ అధ్యక్షుడు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉపాధ్యక్షులు.
ప్రధానమంత్రి సంగ్రహాలయ ప్రదర్శనలో ఉంచవలసిన చారిత్రక అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి ఒక సంఘాన్ని నియమించారు (కంటెంట్ కమిటీ). ఇది రెండేళ్ల పాటు శ్రమించి, ఇందులో చరిత్రకు సంబంధించిన అంశాలను ఎంపిక చేసింది. సభ్యులు: ఎంజే అక్బర్ (ప్రముఖ జర్నలిస్ట్), ప్రసూన్ జోషి (గేయ రచయిత), ప్రొఫెసర్ కపిల్ కపూర్, వినయ్ సహస్రబుద్ధే (భారత సాంస్కృతిక సంబంధాల కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు) డాక్టర్. ఎ. సూర్యప్రకాశ్ (ప్రముఖ జర్నలిస్ట్).
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్: చైర్మన్- నృపేన్ మిశ్రా, వైస్ చైర్మన్ డాక్టర్ ఎ. సూర్యప్రకాశ్.
చారిత్రక ఘట్టాల పరంపర
బ్రిటిష్ వలస వాసనలు వదిలించుకునే క్రమంలో వేసిన తొలి అడుగు మనదైన రాజ్యాంగ నిర్మాణం. స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న ఒడుదుడుకులు, నేటి విజయాలు, రేపటి స్వప్నాలు ఇందులో దర్శనమిస్తాయి. చారిత్రక ప్రస్థానం ఒక్కటే కాదు, శాస్త్ర సాంకేతిక, రాజ్యాంగ పరిణామాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వీటి మీద చక్కని సత్యనిష్టతో కూడిన వ్యాఖ్యానం కూడా వినిపిస్తుంది, కనిపిస్తుంది.
ఇండియా ఎట్ ఇండిపెండెన్స్ విభాగం
చారిత్రక గత తర్కాన్ని అనుసరించి ఇందులో వస్తు ప్రదర్శన సాగింది. లోపలికి ప్రవేశించిన తరువాత సంగ్రహాలయ నమూనాను చూసుకుని ఎడమకు తిరిగితే ఈ విభాగంలోకి ప్రవేశిస్తాం. ఆఖరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ జూన్ 3, 1947న విభజన ప్రణాళికను (ఇదే మౌంట్‌బాటన్ పథకం) దృశ్యం ఇందులో ప్రదర్శించారు. అదే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ (1947)కు ఊపిరి పోసింది. పండిత్ నెహ్రూ, సర్దార్ పటేల్, జేబీ కృపలానీ (నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు), సర్దార్ బల్దేవ్ సింగ్ (సిక్కుల ప్రతినిధి) ఒక వైపు, ముస్లిం లీగ్ నాయకులు జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ ఒకవైపు, మౌంట్‌బాటన్, వీపీ మేనన్ తదితరులు ఇందులో కనిపిస్తారు. ఆ ఫోటోలో కనిపించే తొమ్మిది మంది ఈ దేశాన్ని భారత్ – పాకిస్తాన్ అనే రెండు ముక్కలుగా విడదీశారు. అఖండ భారత్ నుదుట విభజన గీతను గీసిన క్షణాన్ని నమోదు చేసిన ఫోటో ఇది. ఇందులో కొన్ని ఫోటోలు మనం గతంలో చూసి ఉంటాం. కానీ చరిత్రను ఒక పద్ధతి ప్రకారం గమనిస్తున్న క్రమంలో వీటిని చూస్తాం, కాబట్టి మళ్లీ వాటిని ఆసక్తిగానే చూస్తాం. కొత్త అనుభూతినే పొందుతాం. విభజన అనే శరాఘాతం తరువాత తగిలిన గదాఘాతాలు శరణార్థుల వెల్లువ, గాంధీ హత్య. ఆ ఫోటోలూ ఇక్కడే కనిపిస్తాయి. ‘లైఫ్’ మాసపత్రిక ఫోటో జర్నలిస్ట్ మార్గరెట్ బౌర్కీ తీసిన శరణార్థులతో కిక్కిరిసిన రైలు ప్రయాణాలు, కాలినడక బాధల ఫోటోలు మనలని కాస్త కలవర పెడతాయి. ఇందులో బ్రిటిష్ ఇండియా కాలంలో దేశంలో వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో కొన్ని గణాంకాలు చూడవచ్చు. తొలి స్వతంత్ర భారత ప్రధానిగా నెహ్రూ ఎర్రకోట నుంచి ఉపన్యాసం, ఆ కార్యక్రమానికి జనం వెల్లువెత్తడం వంటి చిత్రాలు, న్యూస్‌రీళ్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
రాజ్యాంగ దర్శనం
మేకింగ్ ఆఫ్ కానిస్టిట్యూషన్ రూమ్ పేరుతో ఉన్న చోట రాజ్యాంగ పరిషత్ కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలు ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగ విశేషాలు, ఆదేశిక సూత్రాలు వంటివన్నీ కింది అంతస్తులో ఉంటాయి. కొత్తగా ఆడియో వీడియో పరిజ్ఞానంతో డాక్టర్ అంబేడ్కర్, రాజేంద్రప్రసాద్ వంటి వారి నిలువెత్తు చిత్రాలు అమర్చారు. రాజ్యాంగానికి జరిగిన 106 సవరణలు ఇక్కడ ఉన్నాయి. 42వ అధికరణం సవరణ వంటి కీలక ఘట్టాల పేపర్ క్లిప్పింగులు కూడా ఉంచారు.
తోషాఖానా
ఈ అంతస్తులోనే ప్రధానులకు వచ్చిన కానుకలను (తోషాఖానా) ప్రదర్శించారు. నెహ్రూ నుంచి మోదీ వరకు విదేశాలలో అందుకున్న కానుకలు ఇక్కడ కొన్ని చూస్తాం. ఇండోచైనా వార్ రూమ్ అప్పటి ఫోటోలు, పత్రాలు చూడవచ్చు. పై అంతస్తులో నెహ్రూ గ్యాలరీ ఉంది. అక్కడే ఆయన పుస్తకాలు, పడక గది, కొన్ని వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించారు. ప్రథమ ప్రధాని నెహ్రూ, డాక్టర్ మన్‌మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీలకు ఇతర దేశాల పర్యటనలలో గౌరవార్ధం ఇచ్చిన జ్ఞాపికలు, బహుమతులు ఇందులో ఉన్నాయి.
పరిచయ్ చాంబర్
రెండో భవనంలో ఏర్పాటు చేసిన పరిచయ్ చాంబర్‌లో ప్రధానులందరి` నెహ్రూ నుంచి నరేంద్రుడి వరకు క్లుప్త పరిచయాలు ఇచ్చారు. కేవలం నెల రోజులే ప్రధానిగా పని చేసి, పార్లమెంటుకు కూడా వెళ్లకుండా రాజీనామా ఇచ్చిన చౌధురి చరణ్‌సింగ్ మొదలు, మొత్తం అందరి ప్రధానుల చరిత్ర ఈ భవనంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ అని అనుకునే ఆస్కారమే లేదు. బ్లాక్ 1లో నెహ్రూ పరిచయం అయిపోయింది. ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి నుంచి మోదీ వరకు చరిత్ర, సాధించిన విజయాలు నమోదు చేశారు. అత్యవసర పరిస్థితిని (1975) వివరించేందుకు ప్రత్యేక గ్యాలరీ కేటాయించారు. ఇందిర హత్యను కళ్లకు కడుతూ ఆనాటి ఆమె నివాసంలో జరిగిన ఆ సన్నివేశాన్ని ఇక్కడ చిత్రించారు. మొరార్జీ దేశాయ్, రాజీవ్‌గాంధీ, చంద్రశేఖర్,హెచ్‌డి దేవెగౌడ, ఐకే గుజ్రాల్, పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్‌సింగ్, నరేంద్ర మోదీల వరకు ఇక్కడ వివరాలు కనిపిస్తాయి. వారి గొంతు, వారి హస్తాక్షరి, ఆలోచనలు కూడా మనం చూడవచ్చు. మోదీ జీవిత గాథను హేలిక్స్ పద్ధతిలో వివరించి, ప్రత్యేక ఆకర్షణ తెచ్చారు.
లాల్‌బహదూర్ శాస్త్రి నిరాడంబరత్వాన్ని చిరస్థాయిగా నిలిపే ప్రయత్నం ఇందులో జరిగింది. శాస్త్రీజీ గ్యాలరీలో ఒక రాట్నం కనిపిస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన వివాహ వేళ అత్తమామలు ఏదైనా అడగమంటే, ఆ మహనీయుడు కేవలం ఒక చరఖా చాలునన్నారట. అత్తవారు అదే ఇచ్చారు. ఇప్పుడు దానిని మనం ఇక్కడ చూడవచ్చు. మొరార్జీ దేశాయ్ గుజరాత్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తూ గాంధీ పిలుపు మేరకు ఉద్యమంలో చేరారు. చరణ్‌సింగ్ జమిందారీ విధానానికి బద్ధ వ్యతిరేకి. ఆ అంశం మీద ఆయన రాసిన పుస్తకం ఇక్కడ కనిపిస్తుంది. చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి ఢల్లీి వరకు 4,260 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ విషయం ఇక్కడ గుర్తు చేశారు. ఒక చాంబర్‌లో ప్రతి ప్రధాని ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతున్న దృశ్యాలు అమర్చారు. ఒకరి తరువాత ఒకరు మన ముందు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. నడవాల నిండా 1947 నుంచి నిన్నటి మొన్నటి వరకు సాధించిన విజయాలను గుర్తు చేసే ఫోటోలు ఉన్నాయి. పోలియో వ్యతిరేకోద్యమం, పోలియో రహిత భారతం, ఆర్యభట్ట ప్రయోగం, కలర్ టీవీ ఆవిష్కారణ, ఏసియన్ గేమ్స్, అణు పరీక్షలు… అన్నీ గుర్తు చేశారు.
టైమ్ మెషీన్ రూమ్ భారతదేశంలో వచ్చిన శాస్త్ర సాంకేతిక పరిణామాలను వివరిస్తుంది. తొమ్మిది లేజర్ ప్రొజెక్టర్లు, ట్రాన్స్‌పోర్టులు ప్రతి ప్రధాని కాలంలో జరిగిన పురోగతిని వివరిస్తాయి. భవిష్యకీ జల్‌కియా భవిష్యత్ భారతం ఎలా ఉండబోతున్నదో తెలియచేస్తుంది. హెలికాప్టర్‌లో కూర్చుని దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది. 6డి ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. 3డి సినిమాలు చూస్తేనే మనం పొందే గాఢానుభూతి ఎలా ఉంటుందో తెలుసు. ఇక 6డి అనుభూతి మాటలకు అందేది కాదు. ఓడ మీద వెళుతుంటే సాగర కెరటాల ఆటు పోట్లు, హెలికాప్టర్‌లో వెళుతున్నట్టు కూడా మనకు అనుభూతి కలుగుతుంది. ఓడ కెరటాల మీద ఎగిరి పడినప్పుడు మన మీద చల్లటి తుంపర కూడా పడుతుంది.
ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని దర్శించిన తరువాత పారిస్‌లో సీయిన్ నది ఒడ్డున, లూవ్ రాజప్రాసాదం ప్రాంగణంలోని లూవ్ మ్యూజియం గుర్తుకు వస్తుంది. ఇది ప్రపంచంలోనే అరుదైన మ్యూజియం. పాశ్చాత్య చిత్రకళలో ప్రసిద్ధిగాంచిన ఎన్నో చిత్రాలతో పాటు మోనాలిసా వర్ణచిత్రం కూడా ఇక్కడే ఉంటుంది. అందులోకి వెళ్లిన అనుభూతి కలిగిందని కొందరు సందర్శకులు ఇప్పటికే వ్యాఖ్యానించారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ లోని హెర్మిటేజ్ మ్యూజియం తరహాలో ఉన్నదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఆరు భవనాలలో దేశ చరిత్రను ప్రదర్శించారు. ప్రధాన మంత్రి సంగ్రహాలయంలో భారత ప్రధానుల జ్ఞాపకాలు, సాంకేతిక పరిజ్ఞానం మనకు అదే స్థాయి అనుభూతిని కలిగిస్తాయి.
తీన్‌మూర్తి ప్రాంగణం
ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (పీఎంఎంఎల్) తీన్‌మూర్తి భవన ప్రాంగణంలో ఉంది. ఇది రాష్ట్రపతి భవన్‌కు దక్షిణ దిశలో ఉంది. ఈ భవనానికి రాబర్ట్ టోర్ రసెల్ రూపకల్పన చేసి 1929-30 ప్రాంతంలో నిర్మించాడు. ఎడ్విన్ ల్యూటెన్స్ ఇంపీరియల్ కేపిటల్ నిర్మాణంలో భాగంగానే దీనిని కూడా నిర్మించారు. ఇది బ్రిటిష్ ఇండియా సర్వ సైన్యాధ్యక్షుని నివాసంగా ఉపయోగించేవారు. 1948 ఆగస్ట్‌లో ఆఖరి శ్వేతజాతి భారత సర్వసైన్యాధ్యక్షుడు ఖాళీ చేసిన తరువాత ఇది ప్రథమ ప్రధాని నెహ్రూ అధికార నివాసంగా మారింది. మే 27,1964, అంటే తన మరణం వరకు నెహ్రూ ఇందులోనే (16 సంవత్సరాలు) నివసించారు. తరువాత ఈ భవంతిని నెహ్రూ స్మారక కేంద్రంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెహ్రూ 75వ జయంతికి నవంబర్ 14, 1964లో నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తీన్‌మూర్తి భవంతిని జాతికి అంకితం చేసి, నెహ్రూ స్మారక మెమోరియల్‌ను ప్రారంభించారు. తరువాత 1990 వరకు ఇక్కడ అవసరాన్ని బట్టి, పెరిగిన పరిశోధకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త నిర్మాణాలు చేపట్టారు.
టికెట్ ధరలు: వారమంతా పీఎం సంగ్రహాలయ ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు వరకు పని చేస్తుంది. ప్రవేశ రుసుము శని, ఆదివారాలలో రూ. 100/-. మిగిలిన రోజులలో రూ. 50/-. పిల్లలకు రూ. 40/- లోపల కొన్ని చాంబర్లలో ప్రవేశానికి రుసుము ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలు రాత్రి 7.30 నుంచి, 8.45 వరకు ఉంటాయి.
– న్యూ ఢిల్లీ నుంచి జాగృతి ప్రత్యేక ప్రతినిధులు