మార్చి 28న పెను భూకంపానికి అతలాకుతలమైపోయిన మయన్మార్‌ను అన్నివిధాలుగా ఆదుకోవడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ఆరంభించింది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన ఆరు విమానాలు, ఐదు నౌకలు 625 మెట్రిక్ టన్నుల మానవీయ సాయం, విపత్తు పునరావాసానికి సంబంధించిన సామాగ్రిని మయన్మార్‌కు చేరవేశాయి. ఆ క్రమంలో భారత్ మార్చి 29న గుడారాలు, దుప్పట్లు, అత్యవసరమైన ఔషధాలు, ఆహార పదార్థాలతో సహా మొత్తం 55 టన్నుల సామాగ్రిని, మార్చి 30న 112 టన్నుల సామాగ్రితో పాటుగా భారత సైన్యానికి చెందిన 118 మందితో కూడిన వైద్య బృందాన్ని, 80 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని, ఏప్రిల్ 1న 16 టన్నుల సహాయక సామాగ్రితో పాటుగా విశాఖపట్టణం ఓడ రేవు నుంచి బయలుదేరిన భారత నావికా దళం నౌక ద్వారా 405 మెట్రిక్ టన్నుల బియ్యం, 30 మెట్రిక్ టన్నుల వంట నూనె, 5 మెట్రిక్ టన్నుల బిస్కెట్లు, 2 మెట్రిక్ టన్నుల నూడుల్స్‌తో కలుపుకొని 442 మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలను మయన్మార్‌కు చేరవేసింది.