ఏప్రిల్ 11 శ్రీరామ కల్యాణం
ఒకప్పుడు రాజులు-రాజప్రాసాదాలు,కోటలతో, సత్రాలు-అన్నసత్రాలతో కళకళలాడిన నగరం ఒంటిమిట్ట. రాజులు రాజ్యాలు పోయినా, కోటలు, బురుజులు శిథిలమైనా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఠీవిగా నిలబడిరది. రామయ్య నడయాడిన స్థలం. జాంబవంతుడు ప్రతిష్టించిన శ్రీరాముడు. హనుమంతుడు లేని రామాలయం. ఆంధ్రా అయోధ్యగా, ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. సీతా, రామ, లక్ష్మణులు ఒకే శిలమీద దర్శనమిచ్చే దృశ్యం. ఎన్నో చారిత్రక, మరెన్నో పౌరాణికి ఘట్టాలకు వేదిక. ప్రకృతి సోయగానికి నిలయం. పరమ భాగవతోత్తముడు పోతనామాత్యుడు కొంతకాలం నివసించిన ప్రదేశం. ఆయన భాగవతం పుట్టిందిక్కడే. ఇతర శ్రీరామ క్షేత్రాలు, ఆలయాలకు భిన్నంగా ఇక్కడ సీతారాముల కల్యాణం పండువెన్నెల్లో జరగడం ఏమిటి? ఇక్కడ రాముని వెంట హనుమ లేకపోవడానికి కారణం? ఈ క్షేత్రానికి ‘ఒంటిమిట్ట’ పేరు లాంటి అంశాల నేపథ్యాన్ని పరిశీలిస్తే…
ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆంధ్రా భద్రాద్రి, తెలుగువారి అయోధ్యగా ప్రసిద్ధి. ఒకప్పుడు అంటే త్రేతాయుగంలో ఈ ప్రాంతం కీకారణ్యంగా ఉండేది. ఇది మహర్షు లకు వారు చేసే యజ్ఞయాగాదులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. తమ యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగిస్తున్న రాక్షసుల నుంచి తమను కాపాడాలని మృకండు, శృంగి తదితర మహర్షులు శ్రీరాముని వేడుకున్నారు. వనవాసంలో ఉన్న రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అమ్ములపొది, పిడిబాకు, కోదండం చేపట్టి వచ్చి యాగ రక్షణ చేశాడని, దానికి కృతజ్ఞతగా ఆ మహర్షులు ఏకశిలమీద సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ, ఆ తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించాడని స్థలపురాణం. ఏ రామాలయంలోనైనా రామయ్యకు కుడివైపు లక్ష్మణుడు, ఎడమ వైపు సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమ విగ్రహాలు దర్శనమిస్తాయి. కాని ఒంటిమిట్టలో మాత్రం సీతమ్మ, లక్ష్మణుడితోనే రామయ్య దర్శనమిస్తాడు. ఆలయం వెలుపల తరువాతి కాలంలో హనుమాన్‌కు విడిగా నిర్మించిన చిన్న గుడి మాత్రం ఉంటుంది. శ్రీరాముడు ఇక్కడకు వచ్చేసరికి ఆంజనేయుని కలుసుకోవడం జరగలేదని అందుకే ఇక్కడ ఆంజనేయుడు రామయ్య దగ్గర లేడని ఓ కథనం.
ఈ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు రావడానికి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయం ఒక మిట్టమీద నిర్మితం కావడం ‘ఒంటిమిట్ట’ రామాలయమనే పేరు వచ్చిందని ఒక కథనం. ఒంటడు,మిట్టడు వారు దారి దోపిడీలకు పాల్పడి చోరీ సొత్తును ఈ ప్రాంతంలోని గుహల్లో దాచుకునే వారు. ఒకసారి వారికి కోదండరాముడు దర్శన మివ్వడంతో ఆ దొంగల బుద్ధి మారి సన్మార్గంలోకి వచ్చి స్వామివారికి గుడి కట్టించారని, అలా ఈ క్షేత్రానికి వారి పేరు మీద ‘ఒంటిమిట్ట’ అని పేరు వచ్చిందని ఓ జానపద కథ. మరో కథనం ప్రకారం, ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే బోయ సోదరులు ఉండేవారు. ఉదయగిరి పాలకుడు కంప రాజు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ సోదరులు ఆయనకు సేవలు అందించి పరిసర ప్రాంతాలను చూపాడట. అందుకు ప్రతిగా, ‘నాకు ఇంత సంతోషం కలిగించిన మీరు ఏదయినా కొరుకోండి’ అనడంతో రామాలయం కట్టించాలని అర్థించారట. ఆలయ నిర్మాణానికి అవసరమైన ధనాన్ని వారికిచ్చి ఆ ఆలయాన్ని కట్టించే బాధ్యతను రాజుకు అప్పగించాడు. ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. అలా ఈ గ్రామానికి వారి పేరు మీద ఒంటిమిట్ట అని, ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు. ఆలయంలోని విగ్రహాలను ఒకేశిలలో మలచడం వల్ల ‘ఏక శిలా నగరం’ అనే పేరు వచ్చిందని చెబుతారు.
ఇక రామయ్యకల్యాణం విషయానికి వస్తే… అన్ని క్షేత్రాలు, రామాలయాల్లో చైత్ర శుద్ధ నవమి నాడు కల్యాణం నిర్వహిస్తే, ఒంటిమిట్టలో నవమి తిథికి బదులు చతుర్దశి రాత్రి కల్యాణం జరుగుతుంది. దీని వెనుక ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. తన సోదరి శ్రీమహాలక్ష్మికి నారాయణమూర్తితో పగటి పూట పెళ్లి జరగడంతో తనకు చూసే భాగ్యం కలగడంలేదని రేరాజు చంద్రుడు బాధపడ్డాడట. దానికి భవిష్యత్‌లో తన కోరిక నెరవేరుతుందని అభయ మిచ్చాడట విష్ణుమూర్తి. అలా ఈ ఆలయంలో చైత్ర శుద్ధ నవమినాడు కాకుండా చతుర్దశి రాత్రివేళ సీతారాముల కల్యాణం జరుగుతుంది.
రామాయణం ప్రకారం సీతారాముల వివాహం చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో జరిగిందని, ఒంటిమిట్టలోనూ అదే రోజున కల్యాణం నిర్వహించాలని విజయనగర సామ్రాజ్య నిర్మాతల్లో ఒకరైన బుక్కరాయలు నిర్ణయించారట. అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోందని చెబుతారు. కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్ట రామయ్య కల్యాణం పున్నమి కాంతుల్లో జరగడం విశేషంగా చెప్పుకోవలసిన విషయం.
ఇక భక్తకవి బమ్మెర పోతనామాత్యుడు తాను ఏకశిలపురవాసిగా స్వయంగా ప్రకటించినట్లు చెబుతారు. అయితే ఆ ఏకశిలాపురం ఈ ఒంటిమిట్ట కాదని, ఓరుగల్లు అని కొన్ని చారిత్రిక కథనాలున్నాయి. ఆయన ఓరుగల్లు నివాసి కాదు ఒంటిమిట్ట వాసి అని వాదనలున్నాయి. దానికి తగిన ఆధారాలను కూడా చూపిస్తారు చరిత్రకారులు.రామదర్శనం పొంది భాగవతం రచన చేసి ఒంటిమిట్ట లోని కోదండ రామునికే అంకితం చేశారని, భాగవత రచనలో కడప మాండలిక పదాలు కూడా ఉండడం, వారి స్వస్థలం ఇదే అనడానికి మరోబలమైన సాక్ష్యమని అంటారు. దీనికి రుజువుగానే ఒంటిమిట్ట కోదండరాముని ఆలయంలో ముఖమండపం నుంచి గర్భాలయానికి వెళుతున్నపుడు ద్వారానికి బయటే కుడివైపున ఉన్న పోతన విగ్రహం అని కూడా కొందరు పండితులు బలంగా నమ్ముతారు. మహాభాగవతం రచన సందర్భంగా గజేంద్ర మోక్షంలో ‘అల వైకుంఠ పురంబులో’ అనే పద్యంలో కొన్ని చరణాలు రాయడానికి సరైన ఆలోచన రాక అక్కడ రాయడం ఆపగా, సాక్షాత్తూ శ్రీరాముడే ఆ పద్యాన్ని పూర్తి చేశాడని చెప్తారు. శ్రీరామ తీర్థానికి తూర్పున ఆయన సేద్యం చేసిన పొలాలు ఉన్నాయి. ఆయన ఇల్లు శిథిలంకాగా,అక్కడే దైవయోగంతో మరో ఇల్లు నిర్మితమైందనేవి ఆయన ఒంటిమిట్ట వాసి అనడానికి రుజువులుగా చెబుతారు., పోతనమర్యాద అన్న పేరుతొ బమ్మెరపోతన జయంతి రోజున కవిపండితు లను సత్కరించడం ఇలా చాలా విషయాలే పోతన ఈ ఒంటిమిట్టలోనే ఉన్నాడని రుజువు చేసే సాక్ష్యాలు అంటారు కొందరు చరిత్రకారులు.
అదే సమయంలో పోతన నేటి తెలంగాణలోని ఏకశిలాపురానికి చెందినట్లు కొన్ని చారిత్రిక కథనాలు చెప్తున్నాయి. మొత్తానికి ఆయన జన్మస్థలం అంశం చారిత్రక వివాదంగానే మిగిలిపోయింది.
సుమారు 500 సంవత్సరాల క్రితం విజయనగర రాజు సదాశివరాయల కాలంలో గర్భాలయం, తూర్పు ముఖ మండపం, గాలిగోపురం మూడు దశల్లో నిర్మించినట్టు శాసనాలను బట్టి తెలుస్తోంది. ఈ ఒంటిమిట్ట గ్రామంతో పాటు చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలను అప్పటి ఆ ప్రాంత పాలకులు ఆలయానికి దానం చేసినట్లు కూడా శాసనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఈ క్షేత్రం ఎందరో మహాకవులకు, కళాకారులకు నిలయంగా ఉండేది. ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతీయుడే. ఈయన మనవడే ‘అష్టదిగ్గజ కవులు’లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పు గుండూరు వేంకటకవి, వరకవి మొదలైన పేరెన్నికగన్న కవులెందరో కోదండరామునికి అక్షరార్చన చేశారు.
ఈ దేవాలయం కాలగతిలో ఎన్నో ఒడుదొడు కులు, ప్రకృతి వైపరీత్యాలు,దోపిడీలు, దొంగతనాలు, దాడులు, ఘాతకాలకు ఇలా చాలానే తట్టుకొని నిలబడిరదంటారు. వైభవాన్ని కోల్పోయి మరుగున పడిన పరిస్థితిలో వాసుదాసుగా ప్రసిద్ధి చెందిన వావిలకొలను సుబ్బారావు అవిరళ కృషితో పునరుద్ధరణ జరిగింది. భద్రాచలం శ్రీరామునికి రామదాసుకు ఉన్న అవినాభావ సంబంధమే ఒంటిమిట్ట కోదండరామునికి వావికొలనుకు ఉందని పెద్దలు చెబుతారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగు లోకి అనువదించి, ‘ఆంధ్ర వాల్మీకి’గా పేరుపొందిన వావిలకొలను (1863-1936) రెవెన్యూ శాఖలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఆలయ పునరుధ్ధరణకు జీవితాన్ని అంకితం చేశారు. ఎందరో రాజులు, జమీందారులు, సంపన్నులు ఇచ్చిన వందలాది ఎకరాల భూములు, సంపద అన్యాక్రాంత మయ్యాయి. నైవేద్యం పెట్టే నాథుడు కూడా లేని జీర్ణదశకు చేరుకుంది ఆలయం. అలాంటి సమయంలో వావిలకొలను సుబ్బారావు ఒంటిమిట్టలో నివాస మేర్పరచుకొని ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నారు. టెంకాయ చిప్ప చేత పట్టుకొని, ఊరూరా పాద యాత్రతో ధనం సేకరించి ఆలయాన్ని పునరుద్ధ రించారు. ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చిన వావిలకొలనుకు రామలక్ష్మణులు బైరాగుల రూపంలో దర్శనమిచ్చారనే కథనం ప్రచారంలో ఉంది.
ఈ ఆలయంలోని ‘రామబుగ్గ’ కాలక్రమంలో రామతీర్థంగా మారింది. దీనిని సీతమ్మ కోసం రాముడే ఏర్పాటు చేశాడని అంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి ఇక్కడే చక్రస్నానం నిర్వహించే వారు. ఆ తరువాత ఆలయానికి ఎదురుగా మరో పెద్ద నూతన పుష్కరిణి నిర్మించారు.
ఒంటిమిట్ట కోదండరాముని మహిమల గురించి ఉన్న కథలలో ఒకదానిని ఉదాహరణగా చెప్పుకుంటే… 1640 ప్రాంతంలో కడప ప్రాంత పాలకుడైన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్ ఒకసారి ఆలయం వద్దకు వెళ్లి ‘మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా?’ అని అక్కడి భక్తులను అడిగాడట. ‘చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడే’ అని వారు సమాధానం ఇచ్చారు. ఆ ప్రకారం ఆయన ఆలయ ద్వారం దగ్గరకు వెళ్లి మూడు సార్లు రాముణ్ణి పిలవగా, ప్రతిగా మూడుసార్లు ‘ఓ’ అని సమాధానం వచ్చిందట. దాంతో ఆయన స్వామి భక్తుడిగా మారిపోయాడని కథనం. భక్తుల కోసం ఏదైనా మేలు చేయాలన్న భావనతో మంచినీటి బావిని తవ్వించాడు. అది ‘ఇమాంబేగ్ బావి’ అని ప్రసిద్ధి చెందింది. అప్పటినుంచి ఎందరో ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయాన్ని, ఇమాంబెగ్ బావిని సందర్శిస్తూ ఉంటారు.
ఈ క్షేత్రానికి విమాన, రైలు, రోడ్డు మార్గాలలో చేరుకోవచ్చు. విమానంలో వచ్చేవారు కడప విమానా శ్రయంలో దిగి, అక్కడి నుంచి వివిధ రకాల వాహనాలలో ఒంటిమిట్టకు చేరవచ్చు. మరో విమానాశ్రం రేణిగుంట.. అక్కడికి 112 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా అయితే అక్కడి స్టేషన్‌లో దిగి కిలోమీటర్ దూరంలోని ఆలయానికి చేరవచ్చు. కడపలో దిగితే అక్కడి నుంచి 25 కి.మీ ప్రయాణించవలసి ఉంటుంది..
– మావూరు విజయలక్ష్మి