‘‘‌గిరిజన పోరాట చరిత్ర మానవాళికి అపూర్వ సందేశాన్నిస్తుంది. ప్రకృతిని పరిరక్షించవలసిన అవసరాన్ని, పర్యావరణంతో మమేకమై జీవించాల్సిన అనివార్యతను ఆధునిక ప్రపంచానికి తెలియజేస్తుంది. ఆదివాసీ సమాజాలు వ్యక్తిగత అకాంక్షలకన్నా సమష్టి మేలుకే ప్రాధాన్యమిస్తాయి, కాబట్టి మానవాళి భవితవ్యం ఉజ్జ్వలం కావాలంటే గిరిజన సమాజాలకున్న ఆ లక్షణాన్ని ప్రోత్సహించాలి’’.

– ద్రౌపదీ ముర్ము (భారత రాష్ట్రపతి)

పండిత పరిశోధకుడు తంగిరాల సుబ్బారావు తన ‘రేనాటి సూర్యచంద్రులు’ పుస్తకంలో మనకు తెలియని ఇద్దరు తెలుగు వీరుల గురించి రాశారు. (స్వాతంత్య్ర పోరా•) ‘‘యుధ్దకాలమున గోసాయి వెంకన్న, ఒడ్డె ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మిన బంట్లు, నాకు లభించిన లఘువీర గాథల్లో వీరి ప్రస్తావన ఉన్నది.’’

మజ్జారి నరసింహారెడ్డి (కంపెనీ పింఛను తీసుకుంటున్న పాలెగాడు) మీద శ్వేతజాతి ఒక కన్నేసి ఉంచదలిచింది. కడప యాక్టింగ్‌ ‌కలెక్టర్‌ ‌జాబు ఇదే చెబుతున్నది. ఇలా: ఆ పాలెగాడు కొందరు కొండవాళ్లను కూడగట్టుకొని, బంట్రోతులను పోగు చేసుకుని, ఆయుధాలు కూడా సమకూర్చుకొని ప్రభుత్వాన్ని ధిక్కరించడానికి ఆయత్తమవుతున్నాడని కోయలకుంట్ల తాసీలుదారు తాలూకాదార్లకు సమాచారం ఇచ్చాడు. ఆఖరికి బంట్రోతులను పెట్టి బందోబస్తుగా పంపిస్తే ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదు. సరికదా, తిరగబడి బెదరగొట్టి వారిని పంపినట్లు కోయలకుంట్ల హెడ్‌ ‌పోలీసు తనకు వర్తమానం పంపాడని కూడా కోయలకుంట్ల తాసీలుదారు వెల్లడించాడు. అందువల్ల నరసింహా రెడ్డిని, అతని మనుషుల్ని ఒక కంట కనిపెడుతూ ఉండవలసినదిగా కోరుతూ కర్నూల్‌లోని గవర్నర్‌ ‌తాలూకు ఏజెంట్‌కు కడప యాక్టింగ్‌ ‌కలెక్టర్‌ ‘‌కాక్రేన్‌’ ‌జూలై 06, 1846 తేదీన ఒక జాబు పంపాడు.

ఈ జాబు వెలువడిన వారానికే నరసింహారెడ్డి సాహస కృత్యాలు విని మరొకసారి కంపెనీ అధికారులు భయపడవలసి వచ్చింది. నరసింహారెడ్డి బృందం జూలై 10న కోయలకుంట్ల ట్రెజరీని కొల్లగొట్టారు. రూ. 805, 10 అణాల 4 పైసలను దమ్మిడీలతో సహా ఊడ్చుకుపోయారు. అడ్డగించిన సిబ్బందిలో చాలామందిని గాయపరిచి, ఒక డఫేరును చంపి కోయటకుంట్ల తాసీలుదారు రాఘవాచార్యులను నరసింహారెడ్డి మనుషులు నిర్భంధంలోకి తీసుకున్నారని జమ్మలమడుగు హెడ్‌ ‌పోలీసు ద్వారా కలెక్టర్‌ ‌కాక్రేన్‌కు వర్తమానం చేరింది. జూలై 11, 1846 చాగలమర్రి తాలూకా, రుద్రవరం గ్రామం పైనబడి నరసింహారెడ్డి బృందం (బహుశ 7,8 తేదీల్లో కావచ్చు) కొల్లగొట్టుకొని పోతుండగా పోలీసు తదితర ప్రభుత్వ సిబ్బంది వెళ్లి మిట్టపల్లి దగ్గర ఎదుర్కొన్నది. ఆ పోరాటంలో హెడ్‌ ‌ఢపేదార్‌, ‌మరో 9 మంది బంట్రోతులను నరసింహారెడ్డి మనుషులు చంపి వాళ్ల ఆయుధాలను లాక్కొని పరారైపోయినట్లు కలెక్టర్‌కు దువ్వూరు తాలూకా తాసీలుదారు ద్వారా వర్తమానం వెళ్లింది.

నరసింహారెడ్డి కంపెనీని గడగడలాడించిన మాట నిజం. మొదట్లో ఆయన నాయకత్వంలో 9000 మంది ఉండవచ్చుననుకొన్నారు. కానీ కలెక్టర్‌ ‌వారు 3000 దాటక పోవచ్చునని అభిప్రాయపడ్డాడు. వనపర్తి జమీందార్‌ ‌రాజా రామేశ్వర్రావు, మునగాల జమీందార్‌ ‌రామకృష్ణారెడ్డి, జటప్రోలు సంస్థానాధీశుడు లక్ష్మణరాయుడు, పెనుగొండ, ఔకు జమీందార్లు, హైదరాబాద్‌కు చెందిన సలామ్‌ఖాన్‌, ‌కర్నూలుకు చెందిన పాషాఖాన్‌, ‌బనగానిపల్లె నవాబు మహమ్మ దారీ ఖాన్‌ ‌ప్రభృతులు నరసింహారెడ్డికి బాసటగా నిలుస్తున్నారనీ, ముఖ్యంగా కట్టుబడి బంట్రోతులు, చెంచులు, వడ్డెరలు, యానాదులు, బోయలు ఇతర సంచార జాతులు, కొందరు బ్రాహ్మణులు సైతం నరసింహరెడ్డి ముఠాలో ఉన్నారనీ కలెక్టర్‌ అభిప్రాయ పడ్డాడు.

కలెక్టరు అభిప్రాయం ప్రకారం నరసింహారెడ్డి తిరుగుబాటు వెనుక ఆకుమళ్ల గ్రామవాసి గోసాయి వెంకన్న ఉన్నాడు. ఆయన నరసింహారెడ్డికి మత గురువు. ఆయనకు మానవాతీత శక్తులున్నాయని నమ్మేవారు. ఆయనతోపాటు ఒడ్డె ఓబన్న, కర్ణం అశ్వత్థామ, దాసరి రోసిరెడ్డి, జంగం మల్లయ్య కూడా ఉన్నారు. వీరందరి తలలపై రివార్డులు ప్రకటించారు. చరిత్రకారులు వీరందరిపైన పరిశోధనలు జరపాలి. బోయర్స్ ‌యుద్ధం ఎంత ముఖ్యమో బోయిల వడ్డెర చరిత్ర అంతే ముఖ్యం.

ఔ..ణ. ఇంగ్లీషును స్పెషల్‌ ‌కమిషనరుగా నియమించి వీరిలో కొందరిని పట్టుకోగలిగారు.  కాలికి గాయం కావడంతో నరసింహారెడ్డి అక్టోబరు 6, 1846న దొరికిపోయాడు. ఆనాటి పోరులో 40 లేదా 50 మంది మరణించారు. 90 మంది పట్టుబడ్డారు. 100 మంది గాయపడ్డారు. 901 మందిపై నేరం మోపారు. 412 మందిని వదిలేశారు, 273 మందిని పూచీకత్తు తీసుకుని వదిలేశారు. 112 మందికి కఠిన శిక్షలు పడ్డాయి. ఒక దశలో 600 మంది దాక జైళ్లలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫిబ్రవరి 22, 1847 సోమవారం ఉదయం 7 గంటలకు కలెక్టర్‌ ‌కాక్రేన్‌ ‌సమక్షంలో నరసింహారెడ్డిని ఉరి తీశారు. ఆ దారుణాన్ని దాదాపు 2 వేల మంది నోళ్లు కుట్టేసుకుని గుడ్లప్పగించి చూశారు.

 గోసాయి వెంకన్న నరసింహారెడ్డికి మత గురువు వంటివాడనీ, అప్పుడప్పుడు భవిష్యద్దర్శనం చేసి రెడ్డికి కొన్ని హితబోధలు చేసేవాడని, కుంఫినీ (ఈస్ట్ ఇం‌డియా కంపెనీ) సర్కార్‌పై సాయుధ పోరాటానికి దిగనిదే నరసింహారెడ్డికి అతీగతీ లేదని మంత్రోపదేశం చేసినవాడు ఈ గోసాయేనని, రెడ్డికి ఏదో పసరుపూత పూసి ఆశీర్వదించి పంపాడనీ కలెక్టర్‌ ‌రిపోర్టులో వివరంగానే రాశాడు.

చారిత్రక వీరగాథలలో ఉయ్యలవాడ నరసింహా రెడ్డి కధ కడప, కర్నూలు మండలాలలో ప్రాచుర్యంలో ఉంది. జానపదల పాటలరూపంలో ఈ చరిత్రను చెబుతారు. ‘తండ్రి పేరు పెద్దిరెడ్డి, తాతపేరు జయరామిరెడ్డి. ఇంటి పేరు మద్దిలోళ్లు – తనపేరు నరసింహారెడ్డి వోహువా! నరసింహారెడ్డి! నీ పేరంటే – రాజా నరసింహారెడ్డి’. ఇతడు రూపనగుడి గ్రామంలో పుట్టాడని ఉయ్యలవాడలో పెరిగాడని చెబుతారు. ఇతడు అరవై ఆరు గ్రామాలకు అధిపతి. వీరినే (పాలెగాండ్రు) జమేదారులు అంటారు.

జయరామిరెడ్డి కాలంలోనే సా.శ (సాధారణ శకం) 1800లలోనే ఆంగ్లేయులు నొస్సం సంస్థానాన్ని వశపరుచుకొని నెలకు 11 రూపాయలు తవర్జీ  ఏర్పాటు చేసిరి. 1845లో నరసింహారెడ్డికి ఈ తవర్జీ (భరణము) అందింది. ఆ తవర్జీ విషయంలోనే వివాదం వచ్చి తాసీలుదారు తలగొట్టి చంపాడు. సైన్యంతో వెళ్లి అతని తలను, ధనాగార కాపలాదారు నారసింగ్‌ ‌తలను నయనాలప్ప కొండ శివాలయంలోని గుహలో దాచాడు. ఆ తలలను కనుగొని వాటిని భద్రపరిచిన గోసాయి వెంకన్న, ఒడ్డె ఓబన్నలను బంధించి కడప కలెక్టరు, పోలీసు సూపరెండెంటు చిత్రహింస•లకు గురిచేశారు.

1847లో ఆంగ్లేయుల లెఫ్టనెంట్‌ ‌వాట్సన్‌ ‌నాయకత్వంలో పెద్ద సేనతో నరసింహారెడ్డిని అణచే ప్రయత్నం చేశారు. నరసింహారెడ్డి వేలాది సైన్యంతో గిద్దలూరు వద్ద వాట్సన్‌తో తలపడ్డాడు. కాని ఓడించలేకపోయారు. కొంత కాలం గడిచాక జగన్నాథపురం కొండపై ఉన్నాడు. ఆంగ్లేయులు తమ యుక్తినే ఇక్కడ ప్రయోగించారు. నరసింహారెడ్డి వంటమనిషికి లంచమిచ్చి పట్టుకొన్నారు. కోవెల కుంట్లకు తెచ్చి జుర్రేరు ఒడ్డున ఉరి తీశారు.

మద్రాసు రాష్ట్ర పరిపాలనా చరిత్రలో ఈ ఉదంతం ఇలా నమోదై ఉన్నది. 1847లో ఉరి తీసినప్పటికీ నరసింహారెడ్డి శిరస్సును 1877 వరకు అదే ఉరి కొయ్యకు వ్రేలాడదీసి ఉంచారు.

లఘువీర గాథ కోలాటపు పాటలో

‘‘కండ్లకు గంతలు గట్టీ నోటినిండా బట్టలు నిలువునా / నీ తలను గొట్టీ కోట బురుజు గట్టిరీ’’

సీతడు, గోసాయి వెంకన్న, కలికి నారిగాడు, ఒడ్డె ఓబయ్య అంగరక్షకుడు ఖాసీం సాహెబ్‌ ‌మొదలైన వారు నరసింహారెడ్డికి ఆంతరంగికులు.

నరసింహారెడ్డి చివరి ఘడియల గురించి ఉద్వేగభరితమైన కథనాలు వినిపిస్తాయి. కంభం తసీల్దారును చంపిన నరసింహారెడ్డి ఒడ్డే ఓబయ్యను, గోసాయి వెంకన్నను వెంటబెట్టుకుని నల్లమల అడవుల్లో దాగాడు. సైన్యం చెల్లా చెదురైంది. సర్కారు వారు వీరి కోసం గాలించారు. ఆ ముగ్గురు అడవిలో వేణు పొదలలో కూర్చుని మాట్లాడుకున్నారట.

నరసింహ అడిగాడు, ‘వెంకన్న! ఇప్పుడేమి చేద్దాం? సర్కారు మనలను విడిచిపెడుతుందని నేను అనుకోను’. వెంకన్న సమాదానమిస్తూ, ‘మనకాయువు తీరినప్పుడు ఏమి చేయగలం? ఎక్కడ దాగినా చావు తప్పదు’ అన్నాడు. ఓబయ్య కలుగజేసుకొని రాచపీనుగు తోడు లేకుండా వెళ్లదు. వాళ్లు మనలని చంపే లోగా వారిలో కొందరిని మనం కడతేర్చక వదులుతామా?’ అన్నాడు.

నరసింహ వెంకన్నను అడిగాడు, ‘వెంకన్నా! ఇప్పుడు సైన్యం ఎంత దూరం వచ్చిందో అంజనం వేసి జెప్పగలవా?’ వెంటనే వెంకన్న చెప్పగలనని చెప్పాడు. కానీ అందుకొక ఆముదపు దీపం కావాలి. అదెక్కడ దొరకుతుంది? అనగానే ఓబయ్య, అహోబిలం గుడిలో ఆముదపు దీపం నిరంతరం వెలుగుతూ ఉంటుంది.’ అన్నాడు. ముగ్గురు అహోబిలం గుడి దగ్గరకు చేరుకున్నారు. గోసాయి వెంకన్న పొదలలోనికి వెళ్లి ఆకులు తీసుకొని వచ్చి పసరు తీస్తుండగా, నరసింహ, ఓబయ్యలు గుడి తలుపులు తెరిచి దీపం సరి చేశారు. అంతలో వెంకన్న పసరు తీసుకువచ్చి ఓబయ్యను దీపం ఎదురుగా కూర్చోబెట్టి కన్నార్పకుండా చూస్తూ అడిగిన దానికి సమాధానము చెబుతున్నాడు.

వెంకన్న అడిగాడు, సైన్యం ఎలా వస్తున్నది? ఓబయ్య పడవలో వస్తున్నారు అన్నాడు. ఆ సైన్యం ఎంత దూరంలో ఉన్నది, మళ్లీ ప్రశ్న. అదిగో సైన్యం డిప్యూటీ సూపరెండెంట్‌ ‌కూడా సైన్యంతో మనలను సమీపిస్తున్నాడు. అదిగో, వచ్చారు, అన్నాడు ఓబయ్య.

వెంటనే వెంకన్న ఓబయ్య కన్నులు మూసి, ఇక మనమిక్కడ ఉండరాదు అని చెప్పే లోపల బయట పెద్ద శబ్దం వినబడింది. వెంకన్న మనం ముగ్గరం పారిపోదాం అన్నాడు నరసింహ. ఓబయ్య ఇలా అన్నాడు, ముగ్గురం ఒకేసారి పరిగెత్తడం మంచిది కాదు. నరసింహారెడ్డి దేవుని వెనుక దాగి ఉంటాడు, మన మిద్దరం ముసుగు వేసుకొని పరుగెడదాం. మనిద్దరిలో ఒకరు నరసింహారెడ్డి అని తరుముతూ మొత్తం సైన్యం మన వెనుక పరుగులు పెడతారు. వెంటనే నరసింహారెడ్డి తప్పించుకుంటాడు అని చెప్పాడు. ఈ ప్రణాళికను అంగీకరించారు. వీరిద్దరు ముసుగులు వేసుకుని చెట్ల చాటు నుండి సుమారు అరమైలు పరుగెత్తారు. నరసింహారెడ్డి పారిపోతున్నాడని మొత్తం సైన్యం వెంటబడి కాల్పులు జరపగా ఓబయ్య, గోసాయి వెంకన్న మరణించారు. ఆ విధంగా తన మరణంలో కూడా తన ప్రభుభక్తిని చాటుకున్న ధీరులు గోసాయి, ఓబయ్య.

ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం (ఓబయ్య) ఆ సమర యోధుని జన్మదినాన్ని ప్రభుత్వ పండుగగా నిర్వహించడానికి పూనుకోవడం చాలా ముదావహం ఈ విధంగా ఆ మహావీరునికి నివాళులర్పించుదాం.

మూలం:

  1. రేనాటి సూర్యచంద్రులు బై తగిరాల వెంకట సుబ్బారావ్‌ ‌పి.139 టు 144 – 250 టు 254.
  2.  Brief History of Madanapalli F.A. Coleridge (P-23)
  3.  A Manual of the Kurnool District by Maruhari Gopala Krishna Seetty

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE