రాష్ట్రంలో నిధులు లేక నిలిచిపోయిన 92 కేంద్ర పథకాలు ఊపు అందుకోనున్నాయి. నిధుల లేమితో కునారిల్లుతున్న పథకాలు కేంద్ర సహాయంతో వేగం పుంజుకోనున్నాయి. ఈ పథకాలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తన వంతు నిధులు చెల్లించడం ద్వారా కేంద్రసాయం పొందుతూ, రాష్ట్ర అభివృద్ధికి తిరిగి బాటలు వేసింది. గత వైసీపీ ప్రభుత్వం చూపిన అలసత్వానికి మరమ్మతులు చేయనారంభించింది. కీలకమైన ఈ నిర్ణయంతో రాష్ట్రంపై పడే ఆర్ధికభారం సగం వరకు తగ్గిపోనుంది.
రాష్ట్రంలోని వివిధ రంగాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకు సాగుతుంటాయి. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా నిధులను కేటాయిస్తుంటుంది. ప్రత్యేకించి కొన్ని పథకాలకు రాష్ట్ర వాటా చెల్లించాక కేంద్ర ప్రభుత్వం తన వంతు నిధులను విడుదల చేస్తుంటుంది. ఆ నిధులతో పెద్ద ఎత్తున వివిధ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంటారు. అయితే రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో సుమారు 92 పథకాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈ దశలో కూటమి ప్రభుత్వం అందుకు సంబం ధించిన రూ.7,230 కోట్ల పెండిరగ్ నిధులతో పాటు 2025-26 సంవత్సరానికి సంబంధించి చేపట్టబోయే కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా నిధులు కలిపి రూ.12,336 కోట్లు విడుదలయ్యాయి. దీంతో రాష్ట్రంలో నిలిచిపోయిన కేంద్ర ప్రాయోజిత పథకాలకు తిరిగి మోక్షం లభించినట్లయింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధికి ఊతం లభించి నట్లయింది.
2019-20 మధ్య కాలంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్రం తన చెల్లించక పోవడంతో ఆయా పథకాలకు సంబంధించిన కేంద్ర వాటా నిధులు మురిగిపోయాయి. గత ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి పెండిరగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు కూడా టెండర్లు పిలిచేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసింది. పోలవరం ప్రాజెక్టుతో పాటు మరికొన్ని పథకాలపై కూడా ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి రావలసిన పెండిరగ్ నిధులు, పాత బకాయిలు కూడా రాబట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా రాష్ట్రంలో తిరిగి పునఃప్రారం భించాలని సంకల్పించింది.
రాష్ట్రంలో పనులు పునరుద్ధరణ
కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాను కేంద్రానికి చెల్లించడంతో వివిధ పనులు పునరుద్ధరణ కాబోతున్నాయి. ప్రధానంగా గ్రామీణాభివృద్ధికి 9పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోబోతున్నాయి. అందులో భాగంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి రూ.1000 కోట్లకు పైగా పెండిరగ్ నిధులను విడుదల చేశారు. అలాగే ప్రస్తుత ఏడాది పనులకు సంబంధిం చిన రూ.1,873 కోట్లు చెల్లించారు. జలజీవన్ మిషన్ కార్యక్రమానికి సంబంధించిన రూ.571 కోట్లు పెండిరగ్ వాటా, రూ.875 కోట్లు ప్రస్తుత వాటా నిధులను విడుదల చేశారు.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, స్వచ్ఛభారత్ పథకం… ఇలా వివిధ పథకాలకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులను చెల్లించింది. దీంతో ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తిరిగి పునరుద్ధరణ కాబోతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 10 పథకాలకు సంబంధించి తిరిగి కార్యక్రమాలు, అందులో ప్రధానంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఊపందుకోబోతున్నాయి. అందుకోసం గతంలో పెండిరగ్‌లో న్న రూ.164 కోట్లతో పాటు ప్రస్తుత ఏడాదికి సంబంధించి రూ.1851 కోట్లు చెల్లించింది.మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి కూడా 8 కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు తిరిగి విడుదల కాబోతున్నాయి. సంబధిత పెండిరగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. దీంతో మహిళలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. వ్యవసాయాభివృద్ధికి కూడా 17 పథకాలకు సంబంధించి పెండిరగ్ బకాయిలను చెల్లించారు. దీంతో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రైతులకు తిరిగి అభివృద్ధి ఫలాలు అందుబాటులోకి రాబోతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఇలా….
కేంద్ర పథకాల నిధులను వినియోగించక పోవడం, దుర్వినియోగం చేయడంలో వైసీపీ ప్రభుత్వ నిర్వాకానికి జల్‌జీవన్ మిషన్ (జేఎంఎం)ను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. 2018 ఆగస్టులో ప్రారంభమైన జేజేఎం కింద ఏపీలో రూ.27,248 కోట్ల అంచనాతో 77,917 పనులను కేంద్రం ఆమోదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులను సమకూర్చాలన్న ఒప్పందానికి జగన్ సర్కార్ తూట్లు పొడిచింది. 2019-20 నుంచి 2023-24 మధ్య కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.2,254.89 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర వాటా కింద రూ.1630.36 కోట్లను గత సర్కార్ ఇచ్చింది. పనులు చేసిన గుత్తేదారు సంస్థలకు రూ.535.50 కోట్లకు పైగా బిల్లులు పెండిరగ్‌లో పెట్టారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు సరిగ్గా ఇవ్వకపోవడంతో, జల్‌జీవన్ మిషన్ అమలు సమస్యాత్మకంగా మారింది.
అదే విధంగా రూ.4,976 కోట్ల అంచనాతో ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ఆర్థిక సాయంతో చేపట్టిన గ్రామీణ రహదారుల నిర్మాణ పనులకూ ఏపీ గత ప్రభుత్వం తన వంతు వాటా నిధులను సక్రమంగా విడుదల చేయలేదు. మరోవైపు డ్యాంల భద్రతకు కేంద్రం అమలు చేస్తున్న పథకంలో ప్రపంచ బ్యాంకు సాయంలో కేంద్ర ప్రభుత్వం 70 శాతం, రాష్ట్రం 30 శాతం నిధులు భరించవలసి ఉంది. ఆ 30 శాతం భరించేందుకు జగన్ సర్కార్ ముందుకు రాలేదు. దీంతో ప్రాజెక్టుల భద్రతకు కేంద్రం ఇచ్చే నిధులను సరిగా ఉపయోగించుకోలేదు.
ఉద్యాన పంటలను ప్రోత్సహించడానికి గతంలో కేంద్ర ప్రభుత్వ కృషి సించాయి యోజన కింద తుంపర సేద్యం పథకానికి డ్రిప్, స్ప్రింక్లర్లు అధిక సబ్సిడీతో ఇచ్చేవారు. పండ్ల మొక్కలు ఉచితంగా ఇవ్వడం, తొలుత మూడు సంవత్సరాల పాటు ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి నిధులు ఇవ్వటం, తైవాస్ స్ప్రేయర్లు, టార్పాలిన్న ఇవ్వటం వంటి కొన్ని ప్రోత్సాహకాలను అందించారు. దీనివల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు చేయడాన్ని నిలిపివేయడంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు, రైతులపై అదనపు భారం పడిరది.
వ్యవసాయంలో సాంకేతిక అమలుకు డ్రోన్‌ల వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయడంలో నాటి వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10778 ఆర్‌బీకేల్లో ఒక్కొక్కటి చొప్పున డ్రోన్‌లను వినియోగించాలని నిర్ణయించారు. మొత్తం వ్యయం రూ.1,070 కోట్లు. అందులో 50 శాతం రాయితీ ప్రకారం చూసినా కేంద్ర, రాష్ట్రాల వాటా రూ.500 కోట్లే అవుతుంది. అందులోనూ కేంద్రం ఇచ్చేది రూ.400 కోట్లు. రాష్ట్రం కనీసం రూ.100 కోట్లు ఖర్చు పెడితే సరిపోయేది. డ్రోన్ ప్రాజెక్టుకు అడుగులు పడేవి. అయితే జగన్ ప్రభుత్వం ఆ మాత్రం కూడా ఖర్చు చేయలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. రాష్ట్రంలో యాంత్రీకరణ సహా పలు పథకాలను అటకెక్కించింది. కనీసం టార్పాలిన్లు, స్ప్రేయర్లు, ఆధునిక యంత్ర పరికరాలు కూడా ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది. రైతులకు సూక్ష్మ పోషకాల పంపిణీని నిలిపివేశారు.
కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్ర భవనాల నిర్మాణానికి నిధులు ఇచ్చినా వాటిని గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. రాష్ట్రంలో 55,745 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో 23,279 (41.75%) అద్దె భవనాల్లో, 410 (7.9%) పాక్షిక పక్కా భవనాల్లో కొనసాగుతున్నాయి.రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 1,743 కేంద్రాలు అద్దె భవనాల్లో, 1,095 కేంద్రాలు పాక్షిక పక్కా భవనాల్లో నడుస్తున్నాయి. కాకినాడ, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనూ వెయ్యికి పైగా కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగు తున్నాయి.
మిషన్ పోషణ్ 2.0 ప్రారంభించిన నాటినుంచి ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 1,864 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి అనుమతినిచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2024-25 వరకు ఎలాంటి ప్రతిపాదనలూ సమర్పించక పోవడంతో పథకం కింద ఎలాంటి నిధులూ విడుదల చేయలేదు.
నగరాల్లో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి జాతీయ స్వచ్ఛవాయు కార్యక్రమం కింద రాష్ట్రంలోని 13 నగరాలకు రూ.361 కోట్లు విడుదల చేయగా, గత ప్రభుత్వం అందులో రూ.173 కోట్లు (48%) మాత్రమే ఖర్చు చేసింది. ఇందులో విజయవాడకు రూ.130 కోట్లు విడుదల చేయగా, కేవలం రూ. 46 కోట్లు (35%), విశాఖకు రూ.129 కోట్లకుగాను రూ.39 కోట్లు 30 (23%) మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన 11 నగరాలకు ఇచ్చిన రూ.102 కోట్లలో రూ.88 కోట్లు (86.27%) ఖర్చయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేంద్ర పథకాలను నాటి వైసీపీ ప్రభుత్వం అమలుచేయక నిర్యక్షం చేసింది. ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్