నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆఖరి అనుయాయి పొస్‌వుయి స్వురో ఏప్రిల్ 15న కన్నుమూశారు. 106 ఏళ్ల స్వురో నాగాల్యాండ్‌లోని రుజజో గ్రామంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన తన గ్రామానికి పెద్దగా – డీబీ వ్యవహరించారు. నేతాజీ 1940 సంవత్సరంలో రుజజో గ్రామంలో తొమ్మిది రోజులపాటు ఉన్నప్పుడు స్వురో ఆయన వెన్నంటి ఉన్నారు. నేతాజీకి దుబాసీగా, గైడ్‌గా వ్యవహరించారు. సుభాష్ చంద్రబోస్‌కు, స్థానిక నాగా నేతలకు మధ్య వారధిగా ఉన్నారు. స్వురోకు అనేక భాషలు తెలుసు. దీంతో స్వరాజ్య ఉద్యమం సందర్భంగా నేతాజీ నెలకొల్పిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి- ఐఎన్‌ఏ స్వురో తరగని ఆస్తిగా మారారు. ఒకానొక ఇంటర్వ్యూలో నేతాజీతో తన జ్ఞాపకాలను పంచుకుంటూ ‘‘నేతాజీ ఆదేశానికి లోబడి ఆజాద్ హిందు ఫౌజ్ కోసమని దరిదాపుల్లోని గ్రామాలకు వెళ్లి నిత్యావసర వస్తువులు తీసుకొచ్చేవాడ్ని. ఒకసారి అలా వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు బ్రిటిష్‌బలగాలు మాపై హఠాత్తుగా దాడి చేశాయి. దాడిలో ముగ్గురు జపాన్ సైనికులు, నాగా నేత కన్నుమూశారు. నేతాజీ మా ఊరు విడిచి వెళుతున్నప్పుడు భారత్ విజయం సాధించిన తర్వాత తిరిగి వస్తానని మాట ఇచ్చారు. తిరిగి వచ్చినప్పుడు గ్రామానికి పాఠశాల, రహదారులు, పైపుల ద్వారా నీరు సమకూరుస్తానని వాగ్దానం చేశారు’’, అని చెమ్మగిల్లిన కనులతో స్వురో చెప్పారు.