నేపాల్‌లో హిందూరాజ్యం కావాలన్న నినాదం, రాజ్యాంగబద్ధ రాచరికం రావాలన్న నినాదం జోరందుకుంటున్నాయి. ఇదే డిమాండ్‌తో మార్చి 28న రాజు అనుకూలురుకి, భద్రతాదళాలకి పెద్దఎత్తున ఘర్షణ జరిగింది. ఇద్దరు చనిపోయారు. 30 మంది గాయపడ్డారు. ప్రధాని కేపీ ఓలి అత్యవసర సమావేశం జరిపి పరిస్థితిని సమీక్షించారు. సరిగ్గా 20 రోజుల క్రితం రాజు అనుకూలురు పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ‘ఓ రాజా! మళ్లీ వచ్చి దేశాన్ని కాపాడు’. ‘మాకు రాచరికం కావాలి’, ‘రాజ ప్రాసాదాన్ని ఖాళీ చేయండి’… మార్చి 8న నేపాల్ రాజధాని ఖట్మాండును హోరెత్తించిన నినాదాలు ఇవి. రెండు మాసాల క్రితం పోఖారా (గండకి ప్రాంత పాలనా కేంద్రం, ప్రముఖ పర్యాటక స్థలం) వెళ్లి, దానితో పాటు చుట్టుపక్కల ఆలయాలను దర్శించుకుని తిరిగి ఖట్మాండు వచ్చిన రాజు జ్ఞానేంద్ర షాకు ప్రజలు అపూర్వ స్వాగతం చెప్పారు. రాజు అనుకూల వర్గాలు, కార్యక్రమం నిర్వహించిన వారు ఆ రోజు నాలుగు లక్షల మంది హాజరయ్యారని చెబుతుండగా, అసోసియేట్ ప్రెస్ మాత్రం పదివేల మంది హాజరయ్యారని చెప్పింది. నిజానికి జ్ఞానేంద్ర రావడానికి వారం ముందు నేపాల్ రాజధానిలో పెద్ద బైక్ ర్యాలీ కూడా జరిగింది. వారి నినాదం కూడా అదే – నేపాల్‌లో తిరిగి హిందూ రాచరికం రావాలి.
తమ ధ్యేయం రాజును తిరిగి సింహాసనం మీద ప్రతిష్ఠించడమేనని, రాజుకు తాము మద్దతుగా ఉన్నామని 72 ఏళ్ల థిర్ బహదూర్ భండారీ మీడియాకు చెప్పారు. ‘దేశంలో మార్పు గాలులు వీస్తున్నాయి. నేపాల్ రాచరిక వ్యవస్థ పునఃప్రతిష్ఠ కోసం మూడో ఉద్యమం మొదలైంది. ఇదే సమాఖ్య వ్యవస్థ రద్దుకు జరుగుతున్న ఉద్యమం కూడా’ అని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకుడు శ్యామల్ కృష్ణ శ్రేష్ఠ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేపాల్‌లో హిందూ రాచరికం పునరుద్ధరణకు గట్టి ఉద్యమమే జరుగుతున్నది. అయితే 2006లో జ్ఞానేంద్ర పాలనను అంతం చేయడానికి జరిగిన ఉద్యమంలో చైనా ఉన్నదని చాలామంది నమ్ముతారు. నేపాల్‌లో 240 ఏళ్ల పాటు హిందూ రాచరికం పరిఢవిల్లింది. రాజు పట్ల ప్రజలు తమ విధేయతను పునఃప్రదర్శించడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. అందుకు కారణం ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల అవినీతి, పేదరికం. 2008 నుంచి నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం లేదు. రాజును దింపి, గణతంత్ర రాజ్యంగా మార్చినప్పటి నుంచి 13 ప్రభుత్వాలు మారాయి.
అయితే దేశంలో తిరిగి రాచరికం ఏర్పడడం సాధ్యం కాదని నేపాల్ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందులో ప్రధాని కేపీ శర్మ ఓలి కూడా ఉన్నారు. జ్ఞానేంద్ర రాజధానికి చేరుకోవడానికి ఒకరోజు ముందు, అంటే మార్చి 7న కేపీ శర్మ మాట్లాడుతూ, కొందరు రాచరికం పునరుద్ధరణ గురించి గొంతు చించుకుంటున్నారని అది సాధ్యం కాదని అన్నారు.
నేపాల్ కూడా ఒకనాడు ఒక సంస్థానం స్థాయిలోనిదే. పృథ్వి నారాయణ్ షా రాజు అయిన తరువాత ఈ ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉన్న రాజ్యాలను ఏకం చేశాడు. అవన్నీ కలిపి 1768లో నేపాల్ రాజ్యంగా అవతరించాయి. 1800 సంవత్సరం వరకు రాజ ప్రతినిధులు, తమకు తామే ప్రధానులుగా నియమితులైన వారు షా రాజవంశం పేరుతోనే పరిపాలన సాగించారు. 1950లో త్రిభువన్ షా తన పూర్వికుల మాదిరిగా మంత్రి పదవికే పరిమితం కాకుండా రాజకీయాలలో ప్రవేశించాలని అనుకున్నారు. దానితో షా రాజవంశం మళ్లీ అధికారికంగా పాలన చేపట్టింది. ఆ వంశీకులే 2006 వరకు పాలించారు. నేపాల్‌లో హిందూ రాచరిక వ్యవస్థ ఆలోచన చేయడమే కాకుండా, అభివృద్ధికి కారకుడయిన వారు మహేంద్ర షా. ఈయన త్రిభువన్ షా కుమారుడు. ఒకే రాజు, ఒకే భాష సూత్రంతో రాజ్యాన్ని పునర్నిర్మించినవాడు కూడా మహేంద్ర షాయే.
మహేంద్ర మరణానంతరం ఆయన పెద్ద కుమారుడు బీరేంద్ర అధికారం చేపట్టారు. ఈయన కాలంలోనే రాచరికానికి ఇబ్బందులు మొదలైనాయి. అనేక ఉద్యమాల తరువాత ఆయన నేపాల్‌ను నియంతృత్వం నుంచి రాజ్యాంగ బద్ధ పాలన తేవడానికి 1990లో అంగీకరించారు. అలాగే పార్లమెంట్‌తో అధికారం పంచుకోవడానికి ఆమోదించారు. అయితే తరువాత కూడా దేశంలో ఉద్యమాలు చల్లారలేదు. 1990 మధ్యలో మావోయిస్టులు చెలరేగిపోయారు. ఇదే పార్టీ నుంచి వచ్చిన పుష్పకమాల్ దహాల్ ‘ప్రచండ’ ప్రధాని కాగలిగారు. కాని కొద్దికాలం మాత్రమే అధికారంలో ఉండగలిగారు. అదే సంవత్సరం జూన్ 1న బీరేంద్ర, ఆయన భార్య ఐశర్వ సహా రాజ కుటుంబీకులు అంతా హత్యకు గురైయ్యారు. యువరాజు దీపేంద్ర తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబం అంగీకరించక పోవడంతో మత్తులో అందరినీ తుపాకీతో కాల్చి తాను కూడా కాల్చుకుని మరణించాడు. తరువాత జ్ఞానేంద్ర పాలకుడయ్యారు. కానీ రాజ కుటుంబీకుడే అయినా ఈయనకు అంత మంచి పేరు ఉండేది కాదు. దీనితో ఆనాడు రాజరికం మీద ప్రజలు ఆగ్రహించారు. రాచరికానికి వ్యతిరేకంగా ఏడు రాజకీయ పార్టీలు కలసి జన ఆందోళన్ పేరుతో ఉద్యమం లేవదీశాయి. వీరిది స్పష్టమైన డిమాండ్. రాచరికం రద్దు కావాలన్నదే ఆ డిమాండ్. చివరికి జ్ఞానేంద్ర పార్లమెంట్‌కు తలొగ్గి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాడు.
2008లో కొత్తగా ఎంపికైనా రాజ్యాంగ నిర్మాణ అసెంబ్లీకి మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఎన్నికయ్యారు. నేపాల్‌ను ఫెడరల్ డెమాక్రటిక్ రిపబ్లిక్‌గా ప్రకటించారు. జ్ఞానేంద్ర రాజ ప్రాసాదాన్ని ఖాళీ చేశారు. దాని పేరు నారాయణహితి. అలా జ్ఞానేంద్ర ఆఖరి నేపాల్ రాజుగా చరిత్రలో మిగిలారు. నారాయణహితి ఒక వస్తు ప్రదర్శన శాలగా మిగిలింది.
‘నారాయణహితిని ఖాళీ చేయండి, మా రాజుగారు అందులోకి రావాలి’ అన్న నినాదం ఇటీవల నేపాల్‌లో గట్టిగా వినపడుతున్నది. ఇటీవలి బైక్ ర్యాలీలో కూడా అదే వినిపించింది. కానీ మావోయిస్టులు దీని పేరుతో మళ్లీ తమ గొంతును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తున్నది. మాజీ పాలకుడు జ్ఞానేంద్ర ఇలాంటి ప్రయత్నం మూర్ఖంగా చేస్తే అందుకు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని సీపీఎన్ మావోయిస్టు చైర్మన్ ప్రచండ వ్యాఖ్యానించినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్నది. నిజానికి ఇటీవలి కాలంలో రాచరికానికి అనుకూలంగా వీస్తున్న గాలి చాలా రాజకీయ పార్టీలను సందిగ్ధంలోకి నెడుతున్నాయి.
ఆర్‌పీపీ అనే రాజరిక అనుకూల పార్టీ, ప్రజలు ఇటీవల దేశంలో పలు చోట్ల రాజుకు అనుకూలంగా ప్రదర్శనలు నిర్వహిస్తూనే ఉన్నారు. 2008 నుంచి జరిగిన పాలన ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ‘అత్యంత దారుణం ఏమిటంటే, దేశమంతా అవినీతిలో కూరుకుపోయింది. అధికారం చేపట్టిన ఏ ఒక్క రాజకీయ పక్షం ప్రజలను పట్టించుకోలేదు’ అన్నాడు 50 ఏళ్ల వడ్రగి కుల్‌రాజ్ శ్రేష్ఠ్. ఆయనే మరొక మాట కూడా అన్నారు. ‘ఆనాడు రాజుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను. కానీ నేను చేసింది తప్పు. దేశం ఇంకా పతనమైంది. అందుకే నేను నా అభిప్రాయం మార్చుకున్నాను’ అన్నాడు శ్రేష్ఠ్. మార్క్సిజం, ఉదారవాదం, ప్రజాస్వామ్యం అంటూ నినాదాలు చేస్తూనే కాలం గడిపితే దేశంలో పేదరికం పోదు. ఫలితం శ్రేష్ఠలు అనేకులు తయారవుతారు.