07 ఏప్రిల్‌ 2025, సోమవారం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఛైత్ర శుద్ధ దశమి

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


విదేశీ సిద్ధాంతాల ఆధారంగా పెల్లుబికే ఉద్యమాలను ప్రపంచం చూసింది. ప్రజావాణి ఆధారంగా, మనోభావాల పునాదిగా అంకురించే ఉద్యమాలనూ వీక్షించింది. చరిత్ర చూస్తే విదేశీ సిద్ధాంతాల ఆధారంగా నిర్మించిన ఉద్యమాలు తరుచూ వ్యూహం మార్చుకుంటూ ఉంటాయన్న సంగతి తెలుస్తుంది. ఏ సిద్ధాంతం, ఏ రాజకీయ సూత్రం ఆధారంగా  ఉద్యమం తలెత్తిందో  ఉద్యమం సాగుతున్న క్రమంలో అవే  వెలిసి పోవడం అందుకు కారణం. మరొకవైపు స్థానీయతకు, ఇంకా చెప్పాలంటే మనోభావాలకు భంగం వాటిల్లడం కూడా కారణమే. విదేశీ సిద్ధాంత ప్రేరేపిత ఉద్యమాలు తాత్కాలికంగా విజయం సాధించాయి. వాటి మనుగడ కొన్ని దశాబ్దాలు. ఈ మాత్రానికే ‘మార్పు’ పేరుతో శతాబ్దాలుగా ఉన్న సంస్కృతినీ, జీవన విధానాన్నీ విచక్షణా రహితంగా ధ్వంసం చేయడం ఆధునిక చరిత్రలో కనిపించే వినాశనం. దీనిని నేపాల్‌ తొందరగా గుర్తించినట్టే ఉంది.

నేపాల్‌ తనదైన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక వారసత్వాన్ని పునఃప్రతిష్ఠించుకోదలుచుకుంది. 2008కి ముందు ఉన్న పాలక వ్యవస్థను తిరిగి సాధించుకోవాలని అనుకుంటున్నది. అంటే, రాజరికం మళ్లీ రావాలి. నేపాల్‌ హిందూదేశంగా ఆవిర్భవించాలి. ఇటీవలి కాలంలో ఆ హిమాలయ రాజ్యంలో వెల్లువెత్తుతున్న ఆందోళన సెగలు ఇందుకు సంబంధించినవే. తెలిసి కాని, తెలియక కాని, ఉద్దేశపూర్వకంగా గాని మీడియాలో కొందరు ఈ పరిణామాన్ని ‘యూటర్న్‌’ గా వ్యాఖ్యానిస్తున్నారు. అలా అనుకోవడం ఒక జాతి ఆకాంక్షను చిన్నబుచ్చడమే.

నేపాల్‌ రాజధాని ఖట్మాండు వీధులు ఈ మధ్య తరచు ‘రాజరికం రావాలి. నేపాల్‌ హిందూరాజ్యం కావాలి’ అన్న నినాదాలతో మారుమోగుతున్నాయి. అక్కడ 2008లో మావోయిస్టు పాలన వచ్చిన తరువాత రాజరికంతో పాటు, హిందూరాజ్య వ్యవస్థను రద్దు చేశారు. ఆనాటి ఉద్యమానికి నాయకుడు మావోయిస్టు ‘ప్రచండ’ (పుష్పకమాల్‌ దహాల్‌). చైనా అండదండలతో లేదా ఆజ్ఞతో ఆనాడు మావోయిస్టులు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ చరిత్ర గమనాన్ని ఎవరూ ఊహించలేరు. నిజానికి శాసించలేరు. మావోయిస్టుల మనోగతం మాత్రం చరిత్ర గమనాన్ని కూడా తాము మార్చగలమనే. కానీ, నేపాల్‌లో మళ్లీ ఆ రెండు వ్యవస్థలను యథాతథంగా పునఃప్రతిష్ఠించుకోవడానికి ఒక మాజీ మావోయిస్టు నాయకత్వంలోనే జాతి ఉద్యమించడం విశేషం. ఆయన పేరు దుర్గా ప్రసాయ్‌. ఈయన అలనాటి మావోయిస్టు గెరిల్లా పోరులో పాల్గొన్నాడు. నాడు రాజరికం మీద పోరాడుతున్న అన్ని వామపక్షాలను ఏకం చేసినవాడు ఈయనే. దాదాపు దశాబ్దం పాటు జరిగిన మావోయిస్టు తిరుగుబాటు 2006లో జరిగిన సమగ్ర శాంతి ఒప్పందంతో ముగిసింది. 2008లో మావోయిస్టులు పాలకులుగా కొలువైయ్యారు. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. కానీ ఈ వ్యర్థ పరిణామం కోసం, ఒక భ్రమాజనితమైన వ్యవస్థను ప్రజల నెత్తిన రుద్దడానికి చెల్లించిన మూల్యం 16,000 ప్రాణాలు.

మాజీ మావోయిస్టు దుర్గా ప్రసాయ్‌ ఆశయం ఒక్కటే. నారాయణహితి రాజప్రాసాదంలో రాజు జ్ఞానేంద్ర షా పునఃప్రవేశించాలి. ప్రస్తుతం ఉన్న కేపీ శర్మ ఓలి (ఇతడూ మార్క్సిస్టే) ప్రభుత్వాన్ని కూలదోసి అయినా రాజరికాన్ని ప్రతిష్ఠిస్తామని ప్రసాయ్‌ హెచ్చరిస్తున్నాడు. అన్నట్టు  ప్రసాయ్‌ మావోయిస్టు ఉద్యమాన్ని సమర్ధించి, చాలామంది తిరుగుబాటుదారులకు ఆశ్రయం కల్పించాడు. మార్క్సిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రచండ నాయకత్వంలోని కమ్యూనిస్టు సెంటర్‌ పార్టీలో చేరాడు. తరువాత కేపీ ఓలి నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యూనిఫైడ్‌ మార్క్సిస్టు లెనినిస్ట్‌) సంస్థలో చేరాడు. ఈ పార్టీ నుంచే 2022లో ఇతడిని బహిష్కరించారు. ఎన్నికలలో టికెట్‌ కూడా నిరాకరించారు. అప్పటికే ఇతడికి మావోయిస్టు మహిమ అనుభవానికి వచ్చింది. మావోయిస్టులు జాతిని మోసం చేశారు, వీళ్ల గణతంత్ర మంత్రం ఘోరంగా విఫలమైంది అని ప్రకటించాడు. ఈ కనువిప్పు ఈ ఒక్కడిదే అనుకుంటే పొరపాటు. కుల్‌రాజ్‌ శ్రేష్ఠ అనే మరో మాజీ మావోయిస్టు కూడా ఇదే చెప్పాడు. అంటే నాటి మావోయిస్టు అభిమానులే ఇప్పుడు రాజరికం వైపు చూస్తున్నారు.

ఆనాడు మావోయిస్టులకు ఉన్న ప్రజామద్దతు ఎంతో సరిగా తెలియదు కానీ, ఇప్పుడు అత్యధికులు రాజరికాన్ని కోరుతున్న దాఖలాలు స్పష్టంగానే ఉన్నాయి. జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్న సాధారణ ప్రజలు, రాజు రావాలి, దేశాన్ని రక్షించాలి అని నినదించేవారు అన్ని చోట్లా కనిపిస్తున్నారు.

రాజరికం రద్దయి 17 ఏళ్లు గడిచాయి. ఈ స్వల్ప కాలంలో 13 ప్రభుత్వాలు మారాయి. అంటే ఏ ఒక్క ప్రభుత్వం రెండేళ్లు కూడా పనిచేయ లేదు. ఎక్కే ప్రభుత్వం, దిగే ప్రభుత్వం. దీనికితోడు అవినీతి స్వైర విహారం ఒకటి. తాజాగా భారత నిఘా వర్గాల గణాంకాల ప్రకారం హిందూరాజ్యంలో ముస్లిం జనాభా శరవేగంగా పెరుగుతోంది. 2001లో 4.2 శాతం ఉన్న ముస్లింలు 2021లో 5.9 శాతానికి పెరిగారు. ఇందుకు మావోయిస్టు పాలనా వ్యవస్థ కల్పించిన వెసులుబాటే కారణం. యథాప్రకారం అక్కడ కూడా వీళ్ల అరాచకాలు మొదలయ్యాయి.  ఇదే ఇప్పుడు ఆ దేశానికి అదనపు తలనొప్పి. ఇది ప్రజాస్వామిక యుగం. రాజరికాల యుగం కాదని చెప్పడానికి సందేహించనక్కరలేదు. అలా అని రాజరిక నియంతృత్వ అంతం అంటే మార్క్సిస్టు నియంతృత్వాల ఆరంభమైతే  కాదు. రష్యాలో, తూర్పు యూరప్‌లో కమ్యూనిజం కుప్పకూలిన తరువాత ఆ విఫల సిద్ధాంతాన్ని రుద్దే యత్నమే చారిత్రక తప్పిదం. నేపాల్‌లో అదే జరిగింది. రాజరికం, ప్రజాస్వామ్యం కలసి సాగుతున్న వ్యవస్థలు ప్రపంచంలో ఉన్నాయి. నేపాల్‌ దానిని ఆదర్శంగా తీసుకోవచ్చు. రాజరికం కావాలన్న ప్రజల ఆకాంక్ష, ఆధునిక ప్రపంచానికి తగ్గట్టు ప్రజాస్వామ్య వ్యవస్థ అక్కడ పరిఢవిల్లుతాయి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE