ఏప్రిల్ 30 అక్షయ తృతీయ
అనంత శుభఫలితాలను ఇచ్చేదిగా అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ)ను సంభావిస్తారు. ఇది సామాజిక పర్వదినం. కులమతాలకు అతీతంగా దీనిని జరుపుకుంటారు.
అక్షయం అంటే క్షయం లేనిది, నిరంతరం వృద్ధి చెందేదని అర్థాలు ఉన్నాయి. ఆనాడు చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజాదికాలు, దానధర్మాలు, పితృతర్పణాలు విశేష ఫలితాలనిస్తాయని పరమ శివుడు అమ్మవారికి చెప్పినట్లు మత్స్య పురాణం,ఆ రోజు చేసే దానధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం పేర్కొంటున్నాయి. అమిత ఫలదాయినిగా భావించి నిర్వహించే ఈ వ్రతానికి లక్ష్మీనాథుడు అధినాయకుడు. మహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయ మాడిన రోజు కూడా ఇదేనట. అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత బంగారం లేదా వెండిని కొనుగోలు చేయాలనే నానుడి స్థిరపడిపోయింది. అందుకే ప్రజలు తమతమ స్థోమతను బట్టి వాటిని కొనుగోలు చేసి అమ్మవారికి అలంకరించి పూజలు చేస్తారు. తహతు లేని వారు లవణం సహా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసినా శుభమనే పెద్దలు చెబుతారు. వాటిని కొనుగోలు చేయటమే కాక ఉన్నంతలో దానధర్మాలు చేయాలని కూడా పెద్దలు చెబుతారు.
త్రేతాయుగం ఆరంభం, పరశురామ, బలరాముల జననం, భగీరథుడు దివిజ గంగను భువికి దింపినది, ద్రౌపదీ మానసంరక్షణకు శ్రీకృష్ణుడు వలువులు ప్రదానం చేసినది, పిడికెడు అటుకుల నివేదనతో బాల్య స్నేహితుడు కుచేలుడికి అనంత ఐశ్వర్యం అనుగ్రహించినది,వనవాస దీక్షలోని పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించినది ఈ రోజునే. నరనారాయణులు, హయగ్రీవ భగవానుడు ఈ తిథినాడే ఆవిర్భవించారు. శివయ్య వాహనం నంది జన్మించినది ఈ తిథి నాడే కావడంతో ‘బసవ జయంతి’ని జరుపుకుంటారు.
అక్షయ తృతీయ నాడు చేపట్టే పుణ్యకార్యాల ఫలితాలకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథ ప్రకారం, ధర్మనాముడు అనే వైశ్యుడు తనకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసేవాడు. కొంతకాలానికి కాలం చేసిన ఆయన క్షత్రియుడిగా జన్మించి జపహోమాదులు, నిత్యాన్నదానం చేయ సాగాడు. సంపదనంతా వ్యయం చేసే కొద్దీ అది ‘అక్షయం’ (వృద్ధి) అవుతోంది. పూర్వజన్మ సంస్కారం అలా కొనసాగుతూనే ఉంటుందని పెద్దలు చెబుతారు.
అక్షయ తృతీయ విశిష్టతలు
- మహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయమాడిన రోజు కూడా ఇదేనట.కృతయుగంలో ప్రహ్లాద వరదుడు శ్రీహరి వరాహా నృసింహాస్వామి రూపంలో పురూరవ చక్రవర్తికి స్వప్న సాక్షాత్కారం చేసి,ఏటా చందనయాత్ర జరిపించుకుంటున్నది ఈ తిథి నాడే.
- ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రకు సంబంధించి రథాల తయారీ పక్రియకు అంకురార్పణ.
- చలికాలం తరువాత చారుథామ్‌లోని గంగోత్రి, యమునోత్రిలను అక్షయ తృతీయ నాడే తెరుస్తారు. బదరీనాథ్, కేదార్‌నాథ్‌లకు తొలి ప్రవేశాన్ని ఈ తిథికి సమీపంలోనే నిర్ణయిస్తారు.
- గంగాదేవి ఈ తిథి నాడే భువికి దిగి వచ్చిందని చెబుతారు. ఈ సందర్భంగా తమిళనాడులోని కుంభకోణంలో శ్రీ మహావిష్ణువును గరుడ వాహనంపై ఊరేగిస్తారు.
- పార్వతీమాత కాశీలో అన్నపూర్ణదేవిగా ఆవిర్భవించి, అన్నార్తును ఆదుకుందంటూ ఆమెకు ప్రత్యేక అలంకరణ చేస్తారు.
- కొన్ని ప్రాంతాలలో శ్రీకృష్ణునికి చందనలేపనం, గౌరీదేవికి డోలోత్సవం నిర్వహిస్తారు. ద్వైత సంప్రదాయవాదులు (మధ్వులు) ఈ తిథినాడు యతుల బృందావనాలకు గంధలేపనం చేస్తారు.
- దేశంలోని అనేక ప్రాంతాలలో పెళ్లి కాని యువతులతో బొమ్మల పెళ్లిళ్లు నిర్వహించే సంప్ర దాయం ఉంది. దీనివల్ల యోగ్యుడు భర్తగా లభిస్తాడని విశ్వాసం. ఈ తిథినాడు వ్యవసాయ పనులు ప్రారంభించడం, భూముల కొనుగోళ్లు, భవనాలు, సంస్థలను వంటి వాటిని ప్రారంభిం చడం శుభప్రదంగా భావిస్తారు.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్