ఒక రాజు పాలనకు మనం కట్టే విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది? చారిత్రక ఆధారాలన్నీ మన ముందు ఉన్నప్పుడు ఎవరికి వారే ఆ అంచనాలు వేసుకోవచ్చు. ఎవరు ఎలా చెప్పినా విజయనగరం చరిత్రలోనే కాదు మొత్తం తెలుగువారి హృదయాల మీద చెరగని ముద్ర వేసిన రాజు శ్రీ కృష్ణదేవరాయలు, కృష్ణ దేవరాయ లెవరన్న ప్రశ్నకు తమ వాడు కాదన్న ఊహే తెలుగువాడు తట్టుకోలేడు, అంగీకరించలేడు. కాని ఇది నిజం,ఆయన కన్నడవాడు.
మనం చరిత్రను చూసే పరిశీలించే విశ్లేషించే పద్ధతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. నూతన దృక్కోణాలు ఏర్పడ్డాయి. ఏ కాలంలో ఏ పాలనలో ప్రజలు ఎంత సుఖపడ్డారు. సామాన్య ప్రజానీకానికి జరిగిందేమిటి? అది స్వదేశీయుల పాలనా? విదే శీయుల పాలన? ఏదయినా ప్రజల దృష్టి ఏమిటి? వంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. రాజవంశాల ఉత్పత్తులూ, వారి విజయాలూ, పరాజయాలూ కూడా చరిత్ర వస్తువులే. రాజకీయ చరిత్రతో పాటు సామాజిక చరిత్ర ప్రధానమే. ఈ రెండింటి మేళవింపుగానే చరిత్ర గమనం ఉంటుంది.
విశ్వనాథ నాయకుడు మధురై నాయక వంశస్థాపకుడు. ఇతడు గరికపాటి కుటుంబీకుడు. కృష్ణదేవరాయలకు నమ్మకస్తుడైన సేనాని. కాని ఇదే సమయంలో విశ్వనాథ నాయకుని తండ్రి కోటిగం నాగమనాయకుడు మధురపైకి దండెత్తాడు. గెలిచాక కృష్ణదేవరాయలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. దానిని అణచి వేసింది విశ్వనాథ నాయకుడే. తానే స్వయంగా తన తండ్రిని పడగొట్టి మధురను చక్రవర్తి కృష్ణదేవరాయలుకి అప్పగించాడు. దానికి ప్రతిఫలంగా రాజు మధుర రక్షకునిగా, మధురై కొన్ని ఇతర తమిళప్రాంతాలను కలిపి దానికి గవర్నర్‌గా విశ్వనాథనాయకుని ప్రకటించారు. తద్వారా మధురై నాయకరాజ్యం ఏర్పడింది.
విశ్వనాథ నాయక్ 1529-1563
కుమార కృష్ణప్పనాయక్ 1563-1573
జాయింట్ రూలర్స్ 1వ గ్రూపు 1573-1595
జాయింట్ రూలర్స్ 2వ గ్రూపు 1595-1602
ముత్తు కృష్ణప్పనాయక్ 1602-1609
ముత్తు వీరప్పనాయక్ 1609-1623
తిరుమల నాయక్ 1623-1659
ముత్తు అలకాద్రినాయక్ 1659-1662
చొక్కనాథ నాయక్ 1662-1682
రంగకృష్ణ ముత్తు వీరప్ప నాయక్ 1682-1689
రాణి మంగమ్మాళ్ (రీజెంట్ రూలర్) 1689-1704
విజయరంగ చొక్కనాథ నాయక్ 1704-1131
క్వీన్ మీనాక్షి (రీజెంట్ రాణి) 1731-1736
విజయనగర సామ్రాజ్య పతనానంతరం తెలుగు సాహిత్యాన్ని పోషించి, తెలుగు సాహిత్యంలో తమకంటూ స్థానం సంపాదించుకున్నవారు ఈ నాయకరాజులు. కాని వస్తువు విషయంలో విలువలను విడిచిపెట్టి శృంగార వర్ణనలు చేశారన్న కారణంతో బ్రిటిష్ ఇండియా పాలనా కాలం నాటి పలువురు సాహిత్యవేత్తలు ఈ యుగాన్ని క్షీణయుగ మని వ్యవహరించారు. ఈ అభిప్రాయం వలసవాద ప్రభావితులైన వారి ధోరణివల్ల వ్యాపించిందని నేటి సాహిత్యవేత్తల అభిప్రాయం. కాని ఈ యుగానికి చెందిన ప్రముఖ కవుల్లో త్యాగరాజు, కంకంటి పాపరాజు, కనుపర్తి అబ్బయామాత్యుడు, కూచుమంచి తిమ్మకవి, కూచుమంచి జగ్గకవి, ఆడిదము సూరకవి, కుందవరపు కవి చౌడప్ప మొదలైన ఎందరో కవులు కూడా ఉన్నారు.
మధురై నాయకులు ఒక తెలుగు రాజవంశం వారు. ఆధునిక తమిళనాడులోని మధురై, తిరుచునాపల్లి రాజధానిగా చేసుకుని పరిపాలించారు. సుమారు రెండు శతాబ్దాల పాటు నాయక రాజవంశం పరిపాలించింది. (కీ.శ.1529- 1736). వీరు కళలు, సంస్కృతి, పరిపాలనా సంస్కరణలు, ఢిల్లీ సుల్తానులు నాశనం చేసిన దేవాలయాల పునరుద్ధరణ, ప్రత్యేకమైన నిర్మాణశైలి వారి ప్రత్యేకత. ఈ రాజవంశంలో 13వ మంది పాలకులున్నారు. వారిలో తొమ్మిది మంది రాజులు, ఇద్దరు రాణులు,ఇద్దరు ఉమ్మడి రాజులు (జాయింట్ రూలర్స్). వారిలో ప్రముఖులు రాజు తిరుమల నాయక, రాణి మంగమ్మాళ్. ప్రధానంగా డచ్చ్, పోర్చుగీసువారితో విదేశీ వాణిజ్యం నిర్వహించి సంపన్నులయ్యారు.
రాణిమంగమ్మ (1689-1709) ముత్తు వీరప్పకుమారుడు విజయరంగ చొక్కనాథుడు మిక్కిలి పసివాడైనందువలన పితామహి మంగమ్మ రాజ్యభారం తీసుకోవలసి వచ్చింది. ఈమె మిక్కిలి సమర్ధురాలు, దూరదృష్టి కలది. ఆమెకడ నరసప్పయ్య అను తెలుగు నియోగి బ్రాహ్మణుడు మంత్రిగా దళవాయిగా ఉండి రాజ్యయంత్రాంగాన్ని సమర్ధంగా నిర్వహించేవాడు. ఆ నాటికి దక్షిణ ప్రాంతంలోని బీజాపూర్, గోల్కొండ రాజ్యాలను ఔరంగజేబు నాశనం చేశాడు. శివాజీ కుమారుడ•• శంభాజీని మొగల్ చక్రవర్తి దారుణంగా చంపించాడు. తన బలహీనతను గుర్తించిన మంగమ్మ తప్పని పరిస్థితుల్లో ఔరంగజేబు చక్రవర్తి అధికారం అంగీకరించి కప్పం కట్టేందుకు ఒప్పుకొన్నది. ఆమె మిక్కిలి నేర్పుతో రాజ్యం పాలించింది. అనేక దానధర్మాలు చేసి చరిత్ర ప్రసిద్ధమయింది.
మంగమ్మ రాజ్యానికి వచ్చేనాటికి ఎటుచూసినా శత్రువులే. దక్కన్ సుల్తానులు, మరాఠాలు, తంజావూరు నాయకులు, మొగలులు, దక్షిణాన తిరువాన్కూరు రాజు కప్పం కట్టడం మానేశాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి దేశాన్ని రక్షించిన ఘనత తెలుగు రాణి మంగమ్మది.
మంగమ్మ చంద్రగిరి నాయకరాజు తుపాకుల లింగమనాయకుని కుమార్తె. ఇతడు మధుర చొక్కనాథ నాయకుడి దగ్గర సైన్యాధిపతి. తన కుమార్తె మంగమ్మను చొక్కనాథ నాయకునకిచ్చి వివాహం చేశాడు. 1682లో చొక్కనాథుడు మరణించాడు. వెంటనే అతని కుమారుడగు ‘‘రంగకృష్ణ ముద్దు వీరప్పనాయకుడు రాజయ్యాడు. కాని రాజైన కొన్ని నెలలలోనే మరణించాడు. నాటికి ఇతని భార్య గర్భవతి. అతి కష్టం మీద మంగమ్మ సతీ సహగమనాన్ని ఆపింది. కాని బిడ్డకు జన్మనిచ్చిన 3 నెలలకే ఆమె మరణించింది. మూడు నెలల పసిగుడ్డును సింహాసనంపై కూర్చుండ బెట్టి మంగమ్మే రాజ్య భారాన్ని స్వీకరించింది. 1689 నుండి 1705 వరకు సమర్థమైన పరిపాలనను అందించింది. రామనాథపురం రాజు రఘునాథ సేతుపతి స్వతంత్రుడయ్యాడు. బయట నుండి ఏ విధమైన సహాయం లేకున్నా తన తెలివి తేటలతో మధుర రాజ్య గౌరవాన్ని నిలిపింది. 1697లో తిరువాన్కూర్ రాజు రవివర్మను సైనిక చర్య ద్వారా లొంగదీసుకుని కప్పం కట్టేటట్టు చేసింది. దళవాయి నరసప్పయ్య సహాయంతో మరాఠా రాజు షాజీని ఓడించి కాళ్ల బేరానికి వచ్చేటట్టు చేసింది. మైసూరు రాజు చిక్క దేవరాయలు మధురకు చెందిన సేలం, కోయంబత్తూరులను ఆక్రమించగా వారిపై దాడి చేసి వారిని దారిలోకి తెచ్చింది. కాని దురదృష్టవశాత్తూ 1702లో రామనాథపురం రాజు రఘునాథ సేతుపతిపై దాడి చేయగా ఆ యుద్దంలో దళవాయి నరసప్పయ్య మరణించాడు. ఆ మరణంతో మంగమ్మ పరాజయం పాలైంది.
మంగమ్మ నీటిపారుదలకు కాలువల నిర్మాణం, కొత్త రోడ్ల నిర్మాణం, రహదారికి ఇరువైపుల చెట్లు నాటడం, ఎన్నో భవనాలు, దేవాలయాలు నిర్మించారు. తుముక్కం వద్ద నిర్మించిన స్ప్రింగ్ పేలస్‌ను కూడా ఆమే నిర్మించారు. ఇప్పుడు ఈ పేలస్‌లో గాంధీ మెమోరియల్ మ్యూజియం నిర్వహిస్తున్నారు. కేప్ కొమరిన్ నుండి హైవే ఈమె కాలంలోనే నిర్మించారు. దానిని ఇప్పుడు రాణి మంగమ్మాళ్ సలై అని పిలుస్తారు.
రాణి మంగమ్మాళ్ మొదటిసారి మీనాక్షి ఆలయంలో ఉంజల్ పండుగను తమిళ నెల ‘అహ్ని’లో జరుపుకుంది. ఉత్సవాల సందర్భంగా రాజ కుటుంబీకులందరూ పాల్గొని మీనాక్షి అమ్మన్‌కు నివాళులర్పించారు.
ఇన్ని విజయాలు సాధించిన ఈ తెలుగు రాణి మంగమ్మ మరణం వివాదస్పదమైంది. 1704లో యుక్త వయస్సు వచ్చిన మనుమడు సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆమె సుముఖంగాలేక పోవడంతో వారి ప్రధానమంత్రి అచ్చన్న సహాయంతో విజయరంగ చొక్కనాథ నాయకుడు ఈమెను బంధించి ఉరి తీయించాడని ప్రతీతి. ఆమె మరణంపై ఎన్ని అభిప్రాయాలున్నా ఆమె 18 సంవత్సరాల కాలం సంక్షేమ కార్యక్రమాలతో అంకిత భావంతో పనిచేసినా ప్రజలు మరచిపోయిన తెలుగురాణి మంగమ్మ.
మూలం:
- మధుర తంజావూరు నాయకరాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర బై నేలటూరి వెంకటరమణయ్య పేజీ నెం.11.
- The Hindu : A town by the vaigai dt.17.08.2008
- ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి బై ఖండవల్లి లక్ష్మీ రంజనం, భాలేందు శేఖరం – పేజీ. 384
- రీజెంట్ రాణి: మైనర్ల తరుపున పరిపాలించినవారు.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు