భారత్-చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటై ఏప్రిల్ 1 నాటికి సరిగ్గా 75 సంవత్సరాలు. 1950, ఏప్రిల్ 1న రెండు దేశాల మధ్య ఈ సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్ ‘‘డ్రాగన్- ఏనుగు’’ కలిసి నాట్యం చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు ఎంతో కీలకం. ఎందుకంటే అమెరికాతో వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో, భారత్ మాత్రమే తనకు అత్యంత విలువైన మార్కెట్ అన్న విషయం చైనా అధినేతకు బాగా తెలుసు. ఒకవైపు మనతో సంఘర్షిస్తూనే మరోవైపు దౌత్యం నెరపడం చైనాకు వెన్నతోపెట్టిన విద్య.
నిజం చెప్పాలంటే ఈ రెండు దేశాల నాగరికతలు ప్రపంచంలో అత్యంత పురాతనమైనవి మాత్రమే కాదు, ఇన్ని వేల సంవత్సరాలనుంచి నిరంతరాయంగా కొనసాగుతూ వస్తున్నవి కూడా! ప్రపంచంలో మరే ఇతర నాగరికతలో ఇటువంటి నిరంతరాయత కనిపించదు. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్-చీనీ భాయీ భాయీ నినాదం మనందరికీ తెలిసిందే. అయితే 1962లో చైనా మనదేశంపై జరిపిన దురాక్రమణ కారణంగా రెండు దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1980-90 మధ్యకాలంలో ఇవి మళ్లీ చిగురించడం మొదలైంది. ఈ నేపథ్యంలో 1993లో ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం, 1996లో సైనికుల ఆత్మవిశ్వాస నిర్మాణ ఒప్పందం (సీబీఎం) వాణిజ్య వృద్ధిపై ఒప్పందం వరుసగా కుదిరాయి. తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యం బాగా అభివృద్ధి చెందుతూ 2023-24లో ఏకంగా 118.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతేకాదు భారత్‌లో చైనా సంస్థల పెట్టుబడుల విలువ 3.5 బిలియన్ డాలర్లు! టాగూర్ శతజయంతి ఉత్సవాలు-2025 వంటి ఈవెంట్ల నిర్వహణ ద్వారా విద్యాపరమైన సంబంధాలతో పాటు, సాంస్కృతిక సంబంధాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. బ్రిక్స్, ఎస్.సి.ఒ, జి-20 వేదికలు, ఇంటర్నేషనల్ ఇన్‌ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌లో పరస్పరం సహకరించుకోవడం వంటి బహుపాక్షిక అంశాల్లో రెండు దేశాల మధ్య సమన్వయ సంబంధాలు కొనసాగుతున్నాయి.
సరిహద్దు సంఘర్షణలు
ఒకపక్క ఇన్ని రకాలుగా సంబంధాలు కొనసాగు తున్నా రెండు దేశాల మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దుల వద్ద తరచుగా సైనిక సంఘర్షణలు, ప్రతిష్టంభనలు జరగడం సర్వసాధారణమైంది. ఉదాహరణకు 2017లో డోక్లాం ప్రతిష్టంభన, 2020లో గాల్వన్ ఘర్షణలు, చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ), పాక్ ఆక్రమిత కశ్మీర్-పీవోకే గుండా నిర్మిస్తున్న సీపెక్ వంటివి భారత్-చైనా సంబంధాల్లో ‘కంటిలో నలుసు’ మాదిరిగా కొనసాగుతున్నాయి. చైనా ప్రారంభించిన బీఆర్‌ఐ ప్రాజెక్టులో భారత్ భాగస్వామి కాలేదు. పీఓకేలో ఆ దేశం చేపడుతున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ తన సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమే ఇందుకు కారణమని భారత్ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు ఇందుకు ప్రతిగా ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్’ను ‘సాగర్ వ్యూహాన్ని’ మనదేశం ముందుకు తెచ్చింది. చైనా ఇదే సమయంలో పాకిస్తాన్‌కు అణుసహకారాన్ని అందిస్తుండటం కూడా మనదేశానికి ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇప్పటివరకు రెండు దేశాల మధ్య ఉద్రిక్తలకు కారణమైన సంఘటనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- పాక్ ఆక్రమిత భూభాగం నుంచి పాకిస్తాన్ కొంత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేసింది. ఈ ప్రాంతాన్ని భారత్ తనదిగా పేర్కొంటున్నది.
- 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధంలో మనదేశానికి చెందిన వె య్యి మంది, చైనాకు సంబంధించి 800మంది సైనికులు మరణిం చారు. ఈ యుద్ధంలోనే చైనా మనదేశానికి చెందిన ఆక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఈ యుద్ధం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఇరుదేశాల మధ్య సరిహద్దు రేఖగా వున్న ‘మక్‌మోహన్ రేఖ’కు అవతలికి చైనా దళాలు వెళ్లినప్పటికీ, ఆక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని మాత్రం తన ఆధీనంలోనే ఉంచుకుంది. ఈ ఆక్సాయ్‌చిన్, చైనాలోని జింజియాంగ్ ప్రావెన్స్‌ను పశ్చిమ టిబెట్‌తో కలుపుతుంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ రేఖనే వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)గా పేర్కొంటున్నారు.
- 1967లో నాథూలా సంఘర్షణలో ఇరుపక్షాల సైనికుల్లో పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఈ సంఘర్షణలు నాథూలా, ఛౌలా పర్వత దారుల్లో జరిగాయి.
- 2017లో డోక్లామ్ పీఠభూమి వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఇక్కడ చైనా సైనికులు జరుపుతున్న రోడ్డు నిర్మాణాన్ని మన సైనికులు అడ్డుకోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభన 73 రోజులపాటు కొనసాగింది.
- 2020 జూన్ 15న లద్దాఖ్ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది మన సైనికులు వీరమరణం పొందగా, చైనాకు చెందిన చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా ఇప్పటికీ మృతుల సంఖ్యను వెల్లడించలేదు. ఈ సంఘర్షణ గాల్వన్ లోయలో జరిగింది. గత 50 ఏళ్ల కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన తీవ్రమైన సంఘర్షణ ఇదే!
కాజాన్ సదస్సు తర్వాత…
2024లో కాజాన్ సదస్సు నేపథ్యంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం తిరిగి ప్రారంభ మైంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, ఉద్రికత్తలు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు టెలికాం, ఔషధ రంగానికి సంబంధించిన ముడిసరుకులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చైనానుంచి మనదేశం పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. రెండుదేశాల మధ్య జరిగే వాణిజ్యం అసమతుల్యంగా అంటే చైనాకే అత్యధికంగా అనుకూలంగా ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం మనదేశ తయారీ రంగానికి సంబంధించిన సరఫరా శృంఖలాలు, పారిశ్రామిక ఉత్పాదకాల ఆవశ్యకత అత్యధికంగా ఉండటమే! ఇదేసమయంలో భారత్ కూడా ముడి ఇనుము, సేంద్రియ రసాయనాలు, ఇతర ముడిపదార్థాలు చైనాకు ఎగుమతి చేస్తుంది. దీన్ని వనరుల చోదిత ఎగుమతి నిర్మాణ వ్యవస్థగా చెప్పవచ్చు. అయితే దిగుమతులపై యాంటీ-డంపింగ్ కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ చైనా విదేశీ వాణిజ్య ఒప్పందా లను అడ్డుపెట్టుకొని తన ఆసియన్ దేశాల భాగస్వాముల ద్వారా భారత్‌కు తన ఎగుమతులు కొనసాగిస్తోంది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యం
ప్రస్తుతం మనదేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చైనాదే. చైనా సంస్థలు 75% శాతం మార్కెట్‌ను ఆక్రమించేశాయి. ప్రభుత్వం ఒకపక్క నిషేధం విధించినా, మనదేశంలో విద్యుత్ వాహనాల తయారీ సంస్థలు, టెలికాం సంస్థలు తమకు కావలసిన బ్యాటరీలు, టెక్నాలజీకోసం చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సెమికండక్టర్ల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలనుకుంటున్న మనదేశానికి అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, ఎకోసిస్టమ్ లేకపోవడం పెద్ద అవరోధంగా పరిణ మించింది. ఇక డిజిటల్ హార్డ్‌వేర్ దిగుమతులపై ఒక స్పష్టమైన విధానం లేకపోవడంతో సంక్లిష్టమైన మౌలిక సదుపాయాలకు తగిన రక్షణ లేకుండా పోయింది. చైనా నుంచి మనకు సైబర్ దాడుల భయం ఉండనే ఉంది. చామెల్ గ్యాంగ్, ఇతర నేరగాళ్లు మన దేశ ఆరోగ్య రంగం, పవర్ గ్రిడ్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడు తున్నారు. ఇప్పటికే మనదేశం చైనాకు చెందిన 300 యాప్‌లను నిషేధించింది. హువావే సంస్థ 5జి టెక్నాలజీ ప్రవేశాన్ని మనదేశం అడ్డుకుంది. భారత్ లోని యూనికార్న్ ఎకో సిస్టమ్, హైటెక్ పరిశ్రమల్లో చైనా పెట్టుబడులు అత్యంత కీలకపాత్ర పోషిస్తు న్నాయి. 2020లో 18 భారతీయ యూనీ కార్న్‌ల్లో చైనా పెట్టు బడులు 3.5 బిలియన్ డాలర్లు! ఇది రెండు దేశాల మధ్య పెట్టు బడుల అనుసంధా నతను వెల్లడిస్తోంది.
కొనసాగుతున్న సవాళ్లు
ప్రస్తుతం 3488 కిలోమీటర్ల సరిహద్దు విషయంలో ఇప్పటికీ ఇరు దేశాలు ఒక స్పష్టమైన అవగాహనకు రాలేదు. ఫలితంగా పరస్పర చొరబాట్లు, మౌలిక సదుపాయాల విస్తరణను రెండు దేశాలు కొనసాగిస్తున్నాయి. ఆక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా 38వేల చదరపు కిలోమీటర్ల మేర మన భూభాగాన్ని కబ్జా చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 90వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని వాదిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా పేర్కొంటున్నది. సరిహద్దు ప్రాంతాల్లో రెండు విధాలుగా ఉపయోగపడే రీతిలో చైనా చేపడుతున్న గ్రామాల నిర్మాణాన్ని భారత్ ‘సలామీ స్లైస్’గా పరిగణిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంట పరస్పరం అంగీకరించిన మ్యాప్‌లు లేకపోవడంతో పెట్రోలింగ్ విషయంలో సమస్యలు ఎదురవు తున్నాయి. 2020 గాల్వన్ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం దెబ్బతిన్నదనే చెప్పాలి. ఇప్పటికీ మనదేశం చైనా గుంటనక్క వ్యవహారశైలిని నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో పరస్పర విశ్వాస స్థాయులు చాలా దిగువనే ఉన్నాయని చెప్పక తప్పదు.
బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులను ఎగువన ఉన్న చైనా నియంత్రించడం ఎప్పటికీ మనకు ఇబ్బంది కలిగించే అంశమే. చైనా బ్రహ్మపుత్రపై మెడాగ్ (గతంలో దీన్ని జాంగ్మూ డ్యామ్ అని పిలిచేవారు) డ్యామ్‌ను భారత్‌తో ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే నిర్మించడానికి ఉద్యుక్తమవుతోంది. సముద్ర సిల్క్ మార్గం ద్వారా శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్‌లతో చైనా సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా అనుసరిస్తున్న ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇక అణుసరఫరా గ్రూపులో మనదేశం ప్రవేశించకుండా చైనా ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా నిరోధిస్తోంది. ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీలు పాకిస్తాన్ ఉగ్రవాదులను నిషేధించకుండా అడ్డుకుంటూ మనదేశానికి ఇబ్బందులు సృష్టిస్తోంది.
అయితే భారత్-చైనాలు జీ-20, బ్రిక్స్ వేదికల ద్వారా వాతావరణ దౌత్యం, విపత్తు సహాయకచర్యలు, ప్రపంచ ఆరోగ్య నిర్వహణ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. భారత్ ముందుకు తెచ్చిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌కు చైనా మద్దతిస్తోంది. ఏఐఐబి, న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) వంటి బహుపాక్షిక బ్యాంకింగ్ వ్యవస్థల విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతోంది.
భారత్-చైనాల సంబంధాల్లో తాజా పరిణామాలు
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఒప్పందం కుదిరి 75 సంవత్స రాలు దాటుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని డెస్పాంగ్, డెమ్‌చౌక్ ప్రాంతా లనుంచి సైనికులను ఉపసంహరించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. 23వ ప్రత్యేక ప్రతినిధుల స్థాయి సమావేశం 2025లో జరిగింది. వైస్- ప్రీమియర్, మన విదేశాంగశాఖ కార్యదర్శి మధ్య బీజింగ్‌లో చర్చలు జరిగాయి. సరిహద్దు విషయంలో వాస్తవాల ఆధారంగా సహకారాన్ని పెంపొందించు కునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. 2024లో కాజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశం సందర్భంగా నరేంద్రమోదీ-జిన్‌పింగ్‌ల భేటీ జరిగింది. గత ఐదేళ్లకాలంలో ఇరుదేశాధినేతల మధ్య లాంఛనంగా జరిగిన తొలి సమావేశమిది. ముఖ్యంగా దారుణంగా దెబ్బతిన్న సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడానికి జరిగిన ప్రయత్నంగా చెప్పవచ్చు. బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవడం, 2025 వేసవి నుంచి కైలాస్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి అంగీకారం కుదిరింది. సంక్షోభానంతర కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరచడానికి ఈ చర్యలు ఉపకరించాయి.
రెండు దేశాల మధ్య పోటీ
21వ శతాబ్దంలో భారత్-చైనాలు బలమైన ఆర్థిక వ్యవస్థలుగా రూపొందేందుకు పోటీపడు తున్నాయి. ఇప్పటివరకు ఈ పోటీ అసమతుల్యంగానే ఉన్నదని చెప్పాలి. 1987 నుంచి 2023 మధ్య కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ 272 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 17.7ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఇదే మనదేశం 279బిలియన్ డాలర్లనుంచి ఇంకా 3.79 ట్రిలియన్ డాలర్ల వద్దే కునారిల్లుతుండటం గమనార్హం. ముఖ్యంగా పరిశీలిస్తే 1987లో మనదేశ ఆర్థిక వ్యవస్థ చైనాతో పోలిస్తే బలీయంగా ఉంది. దురదృష్టవశాత్తు ముందుచూపులేని, దేశ ఆర్థికాభివృద్ధిని పెద్దగా పట్టించుకోని పార్టీల నిర్లక్ష్య పాలన కారణంగా మనం ఇంకా అట్టడుగున కునారిల్లాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య సరిహద్దుల వద్ద శాంతి ఒప్పందం కుదిరింది 1993లో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు హయాంలోనే. దేశ ప్రయోజనాలను చక్కగా విశ్లేషించి తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో అన్ని పార్టీల మద్దతు పొందగలిగారు. నిజం చెప్పాలంటే చైనా విషయంలో, మనదేశ ప్రయోజనాల రీత్యా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ప్రారంభమైంది పి.వి. హయాం నుంచే. అదే ఇప్పటికీ కొనసాగు తోంది. భారత్-యుఎస్‌ఎస్‌ఆర్‌ల మధ్య బలీయమైన స్నేహసంబంధాలు చైనాకు అప్పట్లో ఇష్టం ఉండేది కాదు. అందుకనే పాకిస్తాన్‌ను అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టింది. నిజానికి 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించడం భారత్‌లో ఆగ్రహావేశాలకు కారణ మైంది. అప్పటి డిప్యూటీ ప్రధాని సర్దార్ వల్ల భాయ్ పటేల్, చైనాను శత్రువుగా పరిగణించాలని చేసిన సూచనను నెహ్రూ తోసిపుచ్చారు. 1954లో ఇరుదేశాల మధ్య పంచశీల ఒప్పందం కుదిరిన తర్వాత, ఐదేళ్లకు అంటే 1959లో టిబెట్ రాజధాని లాషాలో చైనా వ్యతిరేక అల్లర్లు చెలరేగడం, దలైలామాకు భారత్ ఆశ్రయమివ్వడం మనదేశంపై ఆ దేశం అనుమానాలను పెంచుకోవడానికి దోహదం చేశాయి. తర్వాత 1962లో చైనా భారత్‌పై దాడిచేసి ఆక్సాయ్‌చిన్‌లో 38వేల చదరపు కి.మీ.ల భూభాగాన్ని ఆక్రమించుకోవడం, నెహ్రూ చైనాను గుడ్డిగా నమ్మిన ఫలితమే! వల్లభాయ్ పటేల్ హెచ్చరికలను బేఖాతరు చేసిన నెహ్రూ నిర్లక్ష్యం కారణంగా పెద్దఎత్తున మన భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. టిబెట్- ఇండియాల మధ్య సరిహద్దుకు సంబంధించి నాటి బ్రిటిష్ ప్రభుత్వం, మక్‌మోహన్ రేఖను ప్రతిపాదిస్తూ 1914లో చేసిన సిమ్లా ఒప్పందాన్ని చైనా అంగీకరించ లేదు. అయితే నెహ్రూ పీపుల్స్ రిపబ్లిక్ చైనాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అనుకున్నారు. కానీ గుంటనక్క చైనా 1962 యుద్ధం రూపంలో మనకు వెన్నుపోటు పొడిచింది, ఇప్పటికీ స్నేహం ముసుగులో పొడుస్తూనే ఉంది. నెహ్రూ, మావోల మరణం తర్వాత 1978లో అధికారంలోకి వచ్చిన డెంగ్ జియోవో పింగ్ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు చైనాలో విపరీతంగా పెట్టుబడులు పెట్టడంతో దేశాభివృద్ధి జెడ్‌స్పీడ్‌తో ముందుకు సాగడమే కాదు చైనా ప్రపంచ తయారీకేంద్రంగా రూపొందడానికి దోహదం చేసింది. ఇదే సమయంలో మనదేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు దేశాభివృద్ధికి దోహదం చేయలేదు. అదే మనం చైనాతో పోలిస్తే వెనుకబడి పోవడానికి ప్రధాన కారణం. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, తానొక ఆధిపత్య దేశంగా ఎదగాలనుకుంటున్న చైనాకు, మనదేశం పశ్చిమ దేశాలు ముఖ్యంగా యు.ఎస్.తో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడం సుతరామూ ఇష్టంలేదు. ఇక భారత్ పరంగా ఆలోచిస్తే, నేడు మనదేశం ఎంతో బలోపేతమైంది.1962 తర్వాత జరిగిన ప్రతి ఘర్షణలో చైనా చిత్తుగా ఓడిపోయింది. పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయింది కూడా.
ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలంటే…
వాస్తవాధీన రేఖ వెంట శాంతి నెలకొనాలంటే చైనా తన సైన్యాలను పూర్తిస్థాయిలో వివాదాస్పద ప్రాంతాల నుంచి ఉపసంహరించాలని భారత్ కోరుతోంది. ముఖ్యంగా 2020లో చోటుచేసుకున్న సంఘర్షణల వంటివి సమస్యను పరిష్కరించలేవని కుండబద్దలు కొట్టింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ), బ్రిక్స్ వేదికల ద్వారా పరస్పరం విశ్వాసం పాదుకునే రీతిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) వల్ల ప్రయోజనాలను కొనసాగిస్తూనే, చైనా ద్వారా సరఫరాల శృంఖలాల విషయంలో బహుముఖ వ్యూహాన్ని భారత్ అమలు చేయాలి. సరిహద్దు వద్ద వ్యూహాత్మక రోడ్ల నిర్మాణం, ఏఎల్‌జీలు, నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ముఖ్యంగా చైనా సైనికుల మోహరింపుపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు ఇవి ఉపయోగకరం. అమెరికా నుంచి 31 ప్రెడెటర్ డ్రోన్‌ల కొనుగోలు ఒప్పందాన్ని మనదేశం 2024 అక్టోబర్‌లో కుదుర్చు కుంది. ముఖ్యంగా అత్యంత ఎత్తైన హిమాలయా పర్వత ప్రాంతాల్లో నిఘావ్యవస్థను పటిష్టం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. ఇటీవలి కాలంలో అండమాన్-నికోబార్ ద్వీప సమూహాల వద్ద చేపడుతున్న చర్యలు, ఆసియన్ దేశాలతో సమన్వయ సహకారాలు, చైనా నౌకాదళం దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి దోహదం చేయగలవు.
నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టడం ద్వారా చైనా అమలుచేసే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన వచ్చు. సైనిక కమాండ్‌లు, దౌత్య వర్గాల మధ్య హాట్‌లైన్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా సమస్య ఉత్పన్నమైనప్పుడు తక్షణం స్పందించి పరిష్కరించడానికి వీలవుతుంది. వాస్తవాధీన రేఖ స్థాయిలో ఉత్పన్నమయ్యే సంక్షోభా లను పరిష్కరించడానికి, ఉమ్మడి శిక్షణ, ఉద్దీపన ప్రొటొకాల్స్‌ను అనుసరించడం వల్ల ప్రయోజన ముంటుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమికం డక్టర్లు, ఏపీఐలు, సోలార్ పరికరాల అమరికను పి.ఎల్.ఐ. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద ఏర్పాటు చేయడం. స్పేస్ టెక్నాలజీ, సెమికండక్టర్ రంగంలో స్వావలంబన సాధించడం వల్ల, చైనా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడటం తగ్గుతుంది. చైనాతో సంబంధాలను కొనసాగిస్తూనే, క్వాడ్‌తో సన్నిహితంగా ఉండటం కూడా వ్యూహాత్మ కంగా మనకు అవసరమే.
వాస్తవాధీన రేఖ వెంట శాంతి నెలకొనాలంటే చైనా తన సైన్యాలను పూర్తిస్థాయిలో వివాదాస్పద ప్రాంతాల నుంచి ఉపసంహరించాలని భారత్ కోరుతోంది. ముఖ్యంగా 2020లో చోటుచేసుకున్న సంఘర్షణల వంటివి సమస్యను పరిష్కరించలేవని కుండబద్దలు కొట్టింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ), బ్రిక్స్ వేదికల ద్వారా పరస్పరం విశ్వాసం పాదుకునే రీతిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్