‘వేదాల వైపు మరలండి!’ అని నినదించి, దాదాపు నిర్జీవ స్థితికి చేరుకున్న హిందూ సమాజాన్ని మేల్కొల్పిన వారు స్వామి దయానంద సరస్వతి. స్వదేశీ, స్వరాజ్య అన్న పదాలను మొదట ప్రవచించి, భారతీయులను పెను నిద్దర నుంచి లేపినవారు కూడా ఆయనే. భారతీయత పునాదిగా కలిగిన భవిష్యత్ భారతదేశాన్ని కలగన్నారు. ఆర్థిక ప్రణాళికలనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాన్నీ సమానంగా ప్రచారం చేసిన తొలి సంస్థ దయానందులు స్థాపించిన ఆర్య సమాజ్. అంటరానితనానికీ, బాల్య వివాహాలకీ వ్యతిరేకంగా గళమెత్తి, ఉద్యమించిన సంస్థ ఆర్య సమాజ్. మతాంతరీకరణలకు వ్యతిరేకంగా మొదటిసారి ఎలుగెత్తి చాటిన మహనీయుడు దయానందుడు. అంతేకాదు, మతం మారినవారిని సైతం ‘శుద్ధి’ ఉద్యమంతో తిరిగి అక్కున చేర్చుకుని, భారతదేశ మౌలిక స్వరూపం మారకుండా ఉండేందుకు తొలి అడుగు వేసినవారు కూడా ఆయనే. శ్యామ్‌జీ కృష్ణవర్మ, లాలా లాజ్‌పతిరాయ్, భాయి పరమానంద, స్వామి శ్రద్ధానంద వంటివారు ఆర్య సమాజ్ నుంచి స్వాతంత్య్రం సమరంలోకి వచ్చారు. తిలక్, వినాయక్ దామోదర్ సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ వంటి ఎందరో స్వరాజ్య సమరయోధులు ఆర్య సమాజ్‌తో ప్రేరణ పొందినవారే. అంతటి స్థానం ఉన్న ఆర్య సమాజ్ స్థాపన జరిగి 150 సంవత్సరాలు అయింది. స్వతంత్ర భారతదేశం నిరంతరం స్మరించుకోవలసిన గొప్ప వ్యక్తి, సంస్థ దయానంద, ఆర్యసమాజ్. ఆ సంస్థ ఆశయాల సంకలనమే ‘సత్యార్థ ప్రకాశ్’. వారి పిలుపు ‘కృణ్వంతో విశ్వమార్యమ్’ (విశ్వమంతా ఆర్యమయం కావాలి).
‘రాజకీయపరమైన పునర్ నిర్మాణం ఆశయంతో భారతదేశంలో జరిగిన ఉద్యమా లన్నింటిలోను ఆర్యసమాజ్ ఉద్యమమంత శక్తిమంతమైనది మరొకటి లేదు. ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రకటించిన మూల సిద్ధాంతం- సంపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో కూడిన జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించడమే.’ ‘ఇండియన్ సోషియాలజిస్ట్’ పత్రిక (మే, 1908)లో గదర్ పార్టీ ప్రముఖుడు, ఆర్యసమాజ్ ప్రేరణతో జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్యామ్‌జీ కృష్ణవర్మ చేసిన వ్యాఖ్య ఇది. ఇండియన్ సోషియాలజిస్ట్ (1905-1922) లండన్ కేంద్రంగా విప్లవకారులు వెలువరించేవారు. దేశంలో 19వ శతాబ్దంలో జాతీయ చైతన్యం అంకురించింది. జాతీయోద్యమం వలెనే ఈ చైతన్యం కూడా ఒకే ఛాయతో లేదు. మన గతం ఆధారంగా దేశ పరిస్థితులను దర్శిస్తూ, ఉద్య మించాలన్న దృక్పథం కల్పించిన జాతీయవాదం అందులో ఒకటి. బ్రిటిష్‌వారికి ఆగ్రహం కలగకుండా పాలనలో మనకూ కాస్త చోటు దక్కించుకోవాలన్న ధోరణిలో నిర్మితమైన జాతీయవాదం మరొకటి. రెండింటి ధ్యేయం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కట్టడి చేయడమే. మన సాంస్కృతిక నేపథ్యం ఆధారంగా, ఆర్షధర్మంలోని మూలాలతోనే జాతీయవాదాన్ని నిర్మించాలన్న ధ్యేయంతో ఆవిర్భవించినది ఆర్య సమాజ్.
స్వామి దయానంద సరస్వతి
ఆర్య సమాజ్ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి. ఆధునిక భారతదేశ చరిత్రలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన, ప్రజలకు చేరువైన సంస్కర్తగా ఆయనకు అగ్రతాంబూలం ఇస్తారు. స్థానీయతను నింపిన జాతీయవాదాన్ని సాధారణ ప్రజల దగ్గరకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. సామాజిక, రాజకీయ చింతనలో ‘స్వ’ అన్న ధోరణిని ఆవిష్కరించిన మహానుభావుడు దయానందులు. స్వరాజ్, స్వభాష, స్వదేశీ అంటూ ఆయన భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించడానికి చాలా ముందే పిలుపునిచ్చారు. స్వదేశీ ఆలోచనకు బీజం వేసినది ఆర్య సమాజ్.
సరైన గురువు
ఆయనకు చూపు లేదు. కానీ జాతికి ఎలాంటి దృష్టి ఉండాలో గొప్ప కల్పన చేసిన ద్రష్ట ఆ యోగి. పేరు విరజానందులు. ఆధ్యాత్మిక చరిత్రలో ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ‘స్వామి విరజానంద సరస్వతి లేదా విరజానంద దాండిశ్ లేకపోతే స్వామి దయానంద సరస్వతి లేరు. దయానంద సరస్వతి లేకుండా వైదిక ధర్మ పునరుద్ధరణ జరిగేదికాదు.’ విరజానంద భారతదేశ చరిత్రలోనే మహోన్నత వ్యక్తి. ‘స్వేచ్ఛ అంటే స్వర్గం, బానిసత్వం అంటే నరకం’ అని నిర్వచించినవారాయన. విదేశీయులు సుపరిపాలన అందించవచ్చు. అదెంత గొప్పదయినా స్వయం పాలన దానికంటే వేయి రెట్లు గొప్పది అని ఆయన చెప్పారు. 19వ శతాబ్దం నాటి భారతీయ పునరుజ్జీవనోద్యమంలో విరజానందకు కూడా కొంత చోటు దక్కవలసి ఉంది. విరజానంద గొప్ప సంస్కృత వ్యాకరణ పండితుడు. ‘మధుర అంధ సాధువు’ అని పేరు పడిన విరజానంద (1778- 1868) పంజాబ్ ప్రాంతానికి చెందినవారు. అసలు పేరు వ్రజ్‌లాల్. ఐదో ఏట మశూచి సోకి కళ్లు పోయాయి. 12 ఏట తండ్రిని కోల్పోయారాయన. అన్నావదినలు సరిగా చూడకపోవడం వల్ల ఇల్లు వదిలి వెళ్లారు. హరిద్వార్ చేరుకుని మూడేళ్లు ఉండి ధ్యానం చేశారు. అక్కడే స్వామి పూర్ణానంద ఆయనకు సన్యాసదీక్ష ఇచ్చారు. పూర్ణానంద గొప్ప సంస్కత పండితుడు కూడా. పూర్ణానంద వద్ద సంస్కృత వ్యాకరణం, సాహిత్యం చదువుకున్న తరువాత కాశీ వెళ్లారు విరజానంద. పదేళ్లు అక్కడే ఉండి వేదాంతం, ఆయుర్వేదం అభ్యసించారు. గయ వెళ్లి ఉపనిషత్తులను అధ్యయనం చేశారు. తరువాత కలకత్తాలో కొద్దికాలం ఉండి, అంతిమంగా మధుర చేరుకుని అక్కడ సంస్కృత పాఠశాల నెలకొల్పారు. దానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేవారు. ఇల్లు విడిచి వచ్చిన దయానంద కూడా అక్కడకు చేరుకున్నారు. అదొక చారిత్రక సందర్భం. సమర్ధ రామదాసుతో శివాజీ, రామకృష్ణ పరమహంసతో వివేకానందల తొలి సమావేశాలతో పోల్చదగినది. విరజానంద శిష్యరికంలో దయానంద గొప్ప పండితు డయ్యారు. విరజానంద తన శిష్యుడు దయానందను గురుదక్షిణ అడిగారు. ‘కుమారా! దయానందా! వెళ్లు, నిజమైన వేదజ్ఞానం గురించి బోధించు. ఈ అంధకారాన్ని అజ్ఞానాన్ని రూపుమాపు. సత్యం, భారతదేశాన్ని విముక్తం చేయడం అనే అంశాల వాస్తవికత ఏమిటో ప్రచారం చెయ్యి’ అని అడిగాడు. తాను గురు ఆజ్ఞ పాటిస్తానని దయానంద ప్రతిజ్ఞ చేశారు. 1836లో ఇల్లు వీడిన దయానంద 1846లో విరజానందను కలుసుకున్నారు. విరజానంద సరస్వతి స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని సన్నిహితంగా గమనించారు. అందులోని నేతలతో సన్నిహిత బంధం ఉండేది. దయానంద ఆ ఉద్యమాన్ని సన్నిహితంగా చూశారనే చెబుతారు.
పునరుజ్జీవనోద్యమం
19వ శతాబ్దంలో భారతీయ సమాజాన్ని కదిలించిన పునరుజ్జీవనోద్యమం ప్రధానంగా హిందూ సమాజ సంస్కరణ ధ్యేయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వాటి ఉద్దేశం మతంలో విప్లవం మాత్రమే కాదు. నాడు భారతీయ సమాజాన్ని ఆవరించిన అంధకారాన్ని తొలగించడం ఒక్కటే కాదు, దేశాన్ని సామాజిక, రాజకీయ దాస్యం నుంచి విముక్తం చేయడం కూడా. ఇందులో సామాన్యుడి ఆత్మ గౌరవం కోసం పిలుపు ఉంది. అంటరానితనం నిర్మూలనకు బలమైన కార్యాచరణ ఉంది. దేశాభివృద్ధి, స్వయంసమృద్ధి తోనే సాధ్యమన్న దృష్టి ఉంది. 16వ శతాబ్డంలో ఐరోపాలో వచ్చిన పునరుజ్జీవనోద్యమం, భారత పునరుజ్జీవనోద్యమం ఒకటి కావు అనడం ఇందుకే. మన పునరుజ్జీవనోద్యమానికి నాయకత్వం వహించిన సంస్థలు, నాయకుల ఉద్దేశం మతాన్ని సంస్కరించడం మాత్రమే కాదు. అప్పటికి ఆవరించి ఉన్న అంధకారాన్ని, మూఢ విశ్వాసాలను రూపుమాపడం ఒక్కటే కాదు. జాతి తలెత్తుకు తిరగడం. ఇందులో ఆర్య సమాజ్ దృక్పథం మరింత స్పష్టమైనది. దేశ ప్రజానీకంలో వచ్చే చైతన్యం స్థానీయతతోనే తీసుకురావాలన్న ఆ సంస్థ ధోరణి చాలా పదునైనది. ఎవరు భారత ఔన్నత్యాన్ని అవమానపరుస్తున్నారో, ఎవరు అందిస్తున్న చదువు దేశీయతను పాతర వేస్తున్నదో, న్యూనపరుస్తున్నదో ఆ చదువు ఇచ్చిన స్ఫూర్తితో మాతృభూమిలో చైతన్యం తేవాలన్న యోచన ఒక బలహీనతగానే దయానందులు భావించినట్టు కనిపిస్తుంది. ‘మరల వేదాల వైపు తరలండి’ అన్న పిలుపే అందుకు గొప్ప నిదర్శనం. భారతీయులు భారతీయులమని చెప్పుకోవడానికి గర్వించాలని ఆకాంక్షించారాయన.
ఆర్య సమాజ్, భారత జాతీయ కాంగ్రెస్
డిసెంబర్, 1885లో ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్ తొలినాటి ఆశయం బ్రిటిష్ జాతి నుంచి దేశాన్ని సంపూర్ణంగా విముక్తం చేయడం కాదు. నినాదాలు, తీర్మానాలు కూడా నేరుగా బ్రిటిష్ పాలన మీద, భారత్‌పై దాని ప్రభావం మీద ఎక్కువపెట్టిన అస్త్రాలు కూడా కాదు. కానీ సరిగ్గా అంతకు పదేళ్ల క్రితం ఏప్రిల్ 10, 1875న ఉద్భవించిన ఆర్య సమాజ్ తొలి అడుగులోనే స్వయం పాలనకు పిలుపునిచ్చింది. చిత్రంగా ఈ రెండు సంస్థలు బొంబాయిలోనే ఆవిర్భ వించాయి. కానీ ఆర్య సమాజ్ ఆది నుంచి స్వయం సమృద్ధి గురించి మాట్లాడింది. వ్యక్తి స్వేచ్ఛను, సామాజిక సమానత్వాన్ని ప్రబోధిం చింది. సామాజిక న్యాయం కోసం తపన, ప్రజాస్వామ్యం ఆ సంస్థ నిర్మాణంలో, ప్రస్థానంలో కనిపిస్తాయి. భారత స్వాతంత్య్ర సమరం కొన్ని దశల వరకు అయినా భారతీయత, మనదైన గతం పునాదిగా నడిచిందంటే అందుకు కారణం దయానందులే. ఆర్య సమాజ్ సిద్ధాంతాలు చాలా తొందరగానే భారతదేశ మంతటా విస్తరించాయి. పంజాబ్, మద్రాస్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, హైదరాబాద్‌లలో సంస్థ బాగా విస్తరించింది.
మొక్కవోని స్వాతంత్య్ర దీక్ష
బ్రిటిష్ ప్రభుత్వంతో దయానంద నేరుగా తలపడలేదు. కానీ ఆయన అన్ని చర్యలు, మాటలు బ్రిటిష్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతనే ప్రతిబింబిం చేవి. 1873లో గవర్నర్ జనరల్ నార్త్‌బ్రూక్‌తో దయానంద సమావేశం ఇందుకు నిదర్శనం. మీరు ఉపన్యాసం ప్రారంభించేటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పాలి అంటే, అందుకు దయానంద అంగీకరించ లేదు. దీనితో నివేదిక ఇంగ్లండ్‌కు వెళ్లింది. దయానంద మీద ఒక కన్నేసి ఉండాలని భారత కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆర్య సమాజ్ ఏ కోణం నుంచి తన స్వాతంత్య్ర కాంక్షను విడనాడలేదు. ఆ సంస్థ ఆధ్వర్యంలో అనేక విద్యాసంస్థలు నడిచేవి. అవే దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) విద్యాసంస్థలు. ఇవి ఏనాడూ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాన్ని దేహి అనలేదు. అవి నిర్వహించే కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారులను ఆహ్వానించలేదు. నిజానికి ఆర్య సమాజం మీద బ్రిటిష్ ప్రభుత్వ ఆగ్రహానికి ఈ విధానం ఒక ప్రధాన కారణం. భారతదేశంలో అశాంతికి కారణాలు వెతకమంటూ బ్రిటిష్ ప్రభుత్వం పంపించిన రామ్‌సే మెక్డొనాల్డ్ చేసినవ్యాఖ్య ఇది: ‘ప్రతి ఆర్య (దయానంద అనుచరుడు) ఒక అరాచకవాది. అందులోని ప్రతి ప్రభుత్వ విమర్శకుడు ఒక దేశద్రోహి.’
స్వాతంత్య్రోద్యమంతో అవినాభావ బంధం
భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఆర్య సమాజ్ సభ్యులు మూడు రకాలుగా కనిపిస్తారు. మొదటి తరహాకు ఉదాహరణ: శ్యామ్‌జీ కృష్ణవర్మ, లాలా లాజ్‌పతి రాయ్. వీరు 20వ శతాబ్దం ఆరంభంలోనే స్వరాజ్య సమరంలో కీలక పాత్ర పోషించారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయ కత్వంలో జరుగుతున్న ఉద్యమంలో చేరకుండా హిందూ మహాసభలో పనిచేసినవారు. ఇందుకు ఒక ఉదాహరణ భాయి పరమానంద. నిజానికి పరమానంద మొదట గదర్ పార్టీ నాయకుడు. తరువాత హిందూ మహాసభలో చేరారు. బ్రిటిష్ జాతిని ఎదుర్కొనడానికి గాంధీజీ ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతం సరికాదన్నదే పరమానంద నిశ్చితాభిప్రాయం. అందుకే వ్యతిరేకించారు. జాతీయోద్యమంలో ఉంటూనే ఏనాడూ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా, విద్యారంగ నిర్మాణానికి పని చేసిన వారూ ఉన్నారు. పంజాబ్‌కు చెందిన హన్సరాజ్ అందుకు ఉదాహరణ. ఈయన కూడా గాంధీజీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించారు. గాంధీజీ లాహోర్ పర్యటనకు వచ్చినప్పుడు హన్సరాజ్ నాయకత్వంలో విద్యార్థులు సమ్మె చేశారు.
స్వదేశీ ఉద్యమం
విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ ఉత్పత్తులు, స్వయం సమృద్ధి ఆది నుంచి ఆర్య సమాజ్ నినాదాలు. జాతీయవాదం వీటికి పునాదిగా చేసిన సంస్థ కూడా అదే. స్వదేశీ చింతన, ఆపై స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావడానికి మూలం వలసపాలన ఆర్థిక దోపిడీ. దేశీయ పరిశ్రమలను క్రమంగా చంపుకుంటూ పోయే దాని బ్రిటిష్ ఆర్థిక సామ్రాజ్యవాదం. ఈ ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని ఆధ్యాత్మికత అనే ఆయుధంతో తొలి దాడి చేసిన సంస్థ ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ నినాదం ఒక చోదకశక్తిగా ఉపయోగపడే సందర్భం బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం (1905) సమయంలో వచ్చింది. పైగా దీనికి నాయకత్వం వహించిన లాల్ బాల్ పాల్ త్రయంలోని లాలా లాజ్‌పతిరాయ్, బాలగంగాధర తిలక్ దయానందస్వామి భక్తులు. బ్రిటిష్ ఉత్పత్తులు, దిగుమతుల మీద ఆధారపడడం తగ్గాలన్నదే ఆర్య సమాజ్ ఉద్దేశం. అందుకు దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలి. జౌళి పరిశ్రమ, సబ్బుల తయారీ, చరఖాల వినియోగం వంటివాటిని ఆర్య సమాజ్ వృద్ధి చేసింది. దీనితో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వ అజమాయిషీలోని విద్యా సంస్థలను బహిష్కరించి, స్వదేశీ విద్యా సంస్థలను స్థాపించారు. స్వదేశీ విద్యా సంస్థలలో వృత్తి విద్యలను ప్రవేశపెట్టారు. దేశానికి గ్రామం, అక్కడ జరిగే సేద్యం ప్రాధాన్యాలను కూడా ఆర్య సమాజ్ గుర్తించింది. వ్యవసాయోత్పత్తుల పెంపు కోసం తన వంతు కృషి చేసింది. సేంద్రియ ఎరువులను ప్రోత్సహించింది. దేశీయమైన విత్తనాల గురించి ప్రచారం చేసింది. స్వదేశీ ఉద్యమం, దానిని నడిపిన జాతీయవాదం ఆర్య సమాజ్ కార్యక్రమాలు. వాటితో స్వతంత్ర భారతదేశానికి జరిగిన మేలు కూడా ఎంతో ఉంది.
హైదరాబాద్ సంస్థానంలో జరిగిన నిజాం వ్యతిరేక పోరుకు తొలి అడుగు వేసినది ఆర్య సమాజమే.
ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతో దబ్ధాసో అపరీతాస ఉద్భిదః।
దేవా నో యథా సదమిద్వృధే అసన్నప్రాయువో రక్షితారో దివేదివే।।
(అన్ని దిక్కుల నుంచి ఉన్నత భావాలు నాలో ప్రవేశించుగాక: రుగ్వేదం)
– జాగృతి డెస్క్