ఏప్రిల్ 7, 2025 శతజయంతి
చిరకాలం భారతీయ జనసంఘ్‌కూ ఆ తరువాత భారతీయ జనతా పార్టీకీ సంస్థాగత కార్యదర్శిగా, జనసందేశ్, ఉదయ కమలం పత్రికల సంపాదకుడిగా కొద్ది కాలంపాటు జాగృతి సంపాదకత్వ శాఖలో పని చేసినవారు కొల్లిమర్ల వెంకటేశ్వర్లు. ఈ సంవత్సరం వారి శతజయంతి.
కొల్లిమర్ల శ్రీరాములు, రంగనాయకమ్మ దంపతులకు ఆయన ఏప్రిల్ 7, 1925లో విస్సన్న పేటలో జన్మించారు వెంకటేశ్వర్లు. చిన్న తనంలోనే తల్లిగారు గతించడంతో మాతామహుల ఇంట్లో పెరిగారు.
విస్సన్నపేట, చోడవరాలలో ప్రాథమిక విద్య సాగించారు. గుంటూరులో హైస్కూలు లో చదువుకునే రోజుల్లోనే వారికి ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం అయ్యింది. అరండల్ పేట మోహన రంగనాయక స్వామి గుడిలో జరిగే శివాజీ శాఖకు తన సమీప బంధువు పెద్దిరాజు వెంకట్రావుతో కలిసి వెళ్లేవారు. అక్కడే నాటి గుంటూరు ప్రచారక్ గోపాలరావుజీ ఠాకూర్ సాంగత్యం లభించింది. వివాహమైన తరువాతనే (1944లో మేనత్త కుమార్తె ఝాన్సీలక్ష్మితో వారికి వివాహం జరిగింది. ఇద్దరు కుమార్తెల మధ్యలో ఒక కుమారుడు) ప్రచారక్‌గా వచ్చారు వెంకట్వేర్లు. 1945 నుంచి 1947 వరకు నరసరావు పేట, చీరాల, తిరుపతి ప్రాంతాల్లో పనిచేసారు. 1953లో గుంటూరు బ్రాడీపేట 2వ లైనులో భారత్ ట్యుటోరియల్స్ పేరుతో కాలేజీ నడిపారు. ఆంధ్ర ప్రాంత సంఘచాలక్‌గా పని చేసిన దెందుకూరు శివప్రసాద్ ఇక్కడే చదివారు. కాలేజీ పెట్టిన మరుసటి సంవత్సరమే జనసంఘ్‌లో బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. 1961 నాటికి కాలేజీని మూసివేయవలసి వచ్చింది. గోపాలరావుజీ ఠాకూర్, బాపూరావుజీ మోఘే, సోమేపల్లి సోమయ్య వంటి శ్రేష్ఠ కార్యకర్తల పర్యవేక్షణలో కొల్లిమర్ల తనను తాను ఒక యోగ్య కార్యకర్తగా మలుచుకున్నారు. దీన్‌దయాళ్‌జీ ప్రవచించిన ఏకాత్మ మానవ దర్శనాన్ని (విజయ వాడలో 1965 లో జరిగిన జాతీయ మహాసభలలో పండిట్‌జీ దీనిని మొదటిసారిగా ప్రస్తావించారు) కార్యకర్తలకు సులభగ్రాహ్యమయ్యే రీతిలో బోధించడంలో కొల్లిమర్ల పేరుపొందారు. జనసంఘ్, భీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరాలలో ఏకాత్మ మానవ దర్శనానికి సంబంధించిన తరగతులను కొల్లిమర్ల గారు తరచు తీసుకుంటుండేవారు.ఈ కారణంగానే, బహుశః మాస్టారు అని సంబోధించే వారనుకోవచ్చు. 60వ దశకంలోనే జనసందేశ్ పత్రికను కొల్లిమర్ల గుంటూరులో ప్రారంభించారు. వాజపేయి వంటి పెద్దలు వచ్చినప్పుడు కొల్లిమర్ల అనువాదకుడిగా ఉండేవారు.
అత్యవసర పరిస్థితి సమయంలో కొద్దికాలం రహస్యంగా పనిచేసిన తరువాత తిరుపతిలో పట్టుబడి మీసా చట్టం కింద ముషీరాబాద్ జైలులో ఉన్నారు. ఆ సమయంలో వారి శ్రీమతి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ తరువాత ఆమె కోలుకోలేదు. మీసా డిటెన్యూ గా ముషీరాబాద్ జైలులో కమ్యూనిస్టు/ నక్సలైట్ నాయకులతో వాడి, వేడి చర్చలు జరుగుతుండేవి. ఏ సమస్యనైనా జాతీయ దృక్కోణంలో సరైన ఉదా హరణలతో కొల్లిమర్ల వివరించేవారు. వైయక్తికంగా అందరితోనూ స్నేహశీలిగా ఉండేవారు. 1976లో భూమయ్య గౌడ్, కిష్టయ్య గౌడ్‌లను అదే జైలులో కొల్లిమర్ల ఉన్నప్పుడే ఉరితీశారు. అందుకు లెఫ్టిస్టు లనూ, రైటిస్టులనూ కలిపి ఒకటిగా నిరసన కార్యక్రమం చేపట్టేట్లు చేయటంలో కొల్లిమర్ల కృతకృత్యు లైనారు. పిల్లల చదువులూ, వివాహాలూ, తగినంత క్రమ బద్ధమైన ఆదాయలేమి కారణంగా పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులు కరిగిపోయాయి. ఆయన బాధ్యతలు తీరేనాటికి గుంటూరులో స్వగృహమూ, కొల్లిమర్లలో భూమీ అమ్ముకుని సరూర్ నగర్, హైదరాబాదులో ఒక ఫ్లాట్ కొనుక్కోగలిగారు.
చిన్నమ్మాయి వివాహం కూడా అయిన తరువాత, వారి మకాం భాగ్యనగరానికి మారింది. •బీజేపీ ఏర్పడిన తరువాత జనసందేశ్ పత్రిక ఆఫీసు హైదరాబాదుకు మారటం దానికి కారణం! అక్కడి నుండి కూడా తన కార్యక్షేత్రానికి (అనంతపూర్ జిల్లా) తరచు ప్రయాణాలు చేస్తుండేవారు. వయసు మీద పడిన తరువాత, ఒక ప్రమాదంలో కొంచెం గాయ పడటం కారణంగానూ ఆయన పర్యటనలు కాస్త తగ్గాయి. జనసందేశ్ పని మాత్రం చూస్తుండే వారు.
ఒక ప్రమాదంలో వారి కోడలు మరణించింది. అనంతపురం జిల్లా పర్యటన సమయంలో ప్రమాదం జరిగి మెడ కండరాలు దెబ్బతిన్నాయి. కాస్త వెనక్కు చూడాలంటే మొత్తం మనిషే తిరగ వలసి వచ్చేది. ఇన్ని సమస్యల మధ్య కూడా ఎప్పుడూ తన బాధలు తాను నిర్వహిస్తున్న బాధ్యతల మీద ప్రభావం చూపనీయ లేదు. ఎప్పుడూ సిటీ బస్‌లోనే ప్రయాణిస్తూ ఉండేవారు. ఆయన గౌరవవేతనం పెంచాలనే ప్రతిపాదనను, మరింత సుఖవంతంగా ప్రయాణించ మనే అభ్యర్థనను సున్నితంగా తోసి పుచ్చేవారు అని పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తులు చెప్పేవారు. వెంకటేశ్వర్లు మృదుస్వభావి, మృదు భాషీ కూడా! కానీ తాను జాగృతి వారపత్రికకు రాయ దలుచుకున్న కాలమ్ కోసం ఆయన ఎన్నుకున్న పేరు – కచటతపలు! తెలుగుభాష వాటికి పరుషాలని పేరు!! సూటిగా, స్పష్టంగా తాను చెప్పదలుచుకున్న విషయాలు అవి పరుషంగా ఉన్నప్పటికీ, దేశ హితం కోసమైతే నిర్ద్వంద్వంగా చెపుతానని ఆయన తన శీర్షిక ద్వారా చెప్పకనే చెప్పారేమో!
చివరగా ఒక విషయం. కొల్లిమర్ల చరమదశలో వారి పెద్దమ్మాయి, శ్రీమతి రంగనాయకమ్మ వారి మోక్షాసక్తిని గూర్చి ప్రశ్నిస్తే-నేను మళ్లీ భారతదేశం లోనే జన్మించి భరతమాత సేవకుడిగా ఉంటాను, మోక్షగామిని కాదలుచుకోవటం లేదు అన్నారట!!
బహుశః చివరి శ్వాస వరకూ ఆయన మనసులో ఉన్న మాటలు అవేనేమో!!
(7వ తేదీన గుంటూరులో ఉత్సవం సందర్భంగా..)
మునిపల్లె వేంకటకృష్ణమోహన్
శత జయంతి ఉత్సవ సమితి కార్యదర్శి
మాస్టారికి నివాళి
స్వర్గీయ శ్రీ కొల్లిమర్ల వేంకటేశ్వర్లు ‘మాష్టారు’గారి శతజయంతి ఉత్సవం జరుపుకోవడం మిక్కిలి ముదావహం. ఆంధ్ర రాష్ట్రంలో పప్రథమంగా రాష్టీయ స్వయంసేవక్ సంఘ్ శాఖలు నెలకొల్పిన వారాయన. సంఘ సేవకులలో ప్రమాణులు శ్రీ కొల్లిమర్ల వెంకటేశ్వర్లు ‘‘మాష్టారు’’. ముఖ్యంగా గుంటూరు, కృష్ణాజిల్లాలలో విశేషకృషి జరిపి ఎన్నో సంఘ శాఖలను స్థాపించి, ఎందరినో స్వయంసేవకు లను దేశ సేవకందించారు. శ్రీ నీలకంఠ మార్తాండ దేశపాండే (నెల్లూరు), దత్తాత్రేయ దండోపంత్ బందిష్టే (తెనాలి), వినాయక విశ్వనాథ పింగ్లే (విజయవాడ), గోపాలరావు మారుతిరావు ఠాకూర్ (బందరు), శ్రీపాద గజానన సహస్రభోజుని (ఏలూరి), వినాయక్ లక్ష్మణ దేశముఖ్ (రాజమండ్రి) విశేషంగా సంఘసేవ చేసారు. ‘జాగృతి’ స్థాపన తొలినాళ్లలో ‘‘మాష్టారు’’ ఎంతో సేవ చేశారు. భండారు సదాశివరావు, ముదిగొండ శివప్రసాద్, తూములూరి లక్ష్మీనారాయణ, కందర్ప రామచంద్రరావు, పొన్నాల రామచంద్రమూర్తి, పమిడిముక్కల వేంకటరామయ్య, మన్నవ గిరిధరరావులతోబాటు శ్రీ కొల్లిమర్ల ‘‘మాష్టారు’’ తమ సేవలందించారు.
దేశభక్తి, త్యాగనిరతి, సంఘసేవ, నిస్వార్థకృషి ‘‘మాష్టారి’’ ముఖ్య లక్షణాలు.
జూపూడి యజ్ఞనారాయణ, బోను వేంకటేశ్వరరావు ‘‘మాష్టారు’’గారలు సహాధ్యాయులు. అట్టి మహానుభావులు ‘‘మాష్టారి’’ శతజయంతి సందర్భంగా ఆ మహనీయులకిదే మా శ్రద్ధాంజలి.
– బుద్ధవరపు వేంకటరత్నం
వ్యవస్థాపక సంపాదకులు, జాగృతి