సంస్కృతిని సేవించాలని, రక్షించాలని హంపీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి పిలుపునిచ్చారు. మనం చేసే సేవలు కచ్చితంగా శ్రీరామునికే చేరతాయన్నారు. పవిత్ర త్రివేణీ సంఘమ క్షేత్రం కందకుర్తిలో ఏప్రిల్ 18న లోకకల్యాణార్థం విఘ్నేశ్వర, స్కంద (కుమారస్వామి), రుక్మిణీ సహిత పాండుంగ విఠల, కేశవమూర్తి (పరమపూజనీయ డాక్టర్‌జీ ఇంటి దైవం) విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీస్వామి హాజరై, ఆశీఃప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మనం చేసే పూజ ద్వారా 25% పుణ్యాన్ని పొందుతామని, సంస్కృతి రక్షణ ద్వారా మరో 25 శాతం పుణ్యం, సమాజసేవ ద్వారా మిగిలిన భాగం లభిస్తుందని వివరించారు. మన కుటుంబాలను, చుట్టుపక్కల వారిని, అట్టడుగువర్గాల ప్రజలను సేవించటం ద్వారా ఆశీర్వాదాలు, సానుకూల కర్మను పొందు తారని అన్నారు. సంస్కృతిని రక్షిస్తేనే హిందూ ధర్మం నిలబడుతుందన్నారు. కందకుర్తిలో ఈ ఆలయాల నిర్మాణం జరగడం ఎంతో ముదావహం అని అన్నారు.
ముఖ్యవక్తగా పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహ తిప్పేస్వామి సంఘ నిర్మాత డాక్టర్‌జీ ప్రేరణదాయక జీవిత విశేషాలు, గ్రామీణ స్థాయిలో సంస్కృతి పునరుజ్జీవనంపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు.
కందకుర్తిలో నిర్మాణం అవుతున్న డాక్టర్‌జీ స్ఫూర్తి కేంద్ర వివరాలు, కందకుర్తి గ్రామ ప్రాశస్త్యం గురించి స్ఫూర్తి కేంద్ర ప్రకల్ప ఇంచార్జ్, సేవాభారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి వాసు వివరిస్తూ డాక్టర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ని స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ సందర్భంలో ఒకప్పుడు డాక్టర్జీ పూర్వికులు నివసించిన గ్రామం కందకుర్తి. సంఘ శతాబ్ది సందర్భంగా ఈ క్షేత్రంలో పూజ్య డాక్టర్జీ ‘‘స్ఫూర్తి కేంద్రం’’ భవ్యంగా నిర్మాణం జరుగుతోంది. 2025 విజయదశమికి ఈ స్ఫూర్తి కేంద్ర నిర్మాణం పూర్తవుతుందన్నారు. ప్రేరణాదాయకమైన వారి జీవిత్ర చరిత్ర ఇందులో నిక్షిప్తం చేయనున్నారు. ఇది భావి తరాలకు గొప్ప స్ఫూర్తి కేంద్రంగా మారనుంది. సమాజంలో ఆర్థిక సామాజిక వెనకబడిన ప్రజలకు చేయూతనివ్వటానికి వారి జీవితంలో వెలుగులు నింపటానికి పలు సేవా కేంద్రాలలో భాగంగా కేశవ విద్యాలయము, విద్యార్థి ఆవాస నిలయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మించనున్నారు. వీటితో పాటు యాత్రికుల కొరకు యాత్రి నివాస్ కాటేజీలు, డార్మెంట్స్ నిర్మించనున్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వికాసం జరగడానికి అనుకూలంగా ఉండే భవనాలను కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్య క్రమంలో పలువురు సంస్కృతిపై, సేవాతత్పరతపై ప్రసంగించారు. అలాగే ఈ ఆలయాల నిర్మాణం, ధార్మిక పునరుజ్జీవనంపై కూడా ప్రసంగించారు.
ఏప్రిల్ 16 న కందకుర్తి గ్రామవీధులలో విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. అలాగే విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు జరిగాయి. 17వ తేదీన గోపూజతో ప్రారంభమై నవగ్రహ మండల పూజ, సర్వతోభద్ర మండల పూజ, వాస్తు మండల పూజ, స్థాప్య దేవతా మూలమంత్ర హవనం, ధాన్యాధివాసంతో పాటు పలు కార్య క్రమాలు జరిగాయి. ఏప్రిల్ 18వ తేదీన యంత్ర ప్రతిష్ఠ, అవభృత స్నానాలు, శిఖర యంత్ర ప్రతిష్ఠతో పాటు సార్వత్రిక సభతో ఈ కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పిట్ల కృష్ణ మహారాజ్‌తో పాటు కేశవ సేవాసమితి అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బర్ల సురేందర్ రెడ్డి, క్షేత్ర సేవాప్రముఖ్ ఎక్కాచంద్రశేఖర్, జిల్లా సంఘచాలక్ కాపర్తి గురుచరణ్, సైయంట్ వ్యవస్థాపక చైర్మన్, బోర్డ్ సభ్యులు అయిన బి.వి.ఆర్. మోహన్ రెడ్డి, ప్రముఖ సామాజిక కార్యకర్త సిబిఆర్ ప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనంతపై, అఖిల భారతీయ వనవాసి కల్యాణాశ్రమ మార్గదర్శక మండలి సభ్యులు సోమయాజులు, సంఘ కార్య కర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు డాక్టర్ హెడ్గేవార్ వంశస్థులు కూడా పాల్గొన్నారు.