మండుటెండలో వానజల్లు

జీవన గగన సీమన అదే హరివిల్లు

చిమ్మ చీకట్లో కొవ్వొత్తి వెలుతురు

జీవిత పయనాన అదే కదా దారిదివ్వె!

స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్న చోటనే

మమతామయం, బాధ్యతాభరితం జతచేరితే

అదీ మానవ జన్మ! పరమార్థం ఇదే సుమా!

ఈ పంక్తులు ‘చిన్నస్వామి’వి. మనందరికీ తెలిసిన, జాతీయవాదులు తలచి తలచి మురిసిన ఆ పేరు ` సుబ్రమణ్యభారతి. ఆయన రచనలే భారతదేశాన స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. మనదైన వేదసాహిత్యాన్ని సమగ్ర అధ్యయనం చేసిన, భగవద్గీతను మాతృభాషలోకి అనువదించిన ఆ మహనీయ కవినే గురువుగా భావించిన రచయిత్రి ` కమలాదేవి అరవిందన్‌.

ఆమె ఎంతగానో పేరొందిన విశ్లేషణాత్మక రచయిత్రి.

ఎంతటి పేరు అంటే….

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ పురస్కారం వరించేంత!

ఆమె విశిష్టత భారత సంతతి వ్యక్తి కావడం, వనితాశక్తికి విశ్వఖ్యాతి తేవడం.

తన రచనలు భారత్‌లోనే కాకుండా` సింగపూర్‌, మలేసియా, కెనడా ప్రాంతాల్లోనూ ముద్రణ రూపాల్లో వెలువడ్డాయి.

తమిళ, మలయాళ భాషల్లో మేటి అయిన తనకు తెలుగు అంటే మక్కువ.

కమలాదేవి రచనాంశాల్లోనూ ఎంతో విభిన్నత ఉంది.

ఆమె ఇంతవరకు రాసినవన్నీ కథానికలు, రంగస్థల ప్రక్రియలు, రేడియో రూపకాలు. ఏది రాసినా ‘బాధ్యత’ అనే పదానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. స్వాతంత్య్రానికి మరో పేరు బాధ్యతాయుత వర్తన అన్నదే ఆమె దృఢ అభిప్రాయం.

సుబ్రమణ్య భారతి గురించి ఆమె ప్రస్తావించని సందర్భమంటూ ఏదీ ఉండదు. ఎందుకని అడిగితేÑ

‘‘దేశీయ భాషల్లో తెలుగుకు సమర్చన చేసినవారు కాబట్టే సంగీత వేత్త త్యాగయ్యకు, సమాజ సంస్కర్త కందుకూరి వారికి అనుదిన నమస్సులు. సహజ పాండిత్యం నిండిన పోతన కవివర్యునికీ నమస్సుమాంజలులు.వీరంతా కరదీపికలయ్యారు. జాతి జనతను ముందుకు నడిపారు’’ అంటూ చేతులు జోడిస్తారు కమలాదేవి.

భారత ` సింగపూర్‌ రచయిత్రిగా ప్రశస్తి గడిరచిన ఆమెకు భారతీయత ఎంతైనా ప్రీతి పాత్రం. ఇప్పుడామెకు ఏడున్నర పదుల ప్రాయం. పదుల సంఖ్యలో మొదలైన రచనలు క్రమంగా వందలకు విస్తరించాయి. ఆమెకిప్పుడు ప్రతిష్టాత్మక పురస్కృతిని ప్రకటించిన సంస్థ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ గురించీ మనం ఇక్కడ విశదంగా తెలుసుకోవాలి. వివిధ రంగాల్లోని సింగపూర్‌ మహిళలను గుర్తించి, సమాదరించి, గౌరవించే వ్యవస్థ అది.

ఆ సంస్థకు ఒకటిన్నర దశాబ్దకాల చరిత్ర ఉంది.

అది వృత్తి నిపుణులను చేర్చుకుంటుంది. సేవానిరతిని గమనించి వేదికపైకి తేవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది.

రంగాలవారీగా ప్రచురణలను ముద్రిస్తుంటుంది ` మళ్లీ మళ్లీ.

రచనలైతే ` సంఘానికి అవి ఏ మేర ప్రయోజనమో నిర్థారిస్తుంది.

సాటి సంస్థలు, సంఘాలతోనూ కలసిమెలిసి పనిచేస్తుంటుంది. సంఘంలో విలువల పరిరక్షణÑ దార్శనికత వ్యాప్తి, విస్తృతిÑ దీర్ఘకాలిక ఉత్తమ ప్రయోజనాల గమనింపు. అన్నింటికన్నా మించి అందరికీ న్యాయ పరికల్పనను అందించాలని శ్రమిస్తుంది. హాల్‌ అనే ఆంగ్ల పదంలో తొలి అక్షరం హెచ్‌ ఆకారాన్ని పోలి ఉంటుంది. మిగిలిన అక్షరాలు ఆల్‌ (ఏఏఎల్‌ఎల్‌) అడ్వాన్సింగ్‌ జస్టిస్‌ ఫర్‌ ఆల్‌ అనేది విశదీకరణ. సింగపూర్‌ జాతీయంగా ఏకైక వ్యవస్థే ఇదంతా. కమలాదేవి దక్షతను పురస్కార ప్రాతిపదికగా స్వీకరించిన సింగపూర్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ విమెన్స్‌ ఆర్గనైజేషన్స్‌ ఈ ఎంపికను వెలువరించింది.

సింగపూర్‌కు సంబంధించి చెప్పాల్సి వస్తే `

అదో గణతంత్ర దేశం. మలేసియా ప్రాంతంలోని దేశం / భూభాగం.

సింగపూర్‌ అనగానే పర్యాటక నిలయంగానే అనుకుంటాం. కానీ, అందులోనే సాంస్కృతిక వారసత్వం వెల్లివిరుస్తోంది. శ్రీనివాస, శ్రీకృష్ణ, కాళిక ఆలయాలూ ఉన్నాయక్కడ.

అటువంటి దేశంలోని సంస్థ నుంచి అవార్డుకు ఎంపిక అవడంలోనే కమలాదేవి ప్రతిభ ప్రస్ఫుటమవు తోంది. ఒక పురస్కారాన్ని గెలుచుకున్న ద్విభాషా రచయిత్రిగానూ ఆమెకి ప్రశస్తి.

మలేసియా, సింగపూర్‌లో ప్రయాణాల వేళ తను గమనించిన వాటిని ఎప్పటికప్పుడు అక్షరబద్ధం చేయడం ఆమె అలవాటు. తను పదిహేనేళ్ల వయసులోనే ఉత్తమ రచయిత్రి పురస్కృతి విజేత!

తన ఆసక్తికి ఊతం ఇచ్చిన గురువర్యులుగా ముత్తుస్వామిని, రామానుజన్‌ని స్మరించుకుంటారు ప్రతీ సందర్భంలోనూ.

ఆమె చిన్న రచనల్లో కొన్ని మలయాళ ప్రాంతంలో పాఠ్యాంశాలు. తనకు తాను వెలయించిన పరిశోధనాత్మక వ్యాసాలూ అనేకాలు.

తన తమిళ రచనలకు అవార్డులెన్నింటినో అందుకున్నట్లే ` మలయాళ కావ్యాలకూ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆమె రచించిన నాటకాలను సింగపూర్‌లో ప్రదర్శించారు పలువేదికల మీద!

రచయిత్రిగానే కాకుండా దర్శకురాలిగానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆమెది నిరంతర కళారంగ ప్రయాణం.

ఇంకా ప్రత్యేకాంశం ఒకటుంది. సారస్వత సీమలో ఆమె పయనాన్ని వివరిస్తూ  అంతటినీ నమోదు చేసింది ఇండియన్‌ కమ్యూనిటీ ఓరల్‌ హిస్టరీ ప్రాజెక్టు సంస్థ.

తన అనుభవాన్ని వర్ధమాన కవులూ, కవయిత్రులూ, కళాకారులకు విపులీకరించేలా కార్యశాలలు (వర్క్‌షాపులు) నిర్వహించారామె. ఇందుకు సింగపూర్‌ రచయితల సంఘం, నేషనల్‌ లైబ్రరీ నుంచి సమన్వయ సహాయ సహకారాలు అందుకున్నారు.

ఆమె రాసిన వాటిని ఎందరెందరో ఆంగ్లంలోకి అనువదించారు. చరిత్ర అంశాలతో ఆమె రచించిన పుస్తకాన్ని ఆమె కుమార్తె అనితాదేవి అనువదించారు. సెంచావాంగ్‌ ప్రాంతంలోని నిజ జీవిత సంఘటనలే ఇతివృత్తాలు.

సింగపూర్‌ ఉత్తర ప్రాంతంలోనిదే సెంబావాంగ్‌. ఇదే ప్రదేశంలోనిదే తంబువాంగ్‌ నది. విభిన్న కథనాంశాల సమాహారం ఇది. ఇక్కడి నుంచే కమలాదేవి అరవిందన్‌ రచన రూపుదిద్దుకుంది.

ప్రచురించిన వ్యవస్థ మార్షల్‌ కావెండిష్‌ ఇంటర్నేషనల్‌ ఆసియా. ఇది ఐదేళ్ల కిందటి సంగతి. ఈ సెంబావాంగ్‌ పుస్తకానికి ఉత్తమ గ్రంథ పురస్కారం లభించింది.

ఆ పుస్తకంలోనే తన జ్ఞాపకాల పరంపరను అక్షరీకరించారామె.

మలేసియాలోని ఒక చిన్న ఊళ్లో పుట్టి పెరిగిన కమలాదేవి ఆ ఊరిని కన్న తల్లితో సమంగా ఆరాధిస్తారు. ఆ ఊరి పేరు` లాబిస్‌. ఆ పరిసరాల్లోనే పాఠశాల చదువు, తమిళంతోపాటు మలయన్‌, ఆంగ్ల భాషలను అభ్యసించారు. తండ్రి నుంచి మలయాళంలో ప్రావీణ్యం గడిరచారు.

పాఠశాలలో చదువుతుండగానే వ్యాసాలు, కవితలు రాసిన అనుభవం తనది. అప్పట్లో ఎన్ని రచించినా ఆ అన్నీ పుస్తకంలోనే ఉండిపోయేవి. వాటిని గ్రహించి, వెలికితీసి, మలేసియాలోని వారపత్రికకు ముద్రణ కోసం పంపినవారు ఆమెకు చదువు చెప్పిన ఉపాధ్యాయిని!

అప్పటి నుంచే ఆమె రచనల ప్రచురణ ఆరంభమైంది. ‘మీ జీవితంలో మరువలేని సందర్భం ఏమిటి’ అని అడిగినపుడు ఇలా వివరించారామెÑ

‘‘అప్పుడు నాకు పదిహేనేళ్లు. ఒక పోటీలో పాల్గొన్నా. నా గొప్ప తనం చూపాలని కాదు. భాషలో నేనేమిటో, నా స్థానం ఎటువంటిదో పరీక్షించు కోవాలని మాత్రమే! విశేషం, విచిత్రం, ఆశ్చర్యం ఏమిటంటే` ఆ పోటీలో ఆ రచనకు ప్రథమ బహుమతి నాకే!

ముందు నమ్మలేకపోయా. ఆ తర్వాత బలంగా నమ్మాను. నన్ను నేనే అభినందించుకున్నాను.  సంతోషంతో పొంగిపోయాను.

రెండో బహుమతి పొందిన వ్యక్తి అప్పటికే పేరున్నవాడు. పేరుతోపాటు అహాన్నీ సొంతం చేసుకున్నాడేమో… వేదికమీద బహుమతి ప్రదాన తరుణాన ఎదురు తిరిగి మాట్లాడాడు.

‘‘మొదటి బహుమతి నాకే రావాలి. నిర్ణేతలు ఇవ్వలేదు. ఇంకెవరికో (కమలాదేవికి) ప్రకటించేశారు. అసలేమిటి తన గొప్ప? అసలు ఆ రచన తనదేనా, ఎవరిదైనా చూసి రాసిందా?’’ అంటూ అడ్డగోలుగా మాట్లాడాడు. నాకు ఏడుపొచ్చింది. అతగాడిమీద మండుకొచ్చింది. కానీ ఏంచేయాలిప్పుడు? అనుమానాన్ని ఎలా తిప్పికొట్టాలీ?

ఇంతలో వేదికమీద ఉన్నవారిలో ఒకాయన తన స్థానం నుంచి పైకి లేచారు. నేరుగా నా దగ్గరికే వచ్చి అడిగారు ‘అమ్మాయ్‌! అది నువ్వు రాసిందేనా?’

నాకు ఉక్రోషం ముంచుకొచ్చింది. ‘రాసింది నేనే, నేనే, నేనే’ అన్నాను గట్టిగా.

‘అయితే నువ్వు రాశానంటున్న ఆ వ్యాసానికే సంబంధించి కొన్ని ప్రశ్నలడుగుతా. ఇతర ప్రశ్నలూ వేస్తా. జవాబిస్తావా?’ ప్రశ్నించాడు.

ఒక్క క్షణమైనా ఆగలేదు నేను. ఆయన అడిగిన ప్రతీ ప్రశ్నకీ దీటైన బదులిచ్చాను. వేదికమీద ఉన్న అందరూ నన్నే మెచ్చుకోలుగా చూశారు. నన్ను ప్రశ్నించిన పెద్ద మనిషైతే ‘శభాష్‌’ అంటూ భుజం తట్టి ‘నువ్వు మన భాష అంతటికీ గర్వకారణం అమ్మాయీ’ అన్నాడు. చప్పట్లు ఆగకుండా మోగాయి సభ నుంచి! ఆ శబ్దాల మధ్యనే ఆయన తన మెడలోని దండను తీసి ఆశీస్సుపలుకుతూ నా మెడలో వేశాడు. మళ్లీ సభలో హర్షధ్వానాలు! మామూలు వ్యక్తి కాదు ఆయన, తమిళ వార్తాపత్రికకు వ్యవస్థాపక సంపాదకుడు!’’

ఈ జ్ఞాపకం ఒక్కటీ చాలదా… కమలాదేవి ధీశక్తిని చాటి చెప్పడానికి! సింగపూర్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ బహూకృతి ఈసారి ఆమెనే వరించిందంటే…. అదీ తన దీక్ష, దక్షత, ప్రతిభ, సాహితీ ప్రభ!

జాతీయతను, స్వతంత్రను సదవగాహన చేసుకున్న వనిత. ఆ అవగాహననే అందరికీ కలిగించాలని సంవత్సరాలుగా పరిశ్రమించినందుకే కమలాదేవికి అంతటి బహూకృతి!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE