సేఠ్‌ రాధాకిషన్‌ జ్ఞాపకాలు

సరిగా యాభై సంవత్సరాల నాటి మాట. 1919 ఏప్రిల్‌ 13న విధి వక్రించిన ఆ వేళ. జలియన్‌వాలా బాగ్‌కు కేవలం 50 గజాల దూరాన, ఫానారా చౌక్‌లో నిలబడి ఉన్నాను. ఇంతలో మా పక్కగా డయ్యర్‌ సేనానీ, సాయుధులైన అతని సైనికులూ హడావిడిగా వెళ్లారు. తర్వాత కొద్ది నిమిషాలకి తుపాకి కాల్పుల శబ్దం వినిపించింది.

ఇతరులతోపాటు నేను కూడా దగ్గరలో ఉన్న మార్కెటులోకి పరుగెత్తుకుపోయి తలదాచుకొన్నాను. అప్పుడప్పుడు స్వల్ప విరామంలో, కొంతసేపటి వరకు కాల్పులు సాగుతూనే ఉన్నాయి. మరికొంతసేపటికి భారతదేశ చరిత్రలోనే దారుణమైన రక్తపాతానికి ఒడిగట్టిన డయ్యర్‌ సేనానీ, అతని సైనికులూ వెనక్కు తిరిగి వెళ్లిపోవటం చూచాము. జలియన్‌వాలా బాగ్‌ దురంతం, ఇంక వేటితోనూ సంబంధం లేకుండా జరిగిన సంఘటన కాదు. అంతకు ఒక వారం క్రితం 1919 ఏప్రిల్‌ 6వ తేదీన మొదలైన సంఘటనలు అనేకం కలిసి, ఈ రక్తపాతానికి దారితీశాయి. ఆ రోజుల్లో విజృంభిస్తున్న స్వాతంత్య్ర పిపాస పాలకుల గుండె దడకు కారణమయింది.


రౌలట్‌ చట్టాన్ని ప్రభుత్వం అమలుపరచడంతో దేశంలో ప్రజల ఆగ్రహానికి అవధులు లేకుండా పోయింది. పంజాబ్‌లో వర్తకులు ఈ చట్టానికి తమ అసమ్మతి సూచనగా మార్చి 30వ తేదీన హర్తాళ్‌ జరిపారు. ఏప్రిల్‌ 6వ తేదీన రెండవ పర్యాయం పూర్తి హర్తాళ్‌ జరిగింది. అధికారుల వత్తిడి, బెదిరింపు ఏమీ పనిచేయలేదు.

అలాంటి సంఘటన అదివరలో ఎన్నడూ జరుగలేదు. కుతూహలాన్ని అణుచుకోలేక మా నాన్నగారిని కారణమేమిటని అడిగాను. ఆయన చెప్పిన సమాధానం ఇప్పటికీ నా చెవులలో మారు మ్రోగుతూనే ఉన్నది. ‘రాజు మరణించినప్పుడో, ప్రజలు లేచి తిరుగుబాటు జరిపినప్పుడో`ఈ రెండు సందర్భాలలో ఇలా జరుగుతుంది’ అన్నారాయన.

నిజానికి అది తిరుగుబాటే. న్యాయవాదిని పెట్టుకునేందుకూ, అప్పీలు చేసుకునేందుకు గల హక్కును తీసివేసిన ఒకానొక దుష్టశాసనం పట్ల ప్రజలు తిరుగుబాటు జరిపారు. ఆ మర్నాడు శ్రీరామనవమి. ప్రజలు బ్రహ్మాండమైన ఊరేగింపు జరిపారు. అమృతసర్‌లో మామూలుగా ఈ పండుగ ఎంతో ఆడంబరంగా జరుపుతూ ఉంటారు. అయితే ఆ సంవత్సరపు వేడుకలలో ఒక విశేషం ఏమంటే హిందువులతోపాటు ఎందరో ముస్లింలు కూడా పాల్గొన్నారు. శ్రీరామచంద్రజీకి జై అనే నినాదాలతో పాటు, అసంఖ్యాకమైన జనసందోహం, ముక్త కంఠంతో హిందూ`ముస్లిం సఖ్యతా సామరస్యాలకు జే కొట్టారు.

బ్రిటిష్‌ పాలకులు కంగారు పడిపోయారు. మర్నాడు నాయకులను అరెస్టు చేశారు. దీనితో ప్రజల ఆగ్రహం మిన్ను ముట్టింది.తమ నిరసన తెలియజేస్తూ, కోర్కెల పత్రం ఒకటి అందజేయడానికిగాను, డెప్యూటీ కమిషనర్‌ భవనం వైపుగా, బ్రహ్మాండమైన ఒక ఊరేగింపు సాగింది. కాలినడకన వెళ్లేవారు, రైలు మార్గాన్ని దాటేందుకు ఉపయోగించే వంతెన దగ్గరకు ఊరేగింపు చేరగానే, పోలీసులు వారిపై తుపాకులు కాల్చారు. ముగ్గురు హతులైనారు, వారిని హాల్‌ బజార్‌లోని ఖైర్‌ దీన్‌ మసీదు లోపలికి జనం మోసుకువెళ్లారు.

ఆగ్రహోదగ్రులైన అక్కడి జనసందోహం హాల్‌బజార్‌లో ప్రవేశించి, అక్కడ ఉన్న బ్రిటిష్‌ బాంకుపైన విరుచుకుపడ్డారు. ఆ దగ్గరలోని రోడ్ల కూడలిలో ఉన్న రాణి విగ్రహంపై చేయిచేసుకున్నారు. ఆ విగ్రహం చేతి చిటికిన వేలు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ సంఘటనను తిలకిస్తూ అక్కడ ఉన్న బ్రిటిష్‌ బాంకు మేనేజర్‌ తన దగ్గర ఉన్న తుపాకి పేల్చాడు. ఫలితంగా కొందరు గాయపడ్డారు.

దీనితో అక్కడి ప్రజల ఆగ్రహం ద్విగుణీకృతం అయింది. వెంటనే వారు ఆ బాంకుపై దాడి జరిపి, జనం మీద దౌర్జన్యం జరిపిన మేనేజర్‌ను హతమార్చారు. కోపంతో ఉడికిపోతూ, తగిన నాయకుడు లేని ప్రజాసమూహం ఆగ్రహంతో పట్టణమంతా వ్యాపించింది. శాంతి భద్రతల పరిరక్షణకు బాధ్యులైనవారు పూర్తిగా అశక్తులయి పోయారు. పాలకులకు గుండె బెదిరిపోయింది.

అయితే ప్రజలు మాత్రం ఎంతో విచక్షణతో, ప్రశంసనీయమైన విధంగా నడుచుకున్నారు. అవాంఛనీయమైన సంఘటనలేవీ జరగలేదు. పంజాబ్‌ ప్రజలు  అతి కోలాహలంగా జరుపుకునే వైశాఖ పండుగ ముగియవస్తూన్న తరుణమది. పశువులను అమ్ముకునేందుకో, కొనుక్కునేందుకో, అనేక ప్రాంతాల నుంచి అసంఖ్యాకంగా జనం అమృత్‌సర్‌ దర్శిస్తూ ఉంటారు, ఈ సందర్భంలో. ఆ యేడూ అలాగే వచ్చారు. సర్కారువారు ప్రజలను వారి కర్మానికి వారిని వదిలివేసి చేతులు ముడుచుకు కూర్చుండిపోవటంతో, ఈ యాత్రీకుల నవీన అవసరాలు తీర్చటం పెద్దసమస్య అయింది. పౌరులే ఈ బాధ్యతను స్వీకరించారు, నగరం యావత్తు బ్రహ్మాండమైన పాకశాలగా తయారయింది. వీధి మొదళ్లలో భోజనశాలలు ఏర్పాటైనాయి.

ఆ రోజుల్లో, జలియన్‌వాలాబాగ్‌ అనేది లోతైన గొయ్యగా ఉండేది. బహిరంగ సభ ఒకటి జరిపేందుకై అంతకు కొద్దిరోజుల క్రితమే అక్కడి చెత్తా చెదారం తీసివేసి, శుభ్రం చేశారు. వైశాఖి పర్వదినానికి ముందు, అక్కడ రెండు సభలు ఏర్పాటైనాయి. ప్రజలలో అంతకంతకు ఉత్సాహం చైతన్యం వృద్ధి చెందుతూ రావటంతో, ఈ బాగ్‌ స్థలానికి గిరాకీ పెరిగింది. అంతకుముందు, ప్రభుత్వ చర్యల పట్ల నిరసన తెలిపేందుకు ఉద్దేశించిన సభలేవైనా, ‘వందేమాతరం హాలులో’ జరిగేవి.

జలియన్‌వాలాబాగ్‌లో నిరసన సభ ఒకటి జరుగుతుంది అంటూ ఏప్రిల్‌ 12వ తేది సాయంకాలమూ 13వ తేదీ ఉదయమూ, ఊళ్లో దండోరా వేయించారు. ఆ వేళ వైశాఖి పర్వదినం. మధ్యాహ్నం 3.00 గం.కల్లా తండోపతండాలుగా జనం బాగ్‌ చేరుకున్నారు. ఇంకా అనేకమంది వెళ్లేదారిలో ఉన్నారు. ఇంతలో ముందుగా హెచ్చరిక లేకుండా, అక్కడ చేరినవారిపై గుండ్ల వర్షం కురిపించటం జరిగింది.

మొట్టమొదటగా మదన్‌మోహన్‌ అనే 12 సంవత్సరాల బాలుడు నేల కొరిగాడు. ఆ వెంటనే బాగ్‌కు పక్కన ఉన్న తన ఇంటి కిటికీలో కూర్చున్న మరో బాలుడు అమరుడైనాడు. విగతజీవులూ, క్షతగాత్రులూ, ఆ రాత్రి అంతా ఆ తోటలోనే ఉండి పోయారు. తమ ఆప్తులు ఏమైనారో వెతికేందుకు, బహుకొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్లేందుకు ధైర్యం చేయగలిగారు. సకాలంలో వైద్య సహాయం అందక చాలామంది మరణించారు. అనేకమంది మృతదేహాల అడుగున పడి అణగారిపోయినారు ` వారికి ఒక గ్రుక్కెడు నీళ్లు పట్టే నాథుడు లేకపోయినాడు.

సైనికులు వెళ్లిపోయాక, ఇంకా శక్తి మిగిలి ఉన్నవారు, మెల్లగా బయటపడ్డారు. చాలామందికి, తమకు గాయాలు తగిలిన సంగతే తెలియలేదు. కొందరు జలియన్‌వాలాబాగ్‌ చుట్టుపక్కలలో వీధులలో, నేలమీద పడిపోయి ప్రాణాలు విడిచారు.

ఈ దురంతం తర్వాత, పాలకులు, ప్రజలు యావన్మందినీ హడల గొట్టించే పనులెన్నో చేశారు. వర్తకులు తమ దుకాణాల తాళాలను పట్టణంలోని కొత్వాల్‌కు అప్పగించాలని హుకుంజారీ అయింది. మిగతా వర్తకుల మోస్తరే మా తండ్రిగారు కూడా ఉదయమే కొత్వాల్‌ కార్యాలయానికి పోయి, తాళం చెవులను మెట్లమీద ఉంచి, సూర్యాస్తమయం వరకు, అక్కడే వాటి ప్రక్కనే గడుపుతూ ఉండేవారు. ప్రజల మోటారు కార్లనూ, టాంగాలనూ, ఇతర శకటాలనూ, సైనిక పాలనాధికారులు వశపరచుకున్నారు. అందుకు పరిహారమివ్వడానికి బదులు, వాటిని నడపడానికి అయ్యే ఖర్చును, వాటి స్వంతదారులు చెల్లించవలసి వచ్చింది.

మా టాంగాను డయ్యర్‌ సేనాని సతీమణి ఉపయోగానికి కేటాయించారు. చిక్కిపోయినట్టు కనిపించే మా గుర్రం ఆమెకు నచ్చలేదు. కాల్చి చంపించాలనుకున్నారు. ఆ ‘దౌర్భాగ్యపు’ గుర్రాన్ని స్వయంగా కాల్చివేయదలచాననీ స్వంతదారులను పిలుచుకురావలసిందనీ, ఆమె, మా బండి తోలే అతనికి చెప్పింది. ఆ గుర్రం మీద ఇంత కోపానికి కారణమేమిటని అతను అడిగాడు. ఇప్పటికో మరి కాస్సేపటికో చనిపోయే స్థితిలో ఉన్న గుర్రం బండిలాగుతూ ఉంటే తాను కూర్చోలేనని ఆమె సమాధానమిచ్చింది. ఆ నిర్భాగ్యపు గుర్రానికి ఒక్క అవకాశమివ్వవలసిందని కోరాడు. ఆమె నన్ను అనుమతించింది.

గుర్రాన్ని బండికి కట్టాడు. ముందు మామూలుగా నడిపించి, తర్వాత పరుగు లంకించుకునేట్లు చేశాడు. ఆ వేగానికి, టాంగాలో నుంచి డయ్యర్‌ సతి ఎగిరి క్రిందబడేటంత పని అయింది. బండి ఆపవలసిందని పొలికేక ఒకటి పెట్టింది. బండి జోరు తగ్గించడానికి టాంగావాలా ప్రయత్నించాడు. కాని గుర్రం లక్ష్య పెట్టలేదు. చివరకు దానంతట అదే ఆగిపోయింది. డయ్యర్‌ సతి ప్రాణాలతో బయటపడినందుకు గట్టిగా నిట్టూర్చింది. భయం నుంచి తేరుకోవడానికి కొంతసేపు పట్టింది. బండివాడిని చూచి చిరునవ్వు నవ్వింది. గుర్రం వీపు మీద తట్టింది. జేబులో నుంచి రుమాలు తీసి, దాని జూలుకు ముడివేసింది. ఆ గుర్రం బండి స్వంతదారులను రమ్మని చెప్పమన్నది. అయితే ఈసారి కారణం వేరు. అటువంటి చక్కటి గుర్రం వారిదైనందుకు వారిని అభినందించడానికి.

డయ్యర్‌ సతి తనను చూడాలనుకుంటున్నదని బండివాడు వచ్చి చెప్పేసరికి, మా తండ్రిగారు భయపడిపోయారు. టాంగాతోకాని, గుర్రంతోకాని, ఏ ప్రమేయమూ ఆయన పెట్టుకోదలచలేదు. ఇష్టమైతే గుర్రాన్ని కాల్చివేయవచ్చునని చెప్పమన్నారు. అప్పుడు బండివాడు జరిగినదంతా చెప్పాడు. మా తండ్రిగారు  స్వయంగా వెళ్లలేకపోయారు. అప్పట్లో ఆయన బాగా అస్వస్థగా ఉన్నారు. తనను సత్కరించదలచినట్లయితే, ఆరోగ్యాన్ని కోలుకోడానికి రోజూ తన పెద్ద కుమారుని వెంట తీసుకుని, ఊళ్లో అలా తిరిగివచ్చేందుకు అనుమతించవలసిందని, ఆమెకు కబురంపారు. ఈ అనుమతి వెంటనే లభించింది.

ఆ రోజుల్లో అమృత్‌సర్‌ నగరం నిర్మానుష్యంగా, కళావిహీనంగా కన్పించేది. ఎవ్వరూ ఇళ్లలో నుంచి కదిలేవారు కారు. పక్షులు సైతం ఊరు విడిచి ఏటో ఎగిరివెళ్లాయి. ఆశ్వారూఢులైన పోలీసులు నగరంలో గస్తీ తిరిగారు. ఎప్పుడు వారెటుపక్క నుంచి వెళ్లినాసరే వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి భారతీయుడూ నిటారుగా నిలబడి వారికి అభి నందనం చేయవలసిందే. ఈ సంగతి తెలియక ఎవరైనా ఆ పనిచేయకపోతే కొరడా దెబ్బలకు గురి అయి, బాధకు ఓర్వలేక కేకలు పెడుతూ పరుగు తీయవలసిందే.

ఒకరోజున రాణి విగ్రహం దగ్గరగా నేను నిలబడి ఉండగా, డయ్యర్‌ సేనాని ఆ దారిన వెళ్లటం తటస్థించింది. బాలుడినైన నేను హడలిపోయాను. అభినందనం చేసేందుకు యెత్తిన చేయి దాదాపు అరగంటవరకు డయ్యర్‌ బలగం కనుచూపు మేరలో నుంచి వెళ్లిపోయేవరకు అలాగే ఉండిపోయింది. ఈ సంఘటనతో నా వైఖరి పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు శాంతి కాముకులైన ఒకానొక వ్యాపారస్తుని అమాయక పుత్రుడుగా ఉంటూండిన వాడినల్లా, ఆ క్షణం నుంచి పర ప్రభుత్వాన్ని ద్వేషించి తిరుగుబాటుదారునైనాను. మనలనందరిని బానిసలుగా మార్చిన ప్రభుత్వాన్ని, ఎదిరించి పోవాలని ఆ క్షణంలోనే తీర్మానించుకున్నాను.

ప్రభుత్వం ప్రజలను ఇంతగా హడల గొట్టినా, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న్నా కూడా అక్కడ జరిగిన మారణహోమం గురించి బయటి ప్రపంచానికి ఎటూ అందనే అందాయి.

పండిత మదనమోహన్‌ మాలవ్యా అమృత్‌సర్‌ వచ్చారు. రైలు వంతెనకు ఎదురుగా ఉన్న ఒక చిన్న ఆలయంలో బస చేశారు. భయ విహ్వలులై ఉన్న నగరవాసులెవరూ ఆయనను, తమ ఇళ్లకు రానివ్వలేదు. చివరకు, ఒక గ్లాసెడు మంచినీరు ఇచ్చే ప్రాణి కూడా ఎవరూ ఆయనకు కన్పించలేదు. అంత మాత్రం చేత ఆయన అధైర్యపడలేదు. ఊరూరా కాలినడకన తిరుగుతూ, ప్రజలకు ధైర్యం కల్గించేందుకు ప్రయత్నించారు.

పంజాబ్‌ ప్రజలకు గుండె ధైర్యం కల్గించడానికి, పరాయి పాలకుల దౌష్ట్యాన్నీ , దమననీతినీ సవాలు చేయడానికిగాను, ఆ తర్వాత కాంగ్రెసు మహాసభలను, 1919 డిసెంబర్‌లో అమృతసర్‌లో గోలాబాగ్‌ అనేచోట ఏర్పాటు చేశారు.

భారత స్వాతంత్య్ర సమరంలో సహాయ నిరాకరణోద్యమానికి పూనుకోవాలని స్వరాజ్య ఉద్యమ కాంగ్రెసు ప్రప్రథమంగా తీర్మానించింది. ఇందుకు జలియన్‌వాలా బాగ్‌ దారితీసింది.

– జాగృతి 21.4.1969

About Author

By editor

Twitter
YOUTUBE