అమృతసర్‌కు సుమారు 300 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కానీ, 1919లో జలియన్‌వాలా బాగ్‌లో దారుణమైన అన్యాయాలు జరిగిన తర్వాతే అది అందరి దృష్టిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేశ చరిత్రలో ప్రాముఖ్యం వచ్చింది.

కాల్పుల వార్త కూడా బయటికి రాలేదు!

శ్రీ జి.ఆర్‌.సేథీ చెప్పింది

అమృతసర్‌కు 1577 నుంచి మతసంబంధమైన ప్రాధాన్యం వచ్చింది. సిక్కుల  నాల్గవ మత గురువు రామదాస్‌ మొగలాయి చక్రవర్తి దగ్గర నుంచి కొంత భూమి సంపాదించారు. గ్రామస్థుల దగ్గర నుంచి మరో 300 ఎకరాల భూమి సేకరించి తమ ఇంటికి చేరువన ఉన్న సరోవర సమీపంలో దేవాలయం నిర్మించడానికి పూనుకొన్నారు. అప్పటికి ఆ ప్రదేశానికి అమృతసర్‌ అన్న పేరు రాలేదు. దేవాలయ నిర్మాణానికి ముందు చాలాకాలం నుంచీ ఆ ప్రాంతం మీదుగా ఒంటెలపై ప్రయాణం చేసేవారు. దేశంలో వాయవ్య ప్రాంతం నుంచి అఫ్ఘానిస్తాన్‌్‌, పర్షియా ` ప్రస్తుతపు ఇరాన్‌లకూ, ఈ ప్రాంతం మీదుగానే వెళ్లేవారు. లే నుంచీ, లడక్‌ల నుంచీ చీనీ వ్యాపారులు ఈ ప్రాంతం మీదుగా వస్తూ ఉండేవారు.

19వ శతాబ్దం ప్రథమార్ధంలో ఆంగ్లేయులు ఈ ప్రాంతాన్ని తమ పరిపాలన క్రిందకు తీసుకొన్న తర్వాత ఇది ఒక పట్టణంగా రూపొందింది. మహారాజా రంజిత్‌సింగ్‌, ఆయనకు పూర్వం సిక్కుల అయిదవ మతగురువు అర్జునదేవ్‌ ఈ ప్రాంతంలో వాణిజ్యం, పరిశ్రమలు పెంపొందింపచేశారు. ఆ పట్టణ సౌభాగ్యంతో వర్థిల్లడానికి తమ అనుచరులు, శిష్యులు వ్యాపార సంస్థలు ప్రారంభించాలని వారు ఆశించారు.

మొదటి నుంచీ లాహోరు, పంజాబు రాష్ట్రానికి రాజధానిగా ఉంటూ వచ్చినా మహారాజా రంజిత్‌సింగ్‌, ఆంగ్లేయ పాలకులూ అమృతసర్‌ ప్రాముఖ్యం తగ్గించడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. మహారాజా రంజిత్‌సింగ్‌ వేసంగిలో విశ్రాంతి నిమిత్తం ఇక్కడే చరిత్రాత్మకమైన రాంబాగ్‌ ఉద్యాన వనంలో ప్రాసాదం నిర్మించారు. ఈ ఉద్యానవనం కూడా ఆయన వేయించిందే. ఈ మహారాజా ప్రాసాదపు పూర్వ వైభవమంతా పోయింది. ఇటీవల కొన్ని సంవత్సరాల క్రితం పురపాలక సంఘం పెద్ద ఎత్తున మరమ్మతులు చేయించి సమావేశాలు, ఉత్సవాలు జరుపుకోడానికి ఏర్పాట్లు చేసింది. అప్పటి సంయుక్త పంజాబు రాష్ట్రానికి వాణిజ్యం రీత్యా ఈ పట్టణాన్నే రాజధానిగా పరిగణించేవారు.

ఇక్కడి పౌరులు ఎక్కువమంది వ్యాపారం చేసుకొని జీవించేవారు కావడం చేత శాంతికాముకులుగా, ప్రభుత్వానికి విధేయులుగా కనిపించేవారు. లాహోర్‌ లోని మేధావి వర్గాల కంటే వీరిలో రాజకీయ చైతన్యం తక్కువే. అటు లాహోర్‌లో పాఠశాలలు, కళాశాలలు ఎక్కువగా ఉండటంవల్ల, పంజాబు విశ్వవిద్యాలయం, పంజాబు ఉన్నత న్యాయస్థానం కూడా అక్కడే ఏర్పాటు కావడంవల్ల అది విద్యాధికుల కేంద్రంగా రూపొందింది. 1918 వరకు రాజకీయాలు అమృతసర్‌ పట్టణంలో కొద్దిమంది విద్యావంతులు, ఎక్కువగా స్థానిక న్యాయవాదులు, విదేశాలలోని ఆంగ్లేయ వ్యాపార సంస్థలతో లావాదేవీలు ఉన్న విద్యావంతులైన వ్యాపారులకు మాత్రమే పరిమితమై ఉండేది. వాస్తవానికి  పంజాబులో రాజకీయ చైతన్యం కలిగింది ప్రథమ ప్రపంచ సంగ్రామానంతరమే. ఆ ఉద్యమాలను అణచివేయడానికి  రౌలట్‌ శాసనం వంటివి అమలు పర్చడంతోపాటు అనేక చర్యలు తీసుకొన్నారు. ప్రజలలో రగిలిన రాజకీయ చైతన్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి ఉద్దేశించినదే ఈ శాసనం. అమృతసర్‌ రైల్వే స్టేషనులోకి భారతీయులు రారాదని నిషేధం అమలుపర్చడం వల్లనే అప్పుడు పెద్ద ఉద్యమం ప్రారంభం అయింది. అప్పట్లో రైల్వే ప్లాట్‌ఫారంపైకి వెళ్లడానికి అమ్మే టిక్కెట్లు భారతీయులకు ఇచ్చేవారు కారు. ఇటువంటి ఆంక్షలు విధించడం మూలంగా అప్పుడే అంటుకొంటున్న అగ్నిలో ఆజ్యం పోసినట్లు అయింది. స్థానిక నాయకులలో పంజాబు విధానసభ మాజీ అధ్యక్షులలో ఒకరు డాక్టర్‌ సత్యపాల్‌, డాక్టర్‌ సఫుద్దీన్‌ కీచ్లూ, ఖ్వాజాయసీన్‌, బద్రుల్‌ ఇస్లామ్‌, కన్హియాలాల్‌ వంటి ప్రముఖ న్యాయవాదులు, గిరిధారీలాల్‌, మహేష్‌ చౌదరి బగ్గామల్‌ వంటి మరికొందరు ప్రముఖులు ఇక్కడ నుంచి 1918 నాటి అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలకు ఢల్లీి వెళ్లారు. ఆ తదుపరి సమావేశాలు అమృతసర్‌లో జరుపవలసిందిగా వారు పెద్దలను అభ్యర్థించారు. వారి ఆహ్వానం మన్నించడం జరిగి నప్పటి నుంచి కాంగ్రెస్‌ మహాసభలు విజయవంతంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

1919 ఏప్రిల్‌ 2వ తేదీన ఒక బహిరంగసభలో ప్రసంగించవలసిందిగా  సన్యాసి, ప్రముఖ వక్త స్వామి సత్యదేవ్‌ను ఆహ్వానించారు. ఆ సమావేశం ఏర్పాటు చేయపూనుకొన్న కార్యకర్తలు కొంచెం విశాలంగా ఉండే స్థలం దొరికితే బాగుండునని అనుకొన్నారు. మహనీరతన్‌ చంద్‌ ఈ ఉపన్యాసం జలియన్‌వాలా బాగ్‌లో ఏర్పాటుచేస్తే బాగుంటుందని సూచించారు. పేరుకు ఇది ఒక తోట, కాని వాస్తవానికి అక్కడ చెత్తా చెదారం పడేసేవారు. జలియన్‌వాలా, ఓ సర్దారుకు చెందినది. ఆ భూమి ఆ ప్రదేశం అంతా గబగబా ఊడ్చి శుభ్రం చేశారు. కాని ఎత్తు పల్లాలు అలాగే ఉన్నాయి. భూమి చదును చేయడం జరగలేదు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో స్వామీజీ ప్రసంగం వినడానికి సుమారు 50 వేల మంది  ప్రజలు హాజరయ్యారు. గంగా ప్రవాహంలా సాగిన ఆవేశపూరితమైన ఆనాటి ప్రసంగం వినే మహాద్భాగ్యం ఈ వ్యాసకర్తకు కూడా కలిగింది. విదేశీ పాలన నుంచి విముక్తి సాధన గురించి ఆయన ప్రసంగిం చారు. ఆయన తమ ప్రసంగంలో ఎన్నో వాదప్రతి వాదాలు వివరించారు. ప్రజలంతా ఆ ప్రసంగం విని ఎంతో ప్రభావితులయ్యారు. ఫలితంగా 1919 ఏప్రిల్‌ 6వ తేదీన శ్రీరామనవమి నాడు అపూర్వమైన పెద్ద ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు వెనుక డాక్టర్‌ సత్యపాల్‌, డాక్టర్‌ కిచ్లూ, గుర్రపు బగ్గీలో వచ్చారు. ఈ అపూర్వమైన ఊరేగింపు చూసేసరికి ఆంగ్లేయ పాలకుల గుండె చెదిరింది. స్థానిక అధికారులు హడలిపోయారు. దీని మూలంగా తమకేదో పెద్ద ముప్పురానున్నదని అనుమానించారు. డాక్టర్‌ సత్యపాల్‌నూ, కాక్టర్‌ క్లీచునూ, ఇద్దరినీ నిర్బంధించారు. ఆ మీదట ఏ విధమైనా ఉపన్యాసాలు ఇవ్వరాదని శాసిస్తూ కొందరు స్థానిక నాయకులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 6వ తేదీన హర్తాళ్‌ జరిగినప్పుడే స్థానిక అధికారులకు బెదురు పుట్టింది. అప్పటి ప్రభుత్వ నివేదికలలో కూడా హర్తాళ్లు జరిగినప్పుడుకానీ, ఆ తర్వాత శ్రీరామనవమి నాడు ప్రజానీకమంతా ఊరేగింపు జరిపినప్పుడు కానీ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగలేదనీ, ఆంగ్లేయులు కూడా అక్కడ స్వేచ్ఛగా తిరిగారనీ, వారు ఊరేగింపులోని జనతతో కలిసి పోయారనీ తెలియజేశారు.

1919 ఏప్రిల్‌ 10వ తేదీన డాక్టర్‌ సత్యపాల్‌నూ, డాక్టర్‌ కిచ్లూనూ ఉదయం 10 గంటలకు డిప్యూటీ కమిషనర్‌ ఇంటికి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత కారులో వారిని ‘ధర్మశాల’కు తరలించారు. వారిని నిర్బంధించిన వార్త దావానలంలా వ్యాప్తం అయింది. నగర ప్రజలంతా గుంపులు గుంపులుగా తమ నాయకులను విడుదల చేయించేందుకు డిప్యూటీ కమిషనర్‌ ఇంటికి బయలుదేరారు. అశ్వారూఢులైన సైనికులు, పోలీసులు వివిధ కూడలి స్థలాలలో ముగ్గురు తెల్లదొరలు న్యాయాధికారుల అజమాయిషీ క్రింద సన్నద్ధులై ఉన్నారు. వీరు కాక ఆంగ్లేయ సైన్యానికి చెందిన పదాతిదళాన్ని రాంబాంగ్‌ తోటలో సన్నద్ధంగా ఉంచారు. పౌరులు నివసించే ప్రాంతం నుంచి విదేశీయులను అందరినీ ఒకచోట చేర్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఆ సైనికులు ఊరేగింపుగా వస్తున్న ప్రజలు రైలు మార్గం పైగా ఉన్న వంతెన దాటకుండా అడ్డుకొన్నారు. ఆ తర్వాత కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో కొందరు దుర్మరణానికి గురయ్యారు. మృతకళేబరాలను ఊరేగింపుగా ఊళ్లోకి తీసుకొనివెళ్లారు. తీవ్రమైన ఆందోళన జరిగింది. ఫలితంగా ఏప్రిల్‌ 13వ తేదీన సైనిక శాసనం ప్రకటించారు. జలియన్‌వాలా బాగ్‌లో హడావిడిగా ఏర్పాటైన సమావేశానికి వైశాఖి మేళా జరుపు కుంటున్న ప్రజలు తండోపతండాలుగా హాజర య్యారు. అలా సమావేశమైన ప్రజా సమూహంపై విచక్షణా రహితంగా, క్రూరాతి క్రూరంగా కాల్పులు జరిపారు. మూకుమ్మడిగా జరిపిన హత్యాకాండ ఫలితంగా భారతదేశ స్వాతంత్య్ర పోరాటం ఉధృతమయింది.

ఆ రోజులలో 1919 ప్రాంతంలో అనేక ఇతర పట్టణాలలో లాగానే అమృతసర్‌లో కూడా వార్తలు సరిగా అందేవి కావు. లాహోర్‌ నుంచి వెలువడే పత్రికలలో అక్కడి వార్తలు ప్రచురితమయ్యేవి. అమృతసర్‌ నుంచి ప్రాంతీయ భాషలో కొన్ని వారపత్రికలు వెలువడుతూ ఉండేవి. అవి రాజకీయాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవి. జలియన్‌వాలా బాగ్‌ దురంతాలకు ముందుగానీ ఆ తర్వాతగానీ ఆ వార్తలు ప్రచురించడానికి అవి జంకాయి. దీనానాథ్‌ ‘పన్త్‌’ అనే ఉర్దూ దినపత్రిక ప్రారంభించారు. కాని కొద్ది కాలం తర్వాతనే పాలకవర్గం ఆ పత్రిక రాకుండా చేసింది. లాహోర్‌లో కూడా ప్రాంతీయ భాషలో దినపత్రికలు లేవు. చెప్పుకోదగిన పలుకుబడిగల ఆంగ్ల దినపత్రికలు రెండే ఉండేవి. ఆంగ్లేయులు ప్రచురించేది ఒకటి, రెండవది కీ.శే. సర్దార్‌ దయాల్‌సింగ్‌ మజీరియా స్థాపించిన జాతీయ పత్రిక ట్రిబ్యూన్‌. అనేక రకాల విభేదాలు, ఆంక్షలు ఉండడంచేత ట్రిబ్యూన్‌ పత్రికలో కూడా బహు స్వల్పంగా ఈ వార్తలు ప్రకటించేవారు. గెజెట్టులో కేవలం ప్రభుత్వం జారీచేసే పత్రికా ప్రకటనలు ఉండేవి. ఈ పత్రికలకు తమ విలేఖరుల ద్వారా వార్తలు సేకరించేందుకు సదుపాయాలు ఉండేవి కావు. ఆంగ్ల దినపత్రికలు బొంబాయి, కలకత్తా, అహ్మదాబాదు నగరాల నుండి వెలువడుతూ ఉండేవి. ఆకాశవాణి కేంద్రం అంటూ అప్పటికి దేశంలో ఏర్పాటుకాలేదు. ఇలా ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ఉర్దూలో ప్రకటనలు వెలువడుతూ ఉండేవి. వాటిలో కొన్ని అచ్చువేసినవి, కొన్ని చేత్తో వ్రాసినవి, ఈ ప్రకటనలనుబట్టి దేశంలో వస్తున్న పరిణామాలను గురించి ప్రజలు తెలుసుకొంటూ ఉండేవారు.

– జాగృతి 21.4.1969

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE