తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మీడియాకు మంచి వార్తావనరుగా మారిపోయింది. కేవలం ఇక్కడే కాదు…. కాంగ్రెస్‌ ‌రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అది మీడియాకు పూర్తి స్థాయిలో వార్తా సమాచారాన్ని వండి పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ పక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ ఆశావహుల్లో నిరాశను నింపుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా పద్నాలుగు నెలలు గడిచిపోయింది. కానీ, మంత్రివర్గ విస్తరణ, పునర్వవ్యస్థీకరణ అంటూ దాదాపు ఎనిమిది నెలల నుంచి ఆ పార్టీ ఊరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పరిస్థితి ఎక్కే విమానం, దిగే విమానం మాదిరిలా మారింది. రేవంత్‌ ‌రెడ్డి ఢిల్లీ విమానం ఎక్కినప్పుడల్లా, మీడియాలో మంత్రివర్గ విస్తరణ  హైలెట్‌ అవుతుంటుంది. మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న నాయకులు ఆయనను కలవడం, ఆయన దృష్టిలో పడటం, తమకు అవకాశం కల్పించేలా అధిష్టానంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేయడం, ఒకవేళ.. అధిష్టానం ఓకే చెప్పినా.. సీఎంగా అడ్డుపుల్ల వేయొద్దని బతిమిలాడుకోవడం వంటివి కాంగ్రెస్‌ ‌పార్టీలో సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి తిరిగి హైదరాబాద్‌లో అడుగు పెట్టేదాకా విశ్లేషణల మీద విశ్లేషణలు సాగుతూనే ఉంటాయి. దాదాపు ఎనిమిది నెలలుగా మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ గురించి చేయని విశ్లేషణ లేదు. రాయని జర్నలిస్టు లేడు అంటే అతిశయోక్తి కాదు. మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై నాయకుల ప్రొఫైల్స్‌ను భూతద్దం పెట్టి మరీ వెతికి పుంఖాను పుంఖాలుగా రాయడం పరిపాటి అయిపోయింది. మొన్నటికి మొన్న.. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కూడా ఖరారైందన్న ప్రచారం జరిగింది. అంతేకాదు.. ‘ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు ఏకంగా రాజ్‌భవన్‌ అపాయింట్‌మెంట్‌ ‌తీసుకున్నారు. గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మను కలిశారు. ఉగాది తర్వాత ఏప్రిల్‌ ‌మూడో తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. ఆ సమాచారం ఇవ్వడానికే సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లారు’ అనే వార్తలు షికార్లు చేశాయి. అందరూ నిజమనుకున్నారు. కానీ, రేవంత్‌ ‌రెడ్డి.. షరా మామూలుగానే ఢిల్లీ వెళ్లి వచ్చారు. కేబినెట్‌ ‌పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ అటకెక్కింది. అది ఎప్పుడు అటక దిగుతుందో, ఏ సమయంలో దాని బూజు దులుపుతారో.. ఎప్పుడు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది.

అధిష్టానమే చూసుకుంటుంది: రేవంత్‌

‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఎప్పటి మాదిరిగానే హస్తిన వెళ్లారు. అక్కడ అధిష్టానం పెద్దలను కలిశారని చెప్పుకుంటున్నారు. కలిశారా? లేదా? సమయం ఇచ్చారా?లేదా? అన్నది అంతా రహస్యమే. ఇక.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తర్వాత రేవంత్‌ ‌హస్తిన వెళ్లి తిరిగొచ్చారు. ఆ సమయంలో రాష్ట్రమంతటా మంత్రివర్గం విస్తరణపైనే వేడివేడిగా చర్చ నడుస్తోంది. రేవంత్‌ ‌ఢిల్లీ నుంచి రాగానే రాజ్‌భవన్‌ ‌పోగ్రాం షెడ్యూల్‌ ఉం‌టుందని, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్న చర్చ జరుగుతున్న వేళ.. రేవంత్‌ ‌రెడ్డి విమానాశ్రయం నుంచి ఇంటికి చేరుకున్నారు. కొందరు జర్నలిస్టులు ఆయనకు ఎదురేగి, ఆయన వాహనం నుంచి దిగగానే.. ‘సర్‌. ‌మంత్రివర్గ విస్తరణ అప్‌డేట్స్ ఏం‌టి?.. ప్రమాణ స్వీకారం ఇవాళ ఉంటుందా?’ అని అడిగారట. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా చిరాకు పడిన రేవంత్‌.. ‘ఆ ‌మాట అధిష్టానాన్ని అడగండి..’ అంటూ విసురుగా లోపలికి వెళ్లిపోయారట. జర్నలిస్టు సర్కిళ్లలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఏప్రిల్‌ 3‌వ తేదీ ముహూర్తం ఏమైంది?

ఈ సారి కూడా ముహూర్తం కూడా ఖరారై మంత్రివర్గ విస్తరణ మూలన పడటం వెనుక కూడా ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఏప్రిల్‌ ‌మూడో తేదీన కేబినెట్‌ ‌పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అందరూ భావించారు. తొలివారం గడిచి పోగా, కనీసం రెండో వారంలో కూడా ఆ ఆనవాళ్లు కనిపించడం లేదు. అంటే.. ఇప్పట్లో మంత్రివర్గాన్ని విస్తరించే సూచనలు కనిపించడం లేదని గాంధీభవన్‌ ‌వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీకి, కొందరి పేర్లు కూడా ఖరారయ్యాయని చర్చ జరిగింది. కానీ, ఆ ప్రచారమే ఈసారి కేబినెట్‌ ‌విస్తరణకు బ్రేక్‌ ‌పడేందుకు కారణమైందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి (మునుగోడు)గడ్డం వివేక్‌ ‌పేర్లు (చెన్నూరు) ఖరారయ్యాయన్న ప్రచారం వల్లే ఈసారికి విస్తరణ పక్రియ నిలిచిపోయిందన్న చర్చలు నడుస్తున్నాయి.

 లెక్క ప్రకారం మంత్రివర్గంలో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం ముఖ్య మంత్రితో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరుగురికి మంత్రులుగా అవకాశం ఇవ్వొచ్చు. కానీ, రకరకాల కారణాలతో ఈ పదవులను ఖాళీగా ఉంచారు. రేవంత్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే ఆ ఆరు మంత్రి పదవులు భర్తీ అవుతాయని అప్పట్లోనే ప్రచారం జరిగినా, వివిధ కారణాలతో వాయిదాలు పడుతూ వస్తోంది. దీంతో మంత్రి పదవులను ఆశిస్తున్నవారు ఉసూరుమంటున్నారు.

వ్యూహాల్లో చతికిలపడుతున్నారా? :

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకుంటోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్‌ ‌రోజురోజుకి ఆదరణ కోల్పోంతోంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య పూర్తిగా పడిపోతోంది. దక్షిణాదిలో తెలంగాణ, కర్ణాటకల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌తెలంగాణలో ముఖ్య నేతలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్న ప్రచారం నడుస్తోంది. అందుకే అధిష్టానం కేబినెట్‌ ‌విస్తరణకులో గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఏ సమయంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నందున ఆయా జిల్లాలకు, కులాలకు, మతాలకు చెందిన వారికి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో విస్తరణ చేపట్టాలని కాంగ్రెస్‌ ‌పార్టీ పెద్దలు భావించారని అనుకుంటు న్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రితో పాటు పార్టీ ముఖ్య నేతలను చ•ర్చలు జరిపిన హైకమాండ్‌, ‌గత నెలలో మరోసారి పిలిపించింది.

సీఎం రేవంత్‌తోనే కాకుండా, పలువురు పార్టీ ముఖ్య నేతలను కూడా ఢిల్లీకి పిలిపించి చర్చించింది. దాంతో ఏప్రిల్‌ ‌మూడో తేదీన కేబినెట్‌ ‌విస్తరణ ముహూర్తం అంటూ ప్రచారం జరగగా, ఆ ముహూర్తం కూడా దాటిపోయింది.

ఆశావహుల కుస్తీలు :

మరోవైపు.. మంత్రివర్గంలో చోటు సంపాదించు కునేందుకు ఆశావహులంతా హస్తినలో ప్రయత్నాలు ముమ్మరం చేసుకున్నారు. తమకు ఉన్న మార్గాల గుండా, తమకు ఉన్న ఛానెళ్ల ద్వారా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకున్నారు. హైకమాండ్‌ ఆమోదం కూడా తెచ్చుకున్నారు. కానీ, మంత్రివర్గ విస్తరణ ఆగిపోవడంతో వాళ్లంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

కేబినెట్‌లో అసమతుల్యత :

వాస్తవంగా చూస్తే… సామాజిక వర్గం కోణంలో, జిల్లాల వారీగా చూసినా కేబినెట్‌ ‌కూర్పు సరిగా జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని జిల్లాలకు అసలు ప్రాతినిథ్యమే లేకపోగా, కొన్ని జిల్లాల నుంచి ఎక్కువ మంది మంత్రులుగా కొనసాగు తున్నారు. సామాజిక వర్గాల పరంగా కూడా ఒకే జిల్లా నుంచి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు. అంతేకాదు.. కొన్ని సామాజిక వర్గాలకు కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ఇలా కేబినెట్లో అసమతుల్యత కూడా కాంగ్రెస్‌ ‌పార్టీని వెంటాడు తోందంటున్నారు.

 మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు ఖాళీలకు గాను, ఈసారికి నాలుగింటిని భర్తీ చేయాలని భావించారని, వాటిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి, గడ్డం వివేక్‌కు ఇస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల సందర్భంగా ఆ ఇద్దరికి ఇతర శాసనసభ్యులు అభినందనలు కూడా చెప్పడంతో వారికి మంత్రివర్గంలో బెర్తులు ఖరారయ్యారని అందరూ అనుకున్నారు. అయితే వీరి పేర్లపై పార్టీలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతోనే విస్తరణకు చుక్కపడిందంటున్నారు. ప్రధానంగా రాజగోపాల్‌ ‌రెడ్డి సోదరుడు ఇప్పటికే మంత్రిగా ఉండటం, గడ్డం వివేక్‌ ఇం‌ట్లో కూడా ఇప్పటికే ముగ్గురికి పదవులు ఉండటంతో అన్ని అవకాశాలు వారికే ఇస్తారా? అనే ప్రశ్న తలెత్తిందంటున్నారు. మంత్రి పదవిని ఇస్తామనే హామీతోనే ఎన్నికల ముందు ఆ ఇద్దరిని పార్టీలో చేర్చుకున్నప్పటికీ, ఇప్పుడు కేడర్‌ అడ్డం తిరగడంతో అధిష్టానం పునరాలోచనలో పడిందంటున్నారు. అంతేకాకుండా వీరికి పదవులిస్తే సామాజికంగానూ విమర్శలు తలెత్తే అవకాశం ఉందనే భయం పార్టీలో కనిపిస్తోందని చెబుతున్నారు. అంతే కాకుండా.. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకుంటారు. మరోవైపు.. గ్రూపుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. పైగా.. పార్టీ అధిష్టానమే గ్రూపిజాన్ని పెంచి పోషిస్తుందన్న ప్రచారం కూడా ఉంది. అప్పుడప్పుడూ చోటు చేసుకునే పరిణామాలు కూడా వీటిని బలపరుస్తుంటాయి.

ఇక, మంత్రి వర్గ విస్తరణ క్లైమాక్స్‌కు చేరుకున్న సమయంలో సీనియర్‌ ‌నాయకుడు జానారెడ్డి లేఖాస్త్రం కూడా కేబినెట్‌ ‌పునర్వ్యవస్థీకరణకు అడ్డుకట్ట పడేలా చేసిందంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, ‌రంగారెడ్డి జిల్లాలకు అసలు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయిందని, ఈ రెండు జిల్లాలు రాష్ట్రంలో ప్రధానమని ఆయన లాజికల్‌ ‌పాయింట్‌ ‌లేవనెత్తారట.

ఆ భయమే కారణమా?

మరోవైపు.. మంత్రివర్గంలోని ఖాళీలన్నిటిని భర్తీ చేస్తే పార్టీలో గ్రూపుల కారణంగా అధిష్టానానికి తలనొప్పులు వస్తాయన్న భయం పార్టీని వెంటాడు తుందంటున్నారు. పార్టీ ముఖ్యనేతల, ఆశావహులను బుజ్జగించేందుకు, వాటిని బూచిగా చూపించేందుకు ఆరు ఖాళీలను అలాగే ఉంచారంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్లు నాలుగు మంత్రి పదవులే భర్తీ చేయడం వెనుక వ్యూహం కూడా అదే అంటున్నారు. మరో రెండు పదవులు ఉన్నాయంటూ బుజ్జగించేందుకు పనికొస్తాయన్న ఎత్తుగడ దీని వెనుక దాగి ఉందట.

మరి.. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కాంగ్రెప్‌ ‌పార్టీ అధిష్టానం అయోమయంలో పడిపోయిందా? తన లెక్కలేవీ వర్కవుట్‌ ‌కావడం లేదా? కేబినెట్‌ ‌విస్తరణ ఎపిసోడ్‌ను ఇంకెన్నాళ్లు సాగదీస్తారు? కాలమే సమాధానం చెప్పాలి.

సుజాత గోపగోని,

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE