రుత్వా (ధర్మబద్ధమైన విరాళ వ్యవస్థ, ధార్మిక సమతుల్యతతో చేసే దానం) హిందూ సంస్కారంలో ప్రధాన గుణం. భక్తికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, అంత కంటే ఎక్కువ ప్రాధాన్యం దానగుణానికి ఇస్తారు. ఈ విషయాన్ని ఎన్నో శ్లోకాలు చాటి చెబుతున్నాయి. మహాభారతం (అనుశాసన పర్వం 58.23) ‘నాస్తి సత్యసమో ధర్మో నాస్తి దానసమం తపః’ అంటుంది. అంటే దానం సత్యంతో సమానమైన ధర్మం. శ్రీమద్ భాగవతం (10.10.13) ‘స్వధర్మేణ దమేన యజ్ఞః దానం, స్వధర్మం, యజ్ఞం’ అంటుంది. కాబట్టి రుత్వాను ఒక శ్రేష్ఠకర్మగా మనం భావించాలి. అందుకే ‘రుత్వా దత్తం సదా పుణ్యం, ధర్మసంరక్షణాయ చ’ అన్నారు. అంటే, రుత్వా పేరిట ఇచ్చిన దానం ఎల్లప్పుడూ పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.
దైవం, ధర్మం, ధనం, దానం, ధర్మరక్షణ, హిందూ జీవనతత్త్వం` వాటి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఒకసారి పరిశీలించాలి. దైవం అనేది మనకు జీవన మార్గం చూపించే ఆధ్యాత్మికశక్తి. ధర్మం ఆ శక్తిని నిలిపే పునాది. ధనం అనేది జీవనాధారం. కానీ దానిని ధర్మబద్ధంగా వినియోగించినప్పుడే నిజమైన విలువను సంతరించుకుంటుంది. ఈ సంపద స్వార్థానికి కాదు, సమాజానికి ఉపయోగపడాలి.
పూజలు, దేవాలయ సంరక్షణ, వేదవిద్య, అనాథల సేవ, గో సంరక్షణ, అన్నదానం వంటి ధార్మిక కార్యక్రమాలకు వెళ్లినప్పుడే ఆ ధనం పరమార్ధాన్ని సాధిస్తుంది. ధనాన్ని నిస్వార్థంగా ధర్మానికి అంకితం చేసినప్పుడే అది ‘దానం’ అనిపించు కుంటుంది. దానం చేసే చేతులు నిరంతరం దివ్య ఆశీర్వాదాలతో నిండి ఉంటాయి.
దైవాన్ని ప్రేమించాలి, ధర్మాన్ని పాటించాలి, ధనాన్ని సంపాదించాలి. కానీ దానాన్ని ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం ఉపయోగించాలి. ఇక ధనం మూలం ఇదం జగత్తు అని ఎలా వేదాలు ఘోషి స్తాయో, అలానే ‘ధనం మూలం ధర్మ రక్షణం। ధర్మం మూలం లోక హితం’ అంటే ధనం ధర్మానికి, ధర్మం సమాజానికి, సమాజం శ్రేయస్సు కోసమే! ఇది అక్షర సత్యం.
ధర్మ రక్షణకు, ధర్మ ప్రచారానికి, సమాజా నికి ఉపయోగపడే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించేందుకు ధనం అనివార్యం. ఆలయ సంరక్షణ, అర్చకుల జీవనోపాధి, వేద పాఠశాలలు, ధార్మిక గ్రంథాల ప్రచురణ, అన్నదానం, గోసంరక్షణ వంటి కార్యాలకు నిరంతరం నిధుల అవసరమే. హిందూధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహించాలి. రుత్వా (ధర్మదక్షిణ) ద్వారా వచ్చే ఆర్థిక సహాయం లేకుండా ఇవన్నీ స్థిరంగా కొనసాగడం కష్టం. ఈ విషయాన్నీ హిందూధర్మం, హిందూ సమాజం మరిచి పోయిందనడంలో సందేహం లేదు. రుత్వా గురించి ఇంకొన్ని కీలక అంశాలను తెలుసుకునే ముందు వివిధ మతాలలో రుత్వ, వారు అనుసరించే విధానాలను విశ్లేషిద్దాం.
జకాత్ : ఇస్లామిక్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
జకాత్ ఇస్లాంలో ముఖ్య ధార్మిక నిధి. అందులో ప్రతి ముస్లిం తన సంపదలో 2.5% భాగాన్ని (ధనం, బంగారం, పెట్టుబడులు) ఏటా దానం చేయాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా సుమారు 200 కోట్లకు (2 బిలియన్లకు పైగా ఉన్నందున, ఈ ఆర్థిక వ్యవస్థ ప్రతి సంవత్సరం వి1 ట్రిలియన్ డాలర్లు (రూ.83 లక్షల కోట్ల రూపాయలు) ఉత్పత్తి చేస్తుంది. ఇది భారతదేశ జీడీపీ (రూ. 273 లక్షల కోట్లు)లో దాదాపు 1/3 భాగం. అంటే భారతదేశం మొత్తం ఉత్పత్తి చేసే సంపదలో మూడోవంతు జకాత్ ద్వారా ముస్లిం ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నది. దీనిని మదర్సాలు, మసీదులు, ఇస్లామిక్ మిషనరీ ప్రాజెక్టులు, ఉచిత ఆసుపత్రులు, రుణ రహిత బ్యాంకింగ్ వ్యవస్థలు, ముస్లిం సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తారు. సౌదీ అరేబియా, కతార్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు జకాత్‌ను ఇస్లామిక్ ప్రభావాన్ని విస్తరించేందుకు, ఇతర దేశాలలో ముస్లిం సమాజాలను బలోపేతం చేయడానికి, రాజకీయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి వినియోగిస్తాయి. జకాత్ కేవలం దానం కాదు. ఇది ఒక బలమైన వ్యూహాత్మక ఆర్థిక వ్యవస్థ. ముస్లిం సమాజాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేసి, ఇస్లాం విస్తరించేందుకు వనరుగా ఉపయోగపడుతున్నది.
క్రైస్తవ ధార్మిక ఆర్థిక వ్యవస్థ: తైథ్
ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ (240 కోట్ల) జనాభా ఉన్న క్రైస్తవమతం తైథ్ (ుఱ్‌ష్ట్రవ) పేరుతో 10% సంపాదనను విరాళవ్యవస్థకు అందించే పద్ధతి అమలు చేస్తున్నది. తద్వారా అత్యంత స్థిరమైన ధార్మిక, ఆర్థిక వ్యవస్థను ఏర్పరచుకుంది. ఈ విధానంలో ప్రతి క్రైస్తవుడు ఆదాయంలో 10% చర్చ్‌లకు లేదా మిషనరీ పనులకు విరాళంగా ఇవ్వడం తప్పనిసరి. సాధారణ పరిభాషలో దశమ భాగం అని వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా క్రైస్తవమతం 700 బిలియన్ల డాలర్లు (రూ. 358 లక్షల కోట్లు) ఉత్పత్తి చేస్తోంది. ఇది భారతదేశ జీడీపీలో (రూ. 72,73,00,000 కోట్లు)లో దాదాపు 20శాతానికి సమానం. ఈ ధన సంపత్తిని చర్చ్‌ల నిర్వహణ, మిషనరీ కార్యకలాపాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, రాజకీయ లాబీయింగ్, మతప్రచారానికి వినియోగిస్తారు. ప్రత్యేకంగా, ఆఫ్రికా, ఆసియా (భారతదేశం సహా), లాటిన్ అమెరికాలో మత మార్పిడి కార్యక్రమా లకు ఈ నిధులను వినియోగించి, క్రైస్తవమతాన్ని విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు. కేవలం మతానికి పరిమితం కాకుండా, ఈ ఆర్థిక వ్యవస్థ రాజకీయాల్లో, శిక్షణ సంస్థల్లో, అంతర్జాతీయ మానవతా సహాయ కార్యక్రమాల్లో ప్రభావం చూపిస్తూ, క్రైస్తవ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తోంది.
ఖైదకా (Tzedakah) యూదుల ఆర్థిక స్థిరత్వం, జీవన సమృద్ధికి మూలాధారం. యూదులు ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల (15 మిలియన్లు) మాత్రమే ఉన్నా, తైదకా (FTY) అనే తప్పనిసరి ధర్మ దాన విధానం ద్వారా, అత్యంత శక్తిమంతమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంది. యూదు ధర్మంలో ప్రతి యూదుడు తన సంపాదనలో కనీసం 10% (Maaser Kesafim) విరాళంగా ఇవ్వడం నైతిక బాధ్యత. ఇలా యూదు సమాజం ఏటా ఖైదకా ద్వారా సుమారు రూ.4 లక్షల కోట్లు సమకూర్చు కుంటోంది. ఈ నిధులు యూదుల వ్యాపారాలకు, విద్యా వ్యవస్థలకు, ప్రార్థనా మందిరాలకు, ఆసుపత్రులకు, వడ్డీ లేని రుణ పథకాల ద్వారా తిరిగి సమాజంలోనే ప్రవహిస్తాయి, దీనివల్ల యూదులు ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత శక్తిమంతంగా నిలుస్తున్నారు. ప్రపంచ జనాభాలో 0.2% మాత్రమే ఉన్నా, ఖైదకా సహాయంతో వారు విశ్వవ్యాప్తంగా ఆర్థిక, విద్యా, రాజకీయ శక్తిగా ఎదిగారు. హోలోకాస్ట్ (Holocaust), ఇజ్రాయెల్ ఏర్పాటుకు ముందు వచ్చిన సంక్షోభాలు, ఎన్నో శతాబ్దాలుగా ఎదురైన దాడులను ఎదుర్కొనే క్రమంలో ఖైదకా వ్యవస్థే వారికి రక్షణ కవచమైంది.
మళ్లీ ఒకసారి హిందువుల దాన వ్యవస్థ రుత్వా దగ్గరకు వద్దాం. ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ (120 కోట్ల) హిందువులు, ప్రతి సంవత్సరం దాదాపు రూ. 350,000 కోట్ల నుంచి రూ. 783,000 కోట్ల వరకు ధార్మిక సేవలకు, దాన కార్యక్రమాలకు విరాళాలుగా అందిస్తున్నారు. రుత్వా ప్రధానంగా ఆలయ విరాళాలు, హుండీ నిధులు, దేవాలయ పునర్ని ర్మాణం, పూజా కార్యక్రమాలు, ఆలయ నిర్వహణకు ఎక్కువగా వినియోగిస్తున్నారు.
తిరుపతి, కాశీ, అనంతపద్మనాభస్వామి, సోమనాథ్ వంటి ప్రధాన ఆలయాలు వేల కోట్ల రూపాయల విరాళాలు పొందుతున్నాయి. కానీ ఈ నిధులు వేద విద్యా ప్రచారం, హిందూ విద్యాసంస్థలు, ధర్మ పరిరక్షణ, గో సంరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలకు తగిన విధంగా వినియోగం కావడం లేదు. మరొక అంశం కూడా పరిశీలిద్దాం. ఒక్కొక్క మతంలో ధార్మిక కార్యక్రమాలకు ఆయా మతస్థులు ఇచ్చే (ఏడాదికి) ధర్మ దక్షిణ ఎలా ఉంది? ఎంత ఉంది? హిందువులు సగటున ఏడాదికి రూ. 416, యూదులు రూ. 2,66,666, క్రిస్టియన్లు రూ. 24,166, మహమ్మదీయులు రూ. 41,500. ఇస్తున్నారు. స్పష్టంగా ఇతర మతస్థులలో ఉన్న ధార్మిక దక్షిణ గుణం హిందువులలో లేదని చెప్పటానికి ఇదే నిదర్శనం.
హిందూ ధార్మిక దక్షిణ ఈ విధంగా ఉండడానికి తొమ్మిది లోపాలు కనిపిస్తాయి.
- జాతి, వర్ణ, పంథ భేదం: హిందూ సమాజం కులాలు, వర్ణాలు, మత పంథాలుగా విడిపోయింది. దీనివల్ల ఒకే ధార్మిక విరాళ వ్యవస్థ రూపుదిద్దుకోలేదు.
- అతిరిక్త కర్మకాండ: హిందూమతం ఆలయ పూజలు, సంప్రదాయ కర్మకాండ్‌లకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తుంది, ధార్మిక, విద్యా, సామాజిక సేవకు తక్కువ ప్రాధాన్యం ఉంది.
- అర్థలోలుపతా: హిందువులు వ్యక్తిగత ధన సంపాదన, విలాసవంతమైన జీవనానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ధర్మ పరిరక్షణ, సామాజిక సేవ కోసం విరాళాలు ఇవ్వడం తక్కువ.
- ప్రచార ప్రసారాభావ: ఇతర మతాల మాదిరిగా, హిందువులకు పెద్ద స్థాయిలో మిషనరీలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు నిర్మించడంలో ఆసక్తి తక్కువ.
- కేవలం దేవాలయ-కేంద్రితం: హిందువుల విరాళాలు ఎక్కువగా ఆలయ హుండీలు, పూజా కార్యక్రమాలకు వెళ్లిపోతాయి, కానీ ఆధ్యాత్మిక లేదా ధార్మిక విద్యకు తక్కువగా దక్కుతాయి.
- కేంద్ర-విహీనతా- ఇస్లాం (జకాత్) లేదా క్రైస్తవ మిషనరీలు (టైథింగ్) లాగా, హిందూ విరాళ వ్యవస్థ అనుబంధంగా లేకపోవడం వల్ల విరాళాల ప్రభావం పరిమితమవుతోంది.
- ధర్మ-సంహితాభావ:-హిందూ ధర్మంలో విరాళాలను క్రమబద్ధంగా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్న నియమాలు లేవు. ఫలితంగా విరాళాలు అసంఘటితంగా ఉంటున్నాయి.
- శ్రీ స్వధర్మ విముఖతా: ముస్లింలు లేదా క్రైస్తవులు వారి మతానుయాయులకు విరాళాలు అందజేస్తారు, కానీ హిందువుల విరాళాలు హిందూ సంక్షేమాన్ని పరిరక్షించడంలో పెద్దగా వినియోగించబడడం లేదు.
- నిజ సంసాధనానాం వ్యర్థతా: హిందువుల సంపద ఇతర సమాజాలకు ప్రవహించేది తప్ప, హిందూ సంస్థలు, విద్యారంగం, వ్యాపారాల్లో తిరిగి మళ్లించటం తక్కువగా ఉంది.
అయితే రుత్వా తత్వాన్ని అభివృద్ధి చేసే ఏడు మార్గాలు సూచించారు.
- సంఘటిత ధార్మిక విరాళ వ్యవస్థ – హిందువులు ఒక శాతం ఆదాయాన్ని ధర్మ పరిరక్షణ కోసం కేటాయించే విధానం (హిందూ టైథింగ్ మోడల్) ను ఏర్పాటు చేయాలి.
- ఆలయ నిధుల పారదర్శక వినియోగం – ఆలయ విరాళాలను విద్యా ప్రచారం, సామాజిక పురోగతి, ధార్మిక విస్తరణకు ఎక్కువగా వినియోగించాలి.
- ప్రపంచ స్థాయి హిందూ విద్యా సంస్థలు – క్రైస్తవ, ఇస్లామిక్ విద్యా వ్యవస్థల మాదిరిగా, హిందువులు పెద్ద స్థాయిలో తమ స్కూళ్లు, విశ్వవిద్యాలయాలను నిర్మించాలి.
- అంతర్జాతీయ హిందూ సంస్థల విస్తరణ – ISKCON, చిన్మయ మిషన్, BAPS స్వామి నారాయణ సంస్థలు వంటి హిందూ సంస్థలను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలి.
- ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేయడం-హిందూ ఆలయ నిధులు హిందూ ధర్మ ప్రయోజనాలకే వినియోగించాలి. ప్రభుత్వ అదుపు నుంచి విముక్తం చేయాలి.
- హిందూ రాజకీయ, ధార్మిక ఉద్యమాలకు మద్దతు- ధార్మిక పునరుజ్జీవనానికి, ఆలయ సంరక్షణకు, హిందూ విద్యకు విరాళాల ద్వారా మద్దతు ఇవ్వాలి.
- ‘‘ఏక హిందూ-శ్రేష్ఠ హిందూ’’ భావన- హిందువుల మధ్య ఏకత్వ భావన, ఐక్యత పెంచి, హిందూ ధర్మ పరిరక్షణలో అందరూ భాగస్వాము లవ్వాలి. ఆలయాలను కేవలం కర్మకాండ ప్రదేశాలుగా కాకుండా ఆధ్యాత్మిక విద్యా కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేయాలి.
దానం ధర్మస్య సహాయకమ్ ।
లోకాః సుఖినో భవంతు॥ అనే అంశాన్ని హిందువులు పాటించాలి. ఒకటి మాత్రం స్పష్టం. ధర్మం లేదా మతం వ్యక్తి ప్రాధాన్యం కాకుండా, సంఘ ప్రాధాన్యం సంతరించుకొంటుందో, రుత్వను పాటించి ధర్మ దక్షిణ తమ దైనందిన కార్యక్రమాలలో ఒకటిగా చేస్తే ఆ ధర్మం, ఆ మతం, ఆ దేశం బ్రహ్మాండంలో వేగుచుక్కలాగా వెలుగుతుంది.
– డా. బూర నరసయ్య గౌడ్, ధార్మిక హిందూ పరిషద్
మాజీ ఎంపీ – భువనగిరి