ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను తొక్కి పెడుతున్నాయి. ఫక్తు వ్యాపార సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. ఆదాయమే లక్ష్యంగా చెలరేగి పోతున్నాయి. ప్రధానంగా తెలంగాణలో రాష్ట్రం ఆవిర్భవించినప్పటినుంచీ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత పదేళ్ల పాటు పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ తొలి నుంచీ అలాగే వ్యవహరించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కూడా నాటి బీఆర్‌ఎస్‌ సర్కారు దారిలోనే నడుస్తోంది.. కాదు కాదు.. పరుగులు పెడుతోంది.

ప్రభుత్వ ఆస్తులైన భూములను అమ్మి ప్రభుత్వాలను నడిపిస్తున్నారు ప్రభుత్వాధినేతలు. అప్పుడు కేసీఆర్‌ హైదరాబాద్‌లోని భూములను వెతికి వెతికి మరీ అమ్మేశారు. ముఖ్యంగా అత్యంత విలువైన ఐటీ కారిడార్‌లోని భూములన్నీ వేలంలో పెట్టారు. డబ్బులొచ్చాయని సంతోషపడ్డారు. కానీ, ఖజానా చూస్తే ఎప్పుడూ ఖాళీగానే కనిపించింది. ప్రధానంగా రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా, సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పదేళ్లలోనే అప్పుల కుప్పగా మార్చి పడేశారు. పైగా ప్రభుత్వానికి భూములు కూడా లేకుండా చేసేశారు. ఇప్పటి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా ఆ పొరపాట్లను సరిదిద్దుతుందని, ప్రభుత్వం అంటే సంక్షేమమే అని, ప్రజల శ్రేయస్సే అనే నిర్వచనాన్ని తిరిగి అమలులోకి తెస్తుందని విశ్లేషకులు, నిపుణులు, సామాజికవేత్తలు ఇలా అన్ని వర్గాల వాళ్లూ భావించారు.. కాదు కాదు.. ఆశించారు. కానీ, ఆ ఆశలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అడియాసలు చేస్తున్నారు. గడిచిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తిట్ల వర్షం కురిపి స్తూనే తాను కూడా అదే దారిలో పయనిస్తున్నారు. అప్పుడేమో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న, ఐటీ కారిడార్‌లో డిమాండ్‌ ఉన్న అత్యంత విలువైన భూములన్నింటినీ వేలంలో అమ్మేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం పర్యావరణ హితమైన భూములకు ఎసరు పెడుతోంది. ఈ క్రమంలో జన హితం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, అటవీ సంపద భద్రత కోసం, మూగజీవులు, అటవీ జీవాల రక్షణ కోసం డిమాండ్‌ చేస్తున్న విపక్షాలను, నిరసనలకు దిగుతోన్న విద్యార్థులు, సామాజిక, ప్రజా సంఘాల నేతల గొంతును ప్రభుత్వం నొక్కుతోంది. ఏకంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేయిం చింది. పలువురు విద్యార్థులపై కేసులు పెట్టింది. మరికొందరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.

చర్చనీయాంశంగా 400 ఎకరాలు

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న 400 ఎకరాల భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు విపక్షాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు నిరసనలతో హోరెత్తిస్తున్నా, మరోవైపు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆ భూములు తమ విద్యా సంస్థ అధీనంలోనే ఉన్నాయని మొత్తుకుంటున్నా, ఇంకోవైపు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలను, వెల్లడిరచిన అభిప్రాయాలను గుర్తు చేస్తూ బహిరంగ లేఖ రాసినా రేవంత్‌ ప్రభుత్వం మాత్రం పునరా లోచించడం లేదు. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ముందుకే వెళ్తామంటూ మొండిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం సమీపంలో ఉన్న ‘కంచ గచ్చిబౌలి’ భూములపై తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ-టీజీఐఐసీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. దీంతో, వివాదం మరింత ముదిరింది. ప్రభుత్వం మాత్రం భూమి చదును పేరుతో పదుల సంఖ్యలో జేసీబీలతో ఆ స్థలంలో పనులు కానిస్తోంది. భూములు చదును చేస్తూ, చెట్ల పొదలను తొలగిస్తోంది. అడ్డుకుంటున్న వాళ్లను అరెస్ట్‌ చేస్తోంది. అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రజా ప్రతినిధులను గృహనిర్బంధం చేస్తోంది.

పరస్పర విరుద్ధ ప్రకటనలు :

వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల భూములపై టీజీఐఐసీ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశాయి. శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో సర్వే నంబరు 25లోని 400 ఎకరాలపై సంపూర్ణ హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని, గత జులైలో వీటికి సర్వే నిర్వహించామని టీజీఐఐసీ పేర్కొనగా.. రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్‌సీయూ స్పష్టం చేసింది. ఎవరికైనా హెచ్‌సీయూ భూములు బదిలీ చేయాలంటే ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అనుమతి ఉండాలని, ఈసీలో ఆరుగురు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దేవేశ్‌ నిగమ్‌ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరిస్తున్నారు. నిరవధిక సమ్మెకు కూడా హెచ్‌సీయూ విద్యార్థి సంఘం నేతలు పిలుపునిచ్చారు. అంతేకాదు నిత్యం హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు.

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వానివే అని టీజీఐఐసీ ప్రకటించింది. ఓ ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని ప్రభుత్వం న్యాయపోరాటం ద్వారా దక్కించు కుందని, 2022 సెప్టెంబరు 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం భూ కేటాయింపులకు సంబంధించిన కొత్త విధానం ఆధారంగా 400 ఎకరాలను కొలిచి హక్కులు బదిలీ చేయాలంటూ ఐ అండ్‌ సీ విభాగానికి గతేడాది జూన్‌ 19న సూచించిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఐటీ, ఇతర ప్రాజెక్టులకు 400 ఎకరాలు కేటాయించాలని, భూమిని స్వాధీనం చేయాలని తాము అదే రోజున విజ్ఞప్తి చేశామని, అనంతరం ప్రభుత్వం జూన్‌ 24న టీజీఐఐసీకి భూమి హక్కులు బదలాయించగా, రెవెన్యూ అధికారులు జులై 1న తమకు అప్పగించారని టీజీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. జులై 7వ తేదీన తాము హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను వ్యక్తిగతంగా కలిసి ప్రాజెక్టు ప్రతిపాదనలు వివరించామని, జులై 19వ తేదీన రిజిస్ట్రార్‌, వర్సిటీ అధికారుల సమక్షంలో భూముల సర్వే చేసి హద్దులు నిర్ధారించారని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టులో వర్సిటీ భూములు లేవని, ఇక్కడి రాళ్ళు అభివృద్ధి పనులు దెబ్బతీయవని, ఇందులో చెరువులు కూడా లేవని టీజీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు.. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 400 ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఎలాంటి డిమార్కేషన్‌ చేయలేదని హెచ్‌సీయూ వీసీ చెప్పారు. తాము దానికి అంగీకరించలేదని రిజిస్ట్రార్‌ దేవేశ్‌ నిగమ్‌ స్పష్టం చేశారు. అక్కడ భౌగోళిక పరిస్థితులను మాత్రమే పరిశీలించారని వివరించారు. పర్యావరణ పరిరక్షణను, జీవవైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ భూములను ఇతరులకు కేటాయించొద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిసరాలు కొద్ది రోజులుగా రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఆ భూములతో వ్యాపారం చేయొద్దని, విలువైన ప్రకృతి సంపద, సహజ వనరులను కాపాడాలని, వాటిని విధ్వంసం చేయొద్దని విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే, పోలీసులు ఎప్పటికప్పుడు ఈ నిరసనలను చెదరగొడుతున్నారు.

కంచ గచ్చిబౌలి భూముల వేలంపై కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌ తప్పు పట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల గొంతునొక్కడం, విద్యార్థులను అణిచి వేయడం, పచ్చదనాన్ని, జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేయడం, నిధుల కోసం హైదరాబాద్‌ పర్యావరణాన్ని పణంగా పెట్టడంపైనే దృష్టిపెట్టిందని కిషన్‌ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని కాంగ్రెస్‌ ప్రభుత్వం మొండిగా వేలం వేయడం.. ఈ ప్రాంతంలోని వృక్షసంపదకు, ఇక్కడ ఉంటున్న జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. అర్ధరాత్రి పూట కూడా బుల్డోజర్లు పెట్టి చెట్లు నేలకూల్చడంతో.. అక్కడుంటున్న జాతీయపక్షులు నెమళ్ల ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయని, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థుల గొంతులను కూడా అక్రమంగా నొక్కేస్తూ.. ఆక్రమణ చర్యలను మొండిగా చేపడుతుండటం దుర్మార్గమన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆలోచనలేని చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కిషన్‌ రెడ్డి ప్రకటించారు. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపేసి.. హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ అందిస్తున్న ఈ ప్రాంతపు అటవీసంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడాలని కోరారు.

కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ :

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలు,  వ్యాఖ్యలను తన లేఖలో గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపేయాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో గ్రీన్‌ మర్డర్‌ – బండి సంజయ్‌ :

తెలంగాణలో గ్రీన్‌ మర్డర్‌ జరుగుతోందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ కోత, కాంగ్రెస్‌ కోతలు మరింత లోతుగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం కోసం బీఆర్‌ఎస్‌ 25 లక్షల చెట్లకు గొడ్డలిపెట్టి, హరితహారం ముసుగులో కోనోకార్పస్‌నును బహుమతిగా ఇచ్చిందన్నారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన హరిత విధ్వంసంలో కాంగ్రెస్‌ చేరిందని విమర్శించారు. అదే గొడ్డలి కానీ కొత్త చేతులని బండి సంజయ్‌ అభివర్ణించారు.

బీజేపీ ఎమ్మెల్యేలు గృహనిర్బంధం

అసలు హెచ్‌సీయూ సమీపంలో ఏం జరుగు తుందో, ఆ భూములు ఎలా ఉన్నాయో పరిశీ లించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి సహా.. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యేల ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. వాళ్లందరినీ ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

మావోయిస్టుల మండిపాటు :

భూముల వేలం ప్రక్రియపై మావోయిస్టు పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి పథకాన్ని రూపొందించారని మండిపడిరది. అందులో భాగంగానే యూనివర్సిటీలో ఘోరమైన నిరంకుశ పాలన కొనసాగుతున్నదని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో లేఖ విడుదల చేయడం కలకలం రేపింది.

విచారణకు హైకోర్టు అంగీకారం:

కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్‌దాఖలయ్యింది. ఈ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వాటా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఉన్నత న్యాయ స్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీంతో, కంచ గచ్చిబౌలి భూములపై విచారణకు హైకోర్టు అంగీకరించింది.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE