సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు వైశాఖ శుద్ధ పాడ్యమి – 28 ఏప్రిల్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
మహారాష్ట్రలో అవకాశవాద రాజకీయాలకు మరోసారి తెరలేస్తోంది. భాషా సంస్కృతుల పరిరక్షణ పేరుతో రాజకీయ దాయాదులు ఏడాది తక్కువ రెండు దశాబ్దాల తరువాత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజకీయాలలో, అందులోనూ కుటుంబ సభ్యుల మధ్య శాశ్వత శత్రుత్వ మిత్రత్వాలు ఉండవనే షరా మామూలు నినాదాన్ని శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధినేతలు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు అందిపుచ్చుకున్నారు. ఇంతకాలం తూర్పు-పడమరలుగా ఉన్న అన్నదమ్ముల తనయుల కరచాలన యత్నాలకు హిందీ వ్యతిరేకత అనే అంశం ప్రధాన సాధనమైంది. జాతీయ విద్యా విధానం కింద 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని మూడవ భాషగా విధిగా అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుపెట్టుకొని ఉభయులు చేతులు కలిపేందుకు సిద్ధపడ్డారు. తమకు రాజకీయాల కంటే మహారాష్ట్ర సాంస్కృతిక, భాషా పరిరక్షణే ప్రధానమని, మరాఠీ భాష, మరాఠీయుల ఆత్మగౌరవం ముఖ్యమంటూ.. అందుకు, తమ మధ్య గల చిన్నపాటి వివాదాలకు స్వస్తి పలుకుతామని ఇరువురు నేతలు సంకల్పం చెప్పుకొన్నారు. వివాదాలకు తాత్కాలిక ‘విరామం’ ప్రకటించారు. రాజ్యాంగపరంగా హోదాలు లేకపోయినా, శక్తిమంతమైన నాయకులుగా చెలామణిలో ఉన్న ఇద్దరికి అంతిమ లక్ష్యం అధికారమే? అందుకు సుమారు రెండు దశాబ్దాల నాటి సంఘటనే నిదర్శనం. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు తన తమ్ముడి కుమారుడు రాజ్ ఠాక్రే అత్యంత ప్రీతిపాత్రుడు అని ప్రతీతి. ఆయనే ‘పెద్దాయన’కు రాజకీయ వారసుడు అవుతాడని కూడా చాలా మంది భావించారు. ఈలోగా అధినేత కుమారుడు ఉద్దవ్ అరంగేట్రం, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా నియమితులు కావడంతో లెక్క తప్పింది. అలిగిన రాజ్ ఠాక్రే శివసేనకు వీడ్కోలు (2006) పలికి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్)పేరిట వేరు కుంపటి పెట్టాడు. ఎన్నికల్లోనూ పోటీ చేశారు. సీట్లు గెలవకపోయినా ఓట్లు చీల్చడంలో ‘సేన’ కీలక పాత్ర వహించిందని నాటి ఫలితాలు రుజువు చేశాయి.
శివసేన 2022లో మళ్లీ చీలి ఉద్దవ్ ముఖ్యమంత్రిత్వానికి ఎసరు తెచ్చింది. దేశవ్యాప్తంగా వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ వస్తోన్న బీజేపీ నేతృత్వంలోని కూటమి మహారాష్ట్రలోనూ కొలువుదీరింది. దాంతో అధికారం కనుచూపు మేరలో లేదని అర్థమైన ‘సోదర పక్షాలు’ ఆత్మవిమర్శలో పడిపోయాయి. కలహించుకుంటే భారీగా నష్టపోతామన్న భావన లేదా భయంతో… ఉమ్మడి శత్రువును కలసి కట్టుగా ఎదుర్కొనాలనే వ్యూహమే ఈ కలయిక యత్నాలకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అయితే ఠాక్రే ద్వయం ఒక్కటైనా.. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎంతవరకు సహకరిస్తుందన్నది ప్రశ్న. సోదరులిద్దరు కలసి నడచినా, రాజ్ ఠాక్రే రాజకీయ ఎదుగుదలను ఉద్దవ్ ఎన్నటికి సహించబోరని శివసేన నాయకుడు రాందాస్ కదమ్ లాంటి వారు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవంక, రాజ్ ఠాక్రే ఇప్పటి వరకు బీజేపీతో అంటకాగారన్నది ఉద్దవ్ వర్గం ఆరోపణ. మరాఠీ భాష కోసం, మరాఠీయుల బాగు కోసం విభేదాలను పక్కన పెట్టేందుకు తాను సిద్ధమని, అయితే మహారాష్ట్ర వ్యతిరేకశక్తులకు దూరంగా ఉండాలని ఉద్దవ్ షరతుపెట్టారు. ఆ శక్తులు ఏమిటో స్పష్టం చేయకపోయినా, రాజ్‌ను విశ్వాసంలోకి తీసుకుంటున్నట్లు లేదని ఆ ప్రకటన చెబుతోంది. వ్యక్తిగత స్వార్థం, ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకం కావాలని, అవిభక్త శివసేనలో ఉద్ధవ్‌తో కలసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న రాజ్ ఠాక్రే ప్రకటనకు ఉద్దవ్ సానుకూలంగా స్పందించారని వార్తలు వచ్చాయి. కానీ అటు ఇటు అనుయాయులు, అభిమానుల్లో సఖ్యతపై అనుమానాలు రేగుతూనే ఉన్నాయి. పైగా, అన్నదమ్ముల మధ్య కుటుంబపరంగా భావోద్వేగ చర్చలు మాత్రమే నడుస్తున్నాయి తప్ప ఇప్పటికిప్పుడు పొత్తులు లేవన్న ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్య ఉద్ధవ్ ‘షరతు’కు లోబడే ఉందని భావించాలి.
ఠాక్రే సోదరుల మధ్య సయోధ్యపై జరుగుతున్న చర్చలను, బీజేపీ అధిష్ఠానం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ అంతగా పట్టించుకోకపోగా, ఆ పరిణామాలను స్వాగతించారు. అయితే దీనిపై మీడియా అతిగా స్పందించిందని, అవసరానికి మించి దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు. ‘ఇద్దరు సోదరులకు సంబంధించిన అంశంలో మా జోక్యం అనవసరం. ఒకరు (రాజ్ ఠాక్రే) ప్రతిపాదించారు. మరొకరు (ఉద్ధవ్) అంది పుచ్చుకుంటున్నారు. కనుక దీనిపై అంతగా స్పందన కానీ వ్యాఖ్యానం కానీ అవసరంలేదు’ అన్నారు ఫడణవీస్. విభేదాలు పరిష్కరించుకుంటే మంచిదే కదా? అని ముక్తాయించారు.
ఇక సోదరుల పునరేకీకరణపై ఎవరెన్ని కారణాల చూపినా, భాష్యాలు చెప్పినా, అది ఎన్నికల ఎత్తుగడలో భాగమనడానికి సందేహించనవసరం లేదు. గత ఎన్నికల్లో చవిచూసిన పరాజయం నుంచి బయటపడి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా పరువు దక్కించుకోవాలన్న యోచన ఈ రాజీ యత్నాలకు కారణంగా చెప్పవచ్చంటున్నారు. రాష్ట్రంలో మరాఠీ భాష అమలు కోసం కొంతకాలంగా ఉద్యమిస్తున్న రాజ్ ఠాక్రే, ఇప్పుడు హిందీ వ్యతిరేకతనూ భుజానికెత్తుకున్నారు. అదీ సమీప భవిష్యత్‌లో జరిగే ఎన్నికలకు ఆయుధంగానే విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఎంఎన్‌ఎస్‌తో చేతులు కలిపితే మున్సిపల్ కార్పొరేషన్ పోరులో పుంజుకోవచ్చన్నది ఉద్ధవ్ శివసేన అభిప్రాయంగా ఉంది. మరాఠీయులే బాగోగులే వారి ప్రథమ ప్రాధాన్యతను కుంటే కలసి నడవాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమే!!