నేషనల్ హెరాల్డ్ కేసు పెద్దదే కానీ, దేశం పట్టించుకోవలసిన స్థాయిలో పట్టించుకోవడం లేదు. ఇది ప్రథమ ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన పత్రికే కావచ్చు. దీని పేరుతో వేల కోట్ల రూపాయలు దోచేశారన్న ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. అయినా మీడియా, విపక్షాలు కాంగ్రెస్‌ను ఒక్క మాట కూడా అనడం లేదు. ఇక ఆరోపణలు ఎదుర్కొం టున్న కాంగ్రెస్ నేతలు ఇదంతా కక్ష సాధింపు చర్య అంటూ నిస్సిగ్గుగా రోడ్డెక్కడం ఈ ఉదంతంలోనే విస్తుపోయే అంశం. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్ 9న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు సమర్పించింది. ఇందులోనే సోనియా పేరు ఏ1గాను, రాహుల్ గాంధీ ఏ2గాను ఉన్నారు. నెహ్రూ స్థాపించిన పత్రికకు నకిలీ గాంధీలు ఎసరు పెట్టి వేల కోట్ల రూపాయల ఆస్తులను జేబులో వేసుకున్నారన్న ఆరోపణలే ఇవన్నీ. అయినా పత్రికా స్వాతంత్య్రం, వాటి గౌరవం గురించి మాట్లాడే ఏ ఒక్క వర్గం, దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం ఉన్నదని విరుచుకుపడే మీడియా ఈ విషయం మీద ఇంకా గుంభనంగా ఉంది. ఒక్క విపక్షం కూడా నోరు విప్పడం లేదు. బీజేపీ, ఈడీల దాష్టీకాలకు వ్యతిరేకంగా అంటూ కాంగ్రెస్ ఈ అంశం మీద దేశవ్యాప్త నిరసనలు నిర్వహించింది. మొత్తానికి ఈ నిరసనతో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఎంత లోతుగా ఉన్నదో జాతి యావత్తుకు తెలిసింది. పనిలో పనిగా ఈ కేసులో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న ఇద్దరు ప్రముఖులు కూడా నిందితులేనన్న విషయం కూడా భారతజాతి మొత్తానికి తెలిసింది.
నేషనల్ హెరాల్డ్‌తో నెహ్రూ అనుబంధం ఉద్వేగభరితమైనది. బహుశా నేటి నకిలీ గాంధీలకు ఈ వాస్తవం తెలిసి ఉండదు. నెహ్రూ పాలిట ఈ పత్రిక ఎప్పుడూ తెల్ల ఏనుగు బాపతుగానే ఉంది. 1938లో మొదలైన పత్రిక 1948 లో ఒక దశాబ్ద కాలంలోనే మూడేళ్లు మూతపడిరది. పత్రికా సిబ్బందితో ఒకసారి జరిగిన సమావేశంలో, ఒకటి నిజం, మనకు వ్యాపారం చేయడం ఎలాగో తెలియదు అన్నారట నెహ్రూ. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మాత్రం, అలహాబాద్‌లో ఉన్న ఆనంద భవన్‌ను అమ్మడానికైనా సిద్ధమే కానీ, నేషనల్ హెరాల్డ్‌ను వదలుకోను అన్నారట నెహ్రూ. స్వాతంత్య్రోద్యమంతో ఇంత మమేకమైన పత్రిక, నెహ్రూ స్థాపించిన పత్రికను నకిలీ గాంధీలు నడిరోడ్డు మీద అమ్మేశారు. అయినా ఇది తప్పుకాదన్నట్టే ఆ పార్టీ వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ చార్జిషీట్‌ను రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే, చార్జిషీట్లతో కాంగ్రెస్‌ను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. యథాప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు, విపక్షాలను అణచివేయడానికే కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నదని పాత పాటే కాంగ్రెస్ వినిపించింది. ఇంతకీ ఈ కేసు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగానే 2012లో కోర్టుకు వచ్చింది. నెహ్రూ సొమ్మును నకిలీ గాంధీలు దోచుకోవడమే ఈ మొత్తం ఉదంతం సారాంశం.
నేషనల్ హెరాల్డ్ వివాదం ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దశాబ్దంగా నలుగుతున్నదే. తాజాగా ఇంత సంచలనం రేకెత్తడానికి కారణం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్ 9న సమర్పించిన ఆరోపణల పత్రంలో ఏ 1గా సోనియా గాంధీ, ఏ 2గా రాహుల్ గాంధీ పేర్లను చేర్చారు. అంటే ఆ ఇద్దరి మీద నేరారోపణ చేసి, విచారణ ఆరంభించ డానికి అనుమతి వచ్చింది. దీనితోనే మరొకసారి దీని మీద జాతికి ఉత్సుకత పెరిగింది. చార్జిషీట్ అంటే ఆరోపణల పత్రం. దీనినే తుది నివేదిక లేదా పోలీస్ నివేదిక అంటారు. ఒక నేర కార్యకలాపం మీద పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు పూర్తి చేసిన తరువాత సమర్పించే పత్రం. ఇందులో కేసు పరిచయం ఉంటుంది. సేకరించిన సాక్ష్యాలు ఉంటాయి. నిందితుల మీద చేసిన ఆరోపణల గురించి ఉంటుంది. దీనిని ఒకసారి కోర్టుకు సమర్పిస్తే, కోర్టు ఆమోదిస్తే ఇక విచారణ మొదలయి నట్టే. కాబట్టి సోనియా,రాహుల్ విచారణను ఎదుర్కొనబోతున్నారు. అది దేశం చూడబోతున్నది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల మీద నమోదైన ఆరోపణ మనీలాండ్రిరగ్ (మనీ లాండ్రిరగ్ ఒక చట్టవిరుద్ధ చర్యకు పెట్టిన పేరు. ఇందులో నేరపూరిత పద్ధతులలో పెద్ద ఎత్తున సొమ్ము సేకరిస్తారు. ఈ సేకరణలో మత్తు మందుల అక్రమ రవాణా, ఉగ్రవాదులకు నిధులు కూడా ఉండొచ్చు. అయితే ఇలా నేరపూరిత చర్యల ద్వారా సేకరించిన సొమ్మును చట్టబద్ధమైనదిగా చూపడమే మనీ లాండరింగ్. నేరపూరిత మార్గాలలో నగదు తెస్తారు కాబట్టి, దానికి మకిలి అంటి ఉంటుంది. దానిని లాండరర్స్ శుభ్రం చేస్తారు. కాబట్టి మనీ లాండ్రిరగ్ అని పిలుస్తారు). బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణియం స్వామి 2012లో దాఖలు చేసిన కేసు ఇది. మనీలాండ్రిరగ్, పార్టీ నిధుల దుర్విని యోగం అన్న అరోపణలతోనే డాక్టర్ స్వామి కూడా కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును అర్థంచేసుకోవడానికి కొన్ని విషయాలు పరిశీలించాలి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) అనే సంస్థ భారత జాతీయ కాంగ్రెస్ నుంచి రూ. 90.25 కోట్లు రుణంగా తీసుకుంది. దీనికి వడ్డీ లేదు. ఈ రుణం తిరిగి తీర్చలేదు. అయితే యంగ్ ఇండియన్ అనే ఒక సంస్థను 2010లో చేర్చారు. దీని మూలధనం రూ. 50 లక్షలు. కానీ ఈ యంగ్ ఇండియన్ తరువాత ఏజేఎల్ ఆస్తులు మొత్తం (రూ 5,000 కోట్లు) తన వశం చేసుకుంది. ఇందులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రమేయం ఉందని చెబుతూ డాక్టర్ స్వామి కోర్టు తలుపు తట్టారు.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఒక అన్‌లిస్టెడ్ కంపెనీ. దీనిని నవంబర్ 20, 1937న నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారాలలోకి తీసుకువచ్చారు. దీని చిరునామా హెరాల్డ్ హౌస్, 5-ఎ, బహదుర్ షా జఫార్ మార్గ్, న్యూఢిల్లీ. ఇది నెహ్రూ ఆలోచనే. ఇంతకీ ఏజేఎల్ సొంత ఆస్తి ఏమీ లేదు. ఇదే నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్త. ఈ పత్రిక 5000 మంది స్వాతంత్య్ర సమరయోధుల వాటా ధనంతో ప్రారంభమయింది. అంటే వీళ్లే ఏజేఎల్ భాగస్వాములు. ఏజేఎల్ మూలధనం విలువ రూ 5 లక్షలు. ఏజేఎల్ స్థాపనకు సంబంధించిన పత్రం మీద పండిత్ నెహ్రూతో పాటు కాంగ్రెస్ ప్రముఖులు పురుషోత్తమదాస్ టండన్, ఆచార్య నరేంద్రదేవ్, కైలాస్‌నాథ్ కట్జు, రఫీ అహ్మద్ కిద్వాయ్, కృష్ణదత్ పాలీవాల్, గోవిందవల్లభ్ పంత్ సంతకాలు చేశారు. నిజానికి ఈ సంస్థ ఏ వ్యక్తికీ చెందినది కాదు. ఒక్క వార్తా సంస్థలతో సహా మరే ఇతర వాణిజ్య సంస్థతోను ఇది సంబంధాలు నెరపదు. ఏజేఎల్ కంపెనీల రిజిస్ట్రార్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం సెప్టెంబర్ 29,2010 నాటికి ఏజేఎల్‌లో 1,057 మంది వాటాదారులు ఉన్నారు. మార్చి 22,2002 నుంచి మోతీలాల్ ఓరా (ఇప్పుడు మన మధ్య లేరు) ఏజేఎల్ చైర్మన్, ఎండీగా ఉన్నారు. 2011లో ఏజేఎల్‌ను యంగ్ ఇండియా సంస్థకు బదలాయించారు. అప్పటికి ఇది నష్టాలలో నడుస్తున్నది.
ఏజేఎల్ 2008 వరకు నేషనల్ హెరాల్డ్ (ఇంగ్లిష్)తో పాటు క్వామీ ఆవాజ్ (ఉర్దు), నవజీవన్ (హిందీ) ప్రచురించేది. ఏజేఎల్‌కు ఢిల్లీ, లక్నో, భోపాల్, ముంబై, ఇందోర్, పట్నా, పంచకుల్ వంటి చోట స్థిరాస్థులు కూడా ఉన్నాయి. వీటి విలువ రూ 50 బిలియన్‌లు. ఆరంతస్తుల హెరాల్డ్ హౌస్ కార్యాలయ భవనం సహా మిగిలిన ఆస్తులు 10,000 చదరపు మీటర్లు. ఇంత జరిగిన తరువాత జనవరి 21, 2016న ఏజేఎల్ లక్నోలో సమావేశమై నేషనల్ హెరాల్డ్‌తో పాటు మిగిలిన రెండు పత్రికలు పున:ప్రారంభించాలని నిర్ణయించడం విశేషం. అంటే కేసు బిగుస్తున్నదని అర్థమైన తరువాత కంటి తుడుపుగా తీసుకున్న నిర్ణయం. అయినా 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తారని ఊహించని కాంగ్రెస్ చేసిన అనేక అవమానకర చర్యలలో ఇది కూడా ఒకటి. ఏజేఎల్ వెనుక ఉన్న వేల కోట్ల ఆస్తులు యంగ్ ఇండియన్ సంస్థకు బదలీ అయినది 2010లోనే.
నేషనల్ హెరాల్డ్ కేసులో తమకు సమన్స్ ఇవ్వకుండా డిస్‌మిస్ చేయాలంటూ సోనియా గాంధీ చేసిన అప్పీల్‌ను కింది కోర్టు కొట్టివేసింది. దీనితో వాటాదారులు గళం విప్పారు. వీరంతా స్వాతంత్య్ర సమరయోధుల సంతానమే. ఒక్క సమావేశానికి కూడా తమకు నోటీసు ఇవ్వలేదని, తమకు తెలియకుండా ఏజేఎల్ వాటాలను (అంటే స్వాతంత్య్ర సమరయోధు లవి) యంగ్ ఇండియన్‌కు బదలీ చేశారని (డిసెంబర్, 2010) వారు ఆరోపించారు. ఏజేఎల్ వాటాదారులలో శాంతిభూషణ్ (అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), మార్కండేయ కట్జు (మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్) వంటి ప్రసిద్ధులు కూడా ఉన్నారు.
ఏజేఎల్ నుంచి వాటాలు బదలాయించుకున్న యంగ్ ఇండియన్ ఒక ప్రైవేట్ కంపెనీ. నవంబర్ 23,2010న ఏర్పాటయింది. దీని చిరునామా 5ఎ హెరాల్డ్ హౌస్, బహదూర్ జఫర్ మార్గ్, ఢిల్లీ. అంటే ఏజేఎల్ చిరునామాయే. యంగ్ ఇండియన్ సంస్థకు ఒకరిని డైరెక్టర్‌గా నియమించారు. డిసెంబర్ 13,2010న డైరెక్టర్‌గా వచ్చిన వ్యక్తి సాక్షాత్తు రాహుల్ గాంధీయే. జనవరి 22, 2011న పాలక మండలిలో సోనియా గాంధీ చేరారు. కొత్త కంపెనీలో 76 శాతం వాటాలు సోనియా, రాహుల్ పేరిట మారాయి. 24 శాతం కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లకు చెరి 12 శాతం వంతున దఖలయ్యాయి. కాబట్టే యంగ్ ఇండియన్‌ను డాక్టర్ స్వామి సోనియా, రాహుల్ సొంత సంస్థని పేర్కొన్నారు. ఏజేఎల్‌కు చెందిన రూ.16 బిలియన్‌ల విలువైన భూమిని యంగ్ ఇండియన్ సంస్థ హస్తగతం చేసుకున్నదని ఆయన ఆరోపించారు. దీనితో పాటు ఆ మూడు పత్రికల ప్రచురణ హక్కులు కూడా వీరికే దఖలు పడినాయని కూడా స్వామి తెలియచేశారు. యంగ్ ఇండియన్ సంస్థకు భారత జాతీయ కాంగ్రెస్ నుంచి రూ 90 కోట్ల రుణం, ఎలాంటి పూచీ లేకుండా ఇచ్చిన మాట నిజమేనని ఏజేఎల్ ఫిబ్రవరి 26, 2011న ప్రకటించింది. ఒక రాజకీయ పార్టీ వాణిజ్య సంస్థకు రుణం ఇవ్వడం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 29 ఏ ప్రకారం చట్ట విరుద్ధమని కూడా డాక్టర్ స్వామి వాదన. అలాగే ఆదాయచట్టం 1961లోని 13ఎ సెక్షన్ ప్రకారం కూడా ఇది చట్ట విరుద్ధమేనని డాక్టర్ స్వామి ఆరోపించారు. కాబట్టి సీబీఐ దర్యాప్తు చేయాలని సూచించారు. ఆ రుణం ఇచ్చినది కేవలం నేషన్ హెరాల్డ్ పునరుద్ధరణకే తప్ప వాణిజ్య అవసరాలకు కాదని తరువాత యంగ్ ఇండియన్ వివరణ ఇచ్చింది. చివరికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ధ్రువీకరించిన కోర్టు సమన్స్ జారీ చేసింది. న్యాయస్థానం గమనించిన సాక్ష్యం` ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం బదలాయించుకోవడానికే యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థను స్థాపించారని అనుకోవలసి వస్తున్నది.
జూన్ 26,2014న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జస్టిస్ గోమతి మోనాచా సోనియా, రాహుల్, మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడాలకు నోటీసులు జారీ చేశారు. ఆగస్ట్ 7, 2014న కోర్టు ముందు హాజరు కావాలన్నదే వాటి సారాంశం. ఈ సమన్స్‌ను నిలిపివేయ వలసిందిగా కోరుతూనే సోనియా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అయినా విచారణ ఆగలేదు. ఈ కేసులోనే మే 2019న రూ 64 కోట్లు, నవంబర్ 2023న రూ. 751 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శాశ్వత ప్రాతిపదికను అటాచ్ చేసింది. ఏప్రిల్ 9 ,2025న ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసి, సోనియాను ఏ1గాను, రాహులన ఏ 2గాను పేర్కొన్నది.
దీనికి తోడు మరొక కేసు కూడా నమోదై ఉంది. ప్రస్తుతం ఇది పంజాబ్` హరియాణా హైకోర్టులో విచారణలో ఉంది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా ఇందులో నిందితుడు. సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. పంచకుల్‌లోని ఒక ఆస్తి గురించిన వివాదం ఇది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు హుడా తన హోదాను అడ్డం పెట్టుకుని భూములు కేటాయించి, రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం తెచ్చారన్నదే ఆ ఆరోపణ.
నేషనల్ హెరాల్డ్ అవినీతి వ్యవహారంలో సోనియా,రాహుల్ దొరికిపోయారని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఈ కేసుతో తమను బెదిరించలేరని ఏఐసీసీ అధ్యక్షుడు విమర్శలు లంఘించుకున్న క్రమంలో ఠాకూర్ ఈ విమర్శలు చేశారు. ఈ విమర్శలు మామూలే అయినా, ఈ సందర్భంలో ఠాకూర్ నేషనల్ హెరాల్డ్ మీద చేసిన ఆరోపణలు గమనించ దగినవి. సుబ్రమణియం స్వామి 2012లో ఈ పత్రిక అవతవకల మీద కోర్టుకు వెళ్లారు. అయితే 2016లో కాలికి అంటిన బురదను కడుక్కునే ఉద్దేశంలో పత్రికను తిరిగి ప్రారంభించారు. అయితే అది ఎవరు చదువుతున్నారో ఎప్పుడు వస్తున్నదో ఎవరికీ తెలియదని ఠాకూర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను మళ్లీ మళ్లీ ప్రారంభించాలని ఆరాటపడుతున్నది కానీ సాధ్యం కావడం లేదని ఆయన విమర్శించారు. 2016లో తిరిగి ప్రచురణ ప్రారంభించినట్టు మాత్రం చెప్పారు. అదికూడా డిజిటల్ రూపంలో మాత్రమే. అందుకే తాము ఎప్పుడు నేషనల్ హెరాల్డ్ గురించి మాట్లాడినా తత్తరపడుతూ ఉంటారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఆయన అన్నారు. నిజానికి కాంగ్రెస్ చరిత్రలో అనేక ఆర్థిక అవక తవకలు ఉన్నాయని అందులో నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారం ఒకటి మాత్రమేనని ఠాకూర్ గుర్తు చేశారు. అసలు ఆ పత్రికను చదివేవారు ఎవరూ లేరని ఆయన ఎద్దేవా చేశారు. దానిని ఎప్పుడూ అచ్చుకు పంపరు. కొన్ని పత్రికలు పేపర్ మీద అచ్చవుతాయనీ, కొన్ని పత్రికలు కేవలం పేపర్ మీద ఉంటాయని ఆయన విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ రెండో రకం పత్రిక అని చెప్పారాయన. ఆ పత్రిక తరఫున వచ్చిన విలేకరులను తాను ఎప్పుడూ చూడలేదని, అదొక వారపత్రిక మాత్రమేనని, కానీ దినపత్రిక కంటే ఎక్కువ నిధులు తీసుకుంటున్నదని ఆయన అన్నారు. ఈ పత్రిక నడపడానికి వివిధ రాష్ట్రాలలో నేతలు ఆస్తులు దఖలు పరిచారని, ఇది కాంగ్రెస్ మార్కు అవినీతి అని ఆయన విమర్శించారు.
నిరంతరం అవినీతికి వ్యతిరేకంగా రంకెలు వేసే రాహుల్, ఆయన తల్లి సోనియా నిందితులుగా బోను ఎక్కబోతున్నారు. ఒకచేతిలో రాజ్యాంగం పట్టుకుని ఊరేగే రాహుల్ కేసులో తనను ఏ 2గా చేర్చిన తరువాత రాజీనామా చేసి ఉండవలసింది. అసలు బ్రిటిష్ పౌరసత్వం కేసుతో, పరువు నష్టం కేసులలో ఇరుక్కుని ఉన్న రాహుల్ గాంధీకి ఇదొక జీవన్మరణ సమస్య. అయినా దీనిని అధిగమించడం ఆయనకు పెద్ద కష్టమని ఆయన తీరును పరిశీలిస్తున్నవారు ఇట్టే చెబుతారు. రాజ్యాంగ నిబంధనలైనా, ప్రజాస్వామ్య పరిరక్షణ అయినా అది ఇతరుకు చెప్పడం వరకే. అవేవీ రాహుల్‌కు చెందినవి కావు.
నేషనల్ హెరాల్డ్
పత్రికల ధ్యేయం వార్తలను అందించడం. అలాంటిది ఒక దశాబ్దకాలంగా పత్రికలలో పతాకశీర్షికగా దర్శనమిస్తున్న పత్రిక నేషనల్ హెరాల్డ్. నేషనల్ హెరాల్డ్ జవాహర్‌లాల్ నెహ్రూ స్థాపించారు. నెహ్రూ ఎదుర్కొన్న రాజకీయ ఆశనిరాశల నుంచి ఉద్భవించినదే పత్రిక ఆలోచన, అదే నేషనల్ హెరాల్డ్ రూపంలో వెలువడిరది అంటారు నెహ్రూ జీవిత చరిత్రకారుడు బెంజిమిన్ జకారియా. 1930లోనే పత్రిక ఆలోచన చేశారు. అందుకు కారణం, స్వరాజ్య సమరంలో వస్తున్న మార్పు. పదునెక్కుతున్న భావాలు. అభిప్రాయాల మధ్య పెరిగిన సంఘర్షణ. భారత జాతీయ కాంగ్రెస్‌లో రియాక్షనరీ శక్తులు పెరిగిపోయాయని వీటిని ఎదుర్కొనడానికి పత్రిక అవసరమని నెహ్రూ భావించారట. ఆ ఆలోచన 1936 నాటికి తీవ్ర రూపం దాల్చింది. సెప్టెంబర్ 9, 1938న లక్నో నుంచి తొలి సంచిక వెలు వడిరది. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం పత్రికకు గదాఘాతంగా మారింది. కాంగ్రెస్‌ను నిషేధించారు. నేషనల్ హెరాల్డ్ సహా 80 ఇతర పత్రికలు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అది ఇచ్చిన ప్రకటనలను ప్రచురించే పని పత్రికలు చేస్తే, అవి కరపత్రాలుగా మారిపోతాయని, స్వేచ్ఛ లేనప్పుడు ప్రచురణ నిలిపివేయడమే ఉత్తమమని గాంధీజీ పిలుపునిచ్చారు. దానితోనే నేషనల్ హెరాల్డ్ ప్రచురణను నిలిపివేశారు. పత్రిక తిరిగి నవంబర్ 1945లో పున: ప్రారంభమైంది. ఎం.చలపతిరావు సంపాదకుడు. దీనికి కోటంరాజు రామారావు, కుష్వంత్‌సింగ్ కూడా సంపాదకులుగా పనిచేశారు. ‘స్వేచ్ఛ ప్రమాదంలో పడిరది. నీ శక్తితో దానిని రక్షించు’ నినాదం పత్రిక మీద ఉండేది. 1975`77 మధ్య ఈ నినాదం కనుమరుగైంది. కారణం, అది అత్యవసర పరిస్థితి కాలం. ఆ సమయంలో కాంగ్రెస్ పత్రిక కాబట్టి అత్యవసర పరిస్థితిని సమర్ధించింది.
– జాగృతి డెస్క్